
సనత్‌నగర్‌లో గుండె సంబంధ వ్యాధుల ఆస్పత్రి.. జూన్‌లో ప్రారంభం
అల్వాల్‌లో గ్యాస్ట్రో... ఎల్బీనగర్‌లో న్యూరో వైద్యసేవలు
ఆయా టిమ్స్‌లకు అనుబంధంగా మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కూడా జూన్‌లోనే
అవసరమయ్యే డాక్టర్లు, సిబ్బంది కోసం సర్కార్‌కు డీఎంఈ లేఖ
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ అనగానే ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రులే గుర్తుకొచ్చేవి. గుండె, మూత్రపిండాలు, న్యూరో సంబంధిత సమస్యలొస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. ఆ కొరత తీర్చేందుకు స్పెషలైజ్డ్ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో నగర శివార్లలో నిర్మిస్తున్న ఆస్పత్రులను స్పెషలైజ్డ్ హాస్పిటళ్లుగా మార్చనున్నారు.
ప్రస్తుతం నిర్మాణపరంగా వివిధ దశల్లో ఉన్న ఈ మూడింటిని స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చడంతోపాటు ప్రతీ ఆస్పత్రికి ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అక్కడ ప్రొఫెసర్లు, డాక్టర్ల కొరత కూడా తీరనుంది. పీజీ స్టూడెంట్లు డాక్టర్లుగా సేవలు అందించే వీలు కలుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తే, నర్సుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది.
ఇప్పటివరకు స్పెషలైజ్డ్ కొన్నే..
ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం.. జనరల్ ఆస్పత్రులుగా ప్రసిద్ధి. ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నా, స్పెషలైజ్డ్ ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదు. హైదరాబాద్‌లో ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, నిలోఫర్ పిల్లల దవాఖానా, సరోజినిదేవి కంటి ఆస్పత్రి వంటివి మాత్రమే స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఉన్నాయి. అయితే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, గ్యాస్ట్రో వంటి స్పెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో కొత్తగా నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ను అందుకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్డియాక్ స్పెషాలిటీ ఆస్పత్రిగా సనత్‌నగర్ టిమ్స్
హైదరాబాద్‌కు నలుదిక్కులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొదటి టిమ్స్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్‌లలో మూడు టిమ్స్ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న టిమ్స్ ను ఖాళీ చేయించి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించారు.
– సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ను గుండె సంబంధమైన వ్యాధుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డియాక్‌తోపాటు కార్డియో థొరాసిక్ సేవలను ఇక్కడ అందుబాటులోకి తేనున్నారు. గ్రామీణస్థాయి నుంచి హైదరాబాద్ వరకు గుండె జబ్బులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను జూన్ 2 న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ హాస్పిటల్‌కు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది కోసం ఇప్పటికే ప్రభుత్వానికి డీఎంఈ నరేంద్రకుమార్ లేఖ రాశారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనైనా హాస్పిటల్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
న్యూరో, గ్యాస్ట్రో కోసం
ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ను న్యూరో సూపర్ స్పెషాలిటీగా మార్చాలని ప్రభుత్వం భావించింది. ఈ ఆస్పత్రికి అనుబంధంగా వనస్థలిపురం మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ను గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. దీనికి కుత్బుల్లాపూర్ మెడికల్, నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేస్తారు.
– వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (డబ్లు్యఎస్‌ఎస్‌హెచ్)ను కూడా జూన్‌లోనే ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనే ఎంజీఎంను విలీనం చేస్తారు. ఈ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు కాకతీయ మెడికల్ కాలేజ్ అనుబంధంగా కొనసాగనుంది.