Farmers Union
-
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్‌ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్‌కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్(70) పేర్కొన్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్ మహాపంచాయత్’నుద్దేశించి దలేవాల్ మాట్లాడారు. కార్యక్రం వేదికపైకి దలేవాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. బెడ్‌పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్పీ పంజాబ్ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి. పంజాబ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్ డిమాండ్ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. ‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్ అన్నారు. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
నేడు మళ్లీ ఢిల్లీ చలో
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంథర్ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రాణం పోయినా.. పరిహాసమేనా?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ మండలంలోని గుండాలగడ్డ తండాకు చెందిన భూక్య సంత్రాలి, ఆమె కుమారుడు మహేష్. వీరి కుటుంబ పెద్ద భూక్య హసిరాం తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, పెసర పంటలు సాగు చేసేవాడు. ఇందుకోసం బ్యాంకులో, ప్రైవేటుగా రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి, పెసరకు తెగుళ్లు సోకడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులోళ్ల ఒత్తిడితో 2015 సెపె్టంబర్ 7న హసిరాం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ అధికారులు వచ్చి హసిరాం కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్లారు. తొమ్మిదేళ్ల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ పరిహారం అందలేదని సంత్రాలి, మహేష్ వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అప్పులు తీసుకుని పంటలు సాగు చేసి, నష్టాల పాలై బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను కనికరించే నాథుడే కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు కాలం కలిసి రాకపోతుందా.. కష్టాల నుంచి బయట పడకపోతామా..అనే ఆశతో సాగు చేస్తూ, పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలు సాయం కోసం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో రైతు బీమా అమలుకు ముందు, రైతు బీమా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన వేలాది మంది రైతుల కుటుంబాల పరిస్థితి నేటికీ దయనీయంగానే ఉంది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు 5,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. ఇందులో రైతు బీమా అమల్లో లేని 2014–2018 సంవత్సరాల మధ్య బలవన్మరణాలకు పాల్పడిన వారు 4,125 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 175 మంది రైతులు చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్వీ) సర్వే చెబుతోంది. త్రిసభ్య కమిటీ నివేదికే ప్రామాణికం రైతు బీమా అమల్లో లేని జూన్ 2, 2014 నుంచి ఆగస్టు 14, 2018 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జీఓనే వర్తించేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను విచారించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఇచ్చే నివేదికే పరిహారం ఇచ్చేందుకు ప్రామాణికం. అయితే ఆ కమిటీ పంపిన నివేదికలు పరిహారం అందించడానికి ప్రతిబంధకంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసుల్లో సరైన విధంగా విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించకుండా, కూతురు పెళ్లి లేదా కొడుకు చదువు లేదా ఇంటి నిర్మాణం కోసం అప్పులు అయ్యాయంటూ నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కౌలు రైతు అయితే కౌలు కాగితాలు లేవనో, మరో కారణమో పేర్కొంటూ నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. ఈ కారణాలతోనే 4,125 మందిలో కేవలం 1,600 కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియా అందిందని, మిగతా వాటిని తిరస్కరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌గ్రేషియా రాని కుటుంబాలు ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. అయితే రైతు కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోక పోతుందా, పరిహారం అందకపోతుందా అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాయి. ఇక 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో రైతు బీమా అమల్లోకి వచ్చాక అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబం దగ్గరికి వెళ్లడమే మానేశారు. దీంతో సొంత భూమి ఉన్న రైతుకు రైతు బీమా వస్తే వచ్చినట్టు లేదంటే లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కౌలు రైతుల సంగతేంటి..? సొంత భూమి లేని కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే 194 జీఓ వర్తించక, రైతు బీమా రాక.. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కౌలు రైతులు, రైతు కూలీలకు బీమా అమలైతే వారికి కూడా 194 జీఓ వర్తిస్తుంది. 194 జీఓ ఏం చెబుతోంది? జీవో 194 వర్తిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పుల వారందరికీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.లక్ష ఇచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబం అప్పుల నుంచి కొంత మేరకు బయట పడుతుంది. ప్రభుత్వం ఇల్లు, పెన్షన్ మొదలైన సౌకర్యాలు కల్పించనుండడంతో జీవితానికి భరోసా లభిస్తుంది. పిల్లలు చదువులు కొనసాగించేందుకు వీలవుతుంది. అయితే 194 జీవో ప్రకారం రైతు కేవలం వ్యవసాయం కోసమే అప్పు చేసినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. పరిహారానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ నివేదికలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా లేవని సమాచారం. కాగా పరిహారం అందని కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. హామీ ఇచ్చిన విధంగా ఆదుకోవాలి బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎక్స్‌గ్రేషియా కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. కొందరికి కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఈ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా అన్యాయం. సరైన విధంగా విచారణ జరిపించి ఆయా కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. కౌలు రైతులను, రైతు కూలీలను వెంటనే గుర్తించి బీమా పరిధిలోకి తీసుకురావాలి. – బి.కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా.. నా భర్త ఎలవేణి వెంకటయ్య మాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవాడు. అయితే పత్తి పంటకు నీళ్లు లేవని అప్పు చేసి రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీళ్లు రాలేదు. దీంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి కోసం అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలవడంతో వాటిని తీర్చలేననే బాధతో 2017 అక్టోబర్ 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్ల నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. – ఎలవేణి స్వరూప, చౌటపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్‌లో రాహుల్‌ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్‌తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్‌కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్‌కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
Farmers movement, Delhi Chalo: రెండో రోజూ ఉద్రిక్తత
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు. బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్రోన్లను కూల్చడానికి పతంగులు శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. నేడు మూడో దశ చర్చలు! రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు తెలిసింది. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
మళ్లీ ఆందోళన బాటలో అన్నదాతలు
చండీగఢ్: పంజాబ్, హరియాణా రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి మూడు రోజులపాటు నిరసనలు తెలపాలన్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఆదివారం పంజాబ్, హరియాణా రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లో వందలాదిగా చండీగఢ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. దీంతో, రైతులను అడ్డుకునేందుకు చండీగఢ్, పంజాబ్, హరియాణా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. రైతులు ముందుగా మొహాలిలోని అంబ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకుని, అక్కడి నుంచి సోమవారం చండీగఢ్ దిశగా తరలివెళ్తారని భావిస్తున్నారు. ఇలా ఉండగా, పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశాల ప్రకారం..రైతులు రోడ్లపై బైఠాయించడం ధిక్కరణ కిందికి వస్తుందని పంచ్‌కుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల ప్రవేశాన్ని నిరోధించేందుకు చండీగఢ్ యంత్రాంగం మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. చండీగఢ్–పంచ్‌కుల మార్గాన్ని మూసేసింది. -
రైతులంతా సంఘటితం కావాలి
సాక్షి, హైదరాబాద్:‘‘చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టం..’’ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈ సంఘర్షణ ప్రారంభ దశలో కలిసి వచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహలకు గురవుతుంటాయని.. ఈ అడ్డంకులు దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలను రైతు నేతలు తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీయగా.. కేంద్ర రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలతో నష్టం జరుగుతోందని రైతు నాయకులు వివరించారు. తెలంగాణలో మాదిరిగా తమకూ సహకారం దొరికితే కష్టాల నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కలిపి ముందుకెళదామని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఇంకా వ్యవసాయ సంక్షోభం ఎందుకు? ‘‘దేశంలో సాగునీరుంది. కరెంటుంది. కష్టపడే రైతులున్నారు. అయినా వ్యవసాయ సంక్షోభం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాక కూడా కేంద్రంలో పాలనా వ్యవస్థ ఇంకా గాడిన పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో ఆలోచించాలి. దేశంలో రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి. దేశంలో అవసరానికి మించి నీళ్లు ఉన్నా ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇంకా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్నా 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. మేం తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు.. ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్‌లు ఉన్నాయా?’’అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ.. రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం దేశంలోని రైతాంగమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకత్వం కావాలి! నిన్నటితరం రైతు సంఘాల నేతలు చరణ్ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్ నారాయణ్, శరద్ పవార్ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏళ్ల వయసు పైబడిన పలువురు రైతు నేతలు కేసీఆర్‌తో సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దేశానికి సీఎం కేసీఆర్‌లాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చూసి మెచ్చుకున్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే.. తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు 100 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా రైతుల సమావేశం కొనసాగనుంది. -
తెలంగాణలో రైతు సంక్షేమం అద్భుతం
సాక్షి, హైదరాబాద్/ తొగుట (దుబ్బాక): వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోపాటు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని ఇతర రాష్ట్రాల రైతులు కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటిరంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన దాదాపు 100 మంది రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున రైతుబంధు సాయం, రూ. 5 లక్షల రైతు బీమా అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని యూపీ రైతు నాయకుడు హిమాంశ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడని కొనియాడారు. తెలంగాణ మాదిరి పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అమలు చేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం వారు తెలంగాణకు హరితహారం పథకం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఓఆర్ఆర్పై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల పునరుద్ధరణను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఆయా కార్యక్రమాల ప్రత్యేకతను వివరించారు. ఆ తర్వాత రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. దీ న్ని అద్భుత కట్టడంగా అభివర్ణించారు. పంప్‌హౌస్ 8వ మోటారు నుంచి నీటి విడుదల ను తిలకించారు. అయితే ఈ క్రమంలో నీరు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడున్న ప్ర తినిధులంతా పరుగులు తీస్తూ ఒకరిపై ఒకరు పడిపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు రైతు సంఘాల ప్రతినిధు లు గాయపడటంతో వారికి స్థానికంగా ప్రా థమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలించారు. రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, గడా అధికారి ముత్యంరెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, మల్లన్నసాగర్ ఎస్ఈ వేణు, సాయి బాబు, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
ఎంఎస్పీ కమిటీ తొలి భేటీకి 40 రైతు సంఘాలు దూరం
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ ఆగస్టు 22న తొలిసారి సమావేశం కానుంది. అయితే, ఈ తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మంగళవారం ప్రకటించింది. కమిటీని తామిప్పటికే తిరస్కరించామని గుర్తు చేసింది. త్వరలో భావిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్కేఎం నేత హనుమాన్ మొల్లా తెలిపారు. మరోవైపు ఎస్కేఎం నేతలను కనీస మద్దతు ధర కమిటీ భేటీకి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 26 మందితో ఎంఎస్పీ కమిటీని జూలై 18న కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్‌లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ఎస్కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్కేఎం కాగా, పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్కేఎం నేతలు దర్శన్ సింగ్ పాల్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు. పంజాబ్‌లో రైతు సంఘాల రాజకీయ వేదిక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్‌లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ సింగ్ రాజేవాల్ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు.