ఓపీ ఉచిత సేవలకు ససేమిరా | Free services refused to OP | Sakshi
Sakshi News home page

ఓపీ ఉచిత సేవలకు ససేమిరా

Published Sun, Jun 28 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

ఓపీ ఉచిత సేవలకు ససేమిరా

ఓపీ ఉచిత సేవలకు ససేమిరా

♦ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల విముఖత
♦ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో చర్చలు విఫలం
♦ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
సర్జికల్ ప్యాకేజీ 25 శాతం పెంపునకు సర్కారు సుముఖం
♦ నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ డిమాండ్‌పై తర్జనభర్జన
♦ రీయింబర్స్‌మెంట్‌ను ఆరునెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఔట్ పేషెంట్ (ఓపీ) ఉచిత సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. దీనిపై ప్రభుత్వానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సంయుక్తంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది.

ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ ఒక్క విషయంలోనే ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. మెడికల్ ప్యాకేజీ నిమ్స్‌లో ఉన్నట్లుగా ఇవ్వాలని టీషా కోరగా, సర్కారు అంగీకరించలేదు. ఉదాహరణకు డెంగీ జ్వరం వంటివి వస్తే ఎన్నాళ్లకు నయమవుతుందో కచ్చితంగా చెప్పలేమని...

కొందరికి తక్కువ రోజుల్లో నయమైతే, మరికొందరికి ఎక్కువ రోజులు పట్టొచ్చని... అందువల్ల ప్రస్తుత సాధారణ ప్యాకేజీ వల్ల నష్టపోతామని టీషా ప్రతినిధులు మంత్రికి వివరించారు. అందువల్ల నిమ్స్ తరహా ప్యాకేజీ ఆమోదయోగ్యమన్నారు. సాధ్యాసాధ్యాలపై వైద్య నిపుణులతో చర్చిస్తామని మంత్రి చెప్పారు. చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, ఆరోగ్యశ్రీ సీఈవో జ్యోతిబుద్ధప్రకాష్, టీషా అధ్యక్షుడు గురువారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.  

 ఉద్యోగుల అవస్థలు
 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులతో నగదు రహిత చికిత్సపై ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు అవస్థలు పడుతున్నారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి కీలకమైన చికిత్సల కోసం వారు ఆయా ప్రధాన ఆసుపత్రుల వద్దకే పరుగులు తీస్తున్నారు. నగదు రహిత చికిత్స లేకపోవడంతో ముందుగా డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. కొన్ని చికిత్సలకు తప్ప ఏ జబ్బుకూ కార్పొరేట్ ఆసుపత్రులు వేసిన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడంలేదు.

రూ. లక్ష బిల్లు అయితే రూ. 20వేల నుంచి 30 వేల వరకు మాత్రమే మంజూరు చేస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. . ఆరోగ్య కార్డులు వచ్చినా తిప్పలు తప్పడం లేదంటున్నారు. ఇదిలాఉండగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల విధానాన్ని, రీయింబర్స్‌మెం ట్ పద్ధతినీ వచ్చే డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement