3 వ్యవసాయ చట్టాలు రద్దు | PM Narendra Modi Announces To Repeal Three Farm Laws | Sakshi
Sakshi News home page

3 వ్యవసాయ చట్టాలు రద్దు

Published Sat, Nov 20 2021 4:20 AM | Last Updated on Sat, Nov 20 2021 12:20 PM

PM Narendra Modi Announces To Repeal Three Farm Laws - Sakshi

న్యూఢిల్లీ:  రైతన్నల డిమాండ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్‌ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్ల డించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...  

ఒక వర్గం రైతులే వ్యతిరేకించారు
‘‘రైతులతోపాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చాం. దేశంలోని రైతులు.. ప్రధానంగా సన్నకారు రైతులు గరిష్టంగా లబ్ధి పొందుతారని ఆశించాం. కానీ, ఈ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. అనుమానాలను నివృత్తి చేసేందుకు పవిత్ర హృదయంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొవ్వొత్తి కాంతి లాంటి స్పష్టమైన నిజాన్ని అర్థమయ్యేలా వివరించలేకపోయాం. సాగు చట్టాల వ్యవహారంలో దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. వాస్తవానికి ఎన్నెన్నో రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన దృక్పథం ఉన్న రైతులు కొత్త సాగు చట్టాలకు అండగా నిలిచారు. ఒక వర్గం రైతన్నలు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదేపదే ప్రయత్నించాం. చట్టాల అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తామని చెప్పాం. అభ్యంతరాలున్న అంశాల్లో సవరణలు చేస్తామని సూచించాం. సుప్రీంకోర్టు కూడా సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

మనమంతా కలిసి ముందుకు సాగుదాం
నేడు గురు నానక్‌ జన్మించిన రోజు. ఒకరిపై నిందలు వేయడానికి ఇది సందర్భం కాదు. దేశ ప్రజలను నేను చెప్పేది ఏమిటంటే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. గురుపూరబ్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని నా విన్నపాన్ని మన్నించి, రైతు సోదరులు ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలి. కుటుంబాలను కలుసుకోవాలి. జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలి. మనమంతా మళ్లీ కొత్తగా ముందుకు సాగుదాం.

పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు
దేశంలో రైతాంగం సాధికారతే లక్ష్యంగా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టబోతున్నాం. జీరో బడ్జెట్‌ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ఈ తరహా వ్యవసాయంలో సహజ ఎరువులు, స్థానిక విత్తనాలే ఉపయోగిస్తారు. మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు తీసుకొస్తాం. కనీస మద్దతు ధర(ఎం ఎస్పీ)ను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఎంఎస్పీతోపాటు జీరో బడ్జెట్‌ ఆధారిత సాగుపై నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు.

రికార్డు స్థాయిలో సేకరణ కేంద్రాలు
ఐదు దశాబ్దాల నా ప్రజాజీవితంలో అన్నదాతల వెతలను దగ్గరగా గమనిస్తూనే ఉన్నాను. వారికి ఎదురవుతున్న సవాళ్లు, కష్టనష్టాలు నాకు తెలుసు. మూడు కొత్త సాగు చట్టాల లక్ష్యం ఏమిటంటే రైతులను బాగు చేయడమే. ప్రధానంగా సన్నకారు రైతులకు సాధికారత కల్పించాలని ఆశించాం. 2014లో ‘ప్రధాన సేవకుడి’గా ప్రజలకు సేవలు చేసుకునేందుకు దేశం నాకు అవకాశం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అప్పటినుంచే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. సన్నకారు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఏకంగా ఐదు రెట్లు పెంచేశాం. ప్రతిఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నాం.

గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ సదుపాయాలను బలోపేతం చేశాం. వెయ్యికి పైగా మండీలను (వ్యవసాయ మార్కెట్లు) ఈ–నామ్‌(ఎలక్ట్రానిక్‌–నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌)తో అనుసంధానించాం. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకోవడానికి రైతులకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మెరుగు పర్చడానికి కోట్లాది రూపాయలు వెచ్చించాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచడమే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల సేకరణ కేంద్రాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాం. దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని సేకరణ కేంద్రాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేవు. రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం తన కృషిని చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement