అంతుపట్టని రహస్యం: కేసీఆర్‌‌ వ్యూహమేంటి? | TRS Political Strategy Against BJP In Central Level | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని రహస్యం.. టీఆర్‌ఎస్‌ వ్యూహమేంటి?

Published Mon, Sep 21 2020 8:43 AM | Last Updated on Mon, Sep 21 2020 12:30 PM

TRS Political Strategy Against BJP In Central Level - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లులు, రాజ్యసభలో మాత్రం పెను దుమారాన్నే సృష్టించాయి. బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్‌ వైదొలగడంతో రాజుకున్న రగడ.. రాజ్యసభలో బిల్లు ప్రతులను చింపివేసే వరకు వెళ్లింది. విపక్షాల నిరసనలు, ఆందోళనల నడమనే  పెద్దల సభలోనూ బిల్లులు ఆమోదం పొందాయని డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించడంతో అధికార పక్షం హర్షం వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించుకున్న వివాదాస్పద బిల్లులపై వివాదం ఇప్పడే ముగిసిపోలేదని దీనిపై పెద్ద ఎత్తున పోరును ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్‌ నేతృత్వంలోనే విపక్ష పార్టీలు ప్రకటించాయి. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన ఘటనలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షినాదినా కనిపించాయి. అయితే ఈ బిల్లుకు టీఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చించాల్సిన అంశం. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే)

జాతీయ స్థాయిలో ఉద్యమం..
అయితే గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అనుకూలంగా మెలిగిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బిల్లులు రైతులను కార్పొరేట్‌ వర్గాలు దోచుకునే విధంగా ఉన్నాయని, అది తేనెపూసిన కత్తి మాదిరిగా ఉందని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌ తాజాగా తిరుగుబాటు చేయడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ సైతం సాగుతోంది. వ్యవసాయ బిల్లులతో పాటు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్‌ బిల్లును కూడా కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రల హక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల అందరితో (బీజేపీయేతర) చర్చించాల్సిన అవసరం ఉందని ఇదివరకే స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్‌ బిల్లులపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే పెను ఉద్యమానికి సైతం తెరలేపుతామని హెచ్చరించారు. ఈ రెండు పరిణాలమాలతో పాటు బీజేపీ సర్కార్‌పై కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు జాతీయ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ వ్యూహమేంటదానిపై సర్వత్రా చర్చసాగుతోంది. (కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి)

కేసీఆర్‌ రచించిన వ్యూహం..
రానున్న రెండు నెలల్లో తెలంగాణలో పలు ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. దానితో పాటు నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఓ మండలి స్థానానికి పోలింగ్‌ జరుగనుంది. ఈ స్థానానికి సీఎం కేసీఆర్‌ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రంగా ఉన్న బీజేపీ నుంచి అసలైన పోటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాల అభిప్రాయం. దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేకంగా నడుచుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తే రైతు వ్యతిరేక సందేశం వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్‌ ఊహించినట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల ముందు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ రచించిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్లమెంట్‌ బిల్లు ఆమోదం తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు చూస్తే ఇది నిజమనే భావన కలుగక మానదు. (ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!)

హరీష్‌, తలసాని ఆగ్రహం..
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్‌ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నది. ఢిల్లీ దిమ్మతిరిగేలా తెలంగాణ ప్రజల మనోగతాన్ని దుబ్బాక ఓటర్లు దేశానికి తెలియజేయాలి’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్‌ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు.

దేశ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారు! 
దేశ వ్యవసాయ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నిప్పులు చెరిగారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మీరు వ్యవసాయ దేశాన్ని కార్పొరేట్‌ దేశంగా మార్చారు. మీరు తెచ్చింది కేవలం చారిత్రక బిల్లు కాదు.. విప్లవాత్మక బిల్లు..’అంటూ ఎద్దేవా చేశారు. రైతులు కార్పొరేట్ల వద్దకు వెళ్లి ధరను నిర్ధారించేంత సమఉజ్జీలు కాదని, ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. బంగారు బాతు లాంటి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చంపాలనుకుంటోందని మండిపడ్డారు. కరోనా వల్ల దేశ జీడీపీ 23 శాతం మేర క్షీణించినప్పటికీ వ్యవసాయ రంగ వాటా మాత్రం తగ్గలేదని వివరించారు. రాజ్యాంగానికి, ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ బిల్లుల రూపకల్పన జరిగిందన్నారు. ఇది రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడిగా అభివర్ణించారు. వ్యవసాయం, సంబంధిత అంశా లు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని సూచించారు. దీనిపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడాన్ని తప్పుపట్టారు. రాజకీయ పార్టీల, ప్రజాభిప్రాయం సేకరించలేదన్నారు. రైతులను ఈ బిల్లులు భూమి లేని వ్యవసాయ కూలీలుగా మార్చుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేశవరావు స్పష్టం చేశారు.

డిప్యూటీ చైర్మన్‌కు ఆ అధికారం ఉండదు
సభ అనంతరం విజయ్‌చౌక్‌ వద్ద ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్‌రెడ్డి, బడుగు లింగయ్య, సంతోష్, పి.రాములు, రంజిత్‌రెడ్డి, దయాకర్, బీబీ పాటిల్‌తో కలసి కేకే విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసేందుకు సభానియమాలను డిప్యూటీ చైర్మన్‌ తుంగలో తొక్కారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ 12 పార్టీలకు చెందిన 25 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును రాజ్యసభ ఇన్‌చార్జి అధికారికి ఇచ్చినట్లు చెప్పారు. తీర్మానం పరిష్కారమయ్యేవరకు డిప్యూటీ చైర్మన్‌కు సభా కార్యకలాపాలు నిర్వహించే అధికారం ఉండదని కేశవరావు తెలిపారు. ‘వ్యవసాయంపై ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులలో రెండింటిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. వాటిపై చర్చ సజావుగానే జరిగినా ఓటింగ్‌కు వచ్చేసరికి డిప్యూటీ చైర్మన్‌ పక్షపాతపూరితంగా వ్యవహరించారు. బిల్లులు తిరస్కరించాలని రెండు చట్టబద్ధ తీర్మానాలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు.

సవరణలు సూచించినా ఖాతరు చేయలేదు. ఎవరి మాటా వినిపించుకోకుండా బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు. నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడవడం, నియమాలను చెత్తకుండీలో పడేయడం ఎప్పుడూ చూడలేదు’అని కేశవరావు అన్నారు. మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లెక్కారు. కోట్ల మంది దేశప్రజలకు అన్నం పెట్‌టేౖ రెతులను మనం రక్షించుకోవాలి. లోక్‌సభలో సంఖ్యాబలంతో బిల్లులు ఆమోదించారు. రాజ్యసభలో ఓటింగ్‌ పెడితే ఓడిపోతామనే భయంతో మూజువాణి ఓటుతో ఆమోదింపచేసుకొని ప్రజాçస్వామ్యం గొంతునొక్కారు. బిల్లులు నిజంగా అంత బాగుంటే అందరినీ సమన్వయపరచడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఎవరితోనూ చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఎందుకు ఆమోదింపచేసుకున్నారు? ఇది నిజంగా రైతుల పాలిట బ్లాక్‌ డే’అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement