
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు.
అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు.