
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి.
సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు ఆమోదం
లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా మాట్లాడారు. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. విద్యా, ఆర్థిక శాఖలకు చెందిన ప్రశ్నలపై చర్చ మొదలైంది. ‘మీ స్థానాల్లోకి తిరిగి వెళ్లండి, సభకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ పునఃప్రారంభమైన తర్వాత సినిమాటోగ్రఫీ (సవరణ) బల్లు–2023ను ఆమోదించారు. ఈ బిల్లు రాజ్యసభలో గతంలోనే ఆమోదం పొందింది. పైరసీని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభలో వాయిదాల పర్వం
మణిపూర్ అంశంపై ‘267 నిబంధన’ కింద వెంటనే చర్చ చేపట్టాలని ఎగువసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోషి చెప్పారు. విపక్ష ఎంపీలు ప్రధాని సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, అనంతరం 3.30 గంటల వరకూ వాయిదా వేశారు. విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.
మూడింట రెండొంతుల మెజార్టీ: పీయూష్ గోయల్
కేంద్రానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చెప్పారు. సంఖ్యలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే బిల్లులను ఆమోదించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని వివరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేలి్చచెప్పారు. అలాగే మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగే యూపీఏ ప్రభుత్వ హయాంనాటి నిర్వాకాలు బయటపడతాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment