జింద్ జిల్లాలో కిసాన్ మహాపంచాయత్‌లో ప్రసంగిస్తున్న రైతు నేత రాకేశ్ టికాయత్
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్‌ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు.
అంతర్జాతీయ మద్దతు గర్వకారణం
రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.
అనధికార చర్చలు లేవు: తోమర్
రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది.
ట్విటర్‌కి కేంద్రం వార్నింగ్
రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్‌ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్‌ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్‌కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment