ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు.
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు.
వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు.
ఆజ్యం పోసిన హరియాణా
హరిణాయా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి.
హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు
ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
పంజాబ్‌లో నాలుగు స్తంభాలాట!
రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్‌తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్ పాత్రను ఆశించొచ్చు.
పశ్చిమంతో మొదలై పాకుతుందని...!
పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్‌లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్‌సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్‌లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్‌లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు.
ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు.
త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్‌లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్‌వాదితో ఆర్‌ఎల్‌డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్‌కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్‌మెంట్‌కుదిగింది.
మృత చట్టాలే... ఖననం చేసేద్దాం!
కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది.
చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి.
–నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment