ఏడాదిన్నరపాటు అమలు నిలిపివేత! | Govt proposes to hold agri laws implementation for 18 months | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నరపాటు అమలు నిలిపివేత!

Published Thu, Jan 21 2021 3:46 AM | Last Updated on Thu, Jan 21 2021 10:30 AM

Govt proposes to hold agri laws implementation for 18 months - Sakshi

సంఘీభావం తెలుపుతున్న రైతు సంఘాల నేతలు

సాక్షి, న్యూఢిల్లీ:  నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం–రైతు సంఘాల మధ్య జరిగిన 10వ దఫా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ నెల 22వ తేదీన మరోసారి భేటీ కావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. వ్యవసాయ చట్టాల అంశంలో ఎవరి పట్టు వారిదే అనే పరిస్థితి కొనసాగుతుండడంతో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. మూడు కొత్త చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని, ఈ చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేద్దామని, ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపింది. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌ విషయంలో రైతులు పంతం వీడలేదు. ప్రభుత్వ ప్రతిపాదనపై గురువారం ఇతర రైతులతో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌(ఉగ్రహన్‌) అధ్యక్షుడు జోగిందర్‌సింగ్‌ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై తాజా ప్రతిపాదనను గమనిస్తే కేంద్ర సర్కారు దిగొచ్చినట్లు కనిపిస్తోందని రైతు సంఘం ప్రతినిధి కవిత కురుగంటి చెప్పారు. మరోవైపు కొత్త సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.

సమస్య పరిష్కారం దిశగా అడుగులు
కేంద్రం తీరుపై పదో దఫా చర్చల్లో రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు రైతులకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి నోటీసులు పంపుతున్నారని కేంద్ర మంత్రులను నిలదీశారు. ఈ చర్చల్లో  వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. అనంతరం తోమర్‌ మాట్లాడుతూ.. 22న జరిగే సమావేశంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చట్టాలపై ప్రతిష్టంభనకు తెరపడి, రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతిపాదన చేశామని అన్నారు.  

నేడు రైతులతో నిపుణుల కమిటీ సమావేశం
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం రైతులతో మొదటి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రైతులు హాజరుకాని పక్షంలో తామే వారి దగ్గరికి వెళ్లాలని కమిటీ నిర్ణయించుకుంది. ఆన్‌లైన్‌లోనూ సూచనలు తీసుకోవడానికి ఒక పోర్టల్‌ను సిద్ధం చేశారు. అయితే, ఈ కమిటీ ముందు తమ వాదనలను వినిపించబోమని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

మరో ఇద్దరు రైతులు మృతి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులోని టిక్రీ సరిహద్దులో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వృద్ధ రైతు ధన్నాసింగ్‌ మరణించాడు. హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాకు చెందిన 42 ఏళ్ల రైతు జైభగవాన్‌ రాణా సాగు చట్టాలను నిరసిస్తూ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

కమిటీలోని సభ్యులపై దూషణలా?
కొందరు రైతు సంఘాల నేతల తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి తాము నియమించిన కమిటీలోని సభ్యులను దూషిస్తుం డడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఈ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం కట్టబెట్టలేదని, కేవలం రైతులు, భాగస్వామ్య పక్షాల వాదనలు విని, తమకు నివేదిక సమర్పించాలని మాత్రమే నిర్దేశించామని గుర్తుచేసింది. కమిటీ నుంచి మిగిలిన ముగ్గురు సభ్యులను తొలగించాలని, భూపీందర్‌సింగ్‌ మన్‌ను మళ్లీ నియమించాలని కోరుతూ రాజస్తాన్‌లోని కిసాన్‌ మహాపంచాయత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ప్రతిస్పందించాలని సూచిస్తూ అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు నోటీసు జారీ చేసింది. ‘‘ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. న్యాయమూర్తులకు కూడా ఉంటాయి. నచ్చని వ్యక్తులపై ఒక ముద్ర వేయడం ఆనవాయితీగా మారిపోయింది. కమిటీలోని సభ్యులకు సొంత అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారిని తొలగించాలా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement