Gram panchayats Funds
-
పెను సంక్షోభంలో ‘పట్టుగొమ్మలు’!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామ పంచాయతీ భవనం.గ్రామంలో 10 వార్డులు, 428 ఇళ్లు, 1,779 జనాభా ఉంది.జనాభా ప్రాతిపదికన ఏటా రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) గ్రాంట్ రూ.15 లక్షలు,15వ ఆర్థిక సంఘం (కేంద్రం) నిధులు రూ.15 లక్షలు వస్తాయి.కానీ గత ఏడాది నుంచి ఈ రెండు నిధులూ రావడం లేదు.గతంలో పంచాయతీ పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ, వృత్తిపన్ను, ఇంటి అనుమతుల లైసెన్స్ జారీ సమయంలో పన్నుల కమీషన్లు నేరుగా పంచాయతీ ఖాతాలో జమయ్యేవి. మీసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాక అవి కాస్తా ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతున్నాయి. దీంతో చిన్న చిన్న పనులకు పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేయాలంటూ.. అధికారుల మెడపై కత్తి పెట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ కార్యక్రమానికి అవసరమైన బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు, పారిశుధ్య నిర్వహణ, నీటి సరఫరా తదితరాల కోసం అధికారులు జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలంటూ చెప్పుకోవడమే కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు నిలిచిపోవడంతో సమస్యలు పరిష్కారం కాక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో పారిశుధ్యం, డ్రైనేజీల నిర్వహణ, అవసరమైన భవన నిర్మాణాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచ్‌లు.. బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో సగం మందికిపైగా అప్పులు, వడ్డీల భారం మోస్తూ బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో తాజా మాజీ సర్పంచ్‌కు రూ.8 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఒత్తిళ్లు భరించలేక ఆస్తులు అమ్ముకుని అప్పులు తీరుస్తున్నారు. మరోవైపు.. పంచాయతీలకు నిధులు మంజూరు చేయని ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల అమలుకోసం మాత్రం ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల కార్యదర్శులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ నిధులూ లేవు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లను పంపిణీ చేయాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2021–22 నుంచి వరుసగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు 85 శాతం, 10 శాతం, 5 శాతం నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నారు. ఈ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలు సూచించి ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్‌లో రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం (ఎస్ఎఫ్సీ) ఒక్కో ఓటరుకు రూ.65 నుంచి రూ.115 చొప్పున ఇస్తోంది. అయితే గత 20 నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఇంకోవైపు పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో.. ఈ ఏడాది జనవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం నిలిచిపోయాయి. ముగిసిన సర్పంచ్ల పదవీకాలం ఇసుక సెస్, సీనరేజ్, రిజిస్ట్రేషన్ చార్జీలు తదితరాలు జమ చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద ప్రభుత్వం తలసరి రూ.800 వరకు గ్రామ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 1న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియగా.. జనవరి 31నే ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించి వారికి ఫిబ్రవరి 15న మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే సర్పంచ్ల పదవీ కాలం ముగిసే ఆరు నెలల ముందే నిధులు నిలిచిపోగా.. పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తుండగా పంచాయతీలకు వివిధ గ్రాంట్ల రూపేణా రావాల్సిన సుమారు రూ.1,514 కోట్లు మంజూరు కాకుండా నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధి పనులు ఆగిపోగా, విద్యుత్ బకాయిలు ఇప్పటికే రూ.4,305 కోట్లకు చేరుకోవడంతో పంచాయతీలు పెను సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మూడు ఖాతాలు ఖాళీ..! గ్రామ పంచాయతీలకు ఉండే మూడు రకాల బ్యాంకు ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఆస్తి పన్ను అరకొరగా వసూలు అవుతున్నా ఖర్చు నాలుగింతలు ఉండడంతో ఆ ఖాతా ఎప్పుడూ ఖాళీ అవుతోంది. రెండోదైన ఎస్ఎఫ్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. వీటిని ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే 20 నెలలుగా నిధులు నిలిచిపోయాయి. మూడోది 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ జనాభా, ఓటర్ల ఆధారంగా నిధులు అందజేస్తుంది. వీటిని ప్రత్యేక సూచనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం పంచాయతీలకు ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. తాజా మాజీ సర్పంచ్‌లకు రూ.కోట్లల్లో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. నేను గ్రామంలో íసీసీ రోడ్లు, మొరం పనులు, వాగు దాటేందుకు వీలుగా నిర్మాణ పనులు చేసిన. స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం కల్పించా. ఈ మేరకు రూ.25 లక్షలు బిల్లు రావాల్సి ఉంది. మా జిల్లాలో రూ.50 కోట్లకు పైనే ఉన్న బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకు రూ.680 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. – దూసరి గణపతి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, జనగామ అప్పులు కట్టడానికి ప్లాటు అమ్మా గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనులు చేశా. గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, సబ్ సెంటర్ నిర్మాణం చేపట్టా. పనులు పూర్తికాగానే బిల్లులు వస్తాయనే ధీమాతో చాలావరకు అప్పులు చేసి పనులు పూర్తి చేశా. వీటికి సంబంధించి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో సిద్దిపేటలో ఉన్న ప్లాటును తక్కువ ధరకు అమ్మి కొంతమేర అప్పులు చెల్లించా. – దమ్మ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, రామలక్ష్మణపల్లె, ముస్తాబాద్, సిరిసిల్ల జిల్లా పదవీకాలం అయిపోయింది..అప్పు మిగిలింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో రెండేళ్ల కిందట రూ.40 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టారు. కానీ వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదు. అభివద్ది పనులతో ఊరు బాగైందని, తాము మాత్రం అప్పులపాలయ్యామంటూ మాజీ సర్పంచ్ ఈడ్గి లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముందడుగేదీ?... నిర్మాణానికి నోచని 101 గ్రామపంచాయతీ భవనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నాయి. అయినా పనులు ప్రారంభానికి నోచలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 180 గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. 127 పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు, 47 భవనాలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చాయి. మరో ఆరింటికి కేంద్ర ప్రభుత్వ ఆర్జీ ఎస్ఏ (రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్) పథకం కింద నిధులు వచ్చాయి. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. గతంలో గిరిజన తండాలుగా ఉండీ ఇప్పుడు పంచాయతీలుగా మారిన చోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి. పనులే షురూ కాలేదు వివిధ పథకాల కింద మొత్తం 180 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 79 గ్రామ పంచాయతీ భవనాలకే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 101 భవనాలు ఇంకా ప్రారంభానికి నోచలేదు. నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పనులకు శ్రీకారం చుట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. స్థలాల సమస్య పలు గ్రామ పంచాయతీల్లో స్థలం లేకపోవడం కూడా భవన నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అనువుగా లేదు. బండలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో పనులు ప్రారంభించలేకపోయామని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్ఎఫ్సీ ఫండ్
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీల్లో నిధుల కటకట నెలకొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు మరో రూ.30 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.1150 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి సర్పంచులు నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్కో నెల పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాలకూ ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు సిబ్బంది, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు చెల్లించేవారు. ఇప్పటికే అన్ని జీపీల్లో అప్పులు తెచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో నెల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. తప్పని ఎదురుచూపులు ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని రోజుల తరబడి సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు అప్పులు తెచ్చి కార్మికులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులకు కూడా డబ్బులను సర్దుబాటు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జీపీ ఖాతాల్లో జమ అయిన నిధులకు కూడా ఫ్రీజింగ్ చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీలో ఒక్క చెక్కు కూడా పాస్ కావడం లేదని వాపోతున్నారు. అభివృద్ధి పనుల బిల్లులు సహా పంచాయతీలకు మొత్తం రూ.100 కోట్లకుపైగా రావాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. పది రోజుల్లో జమయ్యే అవకాశం గ్రామపంచాయతీలకు పది రోజుల్లో నిధులు విడుదల య్యే అవకాశముంది. ఆర్థిక సంఘంతోపాటు, ఎస్ఎఫ్సీ నిధులు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జయసుధ, జిల్లాపంచాయతీ అధికారి రూ.45 కోట్ల బకాయిలు.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కోసం సర్పంచ్, ఉపసర్పంచ్ జాయింట్ ఖాతాతో డిజిటల్ టోకెన్ ప్రక్రియను 13 నెలల క్రితమే పూర్తిచేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే ఎస్ఎఫ్సీ మూడు నెలలుగా జమ చేయడం లేదు. గతేడాదికి సంబంధించి పూర్తిగా విడుదల చేసినా.. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి విదిల్చలేదు. గతేడాది, ఈయేడాదికి సంబంధించి ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నుంచి మొత్తం రూ.45కోట్ల వరకు జమ కావాల్సి ఉంది. -
నిధులు వెనక్కు పంపడం ఇష్టం లేక.. రూ.69 లక్షలు జేబుల్లోకి
సాక్షి, దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కరోనా కాలంలో తలుపులే తెరవని పాఠశాలో కంప్యూటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని రూ.69 లక్షలు గోల్మాల్ చేశారు. దేవనహళ్లి తాలూకా అణ్ణేశ్వర గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ స్కాం జరిగింది. రూ.69 లక్షలు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు కొనుగోలు చేసి జీపీ ఆఫీసుతో పాటు తమ పరిధిలోని పాఠశాలలకు ఏర్పాటు చేశామని అధికారులు లెక్కలు రాశారు. అయితే ఎక్కడా సీసీ కెమెరాలు, కంప్యూటర్లు కనిపించడంలేదు. పీడీఓ ఇనాందార్‌ను ఇదేమని ప్రశ్నిస్తే నిధులు వెనక్కు పంపించడం ఇష్టం లేకే లెక్కలు రాశామని సమర్థించుకుంటున్నారు. -
పల్లెలు మారితీరాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలవారు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే విధంగా 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ‘‘పల్లెల ప్రగతికి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉంది. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలి. అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని గట్టిగా విశ్వసిస్తున్నా. 30 రోజుల తర్వాత కచ్చితంగా గ్రామముఖ చిత్రం మారితీరాలి. దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలి’’అని ఆకాంక్షించారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను అందించిందన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు. ప్రణాళిక అమలుపై ‘తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ముఖ్య సేవకుడిననే భావనతో ఉంటా.. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిర్వహించడం అనేది నిరంత రం సాగాలని, దీనికోసం ఈ 30 రోజుల ప్రణాళికతో కొత్త ఒరవడి ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కలెక్టర్లు దీనికి నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామన్నారు. వీరిలో ఒకరిని పంచాయతీ రాజ్ శాఖకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులు అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. వయో పరిమితి పెంచుతాం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలుచేసే దుస్థితి పోవాలన్నారు. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కూడా సృష్టిస్తామన్నారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను ధూషిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలు తలుచుకుంటే.. ప్రజలు తలుచుకుంటే, ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ‘‘ఎస్.కె.డే గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థకు పురుడుపోశారు. కూసం రాజమౌళి కృషి ఫలితంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామ కమిటీలున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా సాధికారితకు సాక్ష్యంగా నిలబడింది. మురార్జీ దేశాయ్ కృషి వల్ల ముంబైలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమైంది’’అని ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏంటో చెప్పడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందన్నారు. సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మం త్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అన్నీ సర్కారే చేసినా... గ్రామ పంచాయతీలపై బాధ్యతలున్నాయి గ్రామ పంచాయతీలు నేల విడిచి సాము చేయవద్దని, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘మిషన్ భగీరథ ద్వారా మంచినీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక ప్రేరణ ప్రభుత్వమే అందిస్తోంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై భారం పడకుండా చూస్తోంది. పచ్చదనం, పరిశుభ్రత కాపాడటం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, క్రమం తప్పకుండా పన్నుల వసూలు, విద్యుత్ బిల్లుల లాంటి చెల్లింపులు చేయడం, వీధిలైట్లను సరిగ్గా నిర్వహించడం పంచాయతీలు నిర్వహించాల్సిన ముఖ్య విధులు’’అని సీఎం నిర్దేశించారు. సెప్టెంబర్ 6 నుంచి అమలు చేసే కార్యాచరణలోని ముఖ్యాంశాలు.. సెప్టెంబర్ 4న కలెక్టర్లు జిల్లాసదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలు కు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండలంలో ఎంపీడీవో, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పన. గ్రామసభ ఆమోదం. ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన. అప్పులు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్టెడ్ అకౌంటు)లో చేర్చాలి. ప్రతీ ఇంటికీ, ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమంతప్పకుండా ఆస్తులవిలువ మదింపు. పన్నులు క్రమం తప్పకుండా వసూలు. పన్నులు వంద శాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలు. మొక్కలు నాటడం, స్మశాన వాటిక నిర్మాణం, డంపుయార్డు నిర్మాణ తదితర పనులకు ‘నరేగా’నిధుల వినియోగం. రాష్ట్ర బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్, ‘నరేగా’ నిధులు వస్తాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి. సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకోవాలి. దాతల నుంచి విరాళాలు సేకరించాలి. శ్రమదానంతో పనులు నిర్వహించాలి. సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వా్కడ్స్ ఏర్పాటు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహాకాలు. అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు. మంగళవారం రూరల్ డెవలప్మెంట్పై పె నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. చిత్రంలో మంత్రులు తదితరులు -
జీపీలకు నిధులు
సాక్షి, వరంగల్ రూరల్: కొత్త గ్రామపంచాయతీలకు నిధులు తొలిసారిగా నిధులు విడుదల కానున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులను పాత పంచాయతీలతోపాటు వీటికి కూడా సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న చిన్నగ్రామాలు, తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాçటు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. గతంలో ఉన్న 265 గ్రామపంచాయతీలలోపాటు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 136 గ్రామపంచాయతీలతో కలిపితే ఈ సంఖ్య 401కి చేరింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. చిన్నగ్రామాలు, తండాలుగా ఉండి కొత్తగా పంచాయతీ హోదా దక్కించుకున్న జీపీలకు ఆయా మాతృపంచాయతీల నుంచి రావాల్సిన ఆస్తులకు సంబంధించిన లెక్కలు కొలిక్కి తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా గ్రామపంచాయతీ ఖాతాల్లో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయనే సమాచారాన్ని జిల్లా పంచాయతీ కార్యాలయానికి రికార్డులు తెప్పించుకుంటున్నారు. ఇవి పూర్తి కాగానే జనాభా ఆధారంగా నిధుల పంపకాలు చేయనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.31 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూలై 31న సర్పంచ్ల పదవీకాలం కూడా ముగిసింది. దీంతో నిధుల పంపకాన్ని నిలిపివేశారు. పాత గ్రామ పంచాయతీల వారిగా నిధులు కేటాయిస్తే కొత్త గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా పోతాయని ముందస్తుగానే ట్రెజరీలో ఫ్రీజ్ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటికే కొత్త గ్రామ పంచాయతీలకు పీడీ అకౌంట్లను ప్రారంభించారు. వాటన్నింటికి డీడీఓ కోడ్లను సైతం కేటాయించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్ ద్వారా గ్రామ పంచాయతీల పేర్ల మీద కరెంట్ అకౌంట్లను తీయాల్సి ఉంది. డీడీఓ కోడ్ నంబర్లతో బ్యాంక్ అకౌంట్లను తీయగానే డబ్బులు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నిధుల కోసం తాజా మాజీల ఎదురుచూపులు 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయని తెలియగానే తాజా మాజీ గ్రామ సర్పంచ్‌లు పదవీలో ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో తీర్మానాలు చేసి, ఎంబీ రికార్డుల్లో సైతం నమోదు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు డ్రా చేసుకునేందుకు 14వ ఆర్థిక సం ఘం నిధులు ఎప్పుడొస్తాయా అని తాజా మాజీ సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ బ్యాంకు అకౌంట్ల లో డబ్బులు జమ కాగానే తీసుకునేందుకు ప్రత్యేకాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరో రెండు రోజుల్లో జమ గ్రామ పంచాయతీల అకౌంట్లను తీయిస్తున్నాం. పీడీ అకౌంట్లు పూర్తి చేశాం. డీడీఓ అకౌంట్ల ద్వారా బ్యాంకుల్లో ఖాతాలను తెరిపిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధులను మరో రెండు, మూడు రోజుల్లో డబ్బులను జమ చేస్తాం. – రాజారావు, ఇన్చార్జి డీపీఓ -
‘పంచాయతీ’ జేబులకు కత్తెర
గ్రామ పంచాయతీల నిధులను తమ హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ వేస్తోంది. కేంద్రం ద్వారా మంజూరైన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకునేందుకు యత్నిస్తోంది. అంగీకరించని సర్పంచ్ల ‘చెక్‌పవర్’ రద్దు చేస్తామంటోంది. రాష్ట్రంలో సగానికిపైగా గ్రామపంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న నేపథ్యంలో వాటి నిధుల ఖర్చును పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ ఎత్తుగడ వేస్తోంది. మీ సొమ్ము... మాకివ్వండి * లేదంటే... సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు * పంచాయతీలకు ప్రభుత్వం హుకుం * రూ. 500 కోట్లు హస్తగతం చేసుకునేందుకు మౌఖిక ఆదేశాలు * 73వ రాజ్యాంగ సవరణకు రాష్ట్ర సర్కార్ తూట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే ఇన్నాళ్లూ చూశాం. విచిత్రంగా చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మీ ఊళ్లో రోడ్లు వేస్తాం, గ్రామ పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులను మాకు బదిలీ చేయాలంటూ ఆదేశిస్తోంది. స్వచ్ఛందంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు రాని గ్రామ సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేస్తామంటూ స్వయంగా ఉన్నతాధికారుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు రూ.1,774 కోట్లు మంజూరు చేసింది. వాటిలో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడానికి టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 500- 600కు పైగా గ్రామ పంచాయతీల నుంచి అలా మంజూరైన నిధులను ప్రభుత్వం గుంజేసుకుంది. కేంద్రం పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా ఇప్పటికే విద్యుత్ బకాయిల పేరుతో వందల కోట్లను లాగేసుకుంది. విపక్ష సర్పంచ్‌లు ఉన్నందునే.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించిన కారణంగా కేంద్రం రెండేళ్లుగా గ్రామాలకు నిలిపివేసిన నిధులన్నింటినీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ. 1,774 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారున్న నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో నిధుల ఖర్చు పూర్తిగా తమ చేతుల్లో తీసుకోవడానికి చంద్రబాబు సర్కారు ఈ ఎత్తుగడ వేసింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను, అదే గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారితో చేయించడానికి సిద్ధమవుతోంది. లింకులు పెట్టి ఉన్న పథకానికీ మంగళం పంచాయతీ నిధులను తమ హస్తగతం చేసుకునేందుకు గ్రామాల్లో వంద శాతం ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేసింది. ‘ఉపాధి’ పథకంలో కేవలం కూలీలతో చేపట్టే పనులే కాకుండా వందశాతం ఆ పథకం నిధులతో గతేడాది వరకు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తిపలికి భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు సగం నిధులు ఇవ్వడానికి ముందుకొస్తేనే మిగిలిన సగం నిధులు ఉపాధి పథకం ద్వారా ఆయా గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలపాలంటూ ప్రభుత్వం జూన్ 18న జీవో నంబరు 58 జారీ చేసింది. వాస్తవంగా, ఆర్థిక సంఘం పేరుతో కేంద్రం గ్రామాలకు ఇచ్చే నిధుల ఖర్చుతోపాటు, 90శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరిగే ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు కేవలం పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. జీవో 58 ప్రకారం.. పై రెండు పథకాల ద్వారా పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను 50-50 శాతం కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కొత్త ఎత్తుగడ వేసింది. నిధులు మళ్లించాలంటూ ఒత్తిడి పంచాయతీలు 50 శాతం నిధులివ్వడానికి ముందుకొస్తే ప్రభుత్వం మరో 50 శాతం నిధులిచ్చి గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొదట గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 12,918 గ్రామాలు ఉండగా, అందులో దాదాపు 8వేల గ్రామాలు తీర్మానాలను ప్రభుత్వానికి అందజేశాయి. మిగిలిన గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకోవడం కోసం ఒక పక్క అధికారులు ఒత్తిడి తీసుకొస్తూనే.. మరో పక్క ఇప్పటికే తీర్మానం చేసిన గ్రామ సర్పంచ్‌లు తక్షణమే కేంద్రమిచ్చిన నిధులను రోడ్ల నిర్మాణం కోసం తమకు మళ్లించాలంటూ ఒత్తిడి మొదలుపెట్టారు. దీనిపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోందంటే... ♦ రాజ్యాంగ సవరణ మేరకు గ్రామ పంచాయతీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. గ్రామ పంచాయతీలకు పన్ను రూపేణా వచ్చే ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపేణా గ్రామాలకు కేటాయించిన నిధులు పంచాయతీల సాధారణ నిధి (జనరల్ ఫండ్)కి జమవుతాయి. ఈ నిధులు ఖర్చు పెట్టుకోవడంలో అధికారం పూర్తిగా ఆ గ్రామాల పంచాయతీలకే ఉంటుంది. ♦ ఈ నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోరాదు. ♦ అత్యవసర సందర్భాల్లోనూ పంచాయతీలతోనే ఖర్చు చేయించాలి. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కానీ, నిధులను తన అధీనంలోకి తీసుకోకూడదు. ♦ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 29 అధికారాలను గ్రామ పంచాయతీలకే పూర్తిగా బదిలీ చేయాలి.