శనివారం ఢిల్లీలో కిసాన్ సంసద్‌లో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు
న్యూఢిల్లీ/చండీగఢ్: తమ నేతలను చంపేందుకు, ట్రాక్టర్ పరేడ్‌ను భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ రైతులు పట్టుకున్న ఓ వ్యక్తిని హరియాణా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సింఘు సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు సదరు వ్యక్తిని పట్టుకుని శుక్రవారం రాత్రి మీడియాకు చూపారు. రిపబ్లిక్ డే రోజు పోలీసు మాదిరిగా లాఠీ పట్టుకుని రైతు సంఘాలు చేపట్టే ట్రాక్టర్ పరేడ్‌లో లాఠీ చార్జి చేయాలంటూ తోటి వారు తనకు చెప్పారని ఆ యువకుడు మీడియాకు వెల్లడించాడు. ట్రాక్టర్ పరేడ్ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపేందుకు కూడా పథకం వేసినట్లు అతడు చెప్పాడు. శనివారం ఆందోళనల్లో పాల్గొంటున్న నలుగురు రైతు సంఘాల నేతలను కాల్చి చంపాలని పథకం వేసినట్లు తెలిపాడు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు నేత కుల్వంత్ సింగ్ సంధు ఆరోపించారు. కాగా, ట్రాక్టర్ పరేడ్‌కు భగ్నం కలిగించేందుకు కుట్ర జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని హరియాణా పోలీసులు తెలిపారు. సోనిపట్ ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రన్‌ధావా శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సింఘు వద్ద రైతులు అప్పగించిన వ్యక్తిని సోనిపట్‌కు చెందిన యోగేశ్ రావత్(21)గా గుర్తించామన్నారు. తమను వేధిస్తున్నాడంటూ రైతు వలంటీర్లు తీవ్రంగా కొట్టడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అతడు అబద్ధాలు చెబుతున్నట్లు తేలిందన్నారు. యోగేశ్ వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, మారణాయుధాలు కానీ లభ్యం కాలేదన్నారు.
ట్రాక్టర్ పరేడ్‌కు గ్రీన్ సిగ్నల్
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్, సింఘు, తిక్రిల నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారు కావాల్సి ఉందని రైతు నేత అభిమన్యు కొహార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 5 మార్గాల ద్వారా రాజధానిలోకి ప్రవేశించే ట్రాక్టర్ పరేడ్‌లో సుమారు 2 లక్షల మంది పాల్గొంటారని మరో నేత గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. ఇందుకోసం 2,500 మంది వలంటీర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఈ నెల 26వ తేదీన పోలీసులు తొలగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment