bharatiya kisan sangh
-
‘లఖీంపూర్ ఖేరి’ని మర్చిపోం.. కేంద్రాన్ని మర్చిపోనివ్వం
లఖీంపూర్ ఖేరి: ‘లఖీంపూర్ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించడం మినహా దేనికీ మేం ఒప్పుకోం’అని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. యూపీలోని లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం లఖీంపూర్ ఖేరిలోని కౌడియాలా ఘాట్ వద్ద సమావేశమైన రైతులనుద్దేశించి తికాయత్ మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతృత్వంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన ఆందోళనల్లో మంత్రిని తొలగింపు డిమాండ్ ఉంచుతామని చెప్పారు. అక్రమ కేసులు మోపి జైళ్లలో ఉంచిన నలుగురు రైతులను విడుదల చేయాలన్నారు. ఈ నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. అప్పటి హింసాత్మక ఘటనల్లో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తుల కొమ్ము కాస్తోంది. న్యాయం జరిగేదాకా రైతుల పోరు ఆగదు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదు, అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయం జరగలేదు’అని ట్వీట్లు చేశారు. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన లఖీంపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్ కుమారుడు ఆశిష్ కారు నడపడం, తర్వాత జరిగిన హింసలో మొత్తంగా 8 మంది చనిపోయారు. -
ఇది ప్రజా ఉద్యమం
గ్వాలియర్(మధ్యప్రదేశ్), చండీగఢ్, చర్ఖిదాద్రి (హరియాణా), భరూచ్(గుజరాత్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఇది విజయం సాధించి తీరుతుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని, ఇళ్లకు వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి ఖాప్ పంచాయత్‌లు, వాటి నేతలు గొప్పగా సహకరిస్తున్నారన్నారు. హరియాణాలో ఆదివారం జరిగిన ఒక కిసాన్ మహా పంచాయత్‌కు ఆయన హాజరయ్యారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే, సాంగ్వన్ ఖాప్ పంచాయత్ ముఖ్యుడు సాంబిర్ సాంగ్వన్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఖాప్ పంచాయత్‌లు హర్షవర్ధన మహారాజు కాలం నుంచి ఉన్నాయని, అప్పటి నుంచి సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నాయని తికాయత్ గుర్తుచేశారు. రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాంతాలపరంగా, మతాల పరంగా నేతల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే, వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని పేర్కొన్నారు.‘ఉద్యమ వేదిక మారదు.. ఉద్యమ నేతలు మారరు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న 40 మంది రైతు నేతలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఉద్యమ నేతల్లో విబేధాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన బీకేయూ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు, ఈ రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలకే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. అధికారంలో ఉండగా, రైతుల కోసం ఏమీ చేయని కాంగ్రెస్‌కు.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వ్యవసాయం గురించి తోమర్‌కు ఏమీ తెలియదన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని, కాంగ్రెస్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని, చర్చల విషయంలో ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందని ప్రధాని కూడా స్పష్టం చేశారని, అయినా రైతు ప్రతినిధుల నుంచి స్పందన లేదని కేంద్ర మంత్రి, రైతులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మాహుతి రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక 52 ఏళ్ల రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని టిక్రీ నిరసన కేంద్రానికి 2 కిమీల దూరంలో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. హరియాణాలోని జింద్‌కు చెందిన కరంవీర్ సింగ్‌గా ఆయనను గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘రైతు సోదరులారా.. మోదీ సర్కారు తేదీలపై తేదీలు ప్రకటిస్తోంది. ఈ నల్ల చట్టాలు ఎప్పుడు రద్దవుతాయో తెలియడం లేదు’ అని చేతిరాతతో ఉన్న ఆ లేఖలో ఉంది. దాదాపు రెండు వారాల క్రితం హరియాణాకే చెందిన మరో రైతు విషం తాగి ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే. చట్టాలను వెనక్కు తీసుకోండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అమెరికా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని తన ఇంటికి పిలిచి ఆతి«థ్యమిచ్చిన తరహాలోనే.. రైతులకు కూడా ఆతిథ్యమిచ్చి, సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పెద్ద మనసు చేసుకుని రైతుల బాధ అర్థం చేసుకోవాలన్నారు. రైతుల నిరసనతో ప్రధాని మోదీకి నిద్ర కరవైందని ఎద్దేవా చేశారు. గుజరాత్లో గిరిజనులు, ముస్లింలు, దళితులు, ఓబీసీలు ఏకం కావాలన్నారు. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, భరూచ్ల్లో భారతీయ ట్రైబల్ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. -
ఏడాదిన్నరపాటు అమలు నిలిపివేత!
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం–రైతు సంఘాల మధ్య జరిగిన 10వ దఫా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ నెల 22వ తేదీన మరోసారి భేటీ కావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. వ్యవసాయ చట్టాల అంశంలో ఎవరి పట్టు వారిదే అనే పరిస్థితి కొనసాగుతుండడంతో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. మూడు కొత్త చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని, ఈ చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేద్దామని, ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపింది. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ విషయంలో రైతులు పంతం వీడలేదు. ప్రభుత్వ ప్రతిపాదనపై గురువారం ఇతర రైతులతో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(ఉగ్రహన్) అధ్యక్షుడు జోగిందర్‌సింగ్ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై తాజా ప్రతిపాదనను గమనిస్తే కేంద్ర సర్కారు దిగొచ్చినట్లు కనిపిస్తోందని రైతు సంఘం ప్రతినిధి కవిత కురుగంటి చెప్పారు. మరోవైపు కొత్త సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. సమస్య పరిష్కారం దిశగా అడుగులు కేంద్రం తీరుపై పదో దఫా చర్చల్లో రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు రైతులకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి నోటీసులు పంపుతున్నారని కేంద్ర మంత్రులను నిలదీశారు. ఈ చర్చల్లో వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం తోమర్ మాట్లాడుతూ.. 22న జరిగే సమావేశంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చట్టాలపై ప్రతిష్టంభనకు తెరపడి, రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతిపాదన చేశామని అన్నారు. నేడు రైతులతో నిపుణుల కమిటీ సమావేశం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం రైతులతో మొదటి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రైతులు హాజరుకాని పక్షంలో తామే వారి దగ్గరికి వెళ్లాలని కమిటీ నిర్ణయించుకుంది. ఆన్‌లైన్‌లోనూ సూచనలు తీసుకోవడానికి ఒక పోర్టల్‌ను సిద్ధం చేశారు. అయితే, ఈ కమిటీ ముందు తమ వాదనలను వినిపించబోమని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మరో ఇద్దరు రైతులు మృతి సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులోని టిక్రీ సరిహద్దులో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వృద్ధ రైతు ధన్నాసింగ్ మరణించాడు. హరియాణాలోని రోహ్తక్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల రైతు జైభగవాన్ రాణా సాగు చట్టాలను నిరసిస్తూ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కమిటీలోని సభ్యులపై దూషణలా? కొందరు రైతు సంఘాల నేతల తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి తాము నియమించిన కమిటీలోని సభ్యులను దూషిస్తుం డడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఈ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం కట్టబెట్టలేదని, కేవలం రైతులు, భాగస్వామ్య పక్షాల వాదనలు విని, తమకు నివేదిక సమర్పించాలని మాత్రమే నిర్దేశించామని గుర్తుచేసింది. కమిటీ నుంచి మిగిలిన ముగ్గురు సభ్యులను తొలగించాలని, భూపీందర్‌సింగ్ మన్ను మళ్లీ నియమించాలని కోరుతూ రాజస్తాన్‌లోని కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ప్రతిస్పందించాలని సూచిస్తూ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కు నోటీసు జారీ చేసింది. ‘‘ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. న్యాయమూర్తులకు కూడా ఉంటాయి. నచ్చని వ్యక్తులపై ఒక ముద్ర వేయడం ఆనవాయితీగా మారిపోయింది. కమిటీలోని సభ్యులకు సొంత అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారిని తొలగించాలా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. -
సడలని రైతుల ఆత్మస్థైర్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలి, అకాల వర్షాలు కురుస్తున్నా ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏమాత్రం వెనకడుగు పడే పరిస్థితులు కనిపించట్లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనను విరమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విపరీతమైన చలిని సైతం తట్టుకుంటూ వర్షం నుంచి తప్పించుకొనేం దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారమే జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. 26న ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. ఈ ట్రాక్టర్ మార్చ్‌లో సుమారు 20 వేల మంది పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రామ్‌రాజీ ధుల్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఈ ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేందుకు çపంజాబ్, హరియాణాల్లోని వేలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు మరిన్ని ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు రైతు నేతలు ప్రయత్నిస్తున్నారు. చర్చలపై, రైతుల సమస్యలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ విమర్శించింది. రేవారి వద్ద ఉన్న నిరసనకారులు, స్థానికుల మధ్య వివాదం సృష్టించేందుకు హర్యానా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో తమ పశువులను సైతం నిరసన స్థలికి తీసుకు వచ్చేందుకు వందలాదిమంది రైతులు సన్నాహాలు చేస్తున్నారు. చర్చలు జరగాలన్నదే మా ఆకాంక్ష: సుప్రీం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన విషయంలో పురోగతి లేదని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య చర్చలు జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పూ, పురోగతి కనిపించడం లేదని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, త్వరలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.చర్చలను కొనసాగించాలని ఈ సందర్బంగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ ప్రకటించారు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్‌కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్‌పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్‌లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్‌ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
సేంద్రియ రైతులతో నేరుగా సంబంధాలు కలిగిన ఏకలవ్య ఫౌండేషన్, గ్రామభారతి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ కలిసి గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను నిర్వహిస్తుండటం విశేషం. హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో జరగనున్న ఈ మేళాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్.ఐ.పి.హెచ్.ఎం, సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్. సంస్థలు కూడా ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేంద్రియ రైతులు, దుకాణదారులు తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకానికి పెడతారు. సేంద్రియ ఆహారోత్పత్తులతోపాటు 200 రకాల ఔషధ మొక్కలు, హెర్బల్ ఉత్పత్తులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయని గో ఆధారిత రైతు మిత్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. మార్చి 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం ప్రారంభమవుతుంది. మ. 3 గం. కు కోత అనంతరం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై సి.ఎఫ్.టి.ఆర్.ఐ. నిపుణులతో సదస్సు, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటాయి. 2న సా. 3 గం.కు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, జాతీయ పోషకాహార సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఆహార సదస్సు ఉంటుంది. 3న సా. 3 గం.కు జరిగే పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 4 గం.కు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ప్రసంగం, చర్చాగోష్టి ఉంటాయి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు ఉచితంగా టేబుల్ స్పేస్ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. 3న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో మార్చి 3(ప్రతి నెలా మొదటి ఆదివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమపేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100 (భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934 3న కొర్నెపాడులో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయవిధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై మార్చి 3(ఆదివారం)న సీనియర్ రైతులు శరత్‌బాబు (ప్రకాశం జిల్లా), శివనాగమల్లేశ్వరరావు (గుంటూరుజిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న డ్రయ్యర్‌తో మామిడి ఆమ్‌చుర్, తాండ్ర తయారీపై ఉచిత శిక్షణ మామిడి కాయలతో ఒరుగులు (స్లైసెస్), మామిడి కాయల పొడి (ఆమ్చూర్), మామిడి తాండ్రలను తక్కువ ఖర్చుతో త్వరగా ఎండబెట్టే డ్రయ్యర్ సాంకేతికత–నిర్వహణపై మార్చి 1 (శుక్రవారం)న ఉ. 10 గం.ల నుంచి గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఎల్. శ్రీనివాసరావు తెలిపారు. ఒక హెచ్.పి. విద్యుత్తు లేదా వంట చెరకుతో ఈ డ్రయ్యర్ నడుస్తుంది. వివరాలకు.. 99123 47711. -
రైతులపై పోలీసు జులుం
-అమలాపురంలో రౌండ్‌టేబుల్ సమావేశానికి అవాంతరాలు -ప్రతిఘటించిన అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా) అమలాపురం పోలీసులు మరోసారి రైతులపై జులుం ప్రదర్శించారు. గతంలో ఖరీఫ్ సాగుకు విరామం ప్రకటించడంపై చర్చించడానికి నిర్వహించిన సమావేశాన్ని అడ్డుకున్నట్టే రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిలిపివేయబోయారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం అమలాపురం జనహిత కార్యాలయంలో పట్టాదారుపాస్ పుస్తకాల రద్దు నిర్ణయంపై అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికార టీడీపీకి చెందిన రైతు సంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు, బీకేఎస్తోపాటు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా సిబ్బందితో వచ్చిన అమలాపురం పట్టణ ఎస్సై కె.విజయశంకర్ సమావేశం నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వి.నాయుడు చేతిలో మైకును లాగేసుకున్నారు. ఆ క్రమంలో మైకు విరిగి, పనిచేయకుండా పోయింది. ‘సెక్షన్-30 అమలులో ఉంది. అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు? తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోండి’ అని హకుం జారీచేశారు. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘మేము సదస్సు నిర్వహించుకోవడానికి కూడా మీ అనుమతి అవసరమా? రైతుల సమస్యలపై చర్చించడమే నేరమా?’ అంటూ ప్రతిఘటించారు. పోలీసు జులుం నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘మేము ఉద్యమాల కోసం సమావేశాలు నిర్వహించడం లేదు. శాంతియుతంగా పట్టాదారుపాస్ పుస్తకాల రద్దుపై చర్చిస్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు. అనుమతి లేనందున సమావేశం అడ్డుకుంటామని ఎస్సై చెప్పగా నిర్వహించి తీరుతామని రైతులు, రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సై, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయూరు. కాగా పోలీసుల తీరుకు నిరసనగా సమావేశం అనంతరం కూడా రైతులు నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. -
కదం తొక్కిన రైతులు
కాకినాడ సిటీ : రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు హామీలను నెలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కదం తొక్కారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఇక్కడకు తరలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎన్నికలకు ముందు ఓమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మార్చిన టీడీపీ.. హామీల అమలులో కాలయాపన చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించిన రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ దశలో కలెక్టరేట్ గేటును తోసి లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు అత్యుత్సాహంతో లాఠీలతో గేట్లపై కొట్టారు. ఈ క్రమంలో సంఘ నాయకుడు కుమారస్వామికి చేతివేలికి గాయం కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు రైతు నాయకులు వినతిపత్రం అందజేసి, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. రైతులు ఆగ్రహించి కోనసీమలో పంట విరామమే కాదు ఈల్డ్డౌన్ కూడా ప్రారంభించారని చెప్పారు. ఇది రాష్ట్రమంతా చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే కోనసీమలో 20 నుంచి 30 శాతం భూములు వరిపంటకు దూరమయ్యాయని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ లాభసాటి ధర నిర్ణయించే వ్యవస్థను తీసుకురావాలని, ప్రత్యేక వ్యవసాయ పంటల బీమా చట్టం తేవాలన్నారు. గతేడాది బీమా క్లెయింలను వెంటనే రైతులకు చెల్లించాలని, ఈ సొమ్మును రుణమాఫీ పథకానికి మళ్లించరాదని డిమాండ్ చేశారు. కాజులూరు మండలం తణుకువాడలో కూడా రైతులు ఆందోళన చేశారు. ఆదర్శ రైతుల ఆందోళన ఆదర్శరైతు వ్యవస్థను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదర్శ రైతులకు రాజకీయ కార్యకర్తలుగా ముద్రవేసి తొలగించడం ప్రభుత్వానికి తగదని, ఆ జీఓ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదర్శ రైతులను రోడ్డున పడేయడం దారుణమని ఆదర్శ రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పుచ్చకాయల ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆదర్శరైతు వ్యవస్థను సమీక్షిస్తానని చెప్పిన చంద్రబాబు వస్తే జాబు వస్తుందని నమ్మకాన్ని కలిగించి, ఇప్పడు ఆ వ్యవస్థనే రద్దు చేయడం సమంజసం కాదన్నారు. అవసరమైతే అనర్హులను, అవినీతి ఆరోపణలున్న వారిని తొలగించాలి మినహా రద్దు చేయడం తగదన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రి వీరాంజనేయరెడ్డి, నాయకులు ఆదిత్యరెడ్డి పాల్గొన్నారు. -
మిశ్రమ పంటలతో మేలు
మిశ్రమ పంటలతో మేలైన ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఆదర్శరైతు (98852 63924) ముత్యాల జమ్మీలు(జమ్మీ). కొబ్బరిలో అంతర పంటలుగా ఆయన అరటి, కోకో, పోక, మిరియాలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మిశ్రమ పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు. కొబ్బరిలో అంతరపంటల సాగుపై ఇస్తున్న కథనాల్లో భాగంగా రెండో కథనంలో మిశ్రమ పంటల సాగు పద్ధతి ఎలా చేపట్టాలో ఆయన వివరిస్తున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతోంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటలను సాగు చేస్తేమరింత ఆదాయం వస్తుంది. ఏటా కొబ్బరి సాగుకు ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. రాబడి సైతం దీనిలో కోకో, అరటి, పోక, మిరియం పంటలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల నాకు అయ్యే అదనపు పెట్టుబడి ఏడాదికి రూ.22,500 మాత్రమే. కాని ఆయా పంటల దిగుబడి ద్వారా ఖర్చులు పోను నాకు వచ్చే అదనపు లాభం (కొబ్బరితో సంబంధం లేకుండా) ఎకరాకు రూ.75 వేలు. కోకో తోట వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగి లాభం మరింత పెరుగుతుంది. ’’ కోకో . మా కుటుంబానికి ఉన్న కొబ్బరి తోటల్లో సగం తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నా. కొబ్బరి వయస్సు 60 ఏళ్లయితే, కోకోది సుమారు 40 ఏళ్లు. ఈ కారణంగా ఏటా ఈ రెండు పంటలకు యాజమాన్య పద్ధతులకు అంటే దుక్కులు, ఎరువులు, నీరు పెట్టడం వంటి చిన్నచిన్న పెట్టుబడులు సరిపోతాయి. కోకోలో అదనంగా కొమ్మల కత్తిరింపునకు మాత్రమే పెట్టుబడి అవుతోంది. కాని ఈ రెండు పంటల ద్వారా దీర్ఘకాలికంగా ఆదాయం పొందవచ్చు. * ఎకరా కొబ్బరి తోటలో నాలుగు చెట్ల మధ్య కోకో మొక్కను వేశాను. నాలుగేళ్ల క్రితం మొక్కలు పాతితే గత ఏడాది నుంచి దిగుబడి వస్తోంది. ఎకరాకు 180 మొక్కలు నాటాను. * పక్వానికి వచ్చే కోకో కాయలను వారానికి ఒకసారి కోస్తాను. తరువాత గుజ్జుతీసి పిక్కలను ముందు పులియబెట్టి, తరువాత నాలుగు రోజులు పాటు ఎండలో పెట్టి పిక్కలను విక్రయిస్తాను. * కోకో గింజలను సీజన్లో కేజీ రూ.210 చేసి అమ్మకాలు చేశాం. ఇప్పుడు అన్‌సీజన్ కావడం వల్ల రూ.160 మాత్రమే ధర ఉంది. ఎకరాకు ఎంతలేదన్నా కొబ్బరితో సంబంధం లేకుండా రూ.25 వేల వరకు ఆదాయం వస్తోంది. * అదే 15 ఏళ్లకు పైబడి తోట ఉన్న రైతులకు నాలుగైదు రెట్లు దిగుబడిగా వస్తోంది. అటువంటి తోట ఉన్న రైతులు ఎకరాకు ఏడాదికి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశముంది. పెట్టుబడి . * కొబ్బరికి చేసే దమ్ములు కోకోకు సరిపోతాయి. ఫ్రూనింగ్ (కొమ్మలు కత్తిరింపునకు) ఏడాదికి ఎకరాకు రూ.500 అవుతోంది. * ఏడాదికి రెండుసార్లు (జూలై, అక్టోబర్) యూరియా, పొటాష్, సూపర్ మందును కేజీ చొప్పున చెట్టుకు వచ్చి మూడు కేజీల చొప్పున అందిస్తున్నా. ఎరువుల ధరలు, చెట్టు కుదళ్లు కొట్టే కూలీలకు కలిపి ఎకరాకు రూ.నాలుగు వేలు పెట్టుబడి అవుతోంది. * చెట్టును ఆశించే తెగుళ్ల నివారణకు మరో రూ. వెయ్యి వరకు అవుతోంది. మొత్తం మీద ఎకరాకు రూ.5,500 పెట్టుబడి అవుతుంటే, రూ. 25 వేల వరకు ఆదాయంగా వస్తోంది. అరటి . * కొబ్బరి, కోకో సాగవుతున్న రెండు ఎకరాల్లో అరటిని కూడా అంతర పంటగా సాగు చేశాను. కొబ్బరి చెట్లు, కోకో చెట్ల మధ్య వరుసగా అరటి చెట్లు వేశాం. ఎకరాకు 400 మొక్కల వరకు వేశాం. * దక్కులు ఎలాను కొబ్బరి తోటకు చేయిస్తున్నందున దీనికి పెట్టుబడి కొంత వరకు కలసి వస్తోంది. కానీ ఏడాదికి మూడుసార్లు కలుపు తీయించాల్సి ఉంది. చెట్టు ఖరీదు, ఎరువులు, ఇతర యాజమాన్య పద్ధతులకు వచ్చి రూ.40 వరకు పెట్టుబడి అయ్యింది. గెల రూ.90 చేసి అమ్మకాలు చేసినందున పెట్టుబడి పోను చెట్టుకు రూ.50 చొప్పున ఎకరాకు రూ.20 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది. పోక . * కొబ్బరి తోట చుట్టూ పోక చెట్లు వేశాను. అలాగే తోటకు నీరు వెళ్లే బోదెల గట్లకు ఇరువైపులా కూడా పోకచెట్లు నాటాను. దగ్గర, దగ్గరగా మొక్కలు పాతుకుంటే ఎకరాకు 400 వరకు మొక్కలు నాటవచ్చు. *పోకకు పెద్దగా పెట్టుబడి పెట్ట లేదు. కోకో మొక్కలకు ఎరువులు వేసినప్పుడే వీటికి కూడా ఏడాదికి రెండు దఫాలుగా యూరియా, సూపర్, పొటాష్ ఎరువులు వేశాం. చెట్టుకు వచ్చి విడతకు అరకేజీ చొప్పున వేశా. ఎకరాకు రూ.వెయ్యి వరకు పెట్టుబడి అయ్యింది. * పోక వల్ల ఏడాదికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయంగా వస్తోంది. మిరియం . ఏజెన్సీల్లోనే కాదు.. మన కొబ్బరి తోటల్లో కూడా మిరియాన్ని అంతర పంటగా సాగు చేయవచ్చు. దీనిని మా తోటలో ప్రయోగ్మాతంగా సాగు చేస్తున్నా. బోదెను అనుకుని ఉన్న 15 పోక చెట్ల మీద మిరియం తీగను ఎక్కించాను. గత ఏడాది చాలా తక్కువ దిగుబడి వచ్చింది. దీనిని మా ఇంటి అవసరాల కోసం వినియోగించాను. అయితే ఈ ఏడాది మిరియం గుత్తులు ఎక్కువ వేసింది. కనీసం ఏడెనిమిది కేజీలకు పైబడి దిగుబడిగా వచ్చే అవకాశముంది. మార్కెట్ ధరను బట్టి చూస్తే కనీసం రూ.పది వేల వరకు ఆదాయం రావచ్చు. -
రుణమాఫీ ప్రకటనలపై ఆగ్రహించిన రైతులు
చింతకొమ్మదిన్నె : రుణమాఫీపై ప్రభుత్వం పలు రకాలుగా ప్రకటనలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చింతకొమ్మదిన్నె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీజీబీలో 2012లో రైతులు తమ బంగారుతోపాటు పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్ ఇచ్చి పంట రుణం తీసుకున్నారన్నారు. మళ్లీ బ్యాంకు వారి సూచన మేరకు 2013లో వడ్డీలు చెల్లించి పంట రుణాలను రెన్యువల్ చేశారన్నారు. కానీ బ్యాంకు అధికారులు రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఈ రుణాలను పశువులకు, గొర్రెలకు, పెరటికోళ్ల వంటి మధ్యకాలిక రుణంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను గాలికి వదిలి రైతులబతుకులతో ఆడుకుంటోందని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉండకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పి.శివారెడ్డి, జిల్లా కార్యదర్శి సి.మాధవరెడ్డి, ప్రాంత కార్యదర్శి బొగ్గుల ఓబుల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా వెంకటరెడ్డి, మండలశాఖ ప్రధాన కార్యదర్శి బుసిరెడ్డి మల్లారెడ్డి, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. -
'రుణమాఫీ కోసం 25 నుంచి ఆమరణ దీక్ష'
కాకినాడ: ఈనెల 25వ తేదీ లోపల రైతుల రుణాలు మాఫీ చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది. ఈనెల 25లోగా రుణమాఫీ అమలు చేయాలని సంఘ్ డిమాండ్ చేసింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత ఏదో ఒక సాకు చెబుతూ రుణాలు మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది. -
అటు ప్రకృతి పగ.. ఇటు ప్రభుత్వ దగా
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘పచ్చని పంటలపై ప్రకృతి పదే పదే పగబడుతోంది. రైతులు తిరిగి కోలుకోకుండా చేస్తోంది. వెన్ను విరిగి నేల కొరిగిన వరిచేల మాదిరిగానే.. దెబ్బ మీద దెబ్బతో అన్నదాత వెన్ను విరుగుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొండి చేయి చూపి దగా చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే వ్యవసాయరంగం సర్వనాశనమై, రైతన్న వాడు కనుమరుగవుతాడు’ అని పలువురు రైతునేతలు, వివిధ రాజకీయపక్షాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే పంటల నష్టాల అంచనాలు’ అనే అంశంపై అమలాపురంలోని సూర్యా రెసిడెన్సీలో శనివారం భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ముఖ్యనాయకులు, రైతు నేతలతో చర్చావేదిక జరిగింది. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ైప్రకృతి వైపరీత్యాలకు పంటలు నాశనమైనప్పుడు నష్టాల నమోదు, పరిహారం చెల్లింపు, బీమా వర్తింపుల్లో లోపభూయిష్ట విధానాలపై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, కాంగ్రెస్ తరఫున డీసీసీబీ డెరైక్టర్ జవ్వాది బుజ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణ చర్చలో పాలుపంచుకున్నారు. అంబాజీపేట కొబ్బరి వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ రామానందం, ముమ్మిడివరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షంషీ కూడా చర్చల్లో భాగస్వాములయ్యారు. తొలుత బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి జలగం కుమారస్వామి చర్చావేదిక లక్ష్యాలను వివరించారు. రైతు నేతలు, అధికారులు, రాజకీయ నేతలతో జరుగుతున్న ఈ వేదిక నేటి వరస ప్రకృతి వైపరీత్యాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వ్యవసాయాన్ని, ఆ రంగాన్ని నమ్ముకున్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా సాగేందుకు అందరూ సహకరించాలని అభ్యర్థించారు. చర్చలో పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు ముఖ్యాంశాలను తమ అధిష్టానాలకు నివేదిక రూపంలో ఇచ్చి, తద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి అన్నదాతకు మేలు చేసేలా ప్రయత్నించాలని కోరారు. అనంతరం కొందరు అభ్యుదయ రైతులు మాట్లాడుతూ వరస ప్రకృతి వైపరీత్యాలతో జిల్లాలో వ్యవసాయం ఎలా అతలాకుతలమవుతుందో, ఏఏ పంటలకు నష్టం ఎంత తీవ్రంగా ఉందో వివరించారు. పంట నష్టాల నమోదులో నిర్లక్షాన్ని, పరిహారం అందజేతలో విపరీత జాప్యాన్ని, బీమా నిబంధనలతో ఎదురవుతున్న ఇబ్బందులను నిలదీస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని రంగాల్లో నిబంధనల అతిక్రమణ, సవరణ జరుగుతున్నా వ్యవసాయ రంగంలో మాత్రం ప్రభుత్వాలు సవాలక్ష నిబంధనలు అంటూ అన్నదాతలను అగచాట్లకు గురి చేస్తున్నారని ఆక్రోశించారు. రైతు సంక్షేమం, లాభసాటి వ్యవసాయం కోసం ప్రభుత్వాలు విధానాలు మార్చుకోకపోతే జిల్లాలో వ్యవసాయరంగం చిన్నాభిన్నం కావటం ఖాయమని చర్చలో పాల్గొన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇలాగే అన్నదాతలను దగా చేస్తుంటే రైతు అనే వాడే కరువవుతాడని హెచ్చరించారు. కొందరు ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూనే రైతును ఆదుకునేందుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కొందరైతే.. ప్రభుత్వం మెడలు వంచేందుకు పంట విరామం లాంటి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వరుస విపత్తులతో జిల్లాలో వరి పంటకు జరిగిన నష్టాలను ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సభ్యుడు తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, దెబ్బతిన్న కొబ్బరిపంట గురించి బీకేఎస్ నాయకుడు ముత్యాల జమ్మీ, అరటిపంట నష్టాలపై బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు వివరించారు. డీసీసీబీ మాజీ డెరైక్టర్, వైఎస్సార్సీపీ నాయకుడు జున్నూరి బాబి పంటల బీమా విషయంలో జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకుడు మట్ట మహాలక్ష్మి ప్రభాకరరావు నష్టాల నమోదులో జరుగుతున్న నిర్లక్ష్యాలను ఎండగట్టారు. చివరిగా రాజకీయ పార్టీల జిల్లా నాయకులు తమ అభిప్రాయాల్ని వినిపించారు. వేదికలో చర్చించిన అంశాలను తమ పార్టీల అధిష్టానాలకు నివేదిస్తామని చెప్పారు. జాప్యానికి వడ్డీ మొత్తం చెల్లించాలి చివరిగా చర్చావేదిక పది తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాల నమోదు, నివేదికలు, నిబంధనలు అంటూ జాప్యం చేయకుండా రైతులకు తక్షణమే సాయం అందించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. నీలం తుపాను నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ.123 కోట్లను ఎనిమిది నెలలుగా చెల్లించకుండా జాప్యం చేసినందున కాలానికి వడ్డీరూపంలో రాగల రూ.14.5 కోట్లు వెంటనే రైతులకు చెల్లించాలని కోరింది.