పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు
20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులు
వివిధ గ్రాంట్ల రూపంలో రూ.1,514 కోట్లు రావాల్సి ఉందని అంచనా
పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు
పంచాయతీలు నిర్వహించే మూడు రకాల బ్యాంకు ఖాతాలూ ఖాళీ
బిల్లులు రాక అప్పుల్లో మాజీ సర్పంచ్‌లు.. సర్కారు బకాయిలు రూ.680 కోట్లు!
రూ.4,305 కోట్లకు చేరిన పెండింగ్ విద్యుత్ బిల్లులు.. నిలిచిపోయిన అభివృద్ధి పనులు.. పారిశుద్ధ్య నిర్వహణకు, దోమల
మందు సరఫరాకూ నిధుల కొరత
మరోవైపు పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వ కార్యక్రమాల అమలు భారం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామ పంచాయతీ భవనం.గ్రామంలో 10 వార్డులు, 428 ఇళ్లు, 1,779 జనాభా ఉంది.జనాభా ప్రాతిపదికన ఏటా రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) గ్రాంట్ రూ.15 లక్షలు,15వ ఆర్థిక సంఘం (కేంద్రం) నిధులు రూ.15 లక్షలు వస్తాయి.కానీ గత ఏడాది నుంచి ఈ రెండు నిధులూ రావడం లేదు.గతంలో పంచాయతీ పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ, వృత్తిపన్ను, ఇంటి అనుమతుల లైసెన్స్ జారీ సమయంలో పన్నుల కమీషన్లు నేరుగా పంచాయతీ ఖాతాలో జమయ్యేవి.
మీసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాక అవి కాస్తా ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతున్నాయి. దీంతో చిన్న చిన్న పనులకు పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేయాలంటూ.. అధికారుల మెడపై కత్తి పెట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ కార్యక్రమానికి అవసరమైన బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు, పారిశుధ్య నిర్వహణ, నీటి సరఫరా తదితరాల కోసం అధికారులు జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలంటూ చెప్పుకోవడమే కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు నిలిచిపోవడంతో సమస్యలు పరిష్కారం కాక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో పారిశుధ్యం, డ్రైనేజీల నిర్వహణ, అవసరమైన భవన నిర్మాణాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచ్‌లు.. బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో సగం మందికిపైగా అప్పులు, వడ్డీల భారం మోస్తూ బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్కో తాజా మాజీ సర్పంచ్‌కు రూ.8 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఒత్తిళ్లు భరించలేక ఆస్తులు అమ్ముకుని అప్పులు తీరుస్తున్నారు. మరోవైపు.. పంచాయతీలకు నిధులు మంజూరు చేయని ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల అమలుకోసం మాత్రం ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల కార్యదర్శులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏ నిధులూ లేవు
గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లను పంపిణీ చేయాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2021–22 నుంచి వరుసగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు 85 శాతం, 10 శాతం, 5 శాతం నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నారు. ఈ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలు సూచించి ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్‌లో రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం (ఎస్‌ఎఫ్‌సీ) ఒక్కో ఓటరుకు రూ.65 నుంచి రూ.115 చొప్పున ఇస్తోంది. అయితే గత 20 నెలలుగా ఎస్‌ఎఫ్‌సీ నిధులు రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఇంకోవైపు పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో.. ఈ ఏడాది జనవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం నిలిచిపోయాయి.
ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం
ఇసుక సెస్, సీనరేజ్, రిజిస్ట్రేషన్ చార్జీలు తదితరాలు జమ చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద ప్రభుత్వం తలసరి రూ.800 వరకు గ్రామ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 1న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియగా.. జనవరి 31నే ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించి వారికి ఫిబ్రవరి 15న మార్గదర్శకాలను జారీ చేసింది.
అయితే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసే ఆరు నెలల ముందే నిధులు నిలిచిపోగా.. పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తుండగా పంచాయతీలకు వివిధ గ్రాంట్ల రూపేణా రావాల్సిన సుమారు రూ.1,514 కోట్లు మంజూరు కాకుండా నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధి పనులు ఆగిపోగా, విద్యుత్ బకాయిలు ఇప్పటికే రూ.4,305 కోట్లకు చేరుకోవడంతో పంచాయతీలు పెను సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
మూడు ఖాతాలు ఖాళీ..!
గ్రామ పంచాయతీలకు ఉండే మూడు రకాల బ్యాంకు ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఆస్తి పన్ను అరకొరగా వసూలు అవుతున్నా ఖర్చు నాలుగింతలు ఉండడంతో ఆ ఖాతా ఎప్పుడూ ఖాళీ అవుతోంది. రెండోదైన ఎస్‌ఎఫ్‌సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. వీటిని ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది.
అయితే 20 నెలలుగా నిధులు నిలిచిపోయాయి. మూడోది 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ జనాభా, ఓటర్ల ఆధారంగా నిధులు అందజేస్తుంది. వీటిని ప్రత్యేక సూచనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి.
బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం
పంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. తాజా మాజీ సర్పంచ్‌లకు రూ.కోట్లల్లో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. నేను గ్రామంలో íసీసీ రోడ్లు, మొరం పనులు, వాగు దాటేందుకు వీలుగా నిర్మాణ పనులు చేసిన. స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం కల్పించా. ఈ మేరకు రూ.25 లక్షలు బిల్లు రావాల్సి ఉంది. మా జిల్లాలో రూ.50 కోట్లకు పైనే ఉన్న బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకు రూ.680 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
– దూసరి గణపతి, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు, జనగామ
అప్పులు కట్టడానికి ప్లాటు అమ్మా
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనులు చేశా. గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, సబ్ సెంటర్ నిర్మాణం చేపట్టా. పనులు పూర్తికాగానే బిల్లులు వస్తాయనే ధీమాతో చాలావరకు అప్పులు చేసి పనులు పూర్తి చేశా. వీటికి సంబంధించి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో సిద్దిపేటలో ఉన్న ప్లాటును తక్కువ ధరకు అమ్మి కొంతమేర అప్పులు చెల్లించా.
– దమ్మ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, రామలక్ష్మణపల్లె, ముస్తాబాద్, సిరిసిల్ల జిల్లా
పదవీకాలం అయిపోయింది..అప్పు మిగిలింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో రెండేళ్ల కిందట రూ.40 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టారు. కానీ వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదు. అభివద్ది పనులతో ఊరు బాగైందని, తాము మాత్రం అప్పులపాలయ్యామంటూ మాజీ సర్పంచ్ ఈడ్గి లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment