aggriculture
-
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
నిత్య దిగ్బంధనాలా..?
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనానికి ముగింపు ఎక్కడ అని ప్రశ్నించింది. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారులపై 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. సమస్యను న్యాయస్థానాలు, పార్లమెంట్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ జాతీయ రహదారులపై జనం రాకపోకలను అడ్డుకోవడం ద్వారా కాదని పేర్కొంది. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులదని స్పష్టం చేసింది. ‘ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వచ్చామంటూ ఆరోపిస్తారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహకుల బాధ్యత’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రైతులను అభ్యరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులను దిగ్బంధించకుండా నిరసనకారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, రైతులు రావడానికి నిరాకరిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది. -
సాగు చట్టాల ప్రయోజనాలు ప్రచారం చేయండి
న్యూఢిల్లీ: ‘దేశమే ప్రథమం’ అన్న భావన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేయడమే పార్టీ కార్యకర్తల లక్ష్యం కావాలన్నారు. పార్టీ మౌలిక సూత్రం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ భావనేనని వివరించారు. ఈ సూత్రం అధారంగానే ప్రభుత్వం జీఎస్టీ సహా పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ‘అధికారం సాధించడం మన ఉద్దేశ్యం కాకూడదు.. దేశాభివృద్ధి కోసం ప్రజాసేవ చేయడమే మన లక్ష్యం కావాలి’ అని వివరించారు. పార్టీ కొత్త ఆఫీస్ బేరర్ల తొలి సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ఆదివారం ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చినందుకు, కోవిడ్–19 నియంత్రణ దిశగా సమర్ధవంతమైన నాయకత్వం అందించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. బడ్జెట్ ప్రతిపాదనలను, గరీబ్ కళ్యాణ్ యోజనను, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలను ఎదుర్కొన్న తీరును కూడా తీర్మానంలో ప్రశంసించారు. ‘రైతు ప్రయోజనాలు కేంద్రంగా ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకువచ్చింది. వారి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించడం, వారి ఆదాయం రెట్టింపు కావడం, తమ ఉత్పత్తులను నచ్చినచోట అమ్ముకునే వెసులుబాటు వారికి లభించడం.. అనే లక్ష్యాల సాధన కోసం ఈ చట్టాలు రూపొందాయి’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంలో పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల సమయంలో వెనక్కు తగ్గకుండా, అదే సమయంలో, అనవసరంగా దూకుడుగా వెళ్లకుండా, సంయమనంతో వ్యవహరించి, సానుకూల పరిష్కారం సాధించారని మోదీపై ప్రశంసలు కురిపించింది. సరిహద్దుల్లో పొరుగుదేశాల విస్తరణ వాదాన్ని భారత్ సహించబోదని, ఈ విషయాన్ని మోదీ నాయకత్వంలో భారత్ పలుమార్లు రుజువు చేసిందని వివరించింది. మోదీ నాయకత్వంలో భారతదేశం స్పష్టమైన విధానంతో బలమైన దేశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది. కోవిడ్–19పై పోరులో భారత్‌ను విజయవంతమైన దేశంగా నిలిపారని ప్రశంసించింది. సాగు చట్టాల విషయంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ తీర్మానం పేర్కొంది. నూతన విద్యా విధానం, కార్మిక సంస్కరణలు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానంలో ప్రశంసించారు. పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులను కోరింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై, ఆత్మనిర్భర్ భారత్‌పై, సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. -
బిల్ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్‌ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మద్దతు గర్వకారణం రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అనధికార చర్చలు లేవు: తోమర్ రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ట్విటర్‌కి కేంద్రం వార్నింగ్ రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్‌ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్‌ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్‌కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది. -
రైతు ఉద్యమంపై ట్వీట్ వార్
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తోఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతోంది. పలువురు ప్రముఖులు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో కొందరు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలపాటు విదేశీ వలసవాదులు అక్రమించుకున్నారు, పాలించారు, లూటీ చేశారు. దేశం బలహీనంకావడం వల్ల కాదు, ఇంటి దొంగల వల్లే ఇదంతా జరిగింది. ఇండియాను అప్రతిష్టపాలు చేసే దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారం వెనుక ఎవరున్నారో ప్రశ్నించాలి’’ – కిరణ్ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ‘‘భారతదేశ శక్తి సామర్థ్యాలు పెరుగుతుండడం చూసి అంతర్జాతీయ శక్తుల్లో వణుకు పుడుతోంది. అందుకే దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రలు సాగిస్తున్నాయి’ – రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే సత్తా ఉంది’’ – అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్ ‘‘అర్ధ సత్యం కంటే మరింత ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు’’ – సునీల్ శెట్టీ, బాలీవుడ్ హీరో ‘‘అరాచక శక్తులను అరాధించే అంతర్జాతీయ ముఠాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఢిల్లీలో హింసను ఎలా ప్రేరేపించారో, జాతీయ జెండాను ఎలా అవమానించారో మనమంతా చూశాం. మనమంతా ఇప్పుడు ఏకం కావాలి. ఇలాంటి శక్తులను ఓడించాలి’’ – హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ‘‘ఇండియాకు, ఇండియా విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దు’’ – అజయ్ దేవగణ్, నటుడు ‘ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’ –సాగు చట్టాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ ‘ప్రచారంతో దేశ ఐక్యతను దెబ్బతీయలేరు. దేశం ఉన్నత శిఖరాలు అధిరోహించకుండా అడ్డుకోలేరు. దేశ భవిష్యత్తును నిర్దేశించేది అభివృద్ధే తప్ప ప్రచారం కాదు’ –కేంద్ర మంత్రి అమిత్ షా -
వ్యవసాయ రంగానికి రూ. 1,31,531 కోట్లు
రైతు ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా వ్యవసాయానికిచ్చే రుణాల పరిమితిని 10% పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు అయింది. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పలు ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెస్ బంగారం, వెండిలపై 2.5% వరకూ ఉంటే.. మద్యంపై 100% వరకూ ఉంది. ఈ నిధులను మౌలిక సదుపా యాలను అభివృద్ధికి ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ఇచ్చే నిధులను గత ఏడాది (రూ.30వేల కోట్లు) కంటే రూ. పదివేల కోట్లు ఎక్కువ చేయడం, సూక్ష్మ బిందు సేద్యం, మార్కెట్ యార్డుల్లో సదుపాయాలు, అభివృద్ధి నిధుల సాయం అందించడం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీ: తొలిసారి తన డిజిటల్ బడ్జెట్‌ను పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల న్నది దేశం మొదటి సంకల్పమని పేర్కొన్నారు. వ్యవ సాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పశుపోషణ; డెయిరీ, చేపల పెంపకానికి కూడా తగినన్ని నిధులు రుణాల రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతాయని, పండించిన పంటలను కాపాడుకోవడంతోపాటు, సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని ఈ చర్యలన్నింటి కారణంగా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం సెస్ విధించే సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విస్తరణ... వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ స్కీమ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తులు (త్వరగా నశించిపోయేవి)ను చేర్చనున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)లో ఇప్పటికే 1.68 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ–నామ్‌లకు చేరుస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మబిందు సేద్యానికి ప్రస్తుతమిస్తున్న రూ.5000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఫిషరీస్ రంగం అభివృద్ధికి కోచీ, చెన్నై, విశాఖపట్నం, పరదీప్, పెటువాఘాట్లలోని ప్రధాన ఫిషింగ్ హార్బర్లను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వలస కార్మికుల కోసం... దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించే వన్ నేషన్ వన్ రేషన్ పథకం వల్ల 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 86 శాతం మంది లబ్ధిదారులు లాభం పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అసంఘటిత రంగంలోని కార్మికులు మరీ ముఖ్యంగా వలస కార్మికుల సమాచారం సేకరించేందుకు, తద్వారా వారి కోసం పథకాలను రూపొందిం చేందుకు ఒక పోర్టల్‌ను రూపొందించనున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత పథకాలను గిగ్, ప్లాట్ఫార్మ్ కార్మికులకూ వర్తింపచేసేందుకు, ఈఎస్ఐ సేవలు అన్ని వర్గాల కార్మికులకు అందేలా చేసేందుకు కనీస వేతనాల్లో మార్పులు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు తగిన రక్షణతో రాత్రి షిఫ్ట్‌లు పనిచేసేందుకు వీలుగా కూడా చట్టాల్లో మార్పులు తేనున్నట్లు చెప్పారు. స్టాండప్ ఇండియా పథకంలో ఎస్సీఎస్టీ మహిళలకు మార్జిన్ మనీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మద్దతు ధర వితరణ పెరిగింది... పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడుల సేకరణ క్రమేపీ పెరుగుతున్న కారణంగా మద్దతు ధర వితరణ కూడా ఎక్కువైందని, 2013 –14తో పోలిస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి పంటల కోసం రైతులకు ఇచ్చిన మొత్తం పెరిగిందని (బాక్స్ చూడండి) వివరించారు. గోధుమల సేకరణ వల్ల 2020–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా గత ఏడాది ఈ సంఖ్య 35.57 కోట్లేనని వివరించారు. పప్పుధాన్యాల సేకరణ 2013–14 కంటే నలభై రెట్లు పెరిగి 2019–20 నాటికి రూ.10,530 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. సెస్ విధింపు.. సుంకాల తగ్గింపు.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం కొన్ని ఉత్పత్తులపై సెస్ విధించిన ప్రభుత్వం కొన్నింటి సుంకాలను తగ్గించింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌పై సెస్ వసూలు చేయనున్నప్పటికీ సుంకాల తగ్గింపు కారణంగా ఆ ప్రభావం వినియోగదారులపై పడకపోవచ్చు. ఈ రెండు ఉత్పత్తులపై విధించే ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే.. పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల నుంచే బియ్యం సేక రణ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రుణ వితరణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. పెద్ద పెద్ద రైతులు లబ్ధి పొందుతూంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుం టుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తూంటే అసలు రైతుకు సంస్థాగత రుణాల లభ్యత ఉండటం లేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో హెక్టారుకు రూ.30,000 వరకూ సబ్సిడీలు లభిస్తూంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేలకు మించడం లేదు. ఈ అసమానతలను సరిదిద్దగకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించి నప్పటికీ బడ్జెట్లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసు లేనేలేకపోవడం గమనార్హం. జి.వి.రామాంజినేయులు, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, హైదరాబాద్. 5.6%పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది కంటే 5.6 శాతం ఎక్కువ నిధులు లభించగా ఇందులో సగం మొత్తాన్ని ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021–22 సంవత్సరానికి గాను మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సాగునీటి పథకాలకు గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2020–21 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.1,24,519 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా కేటాయింపుల్లో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించు కుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తారు. పీఎం–కిసాన్ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తారు. మద్దతు ధర వితరణ (రూ. కోట్లలో) ఉత్పత్తి 2013–14 2019–20 2020–21 గోధుమలు 33,874 62,802 75,050 బియ్యం 63,928 1,41,930 172,752 పప్పుధాన్యాలు 236 8,285 10,530 పత్తి 90 - 25,974 వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సెస్ దేనిపై ఎంతంటే(శాతాల్లో) శనగపప్పు 50 శాతం ఆపిల్ పండ్లు 35 శాతం కాబూలీ శనగలు 30 శాతం మసూర్‌దాల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 20 శాతం ముడి పామాయిల్ 17.5 శాతం బటానీలు 10 శాతం పత్తి, నిర్దిష్ట ఎరువులు 5 శాతం బంగారం, వెండి కడ్డీలు 2.5 శాతం బొగ్గు,పీట్ లిగ్నైట్ 1.5 శాతం పెట్రోలు రూ.2.5 డీజిల్ రూ.4.0 రైతులతో చర్చలకు సిద్ధం: నిర్మలా న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ఆమె చెప్పారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు బైఠాయించారో మాకు అర్థమయింది. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు రైతులతో చర్చలు జరిపారు. కొత్త సాగు చట్టాలపై అంశాల వారీగా సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇదే విషయం స్పష్టం చేశారు’అని మంత్రి నిర్మల అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు, సందిగ్ధాలను తొలగించుకోవాలని ఆమె రైతులను కోరారు. అనంతరం, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరి మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించారు. -
వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకంజ
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా రైతులు చలిని, ఎండను లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. దీనికి కేంద్ర మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలోనే రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు 9సార్లు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్రం మరోసారి నేడు 10వ సారి చర్చలు జరిపింది. నేటి చర్చల్లో కేంద్రం రైతులకు ఓ ఆఫర్‌ను ప్రకటించింది. వివాదాస్పదంగా మారిన చట్టాలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది. కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటాం. ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తాం. ఈ ప్రతిపాదనతో కేంద్రం దిగొచ్చినట్టే కనిపిస్తోంది’ అని కవిత తెలియజేశారు. అయితే మరోసారి జనవరి 22న రైతులతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది. -
వ్యవసాయ చట్టాలు: సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి. కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీం, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు. -
పొయ్యి ఆరలేదు.. స్ఫూర్తి తగ్గలేదు
న్యూఢిల్లీ : కడుపులో ఆకలి మంటల్ని చల్లార్చడానికి అక్కడ పొయ్యి రేయింబగళ్లు మండుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా వారిలో స్ఫూర్తి ఆరని జ్వాలలా రగులుతూనే ఉంటుంది. కుండపోతగా వాన కురిసినా, ఎముకలు కొరికే చలిలోనైనా రైతన్నలు చలించడం లేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా తాము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. 40 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ వారిలో ఆత్మస్థైర్యం రవ్వంత కూడా సడల్లేదు. అందరి కడుపులు నింపే అన్నదాతల కడుపు నింపడానికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే రైతులెవరూ ఆకలి బాధతో ఉండకూడదన్న ఏకైక ఎజెండాతో రైతు నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లంగర్లలో (కమ్యూనిటీ కిచెన్) నిరంతరం ఏదో ఒక వంటకం తయారవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద పొయ్యిలు, గిన్నెలు, రోటీ మిషన్లు, ఒకటేమిటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైతు కుటుంబాల వారే వంతులవారీగా వంటలు చేస్తూ ఉంటారు. గురుదాస్‌పూర్‌కి చెందిన పల్వీందర్ సింగ్ (45) అనే రైతు హైవేపైనే ఒక లంగరు ఏర్పాటు చేశారు. ‘‘ఆకలి బాధతో ఉంటే విప్లవం ముందుకు వెళ్లలేదు. సిక్కు గురువుల ప్రబోధాలే మాకు ఆదర్శం. వారి ఆశీర్వాదం మా పై ఉంది. అందుకే ఈ కిచెన్‌లో పొయ్యి నిరంతరాయంగా మండుతూనే ఉంది’’ అని పల్వీందర్ సింగ్ చెప్పారు.‘‘ ఏ క్షణంలోనైనా మాపై కరకు లాఠీ దెబ్బలు పడొచ్చు, బాష్పవాయువు ప్రయోగాలు జరగొచ్చు. వాటర్ కెనాన్లు ముంచేయొచ్చు. అయినా అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. మొత్తం 200 మంది షిప్ట్‌ల వారీగా ఆ కిచెన్‌లో పనిచేస్తారు. పూరీలు, కూర, హల్వా, ఖీర్, అన్నం ఎవరికి ఎంత కావాలో అంత పెడతారు. అక్కడ గొప్పవాళ్లు, పేదవారు అన్న భేదం లేదు. ఎవరైనా సరే ముకుళిత హస్తాలతో క్యూ లైన్లలో వచ్చి తినాల్సిందే. స్ఫూర్తి తగ్గలేదు.. ‘‘గురునానక్ శతాబ్దాల క్రితం ప్రారంభించిన లంగర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవీ అంతే. 40 రోజులైంది. మా పొయ్యి ఆరలేదు. సరుకులు నిండుకోలేదు. మాలో స్ఫూర్తి కూడా ఏ మాత్రం తగ్గలేదు’’ అని ఒక మహిళా రైతు అన్నారు. అన్నింటికంటే విశేషం ఏమిటంటే ఈ కమ్యూనిటీ కిచెన్లలో సేవలందించడానికి వచ్చిన వారెవరూ తమ పేరు, ఊరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. మేము ఎవరిమైతే ఏంటి మాదంతా రైతు కుటుంబమే అని చిరునవ్వుతో చెబుతున్నారు. రైతు పోరాటానికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. పాలు, కూరలు వంటివి ఇస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. -
ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం: రైతుల హెచ్చరిక
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం కొనసాగుతోంది. వేలాదిగా రైతులు, ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర చలి పరిస్థితులకు తోడు, అనూహ్య వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయినా, డిమాండ్ల సాధన విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వారంతా ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు. రైతులు, ప్రభుత్వం మధ్య గత ఏడు విడతలుగా జరిగిన చర్చల్లో పెద్దగా పురోగతి చోటు చేసుకోలేదు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు తమ పట్టు వీడడం లేదు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు తేల్చి చెబుతుండగా, ఆ చట్టాల రద్దు కుదరదని స్పష్టమైన సంకేతాలిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా, ఆ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చ జరిపితే, అవసరమైన సవరణలు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య 8వ విడత చర్చలు ఈ నెల 8న జరగనున్నాయి. 8వ తేదీన జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు సోమవారం జరిగిన చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి, చర్చల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. వర్షాల నుంచి రక్షణ కోసం రైతులు తమ దీక్షాస్థలిలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతుల టెంట్లలో నీళ్లు నిలుస్తుండటంతో ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఎత్తైన బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు, ఢిల్లీకి వెళ్తున్న రైతులపై హరియాణాలోని మాసాని బ్యారేజ్ వద్ద ఆదివారం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రేపు ట్రాక్టర్ మార్చ్ డిమాండ్ల సాధనలో భాగంగా నేడు(బుధవారం, జనవరి 6న) తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ కార్యక్రమాన్ని రైతులు గురువారానికి వాయిదా వేసుకున్నారు. జనవరి 6న అననుకూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జనవరి 26న ఢిల్లీకి చేపట్టిన ట్రాక్టర్ మార్చ్‌ని భారీ స్థాయిలో నిర్వహిస్తామని రైతు నేత జోగిందర్ తెలిపారు. హరియాణాలోని ప్రతీ గ్రామం నుంచి 10 ట్రాక్టర్లు వస్తాయన్నారు. ప్రధానిని కలిసిన పంజాబ్ బీజేపీ నేతలు పంజాబ్ బీజేపీ నాయకులు సుర్జిత్‌కుమార్ జ్యానీ, హర్జిత్ సింగ్ గ్రేవల్ మంగళవారం ప్రధాని మోదీని కలిశారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని సుర్జిత్ అన్నారు. ‘మోదీకి అన్నీ తెలుసు. పంజాబ్ గురించి ఇంకా ఎక్కువ తెలుసు. మా సమావేశంలో ఏం చర్చించామనేది చెప్పలేను. కానీ మంచే జరగబోతోంది’ అని గ్రేవల్ వ్యాఖ్యానించారు. ‘రైతు ప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగానే ఉంటారు. కానీ రైతుల ఉద్యమంలోకి మావోయిస్టులు చొరబడ్డారు. వారే సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారు’ అని జ్యానీ పేర్కొన్నారు. చట్టాల రద్దుపై రైతులు మొండిగా ఉండవద్దని, ప్రభుత్వంతో చర్చలకు ఒకరిద్దరు నేతలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. -
వీడని ప్రతిష్టంభన.. అసంపూర్తిగా చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరశిస్తూ రైతులు చేపట్టిన దీక్షలు మరికొన్నాళ్ల పాటు సాగేలా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలు, పంటకు గిట్టుబాటు ధరపై ప్రతిష్టంభన ఎంతకీ వీడటంలేదు. రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్స్‌ను ఏమాత్రం తలొగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. (చలికి తోడు వాన) రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు దీక్షలు 40 రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కాగా చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు ఉధృతం చేయాలని ఇదివరకే రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. -
దిగుబడి పెరిగినా తగ్గిన ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతుబంధు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు నగదు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రేపటి (సోమవారం) నుంచి నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు. -
దేశంలో ప్రజాస్వామ్యం లేదు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రా సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట భావించారు. అయితే, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ముందే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాంతో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రియాంకా గాంధీని, పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్‌చౌధురి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదని, ఊహల్లోనే అది ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజస్వామ్యం ఉందన్న ్రభ్రమల్లో బతుకుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశం ప్రమాదకర మార్గంలో వెళ్తోందని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిపై అయినా ఉగ్రవాది అని ముద్ర వేస్తారని ఆరోపించారు. ‘అది రైతులైనా, కూలీలైనా, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే.. మోదీని వ్యతిరేకిస్తే ఉగ్రవాది అని ముద్ర వేస్తారు’ అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనట్లయితే.. వ్యవసాయ రంగం, తద్వారా దేశం చాలా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సన్నిహితులైన ముగ్గురు, నలుగురు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం ఒక్కటే ప్రధాని మోదీ లక్ష్యం. పేదల డబ్బుతో ఆ కార్పొరేట్ల జేబులు నింపాలన్నది ప్రధాని తాపత్రయం. అందుకు అడ్డుపడే ఎవరినైనా సరే.. ఉగ్రవాదులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, నేరస్తులు అని ముద్ర వేస్తారు. అందుకు రైతులు, కూలీలు, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే మినహాయింపు కాదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్.. చర్చకు రా! రైతుల సంక్షేమం కోసం అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఏం చేసింది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయంలో బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి బీజేపీ సవాలు చేసింది. కేంద్రంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని తోసిపుచ్చింది. అధికారంలో ఉండగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వలేదని, మోదీ సర్కారు వచ్చిన తరువాతనే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశామని, కనీస మద్దతు ధరలను భారీగా పెంచామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ రూ. 18 వేల కోట్లను జమ చేయనున్నారన్నారు. ఇప్పటివరకు రూ. 1.20 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మొత్తంగా పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చేసింది కేవలం రూ. 53 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. అదికూడా రైతులకు ఇవ్వలేదు. బ్యాంకులకు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నా. రైతుల సాధికారతకు మోదీ ఎంత కృషి చేస్తున్నారో, రైతులను కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యం చేసిందో నిరూపిస్తా’ అన్నారు. ప్రభుత్వానివి అబద్ధాలు రైతులకు అవాస్తవాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీలు స్పందించాయి. ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళన మార్గం పట్టిన రైతులకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ‘రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను మేం పార్లమంట్లోనూ వ్యతిరేకించాం. ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేశారు’ అని కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, పీఏజీడీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆరెస్పీ, ఏఐఎఫ్బీ ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు.. సాగు చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరింది. అసెంబ్లీ సెషన్ పెట్టండి నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించి, వాటిని రద్దు చేయాలని తీర్మానం చేసేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు మరోసారి సిఫారసు చేయాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసినట్లుగా ప్రత్యేక సమావేశాలని కాకుండా, రైతుల అంశంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీ 21వ సమావేశాలను డిసెంబర్ 31న ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేయనున్నారు. డిసెంబర్ 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని గతంలో కేబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మళ్లీ ఆహ్వానం చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ రైతు సంఘం నేతలకు ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. అయితే, కనీస మద్దతు ధర అంశానికి సంబంధించిన కొత్త డిమాండ్లేవీ చర్చల ఎజెండాలో ఉండకూడదని షరతు విధించింది. కొత్త సాగు చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధర అంశాన్ని చర్చల్లో భాగం చేయడం అర్థం లేని పని అని వ్యాఖ్యానించింది. 40 రైతు సంఘాల నేతలను ఉద్దేశించి వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ లేఖ రాశారు. ‘రైతుల నిరసనలు ముగియాలన్న ఉద్దేశంతో వారి అన్ని అభ్యంతరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది’ అని తెలిపారు. అరెస్ట్ సందర్భంగా మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రియాంక, రైతులు. రాష్ట్రపతికి రాహుల్ వినతిపత్రం -
శిరస్సు వంచి నమస్కరిస్తా.. రద్దు చేయండి
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాని మోదీకి శిరస్సు వంచి నమస్కారం చేస్తా, దయచేసి రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయండని ప్రముఖ సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వేడుకున్నారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన బుధవారం వ్యవసాయ సంక్షోభం–పరిష్కారం అనే అంశంపై రైతు సంఘీభావ సభ నిర్వహించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో సహా అన్ని రంగాల ప్రజల మద్దతును కూడగట్టి విజయాలను సాధించగలగడమే స్వర్గీయ చరణ్‌సింగ్‌కు ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులను, కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడారు. అనంతరం రైతాంగ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 24న మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, 27, 28 తేదీలలో మాకీబాత్ కార్యక్రమానికి నిరసనగా డప్పులు, పళ్లేలు మోగించి నిరసన తెలపాలని, ఆదాని, అంబానీ వస్తువులను బహిష్కరించాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వి.శ్రీనివాసరావు రాసిన వ్యవసాయ చట్టాలతో రైతుకు మరణ శాసనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు క్షేమం’ రాజ్యం బాధ్యతే!
కరుకు కరోనా అనేక రంగాలను కుదిపి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంవత్సరం... మనదేశ అగ్రశ్రేణి కుబేరుల సంపద వృద్ధిరేటు నాల్గింట మూడొంతులు పెరిగి నమోదైంది. కరోనా దెబ్బతో ఇదే సంవత్సరం చిన్న, మధ్యతరగతి సమాజం కుదైలై దేశంలో పేద రికం రెట్టింపయినట్టు అంతర్జాతీయ అధ్య యనాలు చెబుతున్నాయి. పరస్పర విరుద్ధ మైన ఈ రెండు పరిణామాలు సామాజంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిన తీరుకు సంకేతాలు. ఈ పరిణామాలకి, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై దేశవ్యాప్తంగా అంటుకున్న రైతు ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు యథా తథం అమలైతే... సమీప భవిష్యత్తులో ఆర్థిక అంతరాలు అసాధారణ స్థితికి చేరి, సమాజం అశాంతి కుంపటిపై రగులనుందనే భావన వ్యక్త మౌతోంది. ఈ ప్రచారం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని, తాము ఎన్ని కల్లో హామీ ఇచ్చినట్టు 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో తాజా సంస్కరణలు పెద్ద ముందడుగని పాలకపక్ష వాదన. కీలక వ్యవసాయ రంగంలో వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో ప్రభా వితం చేస్తుంది కనుక తమ చర్యల వల్ల ఆర్థిక అంతరాలు తగ్గుతాయని కేంద్రం అంటోంది. కొత్త చట్టాలను నిరసిస్తూ రైతాంగం ఉద్యమిస్తున్న తాజా పరిస్థి తికి పలువురు మేధావులు విభిన్న భాష్యాలు చెబుతున్నారు. వ్యవ సాయ రంగంలో ఎప్పట్నుంచో రావాల్సిన సంస్కరణలకు ఇది తోవ అని కొందరు పొగడుతుంటే, ఇవి రైతును, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్పొరేటీకరణ చర్యలని మరికొందరు తెగుడుతు న్నారు. నడ్డివిరిగి ఉన్న నిస్సహాయ రైతాంగాన్ని మెడబట్టి బహుళ జాతి కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ల సందిట్లోకి నెట్టడమేనని వారం టున్నారు. పూర్తి భిన్నమైన వాదనలు సాగుతున్నాయి. మరో వంక, సర్కారు–రైతు సంఘాల మధ్య జరిగిన చర్చల ప్రక్రియ విఫలమై, ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో కీలక పరి ణామమిది. కొత్త చట్టాల మంచి చెడులు, వాదవివాదాలెలా ఉన్నా... ఉద్యమిస్తున్న రైతులను సముదాయించి, నిర్దిష్ట చర్యలతో సంతృప్తి పరచి, వెంటనే ఆందోళనను కేంద్ర ప్రభుత్వం విరమింపజేయా ల్సింది. ఉద్యమం వెనుక ఇతరేతర శక్తులున్నాయనో, ఇది రెండున్నర రాష్ట్రాల వాళ్లు చేస్తున్న అలజడి అనో రైతు ఉద్యమాన్ని తక్కువ చేసి చూడటం సరైన స్పందన కాదు. తమ జీవితాలతో ముడివడి ఉన్న నిర్ణయాలను రైతాంగం ప్రశ్నిస్తున్నపుడు వారు లేవనెత్తే అంశాలకు, భయ–సందేహాలకు సహేతుకమైన సమాధానాలివ్వడం పాలకుల కర్తవ్యం. భరోసా కల్పించాలి. చట్టాల అమలుకు ముందు ప్రజాభి ప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. రైతు కష్టాలు ఇన్నన్ని కావు అత్యధిక పౌరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీదే ఆధార పడ్డ దేశం మనది. రైతు అసంఘటిత రంగంలో ఉన్నందున, వ్యవసా యాన్ని పరిశ్రమగా గుర్తించనందున వరుస ప్రభుత్వాలు, పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. పాలకులు రైతాంగంపై శ్రద్ద పెట్టిన దాఖలాలు పరిమితమే! వేర్వేరు కారణాలతో వ్యవసాయ రంగం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతాంగం తీరని కష్టాల్లో కూరుకుపోయింది. దుర్భరమైన బతుకీడ్చలేక ఏటా పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు దిక్కులేనివవు తున్నాయి. పెట్టుబడి వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. విత్తనంపై కార్పొ రేట్ల పెత్తనం. ఎరువులతో వ్యాపార జిమ్మిక్కు, పంట భీమాలో మోసాలు, సబ్సిడీల్లో అవినీతి, రుణాల్లో దగా, సర్కారు అప్పులు దొరకవు–ప్రయివేటు అప్పులు భారం, అతివృష్టి–అనావృష్టితో ప్రకృతి కన్నెర్ర, దిగుబడికి భరోసా లేదు, పంట పండినపుడు ధర రాదు, కాటేసే మార్కెట్ల మాయాజాలం... ఇన్ని ప్రతిబందకాల మధ్య కొట్టుమిట్టాడే రైతుకు చట్టాల రూపంలోనైనా సర్కార్ల సహకారం లభించకుంటే పరిస్థితి దుర్భరమే! ఆర్థిక–సరళీకరణ విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రపంచీకరణ నుంచి ఎడతెగని కడగండ్లే! దాదాపు ముడు దశాబ్దాలుగా సానుకూల సంస్కరణల కోసం రైతులు నిరీక్షిస్తు న్నారు. తాజా సంస్కరణలు ఎవరి హితంలో ఉన్నాయన్నది పెద్ద ప్రశ్న. కనీస మద్దతు ధర తొలగిపోయి, మార్కెట్లో «కొనుగోలు భరోసా లేకుండా మనుగడ ఎలా? ఉద్దేశపూర్వకంగానే బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలగుతోంది. బలహీనమైన రైతులకు–శక్తి మంతులైన కార్పొరేట్లకు మధ్య పోటీ ఎలా సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఏకపక్షంగా కార్పొరేట్ కబంద హస్తాల్లోకి జారే దుస్థితి అయితే ‘బతుకెట్లా?’ అనే ప్రశ్నను రైతాంగం లేవనెత్తుతోంది. ఈ అంశం కేంద్రకంగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకోమంటున్నాయి. ఇప్పుడు తెచ్చిన రెండు చట్టాలు, సవరణలు చేసిన మూడో చట్టం, విద్యుత్ సంస్కర ణలు... ఇవన్నీ రైతుకు మేలు చేయకపోగా నష్టం. ఉన్న సదుపా యాల్ని తొలగించి పెనం మీంచి పోయ్యిలో వేసినట్టుందనే అభి ప్రాయం రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సవరణలకు సరే తప్ప చట్టాలు వెనక్కి తీసుకోమని కేంద్ర సర్కారు అంటోంది. ఏమిటి భయాలు, ఎందుకు సందేహం? ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం’ ముఖ్య ఉద్దేశ్యం రైతు తన ఉత్పత్తుల్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్(మండీ)లలోనే అమ్ముకోవా ల్సిన కట్టుబాటు లేకుండా, ప్రాంత పరిమితులు దాటి ఎక్కడైనా విక్ర యించుకునే వెసలుబాటు అని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడికి వెళ్లి అమ్ముకునే సంస్కరణ అంటోంది. రైతు నేతలు దీన్ని మరోలా చెబుతున్నారు. తిరగేసి చూస్తే, ప్రయివేటు కొనగోలుదారుకు లభిస్తున్న వెసలుబాటు అంటోంది. బాధ్యత–జవా బుదారుతనం లేని ప్రయివేటు మార్కెట్లొస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థ (పీడీఎస్)ను క్రమంగా బలహీనపరచి, బదు లుగా లబ్దిదారులకు నగదు బదిలీని ప్రోత్సహిస్తోంది. తాజా చట్టాలతో క్రమంగా సర్కారు మార్కెట్ కమిటీలు బలహీనపడతాయి. ధాన్యం సేకరణ తగ్గుతుంది, మద్దతు దర ఉండదు, మార్కెట్ స్వేచ్ఛ వల్ల పెద్ద ప్రయివేటు సంస్థలు బరిలో దిగి ఆధిపత్యం చెలాయిస్తాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీస మద్దతు ధరకూ రైతు నోచుకోడు. ఇదీ భయం! వ్యవసాయం చేయలేక, విధిలేని పరిస్థితుల్లో భూము లను కార్పొరేట్లకు అప్పగించి, ఒప్పంద వ్యవసాయానికి తలపడేలా చిన్న, సన్నకారు రైతాంగాన్ని నెట్టడమే అన్నది వారి ఆందోళన! ఇప్పుడు తెచ్చిన ‘ఒప్పంద వ్యవసాయ చట్టం’ నిబంధనలు కూడా కార్పొరేట్లకే తప్ప రైతుకు అనుకూలంగా లేవు. ఇదే జరిగితే, సమా జంలో ఇప్పుడున్న గౌరవం కూడా దక్కదని, కార్పొరేట్లకు రైతులు కట్టుబానిసగా బతకాల్సిందేనని వాపోతున్నారు. దిగుబడి ఉన్నపుడు నాణ్యతకు ముడిపెట్టి, దిగుబడి లేనపుడు మరో వంక చూపి బహుళ జాతి కంపెనీలు చేసే అరాచకాలకు రైతు బలి కావాల్సిందే అన్నది ఆందోళన! లోగడ పలు రాష్ట్రాల్లో పెప్సీ వంటి బహుళ జాతి కంపెనీలు చిప్స్ ఉత్పత్తి కోసం, ఆలూ పండించే రైతులతో జరిపిన ఒప్పంద వ్యవ సాయం ఎన్ని అనర్థాలకు దారి తీసిందో రైతాంగం మరచిపోలేదు. కోర్టుల చుట్టూ తిప్పి, భూములు విక్రయించినా కట్టలేనంత జరిమా నాలతో వేధించిన ఉదంతాలు మరపురాని చేదు జ్ఞాపకాలే! ఇప్పుడా న్యాయ తనిఖీలు కూడా లేకుండా, న్యాయస్థానాల పరిధి తొలగించి, కేవలం అధికార వ్యవస్థ పరిధిలోనే వివాదాల్ని పరిష్కరించుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. రాజ్యాంగ పరిధిలో తమకున్న హక్కుల్ని కాల రాయడమేనని రైతు సంఘాలంటున్నాయి. ఇక నిత్యావసరాల చట్ట పరిధిలో, నిలువ నిబంధనల నుంచి చాలా సరుకుల్ని మినహాయిం చడం కార్పొరేట్లకు కార్పెట్ పరవడమే! ఏయే సరుకుల్ని, ఎంతైనా నిలవ చేయవచ్చు! తద్వారా వారు ధరల హెచ్చుతగ్గుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలరు. కొనుగోలు సమయంలో రైతులకు తక్కువ ధర, విక్రయించేప్పుడు వినియోగ దారులకు ఎక్కువ «భారం పడేలా చేసి లాభాలార్జిస్తారు. ఇది ఆహార సరఫరా, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా డబ్బు గడించే ప్రయివేటు శక్తులు ఎన్ని కల్లో రాజకీయ పక్షాలకు విరాళాలిస్తాయి. ఇదో తెగని విషవలయం! మండీలను సంస్కరిస్తే తప్పేంటి? రైతు ఉద్యమం వెనుక దళారీలున్నారంటున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవసాయ మార్కెట్ (ఎపీఎమ్సీ)లలో లొసుగుల్ని తమ వాదనకు దన్నుగా వాడుకుంటోంది. దశాబ్దాలుగా రైతులు అక్కడ మోస పోతు న్నారు, మేం విముక్తి కలిగిస్తున్నామంటారు. మండీలు రాష్ట్ర ప్రభు త్వాల నియంత్రణలో ఉన్నాయి. కానీ, ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల సేకరణ చేసేది కేంద్ర పరిధిలోని ‘భారత ఆహార సంస్థ’ (ఎప్సీఐ). రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంపై ఈ కొత్త చట్టాలతో కేంద్రం పెత్తనం చేస్తోందని చాలా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి ఇది భంగకరమనేది వాదన. అందుకే, తాజా చట్టాలు వర్తించనీకుండా కొన్ని రాష్ట్రాలు స్థానికంగా విరుగుడు చట్టాలు కూడ తీసుకువచ్చాయి. ఇంతకన్నా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతును ఆదుకోనేట్టు, వారికి ఉపయోగపడేలా మండీల్లో సంస్కరణలు తీసుకు వస్తే బాగుండేది. అక్కడ కనీస మద్దతు ధర లభించేది. రైతు కిన్ని కష్టాలుండేవి కావు. కమిషన్ ఎజెంట్ల దోపిడీ, వ్యాపారులు కుమ్ము క్కయి వ్యవసాయోత్పత్తుల ధరల్ని తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం, నగదు ఇచ్చేట్టయితే ధరల్లో కొత, తామిచ్చిన అప్పులకు అధిక వడ్డీ వసూళ్లు, సెస్సు విధింపు, నాసిరకం సదుపాయాలు.. ఇలా మండీల్లో చాలా సమస్యలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సర్వే జరిపినపుడు, 57 శాతం మంది రైతులు మండీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 43 శాతం మంది ఓకే అన్నారు. ఈ రెండు వర్గాల్లోనూ అత్యధికులు మండీల్లో మార్పులు కోరారు. ఇక మొత్తానికే మండీలు ఉండవంటే ‘మద్దతు ధర’ ఎలా? అని భయపడుతున్నారు. ఉద్యమించేది రైతులు కాదనడం అన్యాయం. ఏ దళారులూ 3 డిగ్రీల చలిలో మూడువారాలపాటు రోడ్డుపక్క దీక్షకు దిగరు. పది కిలోమీటర్ల నిడివి రోడ్లను ఆక్రమించి నెలల కాలమైనా సరే పరిష్కారంతోనే వెళ్తామంటున్న రైతుల సహనాన్ని పరీక్షించొద్దు. రైతాంగ ఆందోళనను విరమింపజేసే అన్ని అవకాశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. సమస్యను సానుభూతితో పరిష్కరించాలి. మనదేశ వెన్నెముకను కాపాడాలి. ‘ఈ మొగులు కింద, ఎముకలు కొరికే చలిలో కూర్చో వడం మాకేమైనా సరదానా? కరోనా చంపుతుందో లేదో కానీ, ఈ చట్టాలు మాత్రం మమ్మల్ని తప్పక చంపుతాయి. అన్నీ ఎత్తేసి, కార్పొరేట్ కంపెనీలకు బలిపెడితే బతికేది ఎలా?’ అన్న ఉద్యమ కారుడు, సోనిపత్ రైతు రమేష్ అతిల్ మాటలు మనందరినీ తప్పకుండా ఆలోచింపజేసేవే! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
అన్నదాతే కాదు, ఉద్యమ దీపధారి
అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశంలోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొరేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడు తున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. ‘‘అధికారంలో ఉన్న వారికన్నా ప్రజాబలం అత్యంత శక్తిమంతమైంది’’. ఇది అక్షర సత్య మనడానికి నేటి భారతావని ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పంజాబ్ రైతన్నలు మొదలుపెట్టిన పోరాటం ప్రధానంగా ఉత్తర భారతాన్ని చుట్టేసింది. దాదాపు 20 రోజులకు పైగా రైతులంతా దేశ రాజధానిని ముట్టడిస్తున్నారు. ఒకరకంగా చదరంగం ఆటలో సాధారణ సైనికులు రాజుకి చెక్ పెట్టినట్టు సామాన్య రైతులు ఢిల్లీ ప్రభుత్వాన్ని దిగ్బంధిం చారు. ప్రభుత్వాలు, రాజ్యాలు, చక్రవర్తులు అన్ని రకాల పాలనలూ ప్రజాబలం ముందు మోకరిల్లక తప్పలేదనేది చరిత్ర ఎన్నో సార్లు రుజువు చేసింది. అయితే ఈనాడు జరుగుతున్న రైతాంగ ఉద్యమం పైకి కనిపిస్తున్నట్టుగా కేవలం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది భారత దేశాన్ని కబళించేందుకు పూనుకున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. గతంలో కూడా ఇటువంటి పోరాటాలు జరి గాయి. కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా కూడా ఆ ఉద్యమాలు గళమె త్తాయి. ఇంత సూటిగా, శక్తిమంతంగా ఆ ఉద్యమాలు నిలబడలేదు. పంజాబ్‌తో సహా యావత్ దేశంలోని రైతాంగం చేస్తున్న ఈ పోరాటం రాబోయే ప్రజా ఉద్యమాలకు ఒక దశ, దిశను చూపిస్తున్నది. భారత రైతాంగం సాగించిన గత పోరాటాలన్నీ కూడా ఆనాటి సామాజిక మార్పునకు పునాదులు వేశాయి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో బిహార్‌లోని చంపారన్ పోరాటం ప్రముఖమైనది. బ్రిటిష్ ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ చట్టం పేరుతో 1917లో ఒక చట్టాన్ని తెచ్చింది. ఇది రైతులకు పెనుశాపంగా మారింది. ఇందులో ప్రధా నంగా భూమిశిస్తు పెంచి రైతుల గొంతుమీద కత్తిపెట్టారు. నీలిమందు పంటను పెంచాలనే నిబంధనను విధించారు. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన పంటను వేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంతే కాకుండా రైతులకు తక్కువ ధర ఇచ్చి పంటను కొనుక్కునే అధికా రాన్ని ప్రభుత్వం వ్యాపారులకు కట్టబెట్టింది. బ్రిటిష్ వ్యాపారుల ప్రయోజనాల కోసం పంట వేయడం వల్ల అదే పంటను ఇంకా ఎక్కడా అమ్ముకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. దీంతో రైతులు పేదరికంలోకి దిగజారిపోయారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడిగా గాంధీజీ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన అహింసాయుతమైన సత్యాగ్రహ ఉద్య మాన్ని చంపారన్‌లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఆకలితో, దారిద్య్రంతో అల్లాడుతున్న రైతులకు గాంధీజీ ఒక ఆశాకిరణంగా కనిపించారు. కానీ చౌరీచౌరాలో పోలీస్ స్టేషన్ తగులబడటంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో గాంధీ అక్కడ ఉద్య మాన్ని విరమించారు. అయితే చంపారన్ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ రహస్య ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. తమ వ్యాపార ప్రయోజనాలు, దేశంలోని వనరుల దోపిడీ వారి ప్రధాన లక్ష్యాలని బయటపెట్టింది. అంతేకాకుండా అహింస, సత్యాగ్రహం ద్వారా జాతీయవాదం మరింత బలపడింది. గుజరాత్‌లోని ఖేడాలో కూడా పత్తి, పొగాకు పండించే రైతులు తీవ్రమైన కరువు కాటకాల్లో చిక్కుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అందించకపోగా, భూమి పన్ను కట్టాల్సిందే నంటూ వేధింపులకు గురిచేసింది. 1919లో గాంధీజీ, వల్లభాయ్ పటేల్, ఎన్.ఎం.జోషి నాయకత్వంలో సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్కడ పాటిదార్లు ప్రధాన రైతాంగ శక్తి. ఖేడా ఉద్యమం వల్ల భూమిశిస్తు రద్దయింది. గాంధీజీ, వల్లభాయ్ పటేల్ నాయకత్వ బలోపేతానికి కారణమైంది. అదే గుజరాత్‌లోని బార్దోలి ప్రాంతంలో వరదలతో రైతులు పంటలను పోగొట్టుకున్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం భూమిశి స్తును 30 శాతం పెంచింది. తగ్గించడానికి ససేమిరా అంగీకరించ లేదు. దీనికి వ్యతిరేకంగా 1925లో వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికే నిశ్చయించుకుంది. పోలీసు బలగా లను దించింది. అరెస్టులను సాగించింది. అయినా రైతాంగం చాక చక్యంగా ఉద్యమాన్ని కొనసాగించింది. వల్లభాయ్ పటేల్ అందించిన నాయకత్వానికి ప్రతిగా రైతాంగం ఆయనకు ‘సర్దార్’ బిరుదును ఇచ్చింది. ఆ రోజు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా మారిపోయారు. ఈ రెండు ఉద్యమాలు ప్రజల్లో భారత స్వాతంత్య్రకాంక్షను పెంచాయి. కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగిన మొఫ్లా రైతాంగ పోరాటం అక్కడి స్థానిక జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరే కంగా సాగింది. 1835 నుంచి మొఫ్లా రైతులను అక్కడి భూస్వాములు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మొఫ్లా రైతులు మెజారిటీ ముస్లిం రైతులు కాగా, భూస్వాములు హిందువులు. అయితే సమస్య మతపరమైనది కాకపోయినప్పటికీ, అంతిమంగా ఆ రూపం తీసుకున్నది. మొఫ్లా తిరుగుబాటు 1921లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించలేకపోయింది. ఈ ఉద్యమం ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం బలపడటానికి, ఒకరకంగా ముస్లింలు ప్రత్యేక శక్తిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం స్థాని కంగా జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. వీళ్ళకు అండగా వచ్చిన రజాకార్లకు, వీళ్ళందరినీ కాపాడిన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. ఈ పోరాటం వల్ల జమీందారు, జాగీర్దారు విధానం పోయి, ఆ భూములను ప్రజలు పంచుకున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఇక్కడే ప్రముఖంగా వినిపించింది. వీటన్నింటితోపాటు, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో ఎంతో శక్తి కలిగి ఉన్నదని చెప్పడానికి తెలంగాణ సాయుధపోరాటం ఉపయోగ పడింది. భూస్వామ్య, పెత్తందారీ, రాచరిక పాలన స్థానంలో ప్రజా స్వామ్య ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం వేసింది తెలంగాణ సాయుధ పోరాటమేనని చెప్పక తప్పదు.భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో పెల్లుబికిన నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ రైతాంగ పోరా టాలు పాలకుల మొద్దునిద్రను వదిలించాయి. ఆ పరంపరంలో ఇప్ప టికీ నక్సలైట్ ఉద్యమాలు సాగుతున్నప్పటికీ, నక్సల్బరీ అనంతరం ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ఎన్నో చట్టాలను, పథకాలను తెచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఉద్యమ ప్రభావం సమాజంపై పడిందనేది వాస్తవం. ప్రస్తుతం మనం చూస్తున్న పంజాబ్ నాయకత్వంలోని జాతీయ రైతాంగ పోరాటం కార్పొరేట్లతో భారత ప్రజలు సాగించాల్సిన ప్రత్యక్ష పోరాటానికి తెరలేపింది. 1990 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణ, సరళీకరణ, విశ్వీకరణలు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థగా మారి పోయాయి. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తుల నుంచి, అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశం లోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొ రేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు వేరువేరనే ముసుగును ప్రస్తుత పోరాటం తొలగించింది. అందుకే ఈ ఉద్యమం సాధారణమైనది కాదు. ఇది చరిత్రాత్మక మైనది. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. గతంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో కార్పొరేట్లను ప్రవే శింపజేయడాన్ని అక్కడి ఆదివాసులు వ్యతిరేకించారు. రెండు సంవ త్సరాల క్రితం నాసిక్ నుంచి 40,000 మంది ఆదివాసీ రైతులు మహా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో, ఆంధ్రాలో ఇంకా అనేక చోట్ల ప్రజలు కార్పొరేట్ కంపెనీలను నిరసిం చారు. పశ్చిమబెంగాల్లోని సింగూరు రైతుల ప్రతిఘటనను కూడా అందులో భాగంగానే చూడాలి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడుతున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొం టున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
చర్చలపైనే దృష్టి పెట్టాలి
దాదాపు 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పట్లో ముగిసే ఛాయలు కనుచూపు మేరలో కనబడని స్థితిలో ఆ సమస్యపై వ్యాపార, వాణిజ్య సంఘాలు తొలిసారి మాట్లాడాయి. ఈ ప్రతిష్టంభన భారీ నష్టానికి దారితీస్తుందని ఆందోళనపడ్డాయి. వాణిజ్య పారి శ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్ చెబుతున్న గణాంకాలనుబట్టి పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్‌లలో రోజుకు రూ. 3,500 కోట్ల మేర నష్టం జరుగుతోంది. రైతుల నిరసనతో పంపిణీ వ్యవస్థ దెబ్బతిని ఎక్కడి సరుకు అక్కడే నిలిచిందని, అసలే ఆర్థిక మాంద్యం అలుముకుని వున్న వర్తమానంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యమవుతుందని సీఐఐ హెచ్చరించింది. ఆ రెండు సంఘాలూ సాగు చట్టాలను సమర్థిస్తున్నాయి. కానీ ఈ ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నదని కొందరు రైతులతో మాట్లాడుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సిక్కు రైతులు కొందరితో ఢిల్లీ నిరసనల గురించే మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను సోమవారం కొందరు రైతు నేతలు కలిసి సాగు చట్టాలకు అనుకూలమేనని చెప్పారు. సమస్య తలెత్తినప్పుడు చర్చించడం, ఒక పరిష్కారాన్ని అన్వేషించడం మంచిదే. దేశంలోని రైతులంతా ఆ చట్టాలను సమర్థిస్తున్నారనో లేక పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనో అభిప్రాయం కలగజేసే ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం సిద్ధించదు. వాస్తవంగా రైతుల భయాందోళనలేమిటో తెలుసుకుని, వాటిని తొలగించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యమం ప్రారంభమయ్యాక ఇప్పటికి అయిదు సార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం అవి నిలిచిపోయాయి. చట్టాలు తీసుకొచ్చేముందే దేశంలోని రైతులతో, మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులతో చర్చించాల్సింది. ఆ తర్వాతే ఆర్డి నెన్సులైనా, బిల్లులైనా తీసుకురావాల్సింది. కనీసం పార్లమెంటులోనైనా చర్చ జరుగుతుందనుకుంటే తీవ్ర గందరగోళం మధ్య బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. చట్టసభల్లో తగినంత బలం వుండొచ్చు. కోరుకున్న చట్టం తీసుకురావడానికి, నచ్చిన నిర్ణయం చేయడానికి అదొక్కటే సరిపోదు. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా చర్చలతోనే ముడిపడి వుంటుంది. ఆ చర్చలు ముందా వెనకా అనేది తేల్చుకోవాల్సింది ప్రభుత్వాలే. ముందే చర్చిస్తే ఆచరణలో అవరోధాలు పెద్దగా ఏర్పడవు. తర్వాత చర్చిద్దామనుకుంటే కొన్నిసార్లు అది అసాధ్యం కావొచ్చు. సాగు చట్టాలకు సంబంధించిన బిల్లులు తీసుకురావడానికి ముందు ఆన్లైన్ ద్వారా 90 లక్షలమంది రైతులతో మాట్లాడామని కేంద్రం చెబుతోంది. అది నిజమే అనుకున్నా... ఆ 90 లక్షలమంది మొత్తంగా రైతుల మనోగతాన్ని ప్రతిబింబించలేకపోయారని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రైతుల ఆందోళన గమనించాక కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వగైరాలపై లిఖితపూర్వక హామీని ఇస్తామని ఇప్పుడు కేంద్రం ముందుకొస్తోంది. ఆ 90 లక్షలమందిలో కొందరైనా ఎంఎస్పీ అంశం లేవనెత్తి వుంటే ముందే జాగ్రత్త పడటం వీలయ్యేది. పార్లమెంటులో సరిగా చర్చ జరిగినా ఆ సమస్యపై దృష్టి సారించడం తప్పనిసరని తెలిసేది. ఇప్పుడు రైతులు అటు లిఖితపూర్వక హామీగానీ, ఇటు చట్ట సవరణలుగానీ తమకు సమ్మతం కాదంటున్నారు. వాటి రద్దు ఒక్కటే తమ డిమాండని చెబు తున్నారు. అది కుదరని పని అని కేంద్రం అంటోంది. వాతావరణం ఉద్రిక్తంగా మారినప్పుడు ఇలాంటివన్నీ సహజమే. కచ్‌లో మాట్లాడిన సందర్భంగా విపక్షం అధికారంలో వుండగా ఈ మాదిరి సంస్కరణలే తీసుకురావడానికి ప్రయత్నించిందని, వాటినే తాము తీసుకొస్తే వ్యతిరేకిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. అందులో వాస్తవముంది. ఇతర అంశాల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా సంస్కరణల విషయంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకటే విధానం. అధికార పక్షంలో వుండగా ఒకలా, విపక్షంలో వుండగా మరొకలా మాట్లాడటంలోనూ ఇద్దరిదీ ఒకే తంతు. కాంగ్రెస్ మేనిఫెస్టోయే మండీల వ్యవస్థను రద్దు చేస్తామని తెలిపింది. అయితే కేవలం విపక్షాల ప్రాపకంతోనే ప్రస్తుత ఆందోళన జరుగుతున్నదని భావించడం పొరపాటు. ఇంతక్రితం కేంద్రమంత్రి తోమర్ సైతం ఈ మాటే అన్నారు. 370 అధికరణనూ, రామమందిరాన్నీ, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించినవారే రైతుల ఆందోళన వెనకున్నారని ఆరోపించారు. ఇతర మంత్రులు ఆ రైతుల వెనక ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ ఉందని, మావోయిస్టులున్నారని, పాకిస్తాన్, చైనాల హస్తం వుందని... ఇలా రకరకాలుగా మాట్లాడు తున్నారు. ఈ ఆరోపణల విషయంలో తగిన సమాచారముంటే ఆ రైతులకు దాన్ని అందజేయొచ్చు. అటువంటి వారిని దూరం పెట్టమని కోరవచ్చు. తామే చర్యలు తీసుకోవచ్చు. కానీ చర్చలు జరిగి మెరుగైన పరిష్కారం సాధించవలసిన సందర్భంలో ఇలా ఏకపక్షంగా ముద్రలు వేసే ప్రయత్నం సరైందేనా? అందువల్ల సమస్య మరింత జటిలం కాదా? ఇందిరాగాంధీ ప్రధానిగా వుండగా తన వ్యతిరేకుల్ని సీఐఏ ఏజెంట్లని ఆరోపించేవారు. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలొస్తాయన్న ఉద్దేశం తోనే రైతులు రాజకీయ పక్షాలను దూరం పెట్టారు. పైగా సంస్కరణల విషయంలో ఎవరి అభిప్రా యాలేమిటో, ఇప్పుడు ఎవరేమి మాట్లాడుతున్నారో వారికి తెలియకపోలేదు. అందుకే విపక్షాల ప్రాపకం వుందన్న కోణం నుంచి సమస్యను చూడకపోవడం ఉత్తమం. ఢిల్లీ చుట్టుపట్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. శీతగాలులతో అది వణుకుతోంది. అక్కడుండే కాలుష్య వాతా వరణానికి తోడు కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పోలేదు. వీటిని కూడా దృష్టిలో వుంచు కోవాలి. ఇరు పక్షాల్లో ఎవరూ ప్రతిష్టకు పోకుండా చర్చలకు సిద్ధపడాలి. సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్య మైన పరిష్కారం లభించేందుకు ప్రయత్నించాలి. -
గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం
కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవసాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతు ఉద్యమం అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి, కేంద్రం రూపొందించిన మూడు రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! పచ్చి నిజమేమంటే ఏ బిహార్‡ నీలిమందు రైతులను బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి గాంధీ బయటపడేశాడో.. ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి కేంద్ర పాలకులు తలెత్తుకోవడం! రైతాంగ, వ్యవసాయ కార్మికుల ప్రయోజ నాలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్రాల పాల కులు మూడు కొత్త వ్యవసాయ బిల్లులను రుద్దడంలో భారత రాజ్యాంగ చట్ట నిబంధనలను ఉల్లంఘించారు. ఈ క్రమంలో పాలకులు రాజ్యాంగం శాసిస్తున్న కేంద్ర, రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఉమ్మడి జాబితాను ఉల్లంఘించారు. తద్వారా రాజ్యాంగ చట్టం ఫెడరల్ (సమాఖ్య) స్వభావంపైనే దాడికి తలబడ్డారు. ఇందువల్ల ప్రత్యక్షంగా నష్టపోయే రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండానే బిల్లులు తెచ్చారు. చివరికి ఈ బిల్లులపై పార్లమెంటులో వ్యతిరేకత అభ్యంతరాలు వచ్చినా వాటిని వినిపించుకోలేదు. కనీసం బిల్లులపై చర్చించేందుకు కూడా వ్యవధిని ఇవ్వకుండా నల్లేరు మీద బండిని నడిపించినట్టు తోసేశారు. అలాగే, రాజ్యసభలో ఈ బిల్లులపై ఓటింగ్‌ను కోరితే దాన్నీ నిరాకరిం చారు పాలకులు. ఈ గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్ చెప్పారు. కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో బిల్లులపై నిరసన తెల్పడానికి ప్రజలు తెగబడి వీధుల్లోకి వచ్చి నిరసన తెలపలేరన్న భరోసాతో ఆ బిల్లుల్ని ఆమోదిం పజేసుకున్నారు. – కేంద్ర, రాష్ట్రాల సర్వీసులలో పనిచేసిన 78 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంయుక్త ప్రకటన రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంస్థలూ ఏకవాక్యతతో పలు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఢిల్లీ సరిహద్దులలో, ఢిల్లీని ముట్టడించే కూతవేటు దూరంలోనే భారీఎత్తున సమీకరణ జరిగి గత 18 రోజు లకు పైగా భీకరమైన స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్న సమయం ఇది. అసలు భూమికోసం, భుక్తికోసం దేశంలో నేడు జరుగుతున్న పోరు.. దేశ పాలకులు ఎంచుకున్న ‘అభివృద్ధి నమూనా’నే తీవ్ర చర్చ లోకి లాగిందని మరచి పోరాదు! ఎందుకంటే మనదేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు, సాగుచేసుకోవడానికి ఇంత కొండ్ర కూడా లేని నిరుపేద రైతుల సంఖ్యే–భూములున్న రైతుల సంఖ్య కన్నా ఎక్కువని గుర్తుంచుకోవాలి. వ్యవసాయంపై రూపొందించే విధానంలోగాని, వ్యవసాయానికి సంబంధించిన విధాన చర్యలలోగానీ ప్రధానంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు, భూమిలేని రైతుల ప్రస్తావన మృగ్యమవుతూ వస్తోంది. దేశంలోకి కాంగ్రెస్, బీజేపీ పాలకులు ప్రవేశ పెట్టిన.. దేశ ప్రయోజనాలకు, రైతాంగ, వ్యవసాయ కార్మిక మౌలిక ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణలలో అసలు ‘కల్మషం’ అంతా కేంద్రీకరించి ఉంది. ఈ దుస్థితిలో, కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా దేశవ్యాప్తంగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! ఇందుకు చరిత్రలో తొలి ఉదాహరణగా గాంధీజీ చంపారన్ రైతాంగ సత్యాగ్రహాన్ని ఉదహరిం చుకోవచ్చు! ఆ పిమ్మట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతూ వచ్చిన ‘పునప్రా’, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యూడల్, భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల వ్యవసాయ కార్మికోద్యమాలు, రైతాంగ సత్యాగ్రహోద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లను తెలుగునాట, పల్నాటిసీమలో ‘ పుల్లరి’ కోసం సామాన్య ప్రజలు కన్నెగంటి హనుమంతు నడిపిన మహోద్యమం పేద రైతాంగ, ప్రయోజనాలకోసం త్యాగాలతో నిర్వహించిన ఉద్య మాలు, మహోద్యమాలేనని మరువరాదు! ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రైతు ఉద్యమ నాయకులు ఈ కొసన ఉన్న శ్రీకాకుళం నుంచి ఆ కొసన ఉన్న మద్రాసు వరకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వెళ్లి రైతాంగ ప్రజల బాధల గురించి సమర్పించిన వినతి పత్రమూ ఈ ఉద్యమాలలో అంతర్భాగమే! వీటన్నింటి సమా హారంగానే నేడు పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవ సాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! లక్షలమంది రైతులను కూడగట్టి 20వ శతాబ్దం తొలి దశాబ్దంలోనే గాంధీజీ తొలిసారిగా ప్రారంభించిన ‘చంపారన్’ (బిహార్) రైతాంగ సత్యాగ్రహం, ఆ తర్వాత ఉద్యమాలన్నింటికి స్ఫూర్తిగా నిలిచిందని మరువరాదు! కానీ ఏ బిహార్ నీలిమందు రైతులను ౖబ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి ఏ గాం«ధీ బయటపడే శాడో ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి పాలకులు తలెత్తుకున్నారు. పైగా, దేశంలోని బుద్ధిజీవులంతా భారత పారిశ్రామిక వేత్తల జాతీయ సమాజ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో.. భారత రైతాంగంకి ఆదాయం పెంచుకోవడానికి ఇప్పు డున్న మార్కెట్లుగాక ‘ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపడానికే మూడు వ్యవసాయ చట్టాలను’ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని.. వీటిద్వారా రైతాం గానికి ఆదాయాలు పెరుగుతాయని నమ్మింపజూశారు! పైగా రైతాంగ ‘సంక్షేమం కోసమే’ ఈ చట్టాలని ఉద్దేశించామని చెప్పారు. కానీ పాత, మధ్య దళారీలను ఎలా తొలగిస్తారో చెప్పకుండా ‘రైతాంగ ప్రయోజ నాల’ పేరిట బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించడం ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ఎలా గ్యారంటీ ఇవ్వగలరో మోదీ భరోసా కల్పించలేకపోయారు. అందుకే కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తూ వ్యవసాయ చట్టా లలో లీగల్‌గా రక్షణ కల్పించి తీరాలని రైతాంగం కోరుతోంది. ఆ చట్టబద్ధ భద్రత మినహా లిఖిత పూర్వక హామీ ఏదైనా ఇస్తామన్నది మోదీ ప్రభృతుల వాదన! ఇక్కడే ఉంది అసలు ‘కిటుకు’ అంతా అని, ఆవులిస్తే పేగులు లెక్కించడంలో ఇన్నేళ్ల అనుభవం తర్వాత రైతాంగ ప్రజలకు తెలిసిపోయింది. కనుకనే పందొమ్మిది రోజుల సత్యా గ్రహాన్ని మరింతగా ఉధృతం చేయాల్సి వచ్చింది రైతాంగం. వారి దృఢ సంకల్పానికి గాంధీజీ సుదీర్ఘ ‘చంపారన్ రైతాంగ సత్యా గ్రహమే’ గీటురాయి అయింది. ఎందుకంటే ఆంగ్లో అమెరికన్ సామ్రా జ్యవాద పెట్టుబడులను ఇండియా లాంటి వర్ధమాన దేశాల మార్కెట్ల లోకి చొరబడేలా చేసి వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి ధనిక దేశాల ప్రయోజనాలు కాపాడడమే ప్రపంచ బ్యాంకు, గుత్త పెట్టుబడి వర్గాల టెక్నాలజీ గుట్టుమట్టులని మరచిపోరాదు. ఈ విషయాన్ని వరల్డ్‌బ్యాంకు దాని అనుబంధ సంస్థలలో కీలక బాధ్యతల్లో పనిచేసిన డేవిసన్ బుధూ, డాక్టర్ జోసెఫ్ స్టిగ్లిజ్లు ఒకటికి పదిసార్లు వర్ధమాన దేశాలకు పాఠంగా బోధించి హెచ్చరించారు. వీరిలో డేవిసన్ బుధూ వరల్డ్ బ్యాంకు వర్ధమాన దేశాలలో తనకు అమలు జరపమని పురమా యించిన బాధ్యతల మూలంగా పేదప్రజల ప్రాణాలతో చెలగాట మాడి ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఈ చేతుల్ని కడిగి పరిశుభ్రం చేసుకోవడానికి ఏ నదీ జలాలూ సరిపోవు’ అని బాహాటంగా ప్రక టించి బ్యాంకు కొలువును చాలించుకున్నాడు. ఇక బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త (స్టిగ్లిజ్) బ్యాంక్ పదవికి రాజీనామా చేసి, తప్పుకున్నాడు! ఇలాంటి పరిణామాల మధ్య భారత రైతాంగ ప్రజల పలు ఉత్ప త్తులకు, ప్రధానంగా ధాన్యం, గోధుమ పంటలకు కనీస ధరను, కనీస మార్కెటింగ్ సౌకర్యాలను గ్యారెంటీ చేస్తూ ప్రభుత్వం హామీ పడాలని, గ్రామీణ స్థానిక మార్కెట్లకు (మండీలు) ప్రైవేటు గుత్త వ్యాపార వర్గాల చేతుల్లో పెట్టరాదని, ప్రభుత్వ ఆహార సంస్థే నేరుగా రైతుల నుంచి ధాన్యోత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటు న్నారు. గాంధీజీ చంపారన్ రైతాంగ ఉద్యమం.. దాదాపు అదే కాలంలో స్వదేశీ మిల్లు యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా అహ్మదా బాద్ కార్మికులు, కరువు రోజుల్లో కూడా వృత్తి ద్వారా చేసే రెవెన్యూ వసూళ్లకు నిరసనగా జరిగిన ‘ఖేడా’ ప్రతిఘటనోద్యమాలకు దీటైన ఉద్యమంగా నేటి రైతు ఉద్యమాన్ని పరిగణించాలి! అందువల్ల మోదీ తమ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ‘తొలగించాలని భావిం చుకున్న అడ్డంకులు’ తద్వారా బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగంపై ఆధిపత్యం కల్పించడానికి చేస్తున్న చట్టాల ద్వారా పెంచేవి లేదా పెంచాలని ఆశిస్తున్నవీ రైతాంగ ఆదాయాలు మాత్రం కావు. గుత్తేదారుల, వారి కంపెనీల ఆదాయాలు మాత్రమే! అందుకే ‘గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి వర్గాలకు ప్రధాన మైన వనరు. అందువల్లనే పారిశ్రామికవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నిం టినీ తొలగించడానికే వ్యవసాయ సంస్కరణల’ని మోదీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు! అందుకే సెయింట్ అగస్తిన్ అని ఉంటాడు. ‘పాల కుడెవరో చెప్పండి, ఆ చట్టం ఎలా ఉంటుందో చెప్తా’ అన్నాడు! అందుకే కొందరు పాలకుల్ని గురించి లోకంలో ఒక సామెత స్థిరపడి ఉంటుంది. ‘చీకటి తన నల్ల దుప్పటిని అందరికీ సమంగా పంచాలని చూస్తుందట’! వెలుగు చీకట్లతో మానవులు కాపురం చేయక తప్పదు గానీ, ఎప్పటికప్పుడు చీకటిని వెడలుగొట్టుకుంటూనే ఉండాలి మరి! అదే నిత్య విమోచనకు అర్థం!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇప్పుడు మాత్రమే కాదు.. అప్పుడూ ఇదే పాట
కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబరులో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకుంది. ఇవి వ్యవసాయ సంస్కరణలను ఆటో పైలట్ మోడ్‌లో ఉంచాయి. 1991లో సరళీకరణ కూడా ఇలాంటి ప్రభావాన్నే తీసుకొచ్చింది. ఆరోజు కూడా ప్రతిపక్షాలు సరళీకరణను ఇలాగే అడ్డుకున్నాయి కానీ కాలం గడిచే కొద్దీ వారి అభిప్రాయం తప్పని రుజువైంది. వ్యవసాయ రంగంలో తలుపులు తెరవడం పట్ల రైతులు సానుకూల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు కలిసి 1991లో సంస్కరణలు ప్రారంభించిన ఆ పరమాద్భుత క్షణాల్లోకి వెళ్లకుండా భారతీయ వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నాయి. ఇన్నేళ్ల తర్వాత వ్యవసాయ బిల్లులు ఆనాటి సరళీకరణను తలపిస్తూ దేశ వ్యవసాయ సంస్కరణలను ఆటో–పైలట్ మోడ్‌లో ఉంచాయి. ఇప్పటిలాగే ఆనాడు కూడా పెడబొబ్బలు పెట్టే ప్రతిపక్షం ఉండేది. కానీ వారి అరుపులన్నీ కాలం గడిచే కొద్దీ తప్పు అని రుజువయ్యాయి. ప్రజాస్వామ్యానికి అధికార వాణిగా పేరొం దిన థామస్ జెఫర్సన్ చెప్పారు.. ‘‘వ్యవసాయం అనేది అత్యంత తెలివైన అన్వేషణ. ఎందుకంటే అంతిమంగా అది దేశ నిజమైన సంపదకు, మంచి నైతిక విలువలకు, సంతోషానికి తోడ్పడుతుంది’’. భారతీయ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన మాటలు చక్కగా వర్ణిస్తాయి. 73 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత, శతాబ్దాల వ్యవసాయ అనుభవం తర్వాత కూడా మనం ఆయన ప్రకటన సారాంశాన్ని అర్థం చేసుకోవడం లేదు. సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా వ్యవసాయం ఒక ప్రత్యేక రంగంగా విడిగా నడుస్తోంది కానీ జాతీయ ఆర్థిక వ్యవస్థతో అది మిళితం కావడం లేదు. దేశంలో 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాయి. దేశ స్థూలదేశీయోత్పత్తిలో 17 శాతాన్ని మాత్రమే అందిస్తున్న వ్యవసాయ రంగం మొత్తం జనాభాలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిస్థితి ఏకకాలంలో ఉపాధి లేమిని, అరకొర ఉపాధిని ప్రతిబింబిస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ రంగ శక్తిసామర్థ్యాలు అపారమైనవి. కోవిడ్–19 మహమ్మారి కాలంలో వేగంగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులవైపు దిశను మార్చుకున్న వ్యవసాయ విధానాలు మరింతగా విస్తరించాయి.అదేసమయంలో సవాళ్లు కూడా తక్కువగా లేవు. ప్రకృతిలో అనూహ్య మార్పులు చాలా తరచుగా సంభవిస్తున్నాయి. దీంతో అకాల వర్షాలు, కరువులు పదే పదే వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాజకీయ జోక్యం అనే మరో సవాలు సంస్కరణల పురోగతిని గణనీయంగా అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో పంజాబ్ తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన తాజా వ్యవసాయ చట్టాలు కనీస మద్దతు ధరను ఎత్తివేయడానికి దారి తీస్తాయని, బడా కార్పొరేట్ వర్గాల దయాదాక్షిణ్యాలకు తమను బలిచేస్తారని భావిస్తుండటంతో రైతులు తమ నిరసనలపట్ల ఎలాంటి బాధను, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడం లేదు. చిట్టచివరి వారికి కూడా చేరేలా (ఎల్ఎమ్సి) పథకాల ఏర్పాట్లు ఉంటేనే భారతీయ అమలు వ్యవస్థ విజయవంతం అవుతుంది.. గ్రామీణ భారతానికి ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. కోవిడ్ మహమ్మారి ఈ ఎల్ఎమ్సి ప్రాధాన్యతను ఒక్కసారిగా వేగవంతం చేసింది. అందుకే ఆత్మనిర్భర ఉద్యమంలో భాగంగా వివిధ ప్రకటనలను కేంద్రం జారీ చేసింది. సమీకృత ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్తు, నీటి సరఫరా అనేవి ప్రాణాధారమైనవి. కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగం మాత్రమే గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కరోనా కాలం లోనే వరి ఎగుమతులు బాగా పెరి గాయి. నెస్టిల్, డాబర్, బ్రిటానియా వంటి కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు శరవేకంగా తమ నెట్‌వర్క్‌లను విస్తరించాయి. అనుకూలమైన రుతువులు, కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర గరిష్టంగా ఉండటం, వలసబాట పట్టిన వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకోవడం, ప్రభుత్వ సంక్షేమ చర్యలు పుంజుకోవడం వంటివి దీనికి మరింతగా దోహదం చేశాయి. అదే సమయంలో సరళీకరణ ప్రారంభ దిశలో అంటే 1991లో వ్యవసాయదారులు అద్భుత క్షణాలను ఆస్వాదించారు. చాలా కాలం తర్వాత 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను చట్టరూపంలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు స్తబ్దంగా ఉండిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజం చెందించే లక్ష్యంతో వరుస సంస్కరణలకు తాజా వ్యవసాయ చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే వీటి ద్వారా ప్రయోజనాలు పొందే అన్ని వర్గాలు దాపరికం లేని మనస్తత్వంతో వ్యవహరించాలి. అయితే ప్రస్తుతం ఇది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్లాలు కేంద్ర బిల్లులను రాజకీయంగా వ్యతిరేకించడం ప్రారంభించాయి. మరోవైపున ఈ సంస్కరణలు చిన్న, సన్నకారు రైతులను భయాందోళనల్లో ముంచెత్తుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారతీయ వ్యవసాయ రంగం మార్కెట్ ఆధారిత రంగంలోకి ప్రవేశించే క్రమంలో ఉంది. వ్యవసాయ విలువ ఆధారిత సరఫరా చెయిన్‌ను వేగవంతం చేయడానికి, మధ్యదళారుల నుంచి చిన్న, సన్నకారు రైతులను విముక్తి చేయడానికి, విత్తులు నాటిన సమయం నుంచే ముందే నిర్దేశించిన మార్కెట్ ధరతో రైతులు ప్రయోజనం పొందడం కోసం ఒక సమగ్రమైన, నిలకడైన చట్రాన్నితీసుకురావడానికి రైతులు వ్యవసాయంలో తలుపులు తెరవడం పట్ల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టకేలకు వ్యవసాయం ఒక పరిణిత రంగంగా మార్పు చెందుతోంది. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి ఉత్పత్తులను దీర్ఘకాలం పాటు శీతలీకరించేందుకు గానూ పది వేల టన్నుల సామర్థ్యంతో కూడిన ఉష్ణోగ్రతల నియంత్రిత గిడ్డంగులను ఏర్పరుస్తోంది. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా ధరల స్థిరీకరణకు కూడా తోడ్బడుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో టెక్నాలజీని వర్తింపజేయడం వేగం పుంజుకుంది. కొన్ని టెక్నాలజీ సంస్థలు డేటా ఆధారిత వ్యవసాయాన్ని స్పెషలైజ్ చేస్తున్నాయి. వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయంపై దృష్టి తప్పనిసరి అవుతోంది. వ్యవసాయరంగ దుస్థితి దాని కారణంగా ఏర్పడుతున్న నిరుద్యోగిత అనే అతిపెద్ద కొరతను తీర్చడానికి కార్యాచరణ పథకం అవసరం అవుతుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న పంజాబ్‌ని వ్యవసాయ సంస్కరణలలో బీహార్ మార్గంలో వెళ్లడానికి అనుమతించకూడదు. వ్యవసాయ సంస్కరణలు రాజకీయ సులోచానాల నుంచి చూడకూడదు. పంజాబ్ రాష్టం తన సొంత వ్యవసాయ బిల్లులను ఆమోదించిన తరుణంగా పంజాబ్ రైతులు ఢిల్లీకి ఎందుకు దండు కట్టారన్నదే సమస్య. పంజాబ్ రాష్ట్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు ఉత్తమంగా ఉన్నాయని భావిస్తున్న ఆ రాష్ట్ర రైతులు కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రకటనలను తలపించే మాటలు మాట్లాడుతూ న్యాయ పోరాటానికి కూడా దిగుతున్నారు. అయితే ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతుల విషయంలో చేసినట్లు తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన రాజకీయాలను అందరూ నిలిపివేయాలి. వాస్తవానికి పురోగామి స్వభావం కలిగిన వ్యవసాయ సంస్కరణలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాల మధ్య పోటీ తత్వం ఉండాలి. అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనూ వ్యవసాయ ప్రయోజానాలను ప్రోత్సహించేలా కుదుర్చుకోవాలి. ప్రకృతి సహజమైన, సాస్కృతిక పరమైన వనరులు సమృద్ధిగా ఉన్న భారత్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ–పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సంస్కరణలు అమలు కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వ్యవసాయ బిల్లులు ఆహార భద్రతకు హామీ ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల మనోభావాలపై ప్రభావం చూపేలా దాన్ని అనుమతించకూడదు. కిరణ్ నందా, కార్పొరేట్ ఆర్థికవేత్త -
అన్నదాతలకే కాదు.. అందరికీ ముప్పే
నూతన వ్యవసాయ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహకులు తామే న్యాయస్థానా లుగా మారిపోతారు. న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. పెద్ద కార్పొరేట్లకూ, రైతులకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను తాజా చట్టాలు మరింతగా పెంచుతాయి. ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కులకోసం నిలబడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారికి, లేదా దీనికి సంబంధించిన మరే ఇతర వ్యక్తికి వ్యతిరేకంగా ఈ చట్టం కింద సదు ద్దేశంతో చేసిన, చేయాలను కున్న వాటి గురించి న్యాయ పరమైన ఫిర్యాదు, దావాలు ఉండవు.’’ రైతు ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్య చట్టం, 2020లోని 13వ భాగంలోని వాక్యాలు ఇవి. ఇప్పుడు కూడా ఈ కొత్త చట్టాలు రైతులను మాత్రమే ఉద్దేశించినవని మీరు అనుకుంటు న్నారా? సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిర్వహించా ల్సిన న్యాయపరమైన బాధ్యతలకు వ్యతిరేకంగా దావా వేయడానికి మినహాయింపునిచ్చే చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇది దాన్ని ఎన్నో రెట్లు మించిపోయింది. ‘సదుద్దేశంతో’ వాళ్లు ఏం చేసినా దానికి చట్టపర మైన మినహాయింపు ఇవ్వడం మరీ అతిశయం. ‘సదుద్దేశంతో’నే ఏదైనా నేరం చేసి వుంటే వాళ్లను కోర్టుకు ఈడ్వలేకపోవడమే కాదు, ఇతరత్రా వేరే విధమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేనంత రక్షణలో వారున్నారు. పొరపాటున మీరు ఈ అంశం వదిలేసివుంటే గనక, చట్టంలోని 15వ భాగం దాన్ని తిరిగి నొక్కి చెబు తుంది... ఈ అంశాలను విచారించే పరిధి ఏ సివిల్ న్యాయస్థానానికి కూడా లేదని. అసలు ఎవరీ చట్టపరంగా సవాలు చేయలేని, సదుద్దేశంతో పనులు చేసే ‘మరే ఇతర వ్యక్తి’? క్లూ: నిరసన తెలుపుతున్న రైతుల నినాదాల్లో దొర్లు తున్న బడా కార్పొరేట్ సామ్రాజ్యాధిపతులు పేర్లను వినడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా వ్యాపారాన్ని, చాలా చాలా పెద్ద వ్యాపారాన్ని సులభతరం చేయడంలో భాగంగా జరుగుతున్నది. ‘ఏ ఫిర్యాదు, వ్యాజ్యం లేదా మరే ఇతర న్యాయపరమైన చర్యలు ఉండవు’... వ్యాజ్యం వేయలేనిది రైతులు మాత్రమే కాదు, ఎవరూ వేయలేరు. ప్రజాహిత వ్యాజ్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. లాభాపేక్ష లేని గ్రూపులు, రైతు సంఘాలు, లేదా మంచో చెడో ఉద్దేశాలతో ఉన్న ఏ పౌరుడి జోక్యానికి కూడా ఇందులో వీలులేదు. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 కాలంలో తేలిగ్గా అన్ని ప్రాథమిక హక్కులు రద్దయి పోయాయి. మళ్లీ దాని తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు పౌరుడికి లేకుండా చేసిన విష యంలో ఈ చట్టాలు మరీ అతిశయపు మినహా యింపులు ఇచ్చేశాయి. ప్రతి భారతీయుడి మీద దీని ప్రభావం ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే, ఈ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహ కులు తామే న్యాయస్థానాలుగా మారిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే, న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. రైతులు మున్ముందు వ్యవహారం చేయాల్సిన పెద్ద కార్పొరేట్లకూ, రైతు లకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను ఇది మరింతగా పెంచుతుంది. దీనిమీద ఆందోళన చెందిన ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇలా ప్రశ్నించింది: ‘‘పౌర పరిణామాలకు దారితీసే అవ కాశమున్న వివాదాల్లో పాలన, కార్యనిర్వహణకు సంబంధించిన యంత్రాంగానికి తీర్పునిచ్చే అధికా రాన్ని ఎలా ఇస్తారు?’’ ఈ న్యాయసంబంధ అధికారాలను కార్య నిర్వాహక యంత్రాంగానికి బదిలీ చేయడాన్ని ‘ప్రమాదకరం, మహాపరాధం’ అని ఢిల్లీ బార్ కౌన్సిల్ అభివర్ణించింది. న్యాయవృత్తి మీద చూపే ప్రభావం గురించి, ‘ఇది ప్రత్యేకించి జిల్లా న్యాయ స్థానాల విధులకు తీవ్రమైన హాని కలిగించడంతో పాటు న్యాయవాదుల ఉనికిని కూడా లేకుండా చేస్తుంది’ అని అభిప్రాయపడింది. ఇప్పుడుకూడా ఈ చట్టాలు కేవలం రైతులను ఉద్దేశించినవే నని అనుకుంటున్నారా? కార్యనిర్వాహక యంత్రాంగా నికి న్యాయపరమైన అధికారా లను బదిలీ చేయడం ఒప్పందా లకు సంబంధించిన చట్టంలో ఉంది. దీనిలోని 19వ భాగం ఏమంటుందంటే: సబ్ డివిజినల్ అధికారి, పునర్విచారణ జరిపే అధికారి ఈ చట్టం కింద పూర్తి సాధికారులై నిర్ణయించినదాన్ని నిలిపివేయ గలిగే అధికారం ఏ సివిల్ న్యాయ స్థానానికిగానీ మరే ఇతర అధికార యంత్రాంగానికి గానీ లేదు. ఈ వ్యవసాయ చట్టం లోని 19వ భాగపు సారాంశం... రాజ్యాంగపరమైన విచికిత్సకు హక్కు కల్పించే రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్‌ను కొట్టి పడేస్తోంది. ఆర్టికల్ 32ను రాజ్యాంగపు ప్రాథ మికమైన నిర్మాణంగా పరిగణిస్తారు. కచ్చితంగా ఈ ‘ప్రధాన స్రవంతి’ మీడియా (జనాభాలోని 70 శాతానికి సంబంధించిన అంశా లను విస్మరించేదానికి పెట్టిన చిత్రమైన పేరు)కు ఈ వ్యవసాయ చట్టాలవల్ల భారత ప్రజాస్వామ్యా నికి సంభవించే విపరిణామాల గురించి తెలిసే అవకాశం లేదు. కానీ ప్రజాహితం, ప్రజాస్వామ్యం కన్నా ఎక్కువగా వారిని లాభాపేక్ష నడిపిస్తుంది. ఇందులో ప్రయోజనాల వైరుధ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలుంటే అవి వదిలించు కోండి. ఈ మీడియా సంస్థలు కూడా కార్పొరేషన్లే. దేశంలోని అతిపెద్ద కార్పొరేషన్ అధిపతి దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ యజమాని కూడా. చాలా కాలంగానే ఈ ఫోర్త్ ఎస్టేట్‌కూ, రియల్ ఎస్టేట్‌కూ మధ్య ఉన్న తేడా ఏమిటో చూపలేనట్టు అయి పోయింది. కార్పొరేషన్ ప్రయోజనాలను కాదని పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత లోతుగా ఈ ప్రధాన స్రవంతి మీడియా తన ప్రపం చంలో కూరుకు పోయివుంది. వారి పత్రికల్లో, చానళ్లలో రైతులను రాక్షసు లుగా చిత్రించడం జరుగుతోంది– ధనిక రైతులు, కేవలం పంజాబీయులు, ఖలిస్తానీలు, కపటులు, కాంగ్రెస్ దేశద్రోహులు, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంతో ప్రతిభావంతంగా చూపుతూనేవున్నారు.కాకపోతే ఈ పెద్ద మీడియా సంస్థల సంపా దకీయాలు భిన్నమైన ఎత్తుగడ అనుసరిస్తాయి. మొసలి కన్నీళ్లు కారుస్తాయి. ప్రభుత్వం ఈ విష యంలో మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిందని చెబుతాయి. రైతుల మేలు కోరి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ ఆర్థికవేత్తలు, ప్రధానమంత్రి తెచ్చిన ఈ చట్టాలు చాలా అవ సరం, ఆచరించదగ్గవని చెబుతాయి. కానీ అవన్నీ వేసుకోని ఒక ప్రశ్న: ఇప్పుడే ఎందుకు? కార్మిక చట్టాలు కూడా ఇంత హడా వుడిగా ఎందుకు ముందుకు తెచ్చారు? ఎంతో శ్రద్ధ చూపాల్సిన వేయి అంశాలుండగా ఈ కోవిడ్ మహ మ్మారి సంక్షోభ సమయమే ఈ చట్టాలను తేవడా నికి ఎందుకు అనువైన సమయమని బీజేపీ భావిం చింది? కోవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిని, చలనం కోల్పోయివున్న రైతులు, కార్మికులు ఏ రకంగానూ అర్థవంతమైన నిరసన చేయలేరని వాళ్ల అంచనా. కాబట్టి, ఇదే సరైన సమయం. అంటే సమూల సంస్కరణలను ముందుకు జరిపే ‘రెండో 1991 క్షణాన్ని’ వాళ్లు దర్శించారు. మంచి సంక్షోభాన్ని అస్సలు వృథా చేయొద్దని వాళ్లకు తెలుసు.2018 నవంబరులో లక్ష మందికి పైగా రైతులు ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గర స్వామినాథన్ నివేదిక సిఫారసులను అమలు చేయాలని నిరసనకు దిగారు. అందులోని ముఖ్యాంశాలైన రుణమాఫీ, కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో కేవలం పంజాబ్ రైతులే లేరు, 22 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతులు ఉన్నారు.ఇప్పుడు కూడా ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కుల కోసం నిలబడ్డారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయుడు; పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు పి. సాయినాథ్ -
వాళ్లు తల్లిదండ్రులతో సమానం: సోనుసూద్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. మరి కొంతమంది షాహిన్‌బాగ్ తరహా నిరసనలతో పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటుడు సోన్‌సూద్ రైతులు చేస్తున్న నిరసనలపై స్పందించారు. ఆయన రైతుల గొప్పతనాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని రైతులు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికంటే ముందు కూడా సోన్‌సూద్ ‘భారతదేశం రైతు దేశం’ అని ట్వీట్ చేశారు. చదవండి: రైతు దీక్షలు.. సింగర్ కోటి సాయం ఇక శనివారం కేంద్రంతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. కేంద్రంతో జరిగిన చర్చలో రైతు సంఘాలు వ్యవసాయ చట్టాల రద్దును తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర డిసెంబర్ 9 వరకు సమయాన్ని కోరింది. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియలో తీవ్ర దుమారం రేపాయి. కంగనా వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు త్రీవంగా ఖండించిన విషయం తెలిసిందే. -
రైతు దీక్షలు.. సింగర్ కోటి సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని నడిబొడ్డున రైతులు చేపట్టిన దీక్షలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 8న తలపెట్టన భారత్ బంద్‌కు ఇప్పటికే విపక్ష పార్టీతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు. పదిరోజులుగా ఢిల్లీ నడిరోడ్డుపై చలిలో దీక్షలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. న్యాయబద్ధమైన రైతుల డిమాండ్స్‌ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు అండగా బియ్యం, దుస్తులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించిన పంజాబ్ నటుడు, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్ మరోసారి వారికి అండగా నిలిచారు. చలిలో గత పదిరోజులుగా నిరసన తెలుపుతున్న రైతులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు, నాయకులు ముందుకు రావాలని కోరారు. (రైతుల దీక్షకు సీఎం కేసీఆర్ మద్దతు) కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దిల్జిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము యూపీ వాలా కాదని, పంజాబ్ రైతులమని గట్టి కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దమరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగింది. మరోవైపు రైతులతో కేంద్రం జరిపిన ఐదో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో దీక్షలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త బంద్‌కు విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు) -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
ఎన్డీయే నుంచి వైదొలుగుతాం..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గడిచిన ఐదు రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేపడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్స్‌కు కేంద్రం దిగొచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. (చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం) రైతుల దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు నూతన వ్యవసాయ బిల్లులు ఎన్డీయేలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పంజాబ్ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రాత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలుచున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం బీజేపీకి హెచ్చరికలు జారీచేసింది. (బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!) రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ ప్రకటించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ మేరకు కేంద్రహోంమంత్రి అమిత్ షాకు సోమవారం బేనివాల్ లేఖ రాశారు. రైతుల డిమాండ్స్‌కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారు. కాగా రాజస్తాన్‌లో బలమైన సామాజిక వర్గం మద్దతుదారులను కలిగిఉన్న ఆర్ఎల్పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. కాగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.