మరింత క్షీణించిన దల్లేవాల్‌ ఆరోగ్యం | Farmer leader Jagjit Singh Dallewal health deteriorates | Sakshi
Sakshi News home page

మరింత క్షీణించిన దల్లేవాల్‌ ఆరోగ్యం

Published Mon, Jan 6 2025 5:45 AM | Last Updated on Mon, Jan 6 2025 5:45 AM

Farmer leader Jagjit Singh Dallewal health deteriorates

వైద్యులు, ఎస్‌కేఎం నేతల వెల్లడి 

చండీగఢ్‌: పంజాబ్‌–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్‌ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. 

ఆదివారం దల్లేవాల్‌ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్‌జీవోకు చెందిన డాక్టర్‌ అవతార్‌ సింగ్‌ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్‌ ఫిల్ట్రేషన్‌ రేట్‌(జీఎఫ్‌ఆర్‌)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్‌ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్‌కేఎం నేతలు తెలిపారు. 

ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. 

దీంతో, పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్‌ను పటియాలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ నానక్‌ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్‌ భార్గవ్‌ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్‌ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement