
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓపీ విభాగం మధ్యాహ్నం 2 వరకు రోగులకు అందుబాటులో ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓపీ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇకపై మధ్యాహ్నం 2 వరకు కొనసాగుతాయి. అదే విధంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉన్న డయాగ్నస్టిక్స్ సమయాన్ని కూడా సాయంత్రం 4 వరకు పొడిగించారు. దీంతో ఎంతో మంది పేదలకు వైద్య సేవలపరంగా ప్రయోజనం చేకూరనుంది.
సకాలంలో మెరుగైన వైద్య సేవలు..
గాంధీ ఆసుపత్రిలో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ చెప్పారు. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగంలో నిత్యం ఎంతో మంది పేదలను అక్కున చేర్చుకొని వారి ప్రాణాలను కాపాడుతున్నామని తెలిపారు. తాజాగా ఓపీ సమయం పెంపుతో రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment