
కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న ఆక్వా రైతులు
అమలాపురంలో ఆక్వా రైతుల భారీ బైక్ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా
పేరుకే ఆక్వాకు రాయితీపై విద్యుత్...
ఏదో ఒక సాకుతో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు
రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి రైతులను ముంచేస్తున్నారు
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్‌పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.
పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్‌లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment