న్యూఢిల్లీ: భారత్ స్థూల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేట్) వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి రూ.10.54 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 31 శాతం ఎగసినట్లు పేర్కొంది. ఇక ఇందులో రిఫండ్స్ విలువ రూ.1.83 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం బడ్టెట్ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 61.31 శాతం. స్థూల పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగితే, వ్యక్తిగత పన్ను వసూళ్లు 40.64 శాతం పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి.
కట్టడిలో ద్రవ్యలోటు: బీఓఏ సెక్యూరిటీస్
కాగా చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ వెలువరించింది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం.
Comments
Please login to add a commentAdd a comment