deteriorated
-
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్‌ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
క్షీణించిన కవిత ఆరోగ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరో గ్యం క్షీణిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తిహార్ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ కంటతడి పెట్టారు. ఎయిమ్స్‌లో ఆమెను చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచి్చంది. పదికిలోల బరువు తగ్గిన కవిత భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. కవిత నీరసంగా ఉండటం, ఇంకా జ్వరంతో బాధపడటం, బరువు తగ్గడంపై అనిల్ చలించిపోయారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పది కిలోల బరువు తగ్గిన విషయాన్ని తండ్రి కేసీఆర్, తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్‌రావుకు తెలిసి ఆమె అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన కనబరుస్తున్నట్లు సమాచారం. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. సోమవారం ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ అనారోగ్యానికి గురైన కవితను రెండు పర్యాయాలు దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి, ఒకసారి ఎయిమ్స్‌కు తరలించిన తిహార్ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి రానున్నారు. -
దీక్ష ఎఫెక్ట్; అనారోగ్యం పాలైన ఆరోగ్యశాఖ మంత్రి
న్యూఢిల్లీ : గత ఏడురోజులుగా ఢిల్లీ లెఫ్నినెంట్ గవర్నర్ కార్యలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌తో పాటు దీక్ష చేస్తున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం పూర్తీగా క్షీణించింది. దీంతో ఆదివారం రాత్రి చికిత్స నిమిత్తం ఆయనను లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి ఎల్ఎన్జీపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పాసీ ‘మా డాక్టర్ల బృందం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్ష చేస్తున్న మంత్రుల ఆరోగ్యాలను పరీక్షిస్తాము. ఈ క్రమంలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకూ కూడా సత్యేంద్ర జైన్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆదివారం రాత్రి సమయానికి జైన్ కీటోన్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో జైన్ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మేము జైన్‌ను ఆస్పత్రికి తరలించాము. ప్రస్తుతం అతనికి చికిత్ప అందిస్తున్నాం ’ అన్నారు. కాగా కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలపడమే కాక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎల్జీ తీరుపై నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. -
ఎగుమతులు 17వ ‘సారీ’..!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు యథాపూర్వం తమ క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం. ♦ దిగుమతులు 23% పడిపోయి.. 25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ♦ దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసం(వాణిజ్యలోటు) 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలోఇది 11 బి. డాలర్లు. ♦ ఏప్రిల్‌లో చమురు దిగుమతులు 24 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు కూడా 23 శాతం పడి 19.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ♦ ఎగుమతుల్లో ప్రధాన భాగమైన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28 శాతం పడిపోయి 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 19 శాతం పడిపోయి 5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటితోపాటు కార్పెట్, తోలు, బియ్యం, జీడిపప్పు ఎగుమతులు క్షీణించాయి. అయితే తేయాకు, కాఫీ, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యింది. ♦ ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఎగుమతులే కాకుండా... ప్రపంచంలోని పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఎగుమతులు క్షీణబాటన పయనిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో అమెరికా (3.87 శాతం), యూరోపియన్ యూనియన్ (0.04 శాతం), చైనా (25.34 శాతం), జపాన్ (1.10 శాతం) ఎగుమతులు క్షీణించాయి. ♦ గత ఆర్థిక సంవత్సరం వార్షికంగా భారత ఎగుమతులు 16 శాతం క్షీణించి 261 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు 60 శాతం డౌన్: కాగా వార్షిక ప్రాతిపదికన పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో 60 శాతం పడిపోయాయి. 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే... 3.13 బిలియన్ డాలర్ల నుంచి 1.23 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఇది కరెంట్ అకౌంట్ కట్టడికి దోహదపడే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.