పల్లెలు మారితీరాలి | KCR Implements New Rules For Rural Development In Telangana | Sakshi
Sakshi News home page

పల్లెలు మారితీరాలి

Published Wed, Sep 4 2019 2:50 AM | Last Updated on Wed, Sep 4 2019 5:28 AM

KCR Implements New Rules For Rural Development In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలవారు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే విధంగా  30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ‘‘పల్లెల ప్రగతికి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉంది. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలి. అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని గట్టిగా విశ్వసిస్తున్నా. 30 రోజుల తర్వాత కచ్చితంగా గ్రామముఖ చిత్రం మారితీరాలి. 

దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలి’’అని ఆకాంక్షించారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను అందించిందన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు. ప్రణాళిక అమలుపై ‘తెలంగాణ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌’లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. 

ముఖ్య సేవకుడిననే భావనతో ఉంటా.. 
పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిర్వహించడం అనేది నిరంత రం సాగాలని, దీనికోసం ఈ 30 రోజుల ప్రణాళికతో కొత్త ఒరవడి ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కలెక్టర్లు దీనికి నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్‌ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్‌ లేదా మరో హాదా కల్పిస్తామన్నారు. వీరిలో ఒకరిని పంచాయతీ రాజ్‌ శాఖకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులు అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు.  

వయో పరిమితి పెంచుతాం..  
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్‌ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్‌ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలుచేసే దుస్థితి పోవాలన్నారు. అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులను కూడా సృష్టిస్తామన్నారు. మండల, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను  ధూషిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.  

ప్రజలు తలుచుకుంటే.. 
ప్రజలు తలుచుకుంటే, ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. ‘‘ఎస్‌.కె.డే గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు పురుడుపోశారు. కూసం రాజమౌళి కృషి ఫలితంగా వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామ కమిటీలున్నాయి. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా సాధికారితకు సాక్ష్యంగా నిలబడింది. మురార్జీ దేశాయ్‌ కృషి వల్ల ముంబైలో ట్రాఫిక్‌ నియంత్రణ సాధ్యమైంది’’అని ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏంటో చెప్పడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందన్నారు. సదస్సులో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇతర మం త్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.  

అన్నీ సర్కారే చేసినా... గ్రామ పంచాయతీలపై బాధ్యతలున్నాయి 
గ్రామ పంచాయతీలు నేల విడిచి సాము చేయవద్దని, ప్రజలందరి భాగస్వామ్యంతో  గ్రామాల రూపురేఖలు మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తోంది. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక ప్రేరణ ప్రభుత్వమే అందిస్తోంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై భారం పడకుండా చూస్తోంది. పచ్చదనం, పరిశుభ్రత కాపాడటం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, క్రమం తప్పకుండా పన్నుల వసూలు, విద్యుత్‌ బిల్లుల లాంటి చెల్లింపులు చేయడం, వీధిలైట్లను సరిగ్గా నిర్వహించడం పంచాయతీలు నిర్వహించాల్సిన ముఖ్య విధులు’’అని సీఎం నిర్దేశించారు. 


సెప్టెంబర్‌ 6 నుంచి అమలు చేసే కార్యాచరణలోని ముఖ్యాంశాలు.. 

  • సెప్టెంబర్‌ 4న కలెక్టర్లు జిల్లాసదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలు కు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి.  
  • ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలి.  
  • జిల్లా స్థాయిలో కలెక్టర్, మండలంలో ఎంపీడీవో, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.  
  • వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పన. గ్రామసభ ఆమోదం. 
  • ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్‌ రూపకల్పన. 
  • అప్పులు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్టెడ్‌ అకౌంటు)లో చేర్చాలి.  
  • ప్రతీ ఇంటికీ, ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమంతప్పకుండా ఆస్తులవిలువ మదింపు. 
  • పన్నులు క్రమం తప్పకుండా వసూలు. పన్నులు వంద శాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలు. 
  • మొక్కలు నాటడం, స్మశాన వాటిక నిర్మాణం, డంపుయార్డు నిర్మాణ తదితర పనులకు ‘నరేగా’నిధుల వినియోగం. 
  • రాష్ట్ర బడ్జెట్, ఫైనాన్స్‌ కమిషన్, ‘నరేగా’ నిధులు వస్తాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి. సీఎస్‌ఆర్‌ నిధులను సమకూర్చుకోవాలి. దాతల నుంచి విరాళాలు సేకరించాలి.  
  • శ్రమదానంతో పనులు నిర్వహించాలి.      
  • సీనియర్‌ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్‌ స్వా్కడ్స్‌ ఏర్పాటు.  
  • 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. 
  • లక్ష్యాలు సాధించిన గ్రామాలకు  ప్రోత్సాహాకాలు.  
  • అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు.  


మంగళవారం రూరల్‌ డెవలప్‌మెంట్‌పై పె నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు. చిత్రంలో మంత్రులు తదితరులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement