సాక్షి, జయశంకర్ భూపాలపల్లి / నిజామాబాద్ : ఆదివాసీల ఆందోళన ఉధృతమవుతోంది. ఇప్పటికే కుమ్రంభీం విగ్రహానికి చెప్పుల దండ వేసిన సంఘటనపై ఉట్నూరు ఏజెన్సీలో అట్టుడికి పోతుండగా తాజాగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ధర్మకర్తల కమిటీ నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పస్రా-తాడ్వాయి మధ్య రహదారిరని స్తంభింపజేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసి రహదారిపై అడ‍్డంగా వేశారు. ఫలితంగా ఈ మార‍్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర‍్పడింది. సమాచారం అందుకున‍్న పోలీసులు వెళ్ళి రహదారిపై అడ‍్డంగా వేసిన చెట‍్ల కొమ‍్మలను తొలగించారు. ఆదివాసీ-లంబాడీల ఘర్షణల నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏజెన్సీలో శాంతిభద్రతలను ఐజీలు అనిల్ కుమార్, నాగిరెడ్డి, చౌహాన్, డీఐజీ రవివర్మ పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ సమీప జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిన పోలీస్ అధికారులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల క్రితం మేడారంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశం రసాభాసాగా జరిగిన విషయం విదితమే. సమావేశానికి వచ్చిన మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక 15 వాహనాలను ఆదివాసీలు ధ్వంసం చేశారు.
రోడ్డెక్కిన లంబాడీలు
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం రూప్లా నాయక్ తండా వాసులు రోడ్డెక్కారు. తండాలోని లంబాడీలు అందరూ శనివారం ఉదయాన్నే జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులను ప్రభుత్వం వెంటనే ఆపివేయించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు నిరసన తెలిపి వెళ‍్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment