వనపర్తి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి నెట్‌వర్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్నారని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ ప్రజలు కరెంటు, నీళ్ల కష్టాలతో బాధపడుతున్నారని చెప్పడం ద్వారా తెలివితక్కువ ప్రధానిగా నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని హోదాలో ఉండి అబద్ధాలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేసీఆర్.. ఆమనగల్లు (కల్వకుర్తి నియోజకవర్గం), మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, హాలియా, చండూరు(మునుగోడు నియోజకవర్గం), ఆలేరుల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. నిజామాబాద్ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు.
‘దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇయాళ నిజామాబాద్ వచ్చిండంట. ఆయనకు కళ్లున్నాయో లేదో.. ఎవడు ఏం రాసిచ్చిండో, ఏం చదవిండో నాకు అర్థం కాలే. ఆయన ఇంత తెలివితక్కువ ప్రధానమంత్రి అని నేననుకోలేదు. ఆయన ఏం మాట్లాడతాడండీ నిజామాబాద్‌లో... కరెంటు, మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట. నరేంద్ర మోదీ.. నేను చాలెంజ్ చేస్తున్నా. నువ్వు రమ్మంటే హెలికాప్టర్ ఎక్కి నిజామాబాద్ వస్తా. నువ్వు కూడా రా. ఇద్దరం కలిసే అడుగుదాం సభ పెట్టి ప్రజలను. నిజామాబాద్‌లో ఇయాళ ప్రజలు కరెంటుకు ఇబ్బంది పడుతున్నరా’’అని మండిపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ వాడకంలో ముందంజలో ఉన్నట్లు తేలిందని చెప్పారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. బీజేపీ పాలిస్తున్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు పూజలు, యాగాలపై ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలకూ టీఆర్‌ఎస్ అధినేత ఘాటుగా బదులిచ్చారు. ‘అరే.. నేను పూజ చేసుకుంటే నీ ముళ్లేం పాయరా బై.. నాకు అర్థం కాదు.. నేను ఏడాదికి పది మార్లు యాగం చేసుకుంటా.. నీ ముళ్లేమయినా పాయనా... నాకు భక్తి ఉంది, నేను దేవుడిని నమ్ము తా.. ఇష్టం ఉన్నవాడు వస్తే ఇంత తీర్థం పోసి... బుక్కెడు బువ్వ పెడుతున్నా... నీకు భక్తి ఉంటే నీవూ రా.. తీర్థం పుచ్చుకుని పో’ అని వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం మతగజ్జిది...
బీజేపీ ప్రభుత్వానికి మతగజ్జి పట్టుకుందని కేసీఆర్ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని కోరితే.. తిరస్కరించారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఎస్టీలు, ముస్లిం సోదరుల జనాభా పెరిగింది. రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు పెరగాలి. వాటి పెంపు కోసం అసెంబ్లీలో, కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కానీ అక్కడున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మతగజ్జిది. ఆ ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయి. ప్రజలను ప్రజల్లాగా కూడా చూడలేని ప్రభుత్వం. రిజర్వేషన్లు పెంచబోమని చెబుతున్నారు. ఆ అమిత్‌షా అనేవాడు నిన్నగాక మొన్న వచ్చి డంబాచారమంతా మాట్లాడి పోయిండు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించినట్లుగానే ఈ రిజర్వేషన్లు పెరిగేంత వరకు మొండి పట్టుతో కొట్లాడుతా. నేను ఎవరికీ భయపడను.. చంద్రబాబు భయపడతడు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం సీపీఐ, పొరుగు రాష్ట్రం సీఎం, టీడీపీ అంతా కలిసి నన్ను తిడుతుండ్రు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కోడానికి ప్రధాని మోదీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు.. సీపీఐ, సీపీఎం అంతా మోపయ్యారు.. గింత మంది ఒక్కటై ఈ బక్కోన్ని కొట్టడానికి నా వెంట పడుతున్నారు.. నన్ను మీరే కాపాడాలి సుమా’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వాళ్లు బీజేపీతో కుమ్మక్కయ్యామని.. బీజేపీ వాళ్లు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యామని టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని.. వీళ్ల మాటలు చూస్తుంటే తనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. 2014లోనూ తాము ఎవరితో పొత్తు పెట్టుకోలేదని, ఇప్పుడు కూడా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు.
రైతన్నకు అండగా నిలిచాం
‘గ్రామ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే బంగారు తెలంగా ణ.. రైతుల అప్పులు తీరాలి.. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతుబంధు ఇస్తం.. నేటికీ వ్యవసాయం చేస్తూ కనీసం పెట్టుబడులు రాకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు కొండంత అండ గా ఉండేందుకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గాలి గత్తర పార్టీల మాట విని గత్తరగత్తరగా ఓట్లు వేస్తే పాలన కూడా అలాగే గాలి గత్తరగా ఉంటుంది. 58 సంవత్సరాలు పరిపాలించి తామే ఘనాపాఠీలమని చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయాయి? ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను పెట్టిన అని చెబుతున్న చంద్రబాబు చార్మినార్ కూడా కట్టించాడా? ఈ విషయం తెలిస్తే కులీకుతుబ్‌షా ఆత్మహత్య చేసుకుంటాడు’ అని ఎద్దేవా చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన సభకు హాజరైన ప్రజలు
పనిచేసే వారికే పట్టం కట్టండి..
‘ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ ఎంతో గొప్పది. ఆ ఓటు వేసే సమయంలో ఆగం ఆగం కాకుండా ఒకటికి పదిమార్లు ఆలోచించి అభివృద్ధి చేసేవారికి మాత్రమే ఓటేయాలి. మా బాస్‌లు మీరే. మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఏమి కోరుకుంటే దానికి అనుగుణంగా పాలన సాగుతోంది. అన్ని పార్టీలు చెప్పేది వినండి. నేను చెప్పేది కూడా వినండి. గ్రామాల్లో చర్చ జరపండి. నిజంగా పనిచేసే టీఆర్‌ఎస్‌ని గెలిపించండి’ అని కోరారు.
జైపాల్‌రెడ్డికి తెలివి ఉందో.. లేదో..!
‘జైపాల్‌రెడ్డి అని చాలా పెద్ద మనిషి. కేంద్ర మంత్రి కూడా అయిండు. ఆయనకు తెలివి ఉందో లేదో! ముసలితనం ఎక్కువై ఏమన్న పనిచేస్తుందో లేదో. ఒక్క ఊరికి కూడా మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటుండు. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం చేసిండు. కల్వకుర్తి గిట్లెందుకుంది? నాగార్జునసాగర్‌ని నాశనం చేసింది కాంగ్రెస్ వాళ్లే. తెలంగాణను ఆంధ్రలో కలిపింది వాళ్లే. అడిగితే కాల్చి చంపింది వాళ్లే. చివరకు తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నా.. పాలమూరు జిల్లా నాయకులు నోరు తెరువలేదు. గింత రోషం, పౌరుషం లేనోళ్లు మనకు అవసరమా?’అని కేసీఆర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment