
హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
తమిళనాడుకు అన్యాయం అబద్ధం
పదేళ్లలో 5 లక్షల కోట్ల నిధులిచ్చింది
దృష్టి మళ్లించేందుకు సీఎం స్టాలిన్ ప్రయత్నమంటూ ధ్వజం
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు.
పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే.
తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు.
దేశ వ్యతిరేక ధోరణి పెరిగింది
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్‌ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది.
అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.
నిధులపై వాస్తవ గణాంకాలివీ..
కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు.
వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment