PM Modi Announced Withdraws Three Farm Laws: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం.తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. రైతులను ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలి. 2014లో నేను తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచీ మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించింది. మనదేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రైతుల కష్టాలను దగ్గరుండి చూశాను. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం’ అని మోదీ తెలిపారు.
2020లో మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పొరెట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం.. రైతు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment