అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘పచ్చని పంటలపై ప్రకృతి పదే పదే పగబడుతోంది. రైతులు తిరిగి కోలుకోకుండా చేస్తోంది. వెన్ను విరిగి నేల కొరిగిన వరిచేల మాదిరిగానే.. దెబ్బ మీద దెబ్బతో అన్నదాత వెన్ను విరుగుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొండి చేయి చూపి దగా చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే వ్యవసాయరంగం సర్వనాశనమై, రైతన్న వాడు కనుమరుగవుతాడు’ అని పలువురు రైతునేతలు, వివిధ రాజకీయపక్షాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే పంటల నష్టాల అంచనాలు’ అనే అంశంపై అమలాపురంలోని సూర్యా రెసిడెన్సీలో శనివారం భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ముఖ్యనాయకులు, రైతు నేతలతో చర్చావేదిక జరిగింది.
బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ైప్రకృతి వైపరీత్యాలకు పంటలు నాశనమైనప్పుడు నష్టాల నమోదు, పరిహారం చెల్లింపు, బీమా వర్తింపుల్లో లోపభూయిష్ట విధానాలపై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, కాంగ్రెస్ తరఫున డీసీసీబీ డెరైక్టర్ జవ్వాది బుజ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణ చర్చలో పాలుపంచుకున్నారు. అంబాజీపేట కొబ్బరి వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ రామానందం, ముమ్మిడివరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షంషీ కూడా చర్చల్లో భాగస్వాములయ్యారు. తొలుత బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి జలగం కుమారస్వామి చర్చావేదిక లక్ష్యాలను వివరించారు.
రైతు నేతలు, అధికారులు, రాజకీయ నేతలతో జరుగుతున్న ఈ వేదిక నేటి వరస ప్రకృతి వైపరీత్యాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వ్యవసాయాన్ని, ఆ రంగాన్ని నమ్ముకున్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా సాగేందుకు అందరూ సహకరించాలని అభ్యర్థించారు. చర్చలో పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు ముఖ్యాంశాలను తమ అధిష్టానాలకు నివేదిక రూపంలో ఇచ్చి, తద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి అన్నదాతకు మేలు చేసేలా ప్రయత్నించాలని కోరారు.
అనంతరం కొందరు అభ్యుదయ రైతులు మాట్లాడుతూ వరస ప్రకృతి వైపరీత్యాలతో జిల్లాలో వ్యవసాయం ఎలా అతలాకుతలమవుతుందో, ఏఏ పంటలకు నష్టం ఎంత తీవ్రంగా ఉందో వివరించారు. పంట నష్టాల నమోదులో నిర్లక్షాన్ని, పరిహారం అందజేతలో విపరీత జాప్యాన్ని, బీమా నిబంధనలతో ఎదురవుతున్న ఇబ్బందులను నిలదీస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని రంగాల్లో నిబంధనల అతిక్రమణ, సవరణ జరుగుతున్నా వ్యవసాయ రంగంలో మాత్రం ప్రభుత్వాలు సవాలక్ష నిబంధనలు అంటూ అన్నదాతలను అగచాట్లకు గురి చేస్తున్నారని ఆక్రోశించారు.
రైతు సంక్షేమం, లాభసాటి వ్యవసాయం కోసం ప్రభుత్వాలు విధానాలు మార్చుకోకపోతే జిల్లాలో వ్యవసాయరంగం చిన్నాభిన్నం కావటం ఖాయమని చర్చలో పాల్గొన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇలాగే అన్నదాతలను దగా చేస్తుంటే రైతు అనే వాడే కరువవుతాడని హెచ్చరించారు. కొందరు ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూనే రైతును ఆదుకునేందుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కొందరైతే.. ప్రభుత్వం మెడలు వంచేందుకు పంట విరామం లాంటి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వరుస విపత్తులతో జిల్లాలో వరి పంటకు జరిగిన నష్టాలను ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సభ్యుడు తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, దెబ్బతిన్న కొబ్బరిపంట గురించి బీకేఎస్ నాయకుడు ముత్యాల జమ్మీ, అరటిపంట నష్టాలపై బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు వివరించారు.
డీసీసీబీ మాజీ డెరైక్టర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు జున్నూరి బాబి పంటల బీమా విషయంలో జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకుడు మట్ట మహాలక్ష్మి ప్రభాకరరావు నష్టాల నమోదులో జరుగుతున్న నిర్లక్ష్యాలను ఎండగట్టారు. చివరిగా రాజకీయ పార్టీల జిల్లా నాయకులు తమ అభిప్రాయాల్ని వినిపించారు. వేదికలో చర్చించిన అంశాలను తమ పార్టీల అధిష్టానాలకు నివేదిస్తామని చెప్పారు.
జాప్యానికి వడ్డీ మొత్తం చెల్లించాలి
చివరిగా చర్చావేదిక పది తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాల నమోదు, నివేదికలు, నిబంధనలు అంటూ జాప్యం చేయకుండా రైతులకు తక్షణమే సాయం అందించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. నీలం తుపాను నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ.123 కోట్లను ఎనిమిది నెలలుగా చెల్లించకుండా జాప్యం చేసినందున కాలానికి వడ్డీరూపంలో రాగల రూ.14.5 కోట్లు వెంటనే రైతులకు చెల్లించాలని కోరింది.
అటు ప్రకృతి పగ.. ఇటు ప్రభుత్వ దగా
Published Mon, Dec 2 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement