వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు | Roadmap prepared by Medical and Health Department | Sakshi
Sakshi News home page

వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు

Published Mon, Sep 16 2024 6:20 AM | Last Updated on Mon, Sep 16 2024 6:20 AM

Roadmap prepared by Medical and Health Department

రోడ్‌మ్యాప్‌ రూపొందించిన వైద్య, ఆరోగ్యశాఖ

అత్యధికంగా డయాగ్నొస్టిక్‌ సర్వీసెస్‌కే రూ.1,044 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా 60 మినీహబ్‌ల ఏర్పాటు

109 కొత్త ట్రామా కేర్‌ కేంద్రాల ఏర్పాటుకు రూ.921 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య­శాఖ నిర్ణయించింది. తద్వారా సామాన్యులకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ­లోకి తేవాలని యోచిస్తోంది. దీనికోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది. ప్రభుత్వంలో డయాగ్నొస్టిక్‌ సెంటర్లు మొదలు... మానవ వనరుల అభివృద్ధి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల వరకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై దృష్టిసారించింది. ట్రామా కేర్‌ సెంటర్లు, డయాలసిస్‌ సెంటర్లు, వాస్క్యులర్‌ యాక్సెస్‌ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్‌ సర్వీసెస్‌ పెంపు, డ్రగ్‌ డీఅడిక్షన్‌  సెంటర్లు, కొత్త ఉస్మానియా, టిమ్స్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, కేన్సర్‌ కేర్‌లపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతోంది.

డయాగ్నొస్టిక్‌ సేవలకే అత్యధికం
టి–డయాగ్నొస్టిక్‌ సేవల బలోపేతానికి వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా రూ. 1,044 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులోభాగంగా మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హబ్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రతీ బోధనాసుపత్రిలో ఒక ఎంఆర్‌ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యంగా ప్రభుత్వం ట్రామా కేర్‌ సెంటర్లపై దృష్టిసారించింది. అందుకోసం రూ. 921 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కొత్తగా 109 ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 35 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు సహా నిమ్స్‌ పరిధిలో ఇవి ఏర్పాటు కానున్నాయి.

పరికరాలకు రూ.750 కోట్లు
టిమ్స్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టిమ్స్‌లు, వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తారు. సనత్‌నగర్‌ టిమ్స్‌లో రూ.50 కోట్లతో స్టేట్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్‌ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రూ.350 కోట్లతో 30 పడకలతో డ్రగ్‌ డీఅడిక్షన్‌ సెంటర్లను నెలకొల్పుతారు.

మరికొన్ని నిర్ణయాలు...
కొత్తగా 108 డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ. 54 కోట్లు
ఆరోగ్య మహిళ కార్యక్రమం సహా ఎంసీహెచ్‌ సేవలను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతుండగా, వాటిని వెయ్యికి పెంచుతారు. అందుకోసం రూ.300 కోట్లు ఖర్చుచేస్తారు. రూ. 10 కోట్ల వ్యయంతో 10 నియోనాటల్‌ అండ్‌ పీడియాట్రిక్‌ ఐసీయూలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 44 యూనిట్లను ఆధునీకరిస్తారు. 
నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రూ. 11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్‌ సెంటర్ల ఏర్పాటు. 
35 జీజీహెచ్‌ల్లో వాస్క్యులర్‌ సెంటర్ల ఏర్పాటు. ఒక్కో సెంటర్‌కు రూ. 1.37 కోట్ల చొప్పున రూ. 49 కోట్లు.

35 బోధనాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేర్‌ ట్రైనింగ్‌ కోసం సిములేషన్‌ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.7 కోట్ల చొప్పున రూ. 245 కోట్లు కేటాయిస్తారు. 
ఇంటిగ్రేటెడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్స్‌ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు. అందులో 10 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కోసం రూ.180 కోట్లు, 10 డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కోసం రూ.70 కోట్లు, 10 వాటర్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కోసం రూ.160 కోట్లు, సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తారు. 

హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆసుపత్రులు సహా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌లలో ఆర్గాన్‌ రిట్రీవల్‌ అండ్‌ స్టోరేజ్‌ సెంటర్ల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు. 
కోక్లియర్‌ ఇంప్లాంట్‌ సెంటర్లను రూ.79 కోట్లతో నెలకొల్పుతారు. 
కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తారు. 
రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ కార్డులు, ప్రోగ్రాం మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు వ్యయం చేస్తారు. 
రూ. 165 కోట్లతో డీ సెంట్రలైజ్డ్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement