
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్‌సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు.
రోడ్ మ్యాప్ సిద్ధం
ముందుగా గుర్తించిన 144 లోక్‌సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్‌సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు.
సోషల్ మీడియా గ్రూప్‌లు
ప్రతి లోక్‌సభ పరిధిలో ఒక సోషల్ మీడియా గ్రూప్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సమీకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్‌సభ సోషల్ మీడియా ఇన్‌చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్‌లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment