భివానీ వద్ద మహాపంచాయత్‌కు భారీగా హాజరైన రైతులు, వేదికపై తికాయత్
గ్వాలియర్(మధ్యప్రదేశ్), చండీగఢ్, చర్ఖిదాద్రి (హరియాణా), భరూచ్(గుజరాత్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఇది విజయం సాధించి తీరుతుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని, ఇళ్లకు వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి ఖాప్ పంచాయత్‌లు, వాటి నేతలు గొప్పగా సహకరిస్తున్నారన్నారు.
హరియాణాలో ఆదివారం జరిగిన ఒక కిసాన్ మహా పంచాయత్‌కు ఆయన హాజరయ్యారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే, సాంగ్వన్ ఖాప్ పంచాయత్ ముఖ్యుడు సాంబిర్ సాంగ్వన్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఖాప్ పంచాయత్‌లు హర్షవర్ధన మహారాజు కాలం నుంచి ఉన్నాయని, అప్పటి నుంచి సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నాయని తికాయత్ గుర్తుచేశారు.
రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాంతాలపరంగా, మతాల పరంగా నేతల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే, వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని పేర్కొన్నారు.‘ఉద్యమ వేదిక మారదు.. ఉద్యమ నేతలు మారరు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న 40 మంది రైతు నేతలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఉద్యమ నేతల్లో విబేధాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన బీకేయూ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు, ఈ రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలకే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
రైతుల ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. అధికారంలో ఉండగా, రైతుల కోసం ఏమీ చేయని కాంగ్రెస్‌కు.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వ్యవసాయం గురించి తోమర్‌కు ఏమీ తెలియదన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని, కాంగ్రెస్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని, చర్చల విషయంలో ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందని ప్రధాని కూడా స్పష్టం చేశారని, అయినా రైతు ప్రతినిధుల నుంచి స్పందన లేదని కేంద్ర మంత్రి, రైతులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
రైతు ఆత్మాహుతి
రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక 52 ఏళ్ల రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని టిక్రీ నిరసన కేంద్రానికి 2 కిమీల దూరంలో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. హరియాణాలోని జింద్‌కు చెందిన కరంవీర్ సింగ్‌గా ఆయనను గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘రైతు సోదరులారా.. మోదీ సర్కారు తేదీలపై తేదీలు ప్రకటిస్తోంది. ఈ నల్ల చట్టాలు ఎప్పుడు రద్దవుతాయో తెలియడం లేదు’ అని చేతిరాతతో ఉన్న ఆ లేఖలో ఉంది. దాదాపు రెండు వారాల క్రితం హరియాణాకే చెందిన మరో రైతు విషం తాగి ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
చట్టాలను వెనక్కు తీసుకోండి
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అమెరికా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని తన ఇంటికి పిలిచి ఆతి«థ్యమిచ్చిన తరహాలోనే.. రైతులకు కూడా ఆతిథ్యమిచ్చి, సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పెద్ద మనసు చేసుకుని రైతుల బాధ అర్థం చేసుకోవాలన్నారు. రైతుల నిరసనతో ప్రధాని మోదీకి నిద్ర కరవైందని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో గిరిజనులు, ముస్లింలు, దళితులు, ఓబీసీలు ఏకం కావాలన్నారు. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, భరూచ్‌ల్లో భారతీయ ట్రైబల్ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment