రైతులపై కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదమే’ | Narasimha Reddy Article On Case Filed On Farmers In Gujarat | Sakshi
Sakshi News home page

రైతులపై కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదమే’

Published Wed, May 22 2019 12:25 AM | Last Updated on Wed, May 22 2019 12:25 AM

Narasimha Reddy Article On Case Filed On Farmers In Gujarat - Sakshi

జీవవైవిధ్యంతోనే మనకు ఆహార భద్రత. మంచి ఆహారం, జీవ వైవిధ్యం తోనే సాధ్యం. జీవ వైవిధ్యం కొనసాగడానికి, స్వచ్ఛంగా ఉండడానికి, ప్రాకృతిక సేవలు అందించటంలో విత్తనాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతి వనరుల వ్యాపారీకరణ పట్ల ఆందోళన చెందుతున్న వారు, ఇటీవల విత్తనాలు, జన్యుసంపదను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలలో మేధోహక్కుల పేరిట కొన్ని రకాల విత్తనాల మీద కూడా తమ వ్యాపార హక్కులను విస్తృతపరుచుకుని, తమ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

భారతదేశం విత్తన హక్కులను కంపెనీలకు ధారాదత్తం ఎప్పుడూ చెయ్యలేదు. ఇక్కడి స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి ఆ పరిస్థితి రాకుండా అనేక సమయాలలో అడ్డుకున్నారు. అయినా, అనేక రకాలుగా విత్తన కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించు కుంటున్నాయి. బీటీ ప్రత్తి జన్యుమార్పిడి విత్తనంతో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మోన్‌ శాంటో కంపెనీ రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా, స్థానిక విత్తన సంస్థల నిరసనల మధ్య, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మాయపరిచి బీటీ ప్రత్తి విత్తన వ్యాపారాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఈ లాభార్జనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రైతు సంఘాలు కొంత అడ్డుకట్ట వేసినా, బీటీ ప్రత్తి విత్తనం వ్యాప్తిని అడ్డుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైంది.

తాజాగా, గుజరాత్‌లో తమ కంపెనికి చెందిన ఆలుగడ్డ విత్తనం దొంగిలించి పంట వేసుకుంటున్నారని, నలుగురు చిన్న రైతుల మీద పెప్సీకో కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఒక్కొక్కరు రూ. కోటి నష్ట పరిహారం కట్టాలని కోర్టు ద్వారా డిమాండ్‌ పెట్టింది.  వాళ్ళు ఎంత పండించినా కోట్ల విలువ చేసే ఆస్కారమే లేదు. కానీ, కోట్ల రూపాయల నష్ట పరిహారం కట్టాలని ఒక బహుళదేశ సంస్థ అయిన పెప్సీ కంపెనీ అడిగిందంటే, రైతులను భయబ్రాంతులను చేయడానికే. పెప్సీ కంపెనీ వాడిన చట్టం పేరు ‘మొక్కల రకాల సంరక్షణ మరియు రైతుల హక్కులు 2001’. కాగా, అదే చట్టంలో స్పష్టంగా ఉంది–రైతులు ఏ విత్తనమైనా తమ ఇష్టానుసారంగా విత్తవచ్చు, మళ్ళీ విత్తవచ్చు, ఇతర రైతులతో పంచుకోవచ్చు, దాచుకోవచ్చు, విత్తన పంటగా కూడా వేయవచ్చు. రైతులకు ఇచ్చిన ఈ హక్కుని కాలరాస్తూ, అదే చట్టం క్రింద తన హక్కులకు భంగం కలిగించారని కేసు పెట్టింది. కంపెనీ సరే, ప్రాథమిక వాదనలు విన్న కోర్టుకు ఈ హక్కు గురించి ఎందుకు తెలియలేదో స్పష్టత లేదు. గుజరాత్‌ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం మొదట చేయలేదు.

దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను మేము మొదలు పెట్టగా, గుజరాత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పెప్సీ కంపెనీతో చర్చలు జరిపింది. చివరకు, పెప్సీ కంపెనీ ఈ కేసులను ఉపసంహరించుకుంది. ఆ నలుగురితో పాటు ఇదివరకు వేసిన ఇంకొక ఐదుగురి పైన కూడా వేసిన కేసులు ఎత్తివేశారు. ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది. పెప్సీ కంపెనీ కేసు పెట్టటానికి గుజరాత్‌ రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకుంది? అందునా, వ్యవసాయం గురించి అవగాహన లేని ఒక ‘వాణిజ్య కోర్టులో’ కేసు దాఖలు చేసింది. అత్యధికంగా ఆలుగడ్డ వ్యవసాయం చేసే 10 రాష్ట్రాలలో గుజరాత్‌ నాలుగో స్థానంలో ఉంది. మరి, ఇతర రాష్ట్రాలలో ఈ రకం రైతులు వాడడం లేదా? అసలు రైతులకు విత్తన రకాల మధ్య  వ్యత్యాసం సాధారణంగా తెలుస్తుందా? కేవలం, ల్యాబ్‌ పరీక్షల ద్వారానే తెలిసే పరిస్థితిలో భారత రైతుల మీద ఇట్లాంటి కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదం’ అనిపించుకుంటుంది.

ఆహార శుద్ధి పరిశ్రమలను విపరీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఆయా ఆహార శుద్ధి పరిశ్రమలు తమకు అవసరమైన వ్యవసాయ పంటలు, విత్తనాల మీద మేథోహక్కులు పొంది, రైతుల మీద ఈ తరహ ‘దాడి’ చేస్తే, అసలే సంక్షోభంలో ఉన్న రైతు, వ్యవసాయం మీద పడే దుష్ప్రభావం మన ఆహార వ్యవస్థ మీద పడదా? ఆహార పంటలు వేస్తే గిట్టుబాటు ధర రావడం లేదని, కోతులు ఇంకా ఇతర అనేక ‘జంతువులూ, పురుగుల’ నుంచి కాపాడుకోలేక, రైతు వాణిజ్య పంటల వైపు పోతుంటే, పెప్సీ లాంటి కంపెనీలు లాభాల మదంతో రైతుల మీద కేసులు వేస్తే, ఆహార ఉత్పత్తి కుంటుపడి, దిగుమతుల మీద ఆధారపడే దుస్థితి తప్పదు.

అందుకే, పెప్సీ కంపెనీ మీద దేశీయ ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టినందుకు ఆర్థిక ఆంక్షలు విధించాలి. ఇంకొక కంపెనీ ఇట్లాంటి దుశ్చర్య చేపట్టకుండా తీవ్ర చర్యలు చేపట్టాలి. తక్షణమే, జాతీయ విత్తనం చట్టం తీసుకు రావాలి. దీనితో రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, పర్యావరణ సంరక్షణకు, జన్యుసంపద పరిరక్షణకు, దేశీయ విత్తనాల ఉపయోగానికి మార్పులు తీసుకురావాలి.
(నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం)


డా.డి. నరసింహరెడ్డి
వ్యాసకర్త పర్యావరణ విధాన విశ్లేషకులు
nreddy.donthi16@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement