super specialty hospitals
-
వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా సామాన్యులకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలోకి తేవాలని యోచిస్తోంది. దీనికోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసింది. ప్రభుత్వంలో డయాగ్నొస్టిక్ సెంటర్లు మొదలు... మానవ వనరుల అభివృద్ధి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల వరకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై దృష్టిసారించింది. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లు, కొత్త ఉస్మానియా, టిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, కేన్సర్ కేర్‌లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.డయాగ్నొస్టిక్ సేవలకే అత్యధికంటి–డయాగ్నొస్టిక్ సేవల బలోపేతానికి వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా రూ. 1,044 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులోభాగంగా మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హబ్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రతీ బోధనాసుపత్రిలో ఒక ఎంఆర్ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యంగా ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్లపై దృష్టిసారించింది. అందుకోసం రూ. 921 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కొత్తగా 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 35 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు సహా నిమ్స్ పరిధిలో ఇవి ఏర్పాటు కానున్నాయి.పరికరాలకు రూ.750 కోట్లుటిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టిమ్స్‌లు, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తారు. సనత్‌నగర్ టిమ్స్‌లో రూ.50 కోట్లతో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రూ.350 కోట్లతో 30 పడకలతో డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు.మరికొన్ని నిర్ణయాలు...⇒ కొత్తగా 108 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 54 కోట్లు⇒ ఆరోగ్య మహిళ కార్యక్రమం సహా ఎంసీహెచ్ సేవలను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతుండగా, వాటిని వెయ్యికి పెంచుతారు. అందుకోసం రూ.300 కోట్లు ఖర్చుచేస్తారు. రూ. 10 కోట్ల వ్యయంతో 10 నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 44 యూనిట్లను ఆధునీకరిస్తారు. ⇒ నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రూ. 11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటు. ⇒ 35 జీజీహెచ్‌ల్లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు. ఒక్కో సెంటర్‌కు రూ. 1.37 కోట్ల చొప్పున రూ. 49 కోట్లు.⇒ 35 బోధనాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేర్ ట్రైనింగ్ కోసం సిములేషన్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.7 కోట్ల చొప్పున రూ. 245 కోట్లు కేటాయిస్తారు. ⇒ ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు. అందులో 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.180 కోట్లు, 10 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.70 కోట్లు, 10 వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.160 కోట్లు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తారు. ⇒ హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులు సహా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌లలో ఆర్గాన్ రిట్రీవల్ అండ్ స్టోరేజ్ సెంటర్ల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు. ⇒ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లను రూ.79 కోట్లతో నెలకొల్పుతారు. ⇒ కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తారు. ⇒ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ కార్డులు, ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు వ్యయం చేస్తారు. ⇒ రూ. 165 కోట్లతో డీ సెంట్రలైజ్డ్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. -
3 పెద్దాసుపత్రుల టెండర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రూ. వెయ్యి కోట్ల చొప్పున నిర్మించబోయే మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సోమవారం టెండర్లు ఖరారయ్యాయి. ఎల్బీ నగర్ సమీపంలోని గడ్డిఅన్నారం మార్కెట్ ప్రాంతంలో, సనత్‌నగర్‌లోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో, అల్వాల్ వద్ద నిర్మించబోయే ఈ మూడు ఆసుపత్రుల టెండర్లను మేఘా, ఎల్అండ్టీ, డీఈసీ వంటి ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆసుపత్రుల డిజైన్‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో వాటిని తిరిగి డిజైన్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాయి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గనిర్దేశంలో రోడ్లు, భవనాలశాఖ సహకారంతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెండర్లు ఖరారైనందున డిజైన్‌పై తుది నిర్ణయం తీసుకున్నాక ఆసుపత్రుల నిర్మాణం మొదలవనుంది. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. హెలికాప్టర్ కూడా దిగేలా ఆసుపత్రులను తీర్చిదిద్దే అవకాశముంది. అవయవ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయాల్సిన సందర్భాల్లో అవయవాలను తరలించేందుకు వీలుగా లేదా రోగులను అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు హెలికాప్టర్ సేవలను ఈ ఆస్పత్రుల నుంచి వినియోగించేలా వాటిని నిర్మించనున్నారు. వెయ్యి పడకలతో... ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రుల కారణంగా హెల్త్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలోనూ పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ఆ ఘనతను సాధించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ వైద్యాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనుంది. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కనీసం 30 మంది నిష్ణాతులైన డాక్టర్లను నియమించనుంది. వీటిల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు, 200 ఐసీయూ పడకలు ఉంటాయి. వీటిల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులూ అందుబాటులోకి తెస్తారు. ఏడాదిన్నరలోగా పూర్తిచేయాలన్నది సర్కారు సంకల్పం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవసరమైన క్వార్టర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ బ్లూప్రింట్ తయారు చేసింది. -
ప్రైవేట్ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ పరిధిలోని వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 (సెక్షన్ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వేతర ఆస్పత్రులు, ట్రస్ట్‌ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఇకపై సర్కారు పరిధిలో పనిచేయాలని పేర్కొన్నారు. తొలిదశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెంచుతారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజ్ (కోవిడ్) రెగ్యులేషన్ 2020 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు ఇవీ... ► ప్రైవేట్/ నాన్‌గవర్నమెంట్ మెడికల్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, అందులో పనిచేసే సిబ్బంది, వసతులు, ఐసొలేషన్ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్ ల్యాబొరేటరీలు, ఫార్మసీలు, శవాగారాలు, ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాలి. ► ఎలాంటి వసతుల వినియోగానిౖకైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే ప్రాధాన్యం ఉండాలి ► ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఏ పనులైనా ప్రభుత్వానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. జిల్లా స్థాయి సంస్థలు స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి ► స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, నాన్‌మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు. బాధితులందరికీ వైద్యమే లక్ష్యం విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించాం. – డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్యశ్రీ పరిధిలో లేనివి కూడా.. తొలిదశలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం తీసుకుంటున్నాం. పరిస్థితిని బట్టి మండల, నియోజక వర్గ స్థాయి ఆస్పత్రులను కూడా తీసుకుంటాం. నెట్వర్క్ పరిధిలో ఉన్నా, లేకున్నా కరోనా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ సిబ్బంది కూడా ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలి. – డా.ఎ.మల్లికార్జున, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అంతా భాగస్వాములు కావాలి విపత్కర సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ అనే తారతమ్యం ఉండకూడదు. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించవచ్చు. – డా.డి.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
సింగరేణిలో పెరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించే ఆస్పత్రుల సంఖ్యను 42 నుంచి 72కు పెంచినట్లు సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు సింగరేణి ప్రాంత జిల్లా కేంద్రాల్లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కార్మికులు వైద్య సేవలు పొందవచ్చన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో బుధవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు హామీలిచ్చారు. వైద్య సదుపాయాల మెరుగుదలకు రూ.10 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశామని, ఏరియా ఆస్పత్రులన్నింటినీ ఆధునీకరించి ఏసీ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఆదివారం హైదరాబాద్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యుల బృందాలతో 6 ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల పథకం కింద వైద్య కారణాలతో విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న 450 మంది కార్మికుల స్థానంలో వారి కుటుం బీకులకు అవకాశమిచ్చామన్నారు. ఈ ఏడాది కంపెనీకి అత్యధిక లాభాలు అర్జించిన నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో గణనీయ వాటా లభించే అవకాశముందన్నారు. సంస్థలో ఉత్పత్తి కన్నా రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో సింగరేణికి నవరత్న కంపెనీ హోదా తప్పక లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో గుర్తింపు సంఘం నాయకులు వెంకట్రావు, ఎం.రాజిరెడ్డి పాల్గొన్నారు. -
హెల్త్‌కార్డుల భారంపై ‘కార్పొరేట్’ బేరం
* వైద్య చికిత్సల ప్యాకేజీపై 40 శాతం అదనంగా పెంచాలని డిమాండ్ * మొదట్లో 25 శాతమే కోరిన ఆసుపత్రులు... ఓకే చెప్పిన సర్కారు * తాజా డిమాండ్లపై ఉన్నతస్థాయి సమావేశానికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డులపై కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకో మాట మారుస్తున్నాయి. కొత్త మెలికలు పెడుతున్నాయి. ప్యాకేజీలపై బేరమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల హెల్త్‌కార్డులపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇంతకుముందు చేసిన డిమాండ్‌కు సర్కారు ఓకే అని చెప్పింది. గతంలో ఆరోగ్యకార్డుల శస్త్రచికిత్స ప్యాకేజీని 25 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మొదట్లో ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ససేమిరా అంది. 10 లేదా 15 శాతానికి మించి పెంచబోమని స్పష్టం చేసింది. కానీ చర్చోపచర్చల అనంతరం చివరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్‌కు తలొగ్గింది. తాజాగా 25 శాతం సరిపోదని, 40 శాతం ప్యాకేజీ పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రులు కోరుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యకార్డుల అమలుకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది. ఓపీకి ఉచిత సేవలపై ప్రతిష్టంభన ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఔట్ పేషెం ట్లుగా వస్తే ఉచితసేవలు అందించడం చాలా కష్టమని, అవసరమున్నా, లేకున్నా ఉద్యోగులు ఆసుపత్రులకు విరివిగా వస్తే తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, అందువల్ల అందుకు ఫీజు వసూలు చేస్తామని, దానికి అంగీకరించాలని యాజమాన్యాలు అంటున్నాయి. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ అడు గు ముందుకు పడలేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యా ల ప్రతినిధులు కోరుతున్నారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎంఆర్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి చెల్లిస్తే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. శస్త్రచికిత్సల ప్యాకేజీ పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 200 కోట్లకు మించి ఖర్చు కాదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం. ‘దసరాకి కార్పొరేట్ చికిత్స అందించాలి’ ఉద్యోగులకు దసరా పండగలోపు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలసి కోరారు. ఉపాధ్యాయుల నుంచి ప్రీమియం గెజిటెడ్ స్కేలు వారు రూ. 200, మిగతావారు రూ. 150 చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
ఓపీ ఉచిత సేవలకు ససేమిరా
♦ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల విముఖత ♦ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో చర్చలు విఫలం ♦ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం ♦ సర్జికల్ ప్యాకేజీ 25 శాతం పెంపునకు సర్కారు సుముఖం ♦ నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ డిమాండ్‌పై తర్జనభర్జన ♦ రీయింబర్స్‌మెంట్‌ను ఆరునెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఔట్ పేషెంట్ (ఓపీ) ఉచిత సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. దీనిపై ప్రభుత్వానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సంయుక్తంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ ఒక్క విషయంలోనే ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. మెడికల్ ప్యాకేజీ నిమ్స్‌లో ఉన్నట్లుగా ఇవ్వాలని టీషా కోరగా, సర్కారు అంగీకరించలేదు. ఉదాహరణకు డెంగీ జ్వరం వంటివి వస్తే ఎన్నాళ్లకు నయమవుతుందో కచ్చితంగా చెప్పలేమని... కొందరికి తక్కువ రోజుల్లో నయమైతే, మరికొందరికి ఎక్కువ రోజులు పట్టొచ్చని... అందువల్ల ప్రస్తుత సాధారణ ప్యాకేజీ వల్ల నష్టపోతామని టీషా ప్రతినిధులు మంత్రికి వివరించారు. అందువల్ల నిమ్స్ తరహా ప్యాకేజీ ఆమోదయోగ్యమన్నారు. సాధ్యాసాధ్యాలపై వైద్య నిపుణులతో చర్చిస్తామని మంత్రి చెప్పారు. చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, ఆరోగ్యశ్రీ సీఈవో జ్యోతిబుద్ధప్రకాష్, టీషా అధ్యక్షుడు గురువారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల అవస్థలు ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులతో నగదు రహిత చికిత్సపై ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు అవస్థలు పడుతున్నారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి కీలకమైన చికిత్సల కోసం వారు ఆయా ప్రధాన ఆసుపత్రుల వద్దకే పరుగులు తీస్తున్నారు. నగదు రహిత చికిత్స లేకపోవడంతో ముందుగా డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. కొన్ని చికిత్సలకు తప్ప ఏ జబ్బుకూ కార్పొరేట్ ఆసుపత్రులు వేసిన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడంలేదు. రూ. లక్ష బిల్లు అయితే రూ. 20వేల నుంచి 30 వేల వరకు మాత్రమే మంజూరు చేస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. . ఆరోగ్య కార్డులు వచ్చినా తిప్పలు తప్పడం లేదంటున్నారు. ఇదిలాఉండగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల విధానాన్ని, రీయింబర్స్మెం ట్ పద్ధతినీ వచ్చే డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైజాగ్‌లో మరో ఆసుపత్రి: అపోలో
న్యూఢిల్లీ: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఈ ఏడాది మరో రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించనుంది. ఇవి వైజాగ్‌తోపాటు నవీ ముంబైలో రానున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటితోపాటు కొత్త ఆసుపత్రుల ద్వారా వచ్చే అయిదేళ్లపాటు ఏటా 1,000 పడకలు జోడించనున్నట్టు చెప్పారు. వైజాగ్‌లో ఇప్పటికే అపోలో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తోంది. -
‘సూపర్' వైద్యం
సాక్షి, గుంటూరు గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయా... ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడే ఏర్పాటు కానున్నాయా...అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. ఇప్పటివరకు కార్డియాలజీ, న్యూరాలజీ, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఒక్క ఆసుపత్రీ సీమాంధ్రలో లేదు. హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రాలో తమ శాఖల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర రాజధాని గుంటూరు- విజయవాడ మధ్యే ఏర్పాటవుతుందని నిర్దారించుకుంటున్న సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల నిర్వాహకులు అనేక మంది ఇక్కడే తమ శాఖల ఏర్పాటుకు నిర్ణయించుకున్నారు. రాజధానికితోడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేస్తే గుంటూరు- విజయవాడ ప్రాంతం మెడికల్ హబ్‌గా మారే అవకాశం ఉందని గుర్తించారని అంటున్నారు. సీమాంధ్రలో పెద్దపెద్ద ఆసుపత్రులు ఎక్కువగా గుంటూరు, విజయవాడ నగరాల్లోనే ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి రోగులు ఇక్కడకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే సీమాంధ్రలోని అన్ని జిల్లాల ప్రజలకు అను కూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య అభ్యసించి మంచి పేరున్న వైద్యులుగా ఎదిగిన ఎందరో ఇతరదేశాలతోపాటు, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కతా, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్యులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటైతే వీరంతా తమ తమ సొంత ప్రాంతాల్లోనే వైద్య సేవలందించేందుకు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గుండెవైద్య విభాగంలో పీపీపీ పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఆయన బాటలోనే మరికొందరు ఇక్కడకు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. భూముల కొనుగోలు పూర్తి... నూతన రాజధాని గుంటూరు- విజయవాడ మధ్య ఏర్పాటు కానుందని భావించిన అనేక మంది వైద్య ప్రముఖులు ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన భూములను ముందుగానే కొనుగోలు చేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మాత్రం విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు వీటి మధ్య ఉన్న మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో గుంటూరులో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా పేరొందిన అపోలో, యశోదా, మెడ్విన్, కామినేని వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు విజయవాడ-గుంటూరు నగరాల మధ్య భూముల కొనుగోలు పూర్తయిందంటున్నారు. వీటి రాకతో గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు సీమాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానుండటం ఆనందించవలసిన విషయమే.