ఉదయం నింపాదిగా పట్టభద్రుల శాసనమండలి స్థానానికి పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల తరువాత జోరు
ఓట్లు నిశ్శబ్దంగా పీడీఎఫ్‌కు...
పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నేతల హడావుడి
పలుచోట్ల పోలింగ్ ఆంక్షలు
ధిక్కరించిన కూటమి నేతలు
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా మొదలై... మధ్యాహ్నం నుంచి జోరందుకుంది. ఓటు వేసేందుకు పట్టభద్రులు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. కూటమి పార్టీలతో పాటు పీడీఎఫ్ మద్దతుదారులు పోలింగ్ ప్రక్రియలో ఉత్సహంగా పాల్గొనడంతో అంచనాలకు మించి ఓటింగ్ నమోదయ్యింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కోనసీమ జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలో 64,471 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లావ్యాప్తంగా 47,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 27,450 మంది కాగా, 19,850 మంది మహిళులో ఓటు వేశారు. ఒక ట్రాన్స్‌జండర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
యువకుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాయవరం తహసీల్దార్ కార్యాలయంలో నవ వధువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.
ఉదయం అంతంత మాత్రమే
జిల్లాలో పోలింగ్ ఉదయం అంతంత మాత్రంగానే సాగింది. ఉదయం 10 గంటలకు 12.74 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు ఇది 32.36 వరకు సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు 50.48 శాతం నమోదయ్యింది. తరువాత నుంచి ఓటింగ్ జోరందుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 73.37 శాతం నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు.
రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎస్‌కేబీఆర్ కాలేజీలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావులు, ఐ.వెంకటేశ్వరరావు, రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అడుగడుగునా అధికార దుర్వినియోగం
ఎన్నికల కేంద్రాల వద్ద కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వద్ద మెప్పు కోసం ఓట్లు లేనివారు సహితం పోలింగ్ కేంద్రాలకు వెళుతూ హడావుడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటు వేసేందుకు వచ్చినవారిని తమ పార్టీ అభ్యర్థి నంబరు, ఓటు వేయాల్సిన నంబరులు చెబుతూ వచ్చారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఇతర అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. పి.గన్నవరం పోలింగ్ కేంద్ర ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఓటర్లకు తమ కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం గమనార్హం. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు 20 మంది ఓటర్లు ఉంటే బయట కూటమి నాయకులు 200 మంది వరకు మోహరించడం విశేషం.
పోలింగ్‌లో కొరవడిన కూటమి నేతల ఉత్సాహం
కొత్త ఓటర్ల నమోదులో చూపించిన ఉత్సాహం.. పోలింగ్ విషయంలో కూటమి నాయకులు చూపించి లేక పోయారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల బయట హడావుడి సృష్టించారు కాని అనుకూల ఓటింగ్ వేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో పీడీఎఫ్ ప్రతినిధులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిశ్శబ్దంగా తమ అనుకూల ఓటింగ్ వేయించుకున్నారు. కూటమి క్యాడర్ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు అన్నట్టుగా పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. అది చూసుకుని స్థానిక ఎమ్మెల్యేలు మురిసిపోయారు.
కొత్తగా తమ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఓటర్ల మీద కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌తోపాటు ఆయా పార్టీల మద్దతుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నా ఆ ఓటర్లు సహితం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటింగ్‌లో చూపించారని సమాచారం. మొత్తం మీద పోల్ మేనేజ్‌మెంట్‌లో కూటమి పార్టీలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రచారంలోనే కాకుండా పోలింగ్ రోజున కూడా పీడీఎఫ్ ప్రతినిధులు వారి అనుకూలురు చాప కింద నీరులా వ్యవహరించి తమకు అనుకూలమైన ఓటును అత్యధికంగా వేయించుకున్నారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు
64,416 మంది ఓటర్లు
జిల్లాలో 73.37 శాతం ఓటింగ్

No Headline

No Headline

No Headline
Comments
Please login to add a commentAdd a comment