సింఘు వద్ద మహిళా రైతుల నిరసన
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో గెలుపు తప్ప వేరే మార్గం లేని దశకు చేరుకున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ– నోయిడా రహదారిలోని చిల్లా బోర్డర్‌ను బుధవారం పూర్తిగా దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు మంగళవారం హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చల నుంచి తాము పారిపోవడం లేదని, ప్రభుత్వమే సరైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని స్పష్టం చేశారు. ‘చట్టాలను రద్దు చేయబోం అని ప్రభుత్వం చెబుతోంది. రద్దు చేసేలా చేస్తాం అని మేమంటున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ వ్యాఖ్యానించారు.
రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని మరో నేత యుధ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా చనిపోయిన రైతుల స్మృతిలో డిసెంబర్ 20వ తేదీని ‘నివాళి రోజు’గా జరపాలని దేశప్రజలకు రైతు నేతలు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలు, తాలూకా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. రెతు సంఘాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘రైతు ఆందోళనల వల్ల కరోనా వైరస్ ప్రబలుతుంది అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటివరకు ఈ దీక్షల్లో పాల్గొంటున్నవారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. దేవుడు మాతోనే ఉన్నాడు’ అన్నారు.
నిరసనల్లోకి మహిళలు..
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరమవుతోంది. రైతు కుటుంబాలకు చెందిన 2000 మంది మహిళలు త్వరలోనే నిరసనల్లో చేరతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని రైతు సంఘాల నేతలు చెప్పారు. మరి కొద్ది రోజుల్లోనే వారు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని తెలిపారు. పంజాబ్ నుంచి రానున్న మహిళల కోసం అవసరమైన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చర్చలకు సిద్ధంగానే ఉన్నాం: తోమర్
నిజమైన రైతు సంఘం నేతలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు కొత్త వ్యవసాయ చట్టాలను స్వాగతించాయన్నారు. ‘కనీస మద్దతు ధర విధానం అనేది పాలనాపరమైన నిర్ణయం. అది ఎప్పటిలాగానే కొనసాగుతుంది’ అని చెప్పారు.
60 వేల మందికి పైగా..
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం 60 వేలకు పైగా నిరసనకారులు అక్కడ ఉన్నారని హరియాణా పోలీసులు తెలిపారు. నిరసన కారుల సంఖ్య మరింత పెరిగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకారుల సంఖ్య 60 వేలకన్నా ఎక్కువగా ఉంటుందని, ఇంకా పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్‌ల నుంచి రైతులు వస్తున్నారని రైతు నేతలు తెలిపారు. రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని హరియాణా డీజీపీ మనోజ్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment