ట్రాక్టర్ పరేడ్ సన్నాహకాల్లో భాగంగా అమృతసర్‌లో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 11వ దఫా చర్చలు సుమారు నాలుగున్నర గంటల పాటు జరుగగా, అందులో ఇరుపక్షాలు కేవలం 30 నిమిషాలపాటే ముఖాముఖి భేటీ అయ్యాయి. 10వ దఫా చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని, చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి.
అయితే ఈ సారి తదుపరి చర్చల విషయంలో తమ వైఖరిని ప్రభుత్వం రైతుల ముందు స్పష్టంచేసింది. తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటేనే తదుపరి చర్చలు జరుగుతాయని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కచ్చితంగా నిర్వహించి తీరుతామని వ్యవసాయ సంఘాల నాయకులు చర్చల అనంతరం తెలిపారు. సాగు చట్టాలలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, రైతుల నిరసనలపై గౌరవంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని తోమర్ తెలిపారు. చట్టాల అమలును నిలిపివేసే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించాలనుకుంటేనే మరో సమావేశానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు తోమర్ స్పష్టం చేశారు.
సమావేశం తరువాత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీకి చెందిన ఎస్‌ఎస్ పంఢేర్ మీడియాతో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించి వ్యవసాయ మంత్రి తమను మూడున్నర గంటలపాటు వేచి ఉండేలా చేయడం అవమానకరమన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని మంత్రి కోరడంతో తాము నిరసనగా సమావేశం నుంచి బయటికి వచ్చామని వివరించారు. ఈ దఫా చర్చల్లోనూ సాగు చట్టాల రద్దుడిమాండ్‌ను రైతు సంఘాల నేతలు ముందుకు తేగా ప్రభుత్వం మాత్రం చట్టాల సవరణకు సిద్ధంగా ఉందని చెప్పిందని రైతు నాయకుడు శివ కుమార్ కక్క తెలిపారు.
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి తమను కోరినప్పుడు, తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని తాము కోరామని, మంత్రి సమావేశం నుంచి వెళ్ళిపోయారని శివకుమార్ పేర్కొన్నారు. అంతకుముందు, రైతు నాయకుల అంతర్గత సమావేశాల్లో.. ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన ఇవ్వాలన్న చర్చ సైతం జరిగింది. చట్టాల అమలును ఏడాదిన్నర కాకుండా, మూడేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కొందరు నేతలు సూచించారు. అంతేగాక వ్యవసాయ రుణ పరిమితిని ఎకరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పాత వడ్డీ రేటును కొనసాగించాలని ప్రతిపాదించారు.
26న ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది: రాకేశ్ టికైత్
ప్రభుత్వంతో 11వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లుగా, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ట్రాక్టర్ పరేడ్‌కు సంబంధించిన అనుమతి కోసం పోలీసులు, రైతులు మధ్య గురువారం జరిగిన మూడో రౌండ్ సమావేశం అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతుల పరేడ్‌కు అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కుండ్లి–మనేసర్–పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై పరేడ్ జరపాలని పోలీసులు సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment