Mahapanchayat
-
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
చావో రేవో తేల్చుకోవాలి
గురుగ్రామ్: హరియాణా పల్వల్‌లో విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఆదివారం నిర్వహించిన మహా పంచాయత్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రను ఆగస్టు 28న పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. జులై 31న నూహ్‌లో దుండగుల దాడితో మత ఘర్షణలు చెలరేగి యాత్ర అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించి తీరాలని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మహాపంచాయత్‌లో హరియాణా గో రక్షక దళానికి చెందిన ఆచార్య ఆజాద్ శాస్త్రి అన్నారు. యాత్రలో అంతా ఆయుధాలు ధరించాలని పిలుపునిచ్చారు. మహాపంచాయత్‌లో విద్వేష ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ హిందూ నాయకులు పెడచెవిన పెట్టారు. కనీసం 100 రైఫిల్స్‌కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలతో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మరి కొందరు వక్తలు కూడా ఇదే తరహాలో ప్రసంగించారు. మీరు ఎవరైనా వేలెత్తి చూపిస్తే మీ చెయ్యినే నరికేస్తాం అని హెచ్చరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నూహ్ జిల్లానే రద్దు చేయాలని ఆ ప్రాంతంలో గోవధ ఉండకూదని వక్తలు డిమాండ్ చేశారు. నూహ్‌లో హిందువుల యాత్రపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఆందోళనలున్నాయి. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
ఎన్ని‘కలవర’మేనా!
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు. ఆజ్యం పోసిన హరియాణా హరిణాయా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి. హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌లో నాలుగు స్తంభాలాట! రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్‌తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్ పాత్రను ఆశించొచ్చు. పశ్చిమంతో మొదలై పాకుతుందని...! పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్‌సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు. త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్‌వాదితో ఆర్ఎల్డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్‌కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్మెంట్కుదిగింది. మృత చట్టాలే... ఖననం చేసేద్దాం! కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి. –నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీని ఓడిద్దాం
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన మహా పంచాయత్‌కు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఇండియా ఫర్ సేల్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్ వేదికగా రాకేశ్ తికాయత్ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్ ఆఫ్ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు. ‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదు’’ అని తికాయత్ చెప్పారు. ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేస్తామని కిసాన్ మహాపంచాయత్ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. వారణాసి వేదికగా ముజఫర్‌నగర్‌లో జరిగిన మెగా సదస్సుని మిషన్ ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్‌లు నిర్వహిస్తామన్న రాకేశ్ తికాయత్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా చాటుతామన్నారు. -
బెంగళూరుని ముట్టడిద్దాం
శివమొగ్గ (కర్ణాటక): కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. బెంగళూరుని కూడా ట్రాక్టర్లతో ముట్టడించాలని రైతులకు పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీని ముట్టడించిన మాదిరిగా బెంగళూరుని కూడా నిర్బంధించాలి. మీ ట్రాక్టర్లు తీసుకొని నగరం నలుమూలల నుంచి రండి’’ అని అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన మహాపంచాయత్‌లో తికాయత్ మాట్లాడుతూ ఢిల్లీలో చేసిన ర్యాలీ మాదిరిగా అందరూ ట్రాక్టర్ల మీదే రండి, నగరంలోని 25 వేల పాయింట్లను బ్లాక్ చేస్తూ ఉద్యమించాలని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో గత మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, తిక్రి, ఘజియాపూర్‌లలో రైతన్నలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మూడు చట్టాలను వెనక్కి తీసుకొని, కనీస మద్దతు ధరపై చట్టం చేసేదాకా తమ ఉద్యమం ఆగదని అన్నారు. రైతుల్ని వ్యవసాయ కూలీలుగా మార్చే ఈ చట్టాలతో పాటుగా పాలు, విద్యుత్, విత్తనాలు, పురుగుల మందులకు సంబంధించిన చట్టాలు కూడా చేస్తున్నారని, ఇవన్నీ రైతులతో పాటు ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తాయని అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతే భూముల్ని ధారాదత్తం చేయాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో రైతుల భూములన్నింటినీ ఏదో ఒక రకంగా లాగేసుకోవడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాకేశ్ తికాయత్ ఆరోపించారు. కేంద్రం దిగి రాకపోతే ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాలను ముట్టడిస్తామని చెప్పారు. -
ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్‌లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాన్ని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ‘‘బీజేపీకి ఓటు వేయొద్దు. ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. మిమ్మల్ని భూమిలేని పేదలుగా మార్చేస్తారు. దేశాన్ని బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడతారు. మీరు ఉపాధి కోల్పోతారు’’ అని ప్రజలను అప్రమత్తం చేశారు. బీజేపీ మోసాలకు మారుపేరని దుయ్యబట్టారు. ఆ పార్టీ సంపన్నుల పక్షపాతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి పక్షాన తాము ఉంటామన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు రైతులు, పేదల పక్షాన ఉంటారని రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కిసాన్ మహాపంచాయత్‌లలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తయిన ఇంట్లో సేదతీరుతున్న రైతులు -
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
మోదీ మిత్రుల కోసమే సాగు చట్టాలు
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సం పన్న మిత్రుల కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. వారి కోసం రాచబాటలు పరుస్తున్నారని దుయ్యబట్టా రు. రైతులను బెదిరిస్తున్న మోదీ చైనాను మాత్రం ఎదిరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజస్తాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలీబంగా పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల తొలి మహాపంచాయత్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు దేశంలో 40 శాతం జనాభాను ప్రభావితం చేస్తాయన్నారు. కేవలం రైతులే కాకుండా వ్యాపారులు, కార్మికులు కూడా నష్టపోతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తర్వాత కొత్త వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు మరో పెద్ద దెబ్బేనని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. కార్పొరేట్ వ్యాపారుల గుత్తాధిపత్యమే ‘‘తూర్పు లద్దాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణపై చైనాతో కుదిరిన ఒప్పందం సరైంది కాదు. పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 3, 4 మధ్యనున్న ప్రాంతాన్ని మోదీ ప్రభుత్వం చైనాకు ధారాదత్తం చేసింది. చైనా ముందు నిలబడలేని నరేంద్ర మోదీ మన రైతులను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే ఆయన అసలు రంగు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు అది నల్లధనంపై పోరాటం కాదని చెప్పా. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని వివరించా. అయినా అప్పట్లో ప్రజలు అర్థం చేసుకోలేదు. తర్వాత ప్రజల డబ్బు బ్యాంకులకు చేరడం, ముగ్గురు నలుగురు బడా బాబుల రుణాలు మాఫీ కావడంతో అసలు విషయం బయటపడింది. నోట్ల రద్దు తర్వాత జీఎస్టీతో మోదీ ప్రభుత్వం ప్రజల వెన్ను విరిచింది. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు మూతపడడం ఖాయం. రైతుల నుంచి పంటల కొనుగోళ్లను ఇకపై కార్పొరేట్ వ్యాపారులే శాసిస్తారు. వారి గుత్తాధిపత్యమే కొనసాగుతుంది. దేశంలోని మొత్తం పంటలను ఒకే వ్యక్తి కొనుగోలు చేసి, దాచిపెట్టే పరిస్థితి కూడా వస్తుంది. చిరు వ్యాపారుల పరిస్థితేంటి? దేశంలో 40 శాతం జనాభా చేసుకుంటున్న వ్యాపారాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు కట్టబెట్టడమే కొత్త సాగు చట్టాల పరమార్థం. దేశమంతటా ఒకే కంపెనీ పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్మితే రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్ముకొని, పొట్టపోసుకునే చిరు వ్యాపారుల పరిస్థితి ఏమిటి? కొత్త చట్టాలతో దేశంలో 40 శాతం మంది ఉపాధి కోల్పోతారు. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే రైతులు పోరుబాట పట్టారు. రైతన్నల సంక్షేమం కోసమే కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని చెబుతున్నారు. అదే నిజమైతే రైతులు ఎందుకు ఆందోళన సాగిస్తున్నారు? ఈ పోరాటంలో 200 మంది ఎందుకు చనిపోయారు?’’ అని రాహుల్ గాంధీ నిలదీశారు. ప్రధానిమోదీకి, బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై నమ్మకం లేదని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఏడు రైతు మహాసభల్లో పాల్గొననున్న తికాయత్ ఘజియాబాద్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ సోమవారం నుంచి హరి యాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల్లో వరుస గా జరుగుతున్న ఏడు రైతు మహాసభలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 23తో ఇవి ముగుస్తాయని బీకేయూ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. చైనాకు అప్పగించారు భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చైనా ఆగడాలకు ఎదురు తిరగలేని పిరికిపంద నరేంద్ర మోదీ, మన సైనికుల త్యాగాలను ఆయన అవమానిస్తున్నారు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మన భూమిని పరాయి దేశానికి అప్పగించడాన్ని దేశంలో ఎవరూ అంగీకరించరని చెప్పారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద తాజా పరిస్థితిపై పార్లమెంట్లో ప్రధాని ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిస్తున్నారని తప్పుపట్టారు. ‘‘భారతదేశ భూభాగాన్ని చైనాకు అప్పగించానని మోదీ చెప్పాలి, ఇదే నిజం’’ అని పేర్కొన్నారు. తూర్పు లద్ధాఖ్లోని ఇండియా భూభాగమైన ఫింగర్ 4 వద్ద మన సైనిక పోస్టు ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన సైనిక బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3 వద్దకు వచ్చేశాయని అన్నారు. మన ప్రాంతాన్ని చైనాకు ఎందుకు ఇచ్చారో ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనక్కి మళ్లాలని మన సైన్యాన్ని ఎందుకు ఆదేశించారని అన్నారు. దీనివల్ల మనకు లాభమేంటి? అని ప్రశ్నించారు. వ్యూహాత్మక ప్రాంతాల నుంచి చైనా ఎందుకు వెనక్కి వెళ్లడం లేదన్నారు. దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. -
బిల్ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్‌ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మద్దతు గర్వకారణం రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అనధికార చర్చలు లేవు: తోమర్ రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ట్విటర్‌కి కేంద్రం వార్నింగ్ రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్‌ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్‌ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్‌కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది. -
రైతు పోరాటం ఉధృతం
ట్రాక్టర్ పరేడ్‌లో హింస తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ ఉధృతం అవుతోంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా రైతులే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా.. ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా వీరికి జత కలిశారు. ఘజియాబాద్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్‌లో హింస చోటుచేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ తీవ్రతరమవుతోంది. ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులే ఇప్పటివరకు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా తోడవుతున్నారు. ఢిల్లీ–మీరట్ రహదారిపై ఉన్న ఘాజీపూర్ మరో ప్రధాన కార్యక్షేతంగా మారిపోయింది. ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలనుమోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ముజఫర్‌నగర్‌లో శనివారం మహాపంచాయత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా రైతు సంఘాల నాయకులు శనివారం ‘సద్భావన దివస్’గా పాటించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఘాజీపూర్‌లో బీకేయూ నేత రాకేశ్ తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు నెలలకుపైగా తమ పోరాటం కొనసాగుతోందని, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమం బలంగా ఉందని బీకేయూ మీరట్ జోన్ అధ్యక్షుడు పవన్ ఖటానా చెప్పారు. రైతుల శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని స్పష్టం చేశారు. సర్కారు వైఖరి మారాలి రైతుల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోందని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంతోమంది తమ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి రికార్డు స్థాయిలో రైతులు దేశ రాజధానికి వస్తారని వెల్లడించారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోందని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని రాజేవాల్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని హితవు పలికారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇస్తామని చెప్పారు. తికాయత్ కన్నీళ్లు కదిలించాయి ప్రముఖ రైతు, ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ తనయుడు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతాంగం సంఘటితమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంతంగా సాగిస్తున్న ఆందోళనలు, నిరసనలు, ఢిల్లీలో హింస తదితర పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి ఘాజీపూర్ వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లు వేలాది మంది రైతులను కదిలించాయి. తికాయత్‌కు మద్దతుగా శనివారం ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఘాజీపూర్‌కు తరలివచ్చారు. గురువారం రాత్రి తికాయత్ విలపించిన తర్వాత తమ కళ్లల్లోనూ నీళ్లు వచ్చాయని, ఆ రాత్రంతా తాము నిద్రపోలేదని, టీవీలకే అతుక్కుపోయామని చారౌర గ్రామ పెద్ద పంకజ్ ప్రధాన్ చెప్పాడు. తికాయత్ కన్నీళ్లే తనను ఇక్కడికి తీసుకొచ్చాయని యూపీలోని బులంద్‌షహర్‌కు చెందిన అనిల్ చౌదరి తెలిపాడు. 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ రిపబ్లిక్ డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో హింసాకాండపై ప్రజల నుంచి పోలీసులకు ఇప్పటిదాకా 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ అందాయి. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హింసాకాండకు సంబంధించి 9 కేసులు నమోదుచేశారు. వీటిపై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాక్టర్ పరేడ్‌ను 9 డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇంటర్నెట్ బంద్ దేశ రాజధానిలో జనవరి 26న హింస చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్లతోపాటు సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హరియాణా ప్రభుత్వం 14 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే రద్దు చేసింది. -
'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు'
జీన్స్ ప్యాంట్ ధరించవద్దంటూ యువతులకు ఓ మహా పంచాయతీ హుకుం జారీ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.జీన్స్ ప్యాంట్ వేసుకున్నారా మీకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది.మధుర సమీపంలోని బరసనలో మహాపంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రెండు రోజుల క్రితం మహా పంచాయతీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఆ మహాపంచాయతీ పూజారీ రాం ప్రసాద్ ప్రజలకు చదవి వినిపించారు. అయితే యువతులు జీన్ ప్యాంట్ వేసుకోవదంటూ పంచాయతీ తీర్మానం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. యువతలు వారికి ఇష్టమైన దుస్తులు వేసుకునే సౌకర్యం కూడా వారికి లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.మరి కొంత మంది మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. మహా పంచాయతీ తీర్మానాలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామని కూడా ప్రకటించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఆ సమావేశానికి మహా పంచాయతీ పరిధిలోని 52 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.