funding grants
-
టాప్–3లో భారత్
లండన్: ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ► 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ. ► మొత్తమ్మీద టాప్–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది. ► సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి. ► ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది. -
గ్రే లిస్టులోనే పాకిస్తాన్
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోని పాకిస్థాన్‌ను పలు ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లోపు ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్థాన్ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది. పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉన్న పాక్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ దన్నుగా నిలుస్తోందని, దానిపై చర్యలు చేపట్టాలని భారత్ ఎఫ్ఏటీఎఫ్కు ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధించిన రుజువులూ అందిస్తూ వచ్చింది. -
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం తాజా నిధులు
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్ ఓవర్సీస్, అలహాబాద్ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్ బ్యాంకు గురువారమే ప్రకటించింది. -
పాక్‌కు చివరి హెచ్చరిక
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా ఉగ్రమూకలకు ఆర్థిక తోడ్పాటుకు ముగింపు పలికేందుకు పాకిస్తాన్‌కు మరో నాలుగునెలల సమయాన్నిచ్చింది. 2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ హెచ్చరించారు. పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిగా విఫలమైంది... పాక్‌ని ప్రస్తుతం ‘గ్రే లిస్ట్’లో కొనసాగించినా, లేక ‘డార్క్ గ్రే లిస్ట్’లో ఉంచినా ఆర్థిక ఆంక్షల చట్రం బిగుసుకుంటుంది. ఐఎంఎఫ్ నుంచి గానీ, యూరోపియన్ యూనియన్ నుంచి గానీ పాక్‌కు ఏవిధమైన ఆర్థిక సాయం ఉండదు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్రంగా విఫలమైందని ఎఫ్ఏటీఎఫ్ సభ్యులంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అదుపుచేయడం, డబ్బు అక్రమరవాణాకి స్వస్తిపలికేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించింది. యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం ఐదంశాలను మాత్రమే పాక్ సరిగ్గా అమలు చేయగలిగిందని తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు నిలిపివేయాలంటూ 2018లో పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’ లో పెట్టింది. లక్ష్యాలను చేరుకోవాలి.. అంతర్జాతీయ ఆర్థిక సమర్థత కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఏటీఎఫ్ 1989 నుంచి ప్రభుత్వ అంతర్ సంస్థగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 205 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్లీనరీ సమావేశాల్లో ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి. లష్కరే తోయిబా వ్యవ స్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ లాంటి ఉగ్రనేతలను కట్టడి చేయాలని పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించింది. -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్‌వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్‌వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్‌వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
మరోసారి ‘గ్రే’ జాబితాలో పాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైందని ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తెలిపింది. తాము నిర్దేశించిన 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను పాక్ అమలు చేయలేకపోయిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను మరోసారి ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఈ సెప్టెంబర్ చివరికల్లా ఈ లక్ష్యాలను చేరుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికాలో సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఎఫ్ఏటీఎఫ్ అధికార ప్రతినిధి స్పందిస్తూ..‘పాకిస్తాన్ నిర్ణీత లక్ష్యాలను చేరుకోనందున ఆ దేశాన్ని ‘గ్రే జాబితా’లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. తమ భూభాగంలోని ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా కచ్చితమైన, విశ్వసించదగ్గ స్థాయిలో, శాశ్వత ప్రభావం చూపేలా చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించింది. గడువులోగా అంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని స్పష్టం చేసింది’ అని తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కన్నెర్ర.. ఉగ్రసంస్థలు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్(జేఈఎం) అధినేత మసూద్ అజర్‌లపై సరైన చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
మీ ఊరికి నిధులు... మాకు ఓట్లు!
సాక్షి, హైదరాబాద్: ‘ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఒక్క ల్యాబర్తి గ్రామానికే నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.1.13 కోట్లు ఇచ్చింది. కానీ, అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. ఆ మాటలను నమ్మవద్దు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీ. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’అంటూ గ్రామాలకు బీజేపీ లేఖలు పంపుతూ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఒక్క ల్యాబర్తే కాదు.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కేంద్రం వెచ్చించిన నిధుల మొత్తాన్ని వివరిస్తూ గ్రామాలకు లేఖలు పంపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో అన్ని జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది. 60 నుంచి 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చినవే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించిన నిధుల్లో 60 నుంచి 90 శాతం నిధులను నరేంద్రమోదీ ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉపాధి హామీ కింద చెల్లించే కూలీని రూ.169 నుంచి రూ.205 పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని లేఖల్లో వివరించింది. నాలుగేళ్లలో తెలంగాణలోని ఒక్కో గ్రామానికి కేంద్రం రూ. 10 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఇచ్చిందని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల కారణాలతో దుర్వినియోగం చేసిందని పేర్కొంది. స్వచ్ఛ భారత్ కింద ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 7,200–9000 చొప్పున 20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వమే ని«ధులు ఇచ్చిందని వెల్లడించింది. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ట్రైసైకిళ్ల పంపిణీ కోసం కేంద్రం ఒక్కో సైకిల్‌కు రూ.12 వేలు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిరుపయోగం చేసిందని ఆరోపించింది. రూ.కిలో బియ్యానికి కేంద్రం ఇస్తున్నది రూ.30... రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా డబ్బును వెచ్చిస్తుంటే టీఆర్ఎస్ దానిని తమ పథకంగా చెప్పుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. కిలో బియ్యానికి మోదీ ప్రభుత్వం రూ. 30 సబ్సిడీ భరిస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ. 2 వెచ్చిస్తోందని వెల్లడించింది. కేంద్రం ఒక్కో కుటుంబానికి ఈ పథకం కింద ఏటా రూ.8,623 ఖర్చు చేస్తోందని వివరించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం తెలంగాణకు రూ. 1,500 కోట్లు మంజూరు చేసిందని, రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను అమల్లోకి తెస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదని వివరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ పేరుతో తన ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించింది. పథకాల పేర్లు మార్చి జిమ్మిక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో ప్రసవానికి కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే, పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ పేర్కొంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద రూ. 6 వేలు కేంద్రం ఇస్తుండగా టీఆర్ఎస్ ఆ పేరును కేంద్రానికి రాకుండా చేస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో 1.21 లక్షల ఇళ్లకు కేంద్రమే ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిందని తెలిపింది. మద్దతు ధర పెంపు, మొక్కల పెంపకం, సాగునీరు, విత్తన పంపిణీకి కేంద్రం రూ.1,985 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.956 కోట్లు , గొర్రెల పంపిణీ పథకం కోసం కేంద్రం సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నా అవన్నీ టీఆర్ఎస్ ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. -
అక్షరంపై నిర్లక్ష్యం!
♦ ఓనమాలు నేర్చుకోని వయోజనులు ♦ చతికిలపడిన సాక్షర భారత్ ♦ నిధులు మంజూరు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ జిల్లా అక్షరాస్యత శాతం 67.40 ♦ నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాట పడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరక్షరాస్యులకు అవగాహన లేవి.. వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది. శుక్రవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బెల్లంకొండ : జిల్లాలో ఏ మండలంలో చూసినా అక్షరాస్యతా శాతం తగ్గుముఖం పడుతుంది. అధికారిక గణాంకాలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి. 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యంగా అట్టహాసంగా ప్రారంభమైన సాక్షర భారత్ కార్యక్రమం జిల్లాలో చతికిల పడింది. అధికారుల నిర్లక్ష్యానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో కోత వి«ధించడంతో కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో వయోజనులు ఓనమాలు నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 48,87,213గా ఉంది. ఇందులో పురుషులు 24,40,521 ఉండగా, స్త్రీలు 24,47,292 ఉన్నారు. అక్షరాస్యతా శాతం 67.40గా నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో జిల్లా అక్షరాస్యతా శాతం 7వ స్థానంలో ఉంది. 2010 సెప్టెంబర్ 22న జిల్లాలో సాక్షర భారత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లాలో 57 మండలాల్లోని 712 గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో 56,816 మందితో మొదటిగా అక్షరాలు దిద్దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేయడంతో నేడు వయోజన విద్యా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా మాట అటుంచితే అక్షరాస్యతలో 7 స్థానంలో ఉన్న జిల్లా అట్టడుగుకు చేరే ప్రమాదం ఉంది. వెనుకబడిన మహిళలు జిల్లాలో అక్షరాస్యతలో మహిళలు వెనుకబడి ఉన్నారు. 2001లో పురుషుల అక్షరాస్యత 71.24గా ఉండగా, మహిళల అక్షరాస్యత 53.74గా ఉంది. 2011లో పురుషుల అక్షరాస్యత 74.79 ఉండగా మహిళల అక్షరాస్యత 60.09 గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు అక్షరాస్యతలో 14.70 శాతం వెనుకబడి ఉన్నారు. నిధుల పంపిణీలో ప్రభుత్వం కొర్రీలు సాక్షర భారత్ నిర్వహణకు 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నాయి. అయితే 2017–18కిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనికితోడు మండల స్థాయి, గ్రామ స్థాయిలో పనిచేసే కోఆర్డినేటర్లకు దాదాపుగా 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాల నిర్వహణకు శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది సాక్షర భారత్ ప్రోగ్రాంను ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి సంకేతాలు వస్తున్నట్లు తెలిసింది.