Agitation continue
-
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
Parliament sessions 2023: పార్లమెంట్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో తక్షణమే చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు ఆమోదం లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా మాట్లాడారు. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. విద్యా, ఆర్థిక శాఖలకు చెందిన ప్రశ్నలపై చర్చ మొదలైంది. ‘మీ స్థానాల్లోకి తిరిగి వెళ్లండి, సభకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ పునఃప్రారంభమైన తర్వాత సినిమాటోగ్రఫీ (సవరణ) బల్లు–2023ను ఆమోదించారు. ఈ బిల్లు రాజ్యసభలో గతంలోనే ఆమోదం పొందింది. పైరసీని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో వాయిదాల పర్వం మణిపూర్ అంశంపై ‘267 నిబంధన’ కింద వెంటనే చర్చ చేపట్టాలని ఎగువసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోషి చెప్పారు. విపక్ష ఎంపీలు ప్రధాని సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, అనంతరం 3.30 గంటల వరకూ వాయిదా వేశారు. విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ: పీయూష్ గోయల్ కేంద్రానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చెప్పారు. సంఖ్యలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే బిల్లులను ఆమోదించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని వివరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేలి్చచెప్పారు. అలాగే మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగే యూపీఏ ప్రభుత్వ హయాంనాటి నిర్వాకాలు బయటపడతాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. -
అవిశ్రాంత పోరులో అన్నదాత జయీభవ
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అన్నదాత చేపట్టిన ఆందోళనలకు దేశమంతా మద్దతు తెలుపుతోంది. అవిశ్రాంత పోరాటం చేస్తున్న రైతుల ఉద్యమం మంగళవారానికి (జనవరి 12) 48వ రోజుకు చేరింది. దాదాపు నెలన్నర రోజులకు రైతులకు కొంత ఊరట లభించింది. సుప్రీంకోర్టు తాత్కాలికంగా నూతన వ్యవసాయ చట్టాల అమలుపై మంగళవారం స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టే ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదని, సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీ వలన ఎలాంటి ఫలితం ఉండదని పెదవి విరుస్తున్నారు. తాము చట్టాల రద్దు ఒకటే డిమాండ్ చేస్తున్నట్లు.. దానికి కమిటీలు.. చర్చలు అంటూ ఏవీ వద్దని తేల్చి చెబుతున్నారు. (కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే) ఈ రైతుల పోరాటం దేశంతో ప్రపంచాన్ని కదిలించింది. పలు దేశాలు, సంస్థలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. అయితే ఈ ఉద్యమం రైతుల బలిదానాలు కూడా చోటుచేసుకుంటుండడం బాధించే విషయం. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో బాబా నసీబ్ సింగ్ మన్ అనే రైతు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 48 రోజుల ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 57 మంది రైతులు చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు అనారోగ్యంతో మృతిచెందారు. ఢిల్లీ సరిహద్దులో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులు అత్యల్ప ఉష్ణోగ్రత్తలు ఉండడంతో చలికి తట్టుకోలేక ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 సార్లు చర్చలు చేసినా రైతులు ఒక్క మెట్టు కూడా దిగకుండా నిరంతర పోరు సాగిస్తున్నారు. తమకు కావాల్సింది నూతన వ్యవసాయ చట్టాల రద్దు అని తమ డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి.. పోలీసుల వేధింపులతో పాటు వాతావరణాన్ని తట్టుకుని అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు సులభతరమైన వ్యవసాయం ఇద్దామనే ఉద్దేశంతో రైతులు ఆందోళన సాగిస్తున్నారు. వీరి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అవహేళన చేసినా పట్టించుకోలేదు. పిజ్జా-బర్గర్లు తిని పోరాటం.. ఆందోళనకారులంతా ఉగ్రవాదులు.. తీవ్రవాదులని ఆరోపించినా వెరవకుండా పోరాట పంథా వీడడం లేదు. అలాంటి రైతుల పోరాటానికి సుప్రీంకోర్టు కరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూనే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ధర్మాసనం నిర్ణయంతో రైతుల పోరాటానికి తాత్కాలిక విజయం దక్కినట్టుగా భావించవచ్చు. సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీకి కూడా తాము ఒకటే మాట చెబుతామని.. కొత్త సాగు చట్టాల రద్దే తమ డిమాండ్ అని స్పష్టం చేస్తామని రైతులు చెబుతున్నారు. మరి సుప్రీం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో.. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో.. రైతులు ఎప్పుడు ఆందోళన బాట వీడతారో వేచి చూడాలి. కానీ రైతుల సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోయేలా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరో స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణిస్తున్నారు. -
చెట్లు నరికి రోడ్డుపై వేసిన ఆదివాసీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి / నిజామాబాద్ : ఆదివాసీల ఆందోళన ఉధృతమవుతోంది. ఇప్పటికే కుమ్రంభీం విగ్రహానికి చెప్పుల దండ వేసిన సంఘటనపై ఉట్నూరు ఏజెన్సీలో అట్టుడికి పోతుండగా తాజాగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ధర్మకర్తల కమిటీ నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పస్రా-తాడ్వాయి మధ్య రహదారిరని స్తంభింపజేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసి రహదారిపై అడ్డంగా వేశారు. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్ళి రహదారిపై అడ్డంగా వేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఆదివాసీ-లంబాడీల ఘర్షణల నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏజెన్సీలో శాంతిభద్రతలను ఐజీలు అనిల్ కుమార్, నాగిరెడ్డి, చౌహాన్, డీఐజీ రవివర్మ పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ సమీప జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిన పోలీస్ అధికారులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల క్రితం మేడారంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశం రసాభాసాగా జరిగిన విషయం విదితమే. సమావేశానికి వచ్చిన మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక 15 వాహనాలను ఆదివాసీలు ధ్వంసం చేశారు. రోడ్డెక్కిన లంబాడీలు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండా వాసులు రోడ్డెక్కారు. తండాలోని లంబాడీలు అందరూ శనివారం ఉదయాన్నే జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులను ప్రభుత్వం వెంటనే ఆపివేయించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. -
'ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకూ ఆందోళన'
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల స్పష్టం చేశారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నివాసంలో వారు సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తరువాత ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేపు కూడా పార్లమెంట్లో తమ నిరసన కొనసాగిస్తామని చెప్పారు. జేపీసీనా, ఆల్‌పార్టీ కమిటీనా అనేది తమకు తెలియదన్నారు. తెలంగాణపై స్పీకర్ ఫార్మట్‌లోనే తాము రాజీనామాలు ఇచ్చినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అన్ని పార్టీలు సస్పెన్షన్‌ను వ్యతిరేకించాయన్నారు. మెజార్టీ పార్టీలు తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు దీనికి అర్థం అన్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. జేపీసీ లేక అఖిలపక్షం లేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తే అంగీకరిస్తామని చెప్పారు. విభజన ప్రస్తావన లేకుండా కమిటీ ఏర్పాటు చేస్తే ఒప్పుకుంటామన్నారు. విభజన అనే మాట ఉంచితే ఏ కమిటీలైనా ఒప్పుకోం అని చెప్పారు. అన్ని అంశాలపై పరిష్కారాలు చూపిన తర్వాతే విభజన అంశాన్ని లేవనెత్తాలని వెంకట్రామిరెడ్డి అన్నారు.