పది కిలోల బరువు తగ్గడంపై భర్త అనిల్ ఆందోళన
భర్త సమక్షంలో ఎయిమ్స్‌లో పూర్తయిన వైద్య పరీక్షలు
సోమవారం కవితను కలవనున్న మాజీ మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.
ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది.
పదికిలోల బరువు తగ్గిన కవిత
భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు.
సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్
అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment