సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్‌లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు.
కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment