ఎగుమతులు 17వ ‘సారీ’..!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు యథాపూర్వం తమ క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం.
♦ దిగుమతులు 23% పడిపోయి.. 25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
♦ దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసం(వాణిజ్యలోటు) 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలోఇది 11 బి. డాలర్లు.
♦ ఏప్రిల్‌లో చమురు దిగుమతులు 24 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు కూడా 23 శాతం పడి 19.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
♦ ఎగుమతుల్లో ప్రధాన భాగమైన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28 శాతం పడిపోయి 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 19 శాతం పడిపోయి 5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటితోపాటు కార్పెట్, తోలు, బియ్యం, జీడిపప్పు ఎగుమతులు క్షీణించాయి. అయితే తేయాకు, కాఫీ, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యింది.
♦ ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఎగుమతులే కాకుండా... ప్రపంచంలోని పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఎగుమతులు క్షీణబాటన పయనిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో అమెరికా (3.87 శాతం), యూరోపియన్ యూనియన్ (0.04 శాతం), చైనా (25.34 శాతం), జపాన్ (1.10 శాతం) ఎగుమతులు క్షీణించాయి.
♦ గత ఆర్థిక సంవత్సరం వార్షికంగా భారత ఎగుమతులు 16 శాతం క్షీణించి 261 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
పసిడి దిగుమతులు 60 శాతం డౌన్: కాగా వార్షిక ప్రాతిపదికన పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో 60 శాతం పడిపోయాయి. 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే... 3.13 బిలియన్ డాలర్ల నుంచి 1.23 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఇది కరెంట్ అకౌంట్ కట్టడికి దోహదపడే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.