పల్లెల్లో బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
పీఆర్ ఇంజనీరింగ్ అధికారులకు వెహికల్ అలవెన్స్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి సంబంధించి వివిధ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.2,773 కోట్లు మంజూరు చేసింది. గతంలోనే రూ. 2,682.95 కోట్లు మంజూరు చేయగా ఆ పనులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపా రు. తాజాగా మంజూరు చేసిన రూ. 2,773 కోట్ల లో.. గ్రామీణ రోడ్ల నిర్మాణం (సీఆర్‌ఆర్) కింద రూ. 1,419 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణ (ఎంఆర్ ఆర్)కు రూ.1,288 కోట్లు కేటాయించారు.
ఈ నిధు లతో పల్లెల్లో బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తండాలు, గూడేల్లో బీటీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. దీంతో పాటు పీఎం జన్‌మన్ పథకం కింద రాష్ట్ర వాటాగా ప్రభుత్వం రూ.66 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 25 ఆదివాసీ గూడేలకు బీటీ రోడ్లు వేయనున్నారు. కాగా, పల్లెల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గురువారం ఆమె ప్రజాభవన్‌లో పూల మొక్క అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసి, పనులు చేయిస్తున్నాం. మొదటి విడతలో రూ. 2,682 కోట్లు, తాజాగా మరో రూ. 2,773 కోట్లు మంజూరు చేశాం.
ఇంకా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు మంజూరు చేశాం. గతంలో పీఎంజీఎస్‌వై కోసం రూ. 110 కోట్లు విడుదల చేశాం’అని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని మంత్రి వివరించారు.
పీఆర్ ఇంజనీరింగ్ అధికారులకు వెహికల్ అలవెన్స్
క్షేత్రస్థాయి పంచాయతీరాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం కల్పిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. శాఖాపరంగా పనుల పర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ ఈలకు వాహన సౌకర్యం లభిస్తుంది. ఇందులో భా గంగా 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు.
ఒక్కో వాహనం అద్దె కింద నెలకు రూ.33 వేలు చొప్పున చెల్లించనున్నారు. కాగా, తమ ఇంజనీర్లకు వాహన సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి పంచాయతీరాజ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment