Adivasi
-
వేపలగడ్డలో ఆదివాసీ జాతర
ఆదివాసీ తిరుగుబాటుకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచిన సమ్మక్క-సారలమ్మలకు మేడారం కేంద్రంగా అతి పెద్ద జాతర జరుగు తుంది. వీరితో సంబంధం కలిగినవాడే పగిడిద్దరాజు. ఆదివాసీ స్వయంపాలన కోసం కాకతీయులపై కత్తులు దూసి కదన రంగంలో అమరులైన సమ్మక్క భర్తే ఈయన. ఈయనకు భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ‘వేపలగడ్డ గ్రామం’లో అత్యంత వైభంగా ‘ఆరెం’ వంశస్థులు జాతర జరుపు తారు. ఈ ఏడాది మార్చి 5నుంచి 7 వరకు ఈ జాతర జరుగుతుంది.కరువుకాలంలో కాకతీయు లకు కప్పం కట్టడానికి నిరాకరించిన కోయ రాజు పగిడిద్దరాజు పైకి చక్రవర్తి ప్రతాప రుద్రుడు దండెత్తి వచ్చాడనీ, ఆ యుద్ధంలో కోయరాజుతో పాటు ఆయన కూతుర్లు సారలమ్మ, నాగులమ్మ; కొడుకు జంపన్న, అల్లుడు గోవింద రాజులు అసువులు బాశారనీ, భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ చిలకలగుట్ట ప్రాంతంలో అదృశ్యం అయిందనీ ఆదివాసుల విశ్వాసం. సమ్మక్క కుంకుమ భరణి రూపంలో ఇప్పటికీ చిలకల గుట్టపై ఉందని కోయలు నమ్ముతారు. అందుకే మేడారంలో జరిగే సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం చేరుకుంటేనే జాతర ప్రారంభం అవుతుంది.పగిడిద్దరాజును ఒక పోరాట యోధునిగా కీర్తిస్తూ స్మరిస్తూనే దైవత్వం నుండే వీరత్వం పుట్టిందని... ఈయనను ఒక దైవంగా నేడు ఆదివాసీలు కొలుస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు తరలివస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రీడలు నిర్వహిస్తారు. ఆదివాసీ స్వయం పాలన కోసం పోరాడి అమరుడైన పగిడిద్దరాజు స్ఫూర్తితో నేడు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేయాలి. మూలవాసీ అస్తిత్వాన్ని చాటు కోవాలి. ‘కంకవనం’ చేజారకుండా పొదివి పట్టుకోవాలి. ఆదివాసీ పోరాటాలకు, ఆరాటాలకు ప్రజాతంత్ర శక్తులన్నీ అండగా నిలవాలి.– వూకె రామకృష్ణ దొర ‘ (నేటి నుంచి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా, వేపలగడ్డలో 7వ తేదీ వరకు పగిడిద్ద రాజు జాతర) -
ఆదివాసీ చట్టం రద్దుకు కుట్రలు!
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కు లను హరించేందుకు సన్నద్ధ మైంది. ‘ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందద’ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే! అడవి, అటవీ భూములు, అందులోని వనరు లపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామ కంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన అధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే! 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్ళ గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోదీ ప్రభుత్వం ‘అటవీ హక్కుల సవరణ చట్టం’ ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది. షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం–1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూము లను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి, భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం ‘1/70’గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించ కుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు.1/70 సెక్షన్ –3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతా ల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీమ్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. ‘పీసా’ చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్ట సవరణ ప్రయత్నాలుగిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను, బహుళజాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్ట పెట్టేందుకు 1996–2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింత పల్లి బాక్సైట్ తవ్వకాల కోసం ‘రస్ ఆల్ ఖైమా’ బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధ మయింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అను గుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం ‘1/70 చట్టాన్ని రద్దు చేయబోమ’ని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలనీ, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయాలనీ అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి.బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఆదివాసీల కల్పవృక్షం.. ఇప్ప చెట్టు
కొత్తగూడ: ఇప్ప చెట్టు ఆదివాసీల కల్పవృక్షంగా పేరుగాంచింది. వారికి పలు రకాల ఆదాయాన్ని సమకూరుస్తూ ఆర్థిక భరోసానిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత అడవుల్లో విరివిగా కనిపించే ఇప్పచెట్లకు ఆదివాసీ తెగలో కొందరు పూజలు చేస్తారు. ఇప్ప నుంచి వచ్చే పూలు, గింజలతో ఆదివాసీ తెగలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్ప పువ్వులో ఎన్నో బలవర్థకమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా కుడుములు చేసుకుని తినడం ఆదివాసీల ఆహారపు అలవాటు. గతంలో ఆదివాసీలు ఇప్పపువ్వుతో సారాయి తయారు చేసుకుని తాగేవారు. ప్రస్తుతం జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ద్వారా పలు ఆయుర్వేద కంపెనీలు ఇప్ప పువ్వును సేకరించి శవన్ప్రా , బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. దైవారాధనకు ఇప్ప నూనె ఇప్ప గింజలతో నూనె తీస్తారు. ప్రాచీన కాలంలో ఆదివాసీ కుటుంబాలు వంటల తయారీలో ఈ నూనె వాడుకునేవారు. ప్రస్తుతం దైవారాధనలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆదివాసీలు గింజలను పట్టించి కిలో ఇప్ప నూనెకు బదులు కిలో వంట నూనె (సన్‌ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్‌రిచ్ తదితర) తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన వారు జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీ ఇప్పపువ్వును కిలో రూ.30, ఇప్ప పలుకు రూ.29తో కొనుగోలు చేస్తోంది. దీంతో స్థానికులు ఇప్ప పువ్వు, గింజల సేకరణకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆదివాసీలకు ఇప్పచెట్టుతో అవినాభావ సంబంధం ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఇప్ప చెట్టుతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏటా జూన్ ప్రారంభంలో ఇప్ప చెట్టుకు పూజలు చేస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఇప్ప ఉత్పత్తులను తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప పువ్వుకు రూ.100, పలుకులకు రూ.50 చెల్లించాలి. – వాసం వీరస్వామి, ఉపాధ్యాయుడువిక్రయానికి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇప్ప పువ్వు సేకరించి శుద్ధి చేసి విక్రయించుకునేందుకు వెళ్తే కొనుగోలు చేసే వారు ఆలస్యం చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిందే తరలించలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సేకరణ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. – దాట్ల సుదర్శన్, కొత్తపల్లి గ్రామస్తులు -
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
‘ఆసిఫాబాద్ ఆదివాసీ మహిళ ఘటన’.. బండి సంజయ్ సీరియస్
సాక్షి, జైనూరు: తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ గ్రామం ఉంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ.. తన సోదరులను కలిసేందుకు నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. జైనూర్‌లో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. ఆమెను నమ్మించి తాను కోహినూరు వెళ్తున్నట్టు చెప్పి ఆటో ఎక్కించాడు. ఈక్రమంలో షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు.దీంతో, భయపడిన ఆమె కేకలు వేసింది. అనంతరం, షేక్ మగ్దూం.. ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆమెను గుర్తించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.అయితే, ఆమె స్పృహాలో లేకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. దీంతో, పోలీసులు.. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. -
పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో, రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న పాలకులంతా రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్విుత్రా పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. సుబోధ్ మిత్రా ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ముందుగా రైతు కూలీ సంఘం పతాకాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించారు.అనంతరం సుబోధ్ మిత్రా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలు భూస్వాముల పీడన నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసుకున్నారని గుర్తు చేశారు. దున్నేవాడిదే భూమి హక్కు కేంద్ర విధానంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలన్నారు. అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను పాలకులు వేగిరం చేస్తున్నారని, వీటిపై అవిశ్రాంత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ 1937 జూలైలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ సాగించిన రైతు రక్షణ యాత్రకు నాయకత్వం వహించిన జిల్లా రైతులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి దంతులూరి వర్మ.. గత మహాసభల నుంచి ఇప్పటి వరకు సాగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 మందికి జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేశారు.ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రైతుల హక్కుల సాధనకు ప్రాణాలైనా అర్పించి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హత్యాకాండలో మరణిస్తున్న వారికి మహాసభ సంతాపం తెలియజేసింది. ఏఐఎఫ్టీయూ(న్యూ) జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, ఏఐకేఎంకేఎస్ ఒడిశా నేత శ్రీకాంత్ మొహంతి, తెలంగాణ నేత ప్రసాదన్న, కర్ణాటక నేత చాగనూరు మల్లికార్జునరెడ్డి, ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
చిన్న పార్టీనే.. కానీ చుక్కలు చూపించింది!
జైపూర్: రాజస్థాన్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్‌సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్‌కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్‌ను దాఖలు చేసిన కాంగ్రెస్‌కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్‌గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గిరిజనుల్లో గట్టి పట్టు గుజరాత్లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్‌లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్, బన్స్వారా దుంగార్పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. -
తండాల స్థాయి నుంచి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్ల య్యనాయక్ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్ నాయక్ పాల్గొన్నారు. -
మావల కమాన్ వద్ద ఆందోళనకు దిగిన ఆదివాసీలు
-
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఆదివాసీలకే చెందుతాయని పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఆ గ్రామాలన్నీ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని తేల్చిచెప్పింది. 2014 ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పింది. ఆ గ్రామాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి రావన్న ఆదివాసీయేతరుల వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2014 మేలో దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేసింది. 75 ఏళ్ల క్రితం నుంచీ వివాదం.. దాదాపు 75 ఏళ్ల క్రితం నుంచి ఈ గ్రామాలకు సంబంధించి ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య వివాదం ఉంది. ఇరువర్గాలు ఈ వివాదంపై పలుమార్లు కోర్టులను కూడా ఆశ్రయించాయి. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు 2005 వరకు జనరల్ రొటేషన్ (జనాభా దామాషా) పద్ధతిన జరిగాయి. అయితే 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను ‘షెడ్యూల్డ్ ఏరియా’గా పేర్కొంటూ, ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ సంబంధిత చట్టాల మేరకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఆదివాసీయేతరులు కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇదే అంశంపై వివాదం కొనసాగుతుండటం, గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో 2014లో వరంగల్ జిల్లాకు చెందిన మర్రి వెంకటరాజం, మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం రాష్ట్రపతి ఈ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించకున్నా.. ప్రభుత్వం మాత్రం వీటి పరిధిలో ఎన్నికలను ఆ చట్టాల మేరకే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ గ్రామాల పరిధిలోని అన్ని పదవులను ఆదివాసీలకే రిజర్వు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు భూరియా కమిషన్ నివేదికను, దాదాపు 70కి పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కాపీలను పరిశీలించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయమూర్తి.. సరిగా పరిశీలన చేయని కారణంగానే రాజ్యాంగం ప్రకారం ఈ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితాలోకి చేరలేదని చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతం కిందికే వస్తాయని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకటరాజం అప్పీల్ దాఖలు చేయగా, సుదీర్ఘ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. తప్పుడు కేసులతో ఎన్నో కోల్పోయాం తప్పుడు లిటిగేషన్ కేసులతో ఎన్నో ఏళ్లుగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, నీరు, నిధులు కోల్పోయాం. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పొందేందుకు 2005 నుంచి తుడుందెబ్బ, ఆదివాసీ సేన, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సహకారంతో పోరాటం ప్రారంభించాం. 2006లో కేసు గెలిచాం. కానీ గిరిజనేతరులు మళ్లీ మా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో పూర్తిస్థాయిలో విజయం సాధించాం. – గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈ తీర్పుతో ఆదివాసీలకు సకల హక్కులు హైకోర్టు తీర్పుతో ఆ 23 గ్రామాల్లో ఆదివాసీ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆదివాసీయేతరులు పోటీ చేయడానికి అనర్హులు. ఆదివాసీలు మాత్రమే పోటీ చేయాలి. అటవీ హక్కుల చట్టం ఈ గ్రామాలకు కూడా వర్తిస్తుంది. ఆదివాసీల నుంచి ఇతరులకు భూ బదలాయింపు నిషేధ చట్టం అమల్లోకి వస్తుంది. ఇకపై ఇతర ఆదివాసీలు పొందిన 5వ షెడ్యూల్లోని హక్కులన్నీ వీరూ పొందుతారు. – న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ -
అడవితల్లికి ‘తొలి’ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు. వనంలో పూజలు.. అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు. కోడితో జాతకం.. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు. తుర్ర వాయింపు.. ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు. ఏత్మాసార్ పేన్కు పూజలు! అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు. -
హనుమంతుడి వారసులం అని గర్వపడండి!: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ధార్ జిల్లాలోని గంద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ అటవీ మంత్రి ఉమంగ్ సింఘర్ హనుమంతుడు ఆదివాసీయే అని వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం అయిన రామాయాణ మహా కావ్యంలో కోతులుగా వర్ణించబడినవారు హనుమంతుని వలే గిరిజనులేనని అన్నారు. ఈ మేరకు ఆయన ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమంతుని గురించి ఈ విధంగా ప్రసంగించారు. రాముడిని లంకకు తీసుకువెళ్లింది ఆదివాసీలు(వానర సేన) అని రామయణ కథలో రాశారు. దీనిని బట్టి ఆదివాసీలు అరణ్యాల్లో నివశించారని ఆ కథ ద్వారా మనకు తెలుస్తోంది కావున హనుమంతుడు కూడా ఆదివాసీయే. అందువల్ల మనం అతని వారసులం అని గర్వపడండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సింఘర్ అన్నారు. దీంతో మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. వారు హనుమాన్ జీని దేవుడిగా భావించరు. హనుమంతుడుని హిందువులు పూజించే దేవుడిగా అస్సలు గుర్తించరు అని ఫైర్ అయ్యారు. హనుమంతుడిని అవమానించారంటూ ఆరోపణలు చేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ క్యాథలిక్ మత గురువులు భాష మాట్లాడుతున్నట్లుంది అని వెటకరించారు. ఇక మత మార్పిడిలు చేసేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్. (చదవండి: పాతికేళ్ల ఎన్సీపీ.. పవార్ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ) -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్
ధ్వని పుట్టింది... రాగం ఆవిర్భవించింది. మాట పుట్టింది... పాట రూపుదిద్దుకుంది. ఆది సంస్కృతి... ఆదిరాగాన్ని ఆవిష్కరించింది. ఆ రాగాల పరిరక్షణకు అంకితమైన గాయని లక్ష్మీబాయ్. హైదరాబాద్‌లో గవర్నర్ బంగళా. ఈ ఏడాది మార్చిలో మహిళాదినోత్సం వేడుకలకు సిద్ధమైంది. తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలు పురస్కారాలందుకుంటున్నారు. వారిలో ఓ మహిళ పెందూరు లక్ష్మీబాయ్. ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఆదివాసీ గాయని ఆమె. గవర్నర్ చేతుల మీదుగా సన్మానం చేయించుకున్న సంతోషం ఆమె ముఖంలో ప్రతిఫలిస్తోంది. ఈ గౌరవాన్ని అందుకున్న లక్ష్మీబాయ్ తన జీవితాన్ని ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకే అంకితం చేసింది. ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘మాది ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం, తోషం గ్రామం. మా తెగ పేరు తోటీ. సిటీల వాళ్లు టాటూ అని ఇప్పుడు ఫ్యాషన్‌గా వేసుకుంటున్నారు చూశారా... అదే... పచ్చబొట్టు. ఆ పచ్చబొట్టు వేయడం మా వృత్తి. అడవుల్లో మూలికలు, వేళ్లను సేకరించి పసరు తయారు చేసుకుంటాం. మా సంస్కృతి, జీవనం గోంద్ రాజులతోపాటుగా ఉండేది. గోంద్ రాజుల దగ్గర కళాకారులం. కిక్రీ అనే వాయిద్యంతో పాటల రూపంలో మహాభారతం, రామాయణం, రాజుల కథలను చెబుతాం. రేలా పాటలైతే వందల్లో ఉంటాయి. అవన్నీ మాకు నోటికి వస్తాయి. పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. మా పేర్లు కూడా రామాయణ, మహాభారతాలు, గొప్ప రాజుల చరిత్ర కథల్లో ఉండే పేర్లే ఉంటాయి. పాటని వదలం అన్నం దొరకకున్నా సరే పాటను మాత్రం వదలం. మా పుట్టిల్లు మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పుట్టిగూడ. మా చిన్నప్పుడు తినడానికి కూడా ఇప్పుడున్నంత వెసులుబాటు ఉండేది కాదు. గోంద్ రాజుల ఇంట్లో పండగ, శుభం... అశుభం... ఏదో ఒక సందర్భంలో వాళ్లు జొన్నలు పెడితే అదే సంతోషం. మిగిలిన రోజుల్లో అడవి తల్లే ఆధారం. అలాంటి గడ్డు రోజుల్లో కూడా మేము మా సంస్కృతిని వదల్లేదు. కిక్రీ వాయిద్యాలను మూలన పెట్టలేదు. సంస్కృతిని, కళను అంతరించి పోనివ్వకూడదని మాకు మేము ఒట్టు పెట్టుకుంటాం. మా వంశాల్లో తరతరాల సంపద మా నోటిపాట, మాట. చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్లపాటు నేర్చుకుంటూ, మర్చిపోకుండా సాధన చేస్తూనే ఉంటాం. అప్పట్లో మా పాట అడవిలోనే ఉండేది. ఇప్పుడు సర్కారు శ్రద్ధ పెట్టడంతో మా కళ అందరికీ తెలుస్తోంది. ఆకాశవాణిలోనూ మా పాటలు వచ్చాయి. పురస్కారం మా కళకే! నా భర్త తుకారామ్ కిక్రీ వాద్యకారుడు. నేను రేల పాటలు పాడుతాను. ఆయన, నేను పాటలు పాడుతూ ఊళ్లు తిరిగాం. ఢిల్లీలో 2006లో రిపబ్లిక్ దినోత్సవాలకు వెళ్లి మా కళలను ప్రదర్శించాం. రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాం. ఈ ఏడు హైదరాబాద్‌లో గవర్నర్ చేతుల మీద సన్మానం, మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో మా పాటలు, దండలు, శాలువాలతో గౌరవించారు. అంతపెద్ద వాళ్లు మాకు దణ్ణం పెడుతుంటారు. ఆ దణ్ణం మాక్కాదు, మా ఆకలి తీరుస్తూ, మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే మా అడవి తల్లికి. అక్షరం రాని మా నాలుక మీద పెద్ద పెద్ద గ్రంథాలను పలికిస్తున్న మా కులదైవానికే. మేము ఏటా జనవరిలో ఒకసారి, ఈ నెలలో (మే నెల) ఒకసారి మా ఉత్సవాలు చేసుకుంటాం. మా పాటలన్నీ మా నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. నగరానికి చేరిన ‘ఆది’ పాట ఐఏఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ఈ కళను మా దగ్గరే ఆగిపోనివ్వకుండా అందరికీ తెలియచేయాలని సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న ఆడపిల్లలకు నేర్పించమన్నారు. ఆమె మాట మీద రెండు నెలలు అక్కడే ఉండి నేర్పించాను. నాకు రాయడం రాదు, వందల పాటలు పాడతాను. మా చిన్నప్పుడు బడుల్లేవు. ఇప్పుడు మా ఆదివాసీలు పిల్లలందరినీ చదివించారు. మేము మా నలుగురు పిల్లలనూ చదివించాం. రాయడం వచ్చినోళ్లు ఈ పాటలను రాస్తే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పటోళ్లు మేము పాడుతుంటే పాటలు రికార్డ్ చేసి యూ ట్యూబులో పెడుతున్నారు. మా పాట నగరాలకు చేరుతోంది. నగరాల వాళ్లు ఈ పాటలను టీవీల్లో పాడుతున్నారు. వాటిని చూసినప్పుడు మాకు ఖుషీగా ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం పాట ఆపను. నా భర్తతో కలిసి ఎన్నెన్ని పాటలు పాడానో... ఇప్పుడు నాతో ఉన్నది ఆయనతో పాడిన పాటలే’’ అని తాను ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితమైన వైనాన్ని వివరించారు పెందూరు లక్ష్మీబాయ్. – వాకా మంజులారెడ్డి -
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఛత్తీస్‌ఘడ్: నారాయణ్‌పూర్‌లో హైటెన్షన్
రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ బస్తర్ జిల్లా నారాయణ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివాసీలు ఆగ్రహంతో సోమవారం పోలీసులపై దాడికి దిగారు. అంతకు ముందు ఓ సున్నితమైన అంశానికి సంబంధించి దాడి చేసేందుకు ప్రయత్నించారు వాళ్లు. ఈ క్రమంలో.. పోలీసులు వాళ్లను అడ్డుకుని వాళ్లతో మాట్లాడేందుకు తయ్నించారు. అయితే ఉన్నట్లుండి ఆదివాసీలు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీ సదానంద కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయన తల పగలి రక్తస్రావం అయ్యింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఘటనపై చత్తీస్‌గఢ్ హోం మంత్రి తమ్రాజ్వాద్ సాహూ స్పందించారు. పోలీసులు శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు యత్నించినా.. ఆదివాసీలు దాడికి దిగారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీపై వెనుక నుంచి దాడి చేశారని వెల్లడించారు. గత కొన్నాళ్లుగా ఆదివాసీల మధ్య చిచ్చు రగులుతోంది అక్కడ. రెండు వర్గాలుగా చీలిపోయిన ఆదివాసీలు.. గత రెండు నెలల్లో దాదాపు 20సార్లు ఘర్షణలకు దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. -
అధికారంలో ఔన్నత్యం చాటుకోవాలి
షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్‌ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్‌తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు. అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం. అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది. ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి. ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
గిరిజన అభివృద్ధిలో కొత్త శకం
సాక్షి, పాడేరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో నవ శకం మొదలైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనుల పక్షపాతిగా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పాడేరులోని తలారిసింగి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్ గిరిజన సంప్రదాయ తుడుమును మోగించి, విల్లంబులు ఎక్కుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ రాలేకపోయారని, కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తారన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్రంలో రూ.14 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 లక్షల కుటుంబాలకు 2 లక్షల 50 వేల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేసి, సీఎం జగన్ సర్వ హక్కులు కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకు రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం గిరిజనులకు అందించిందన్నారు. బాక్సైట్ జీవోలన్నింటిని రద్దు చేయడం చరిత్రాత్మకమన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన సీతంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్, సీతంపేట ఐటీడీఏ పీవో నవ్య, ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ పీవో ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. సంక్షేమాభివృద్ధి సీఎం జగన్ సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న గిరి పుత్రులకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన ట్వీట్ చేశారు. -
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ. -
వెదురులో విరిసిన బతుకులు
సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది. ‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్షెడ్పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి. భూమి ఉంది కానీ! అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది. దశాబ్దాలు గడిచాయి కానీ! సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్షెడ్పూర్కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది. కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను. వెదురు వంద రకాలుగా ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్షేడ్లు, పెన్ హోల్డర్లు, బాస్కెట్లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను. ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా. -
సిర్పూర్ ఆదివాసీ కోటను కాపాడండి!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్లలో ఉన్న కోటలు. ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) – పోలేబోయి అశోక్ ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్‌నగర్ -
మెస్రం బేతాళ్ నృత్యం
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గతనెల 31న మహాపూజతో ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా మెస్రం వంశీయులు శుక్రవారం బేతాళ్, మండగాజిలింగ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దల కాళ్లు కడిగి ఆహ్వానం పలికారు. ఆదివాసుల ఆనవాయితీ ప్రకారం ప్రధాన్ (పటడి)లకు మెస్రం వంశీయులు, మహిళలు, కోడళ్లు బుందో(కానుకలు) సమర్పించారు. తర్వాత వంశ పెద్దలు వెదురు కర్ర పట్టుకుని బేతాళ్ నృత్యాలు చేశారు. కోడళ్లు, మహిళలు, మెస్రం వంశీయులు సంప్రదాయ నృత్యాలు చేశారు. సాయంత్రం వాయిద్యాలు వాయిస్తూ అందరూ నాగోబాను దర్శించుకుని సంప్రదాయ పూజలను ముగించారు. ఈ పూజల్లో మెస్రం వంశం పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశం పెద్దలు మెస్రం చిన్ను పటేల్, కటోడ మెస్రం కోసేరావ్, మెస్రం బాదిపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
పేదోడి ఇంట్లో గవర్నర్ భోజనం.. ఆపై రూ.14 వేలు బిల్లు చేతిలో పెట్టారు!
Madhya Pradesh Man Gets Rs 14 000 Bill : మధ్యప్రదేశ్‌లోన విదిషా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివాసీ బుధ్రామ్ ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే అతనికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికారులు పక్కా ఇల్లు కట్టించారు. ఈ మేరకు గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటి తాళం చెవిని అందజేశారు. అంతేకాదు బుధ్రామ్‌తో కలిసి భోంచేశారు. గవర్నర్ తన ఇంట్లో భోజనం చేయడంతో బుధ్రామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఒకటైతే.. గవర్నర్ వెళ్లిపోయాక కొంతమంది అధికారులు సదరు ఆదివాసీ చేతిలో రూ. 14వేల బిల్లు చేతిలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) వివరాల్లోకి వెళితే.. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్, ఫ్యాన్లను అమర్చారు. అయితే బుధ్రామ్ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు. బుద్రామ్కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. దీనిపై అర్బన్ డెవలప్మెంట్ మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సదరు ఆదివాసీ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి చూసిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) -
ఆదిలాబాద్: ఆదివాసీల దండారి పండుగ ఉత్సవాలు
-
‘అల్లనేరేడు’ తింటే ఆరోగ్యానికి ఎంత మేలో..
జియ్యమ్మవలస: గిరిజనులకు అల్లనేరేడు తోటలు ఆసరాగా నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్షి్మపురం, కొమరాడ మండలాల్లో నేరేడు తోటలు ఎక్కువగా పెంచుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో టికేజమ్ము, పిటిమండ, కొండచిలకాం, నడిమిసిరిపి, పల్లపుసిరిపి, చాపరాయిగూడ, బల్లేరు తదితర గ్రామాలలో విపరీతంగా నేరేడు చెట్లున్నాయి. గిరిజన గ్రామాలలోనే కాకుండా గిరిజనేతర గ్రామాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా అల్లనేరేడు చెట్టును నాటినప్పటి నుంచి సుమారు నాలుగేళ్లలోపు పంటకు వస్తుంది. ఒక్కో చెట్టు సుమారు 100 కిలోల వరకు చెట్టు పెరుగుదలను బట్టి దిగుబడి వస్తుందని గిరిజనులు అంటున్నారు. గిరిజన గ్రామాలకు వ్యాపారులు వచ్చి బేరాలు కుదుర్చుకుంటారు. కేజీ నేరేడు పండ్లు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వాటిని పట్టణాలకు తీసుకుపోయి కిలోను రూ.160కు విక్రయిస్తుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పౌరాణికంగాను, ఔషధపరంగా కూడా జంబూ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిదని, మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. నేరేడుకు పట్టణాల్లో డిమాండ్ అల్లనేరేడు పండుకు గిరిజన ప్రాంతాలలో అంతగా ధర లేదు. పట్టణాల్లో ఎక్కువ ధర ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుండడంతో ఇక్కడ ఎవరూ కొనరు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటాం. - మండంగి అప్పారావు, బల్లేరుగూడ షుగర్‌కు దివ్య ఔషధం షుగర్ వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు పండును తింటే దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ గింజలను పొడిరూపంలో చేసుకుని తింటే ఫలితం ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పండే ఈ పండుకు ఆదరణ ఉంది. - డాక్టర్ శ్రావణ్‌కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, ఆర్‌ఆర్‌బీపురం చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా.. -
గుస్సాడీ నృత్యం అంటే తెలుసా!
సాక్షి, మంచిర్యాల: ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకం. ఈ నాట్య ప్రదర్శనలో అపార నైపుణ్యం గడించిన కనకరాజు సొంతూరు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. తమ సంస్కృతిని కొత్త తరానికి అందిస్తున్న గుస్సాడీ రాజు కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో ఆదివాసీ సమాజం హర్షిస్తోంది. ఈ ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కొనసాగుతోంది. ఈ నాట్యానికి మెరుగులు దిద్దడమేగాక నేటి తరానికి శిక్షణ ఇస్తూ.. మరింత గొప్ప కళగా మలిచారు కనకరాజు. ఈ కళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ ఉంది. పౌరాణిక గాథల్లో ప్రస్తావన.. గుస్సాడీ నృత్యం ఆవిర్భావంపై అనేక పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం, యత్మసూరు దేవత స్వరూపంగా.. ప్రకృతి ఆరాధనలో ఓ భాగమని ఆదివాసీ పెద్దలు చెబుతారు. తమ పూర్వీకులు అందించిన ఈ నృత్యానికి కాలక్రమేణా ఆదివాసీ ప్రముఖులు మరింత వన్నె తెచ్చారు. వీరిలో ఉట్నూరు ఐటీడీఏ ఏపీవోగా పనిచేసిన ఆదివాసీ ఐఏఎస్ మడవి తుకారాం విశేష కృషి చేశారు. 1940 దశకంలో రాజ్ గోండులపై అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్, ఆ తర్వాత 1978లో ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన శిష్యుడు మైకేల్ యోర్క్ తమ రచనల్లో, డాక్యుమెంటరీల్లో గుస్సాడీ ప్రత్యేకత వివరించారు. దండారీ ఉత్సవంలో... ఆదివాసీ గూడేల్లో దీపావళి పండుగకు వారం ముందు మొదలయ్యే దండారీ ఉత్సవాల్లో గుస్సాడీ ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి. పురుషులు మాత్రమే గుస్సాడీ వేషధారణ వేస్తారు. గుస్సాడీగా ఉన్న వ్యక్తి నిష్ఠతో దండారీ పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటించాలి. తలపై నెమలి టోపీ (మాల్బూర), చేతిలో దండం (కర్ర), భుజానికి జింక తోలు, ఒళ్లంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో దీక్ష కొనసాగిస్తారు. వారం, పది రోజులు (దండారీ పూర్తయ్యే వరకు) స్నానం చేయరు. ఒక్కో నెమలి టోపీలో వెయ్యికి పైగా ఈకలు అమర్చుతారు. దీనిని నిపుణులతో చేయిస్తారు. కొందరు ఆడ వేషంలోనూ ఆకట్టుకుంటారు. నృత్యం చేసేప్పుడు సంప్రదాయ వాయిద్యాలైన తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమెలా, ధోల్, వెట్టి, కర్ర (దండం)తో వాయిస్తూ.. ఎంతో రమణీయంగా పాడుతుంటారు. కష్ట సుఖాలు, సంతోషాన్ని ఆనందాన్ని నాట్యంలో వ్యక్తపరుస్తారు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారీలోనే ప్రదర్శిస్తుంటారు. కళ సాగేంతవరకు తమను తాము మైమరచి దైవత్వం కలిగి ఉంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బృందంగా ఏర్పడి వెళతారు. గుస్సాడీలకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామంలో మెప్పుపొందేలా వారి ప్రదర్శనలు ఉంటాయి. దండారీ ఉత్సవాల కోసం కొన్ని నెలల ముందే ఆదివాసీ గూడేలు సన్నద్ధమవుతాయి. చదవండి: గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి -
అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం
దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా గణ న సందర్భంగా ఆదివాసీలను ఇతర మతాల్లో కలపకుండా ప్రత్యేక గుర్తింపు కోడ్ కాలమ్‌లో చేర్చాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభలో చేసిన తీర్మానం సభ ఆమోదం పొందింది. జార్ఖండ్‌లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు కూడా, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, జనగణన విభాగం దీన్ని ఆమోదించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఖాయం. ‘‘జనాభా లెక్కల్లో ఆదివాసీలను హిందు వుల్లోగానీ, ఏ ఇతర మతాల్లోగానీ చేర్చకూ డదు. వారిని జనాభా లెక్కల్లో ‘సరన’ కోడ్ కాలమ్‌లో చేర్చాలి. గత నలభై ఏళ్ళుగా ఆదివాసీలు చేస్తున్న ఈ డిమాండ్‌ని శాసనసభ ఆమో దించాలి’’ అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నవంబర్ 11వ తేదీన ఒక రోజు ప్రత్యేక సమావేశం నిర్వ హించి, ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. కానీ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. సాంకేతికంగా సమస్యలున్నాయని ఆ పార్టీ నాయకులు బాబూలాల్ మరాండి పేర్కొన్నారు. అయితే సరన కోడ్‌ను జనాభా లెక్కల్లో చేర్చాలనే డిమాండ్‌ను హేమంత్ సోరెన్ నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాదు, ఈ విషయంపైన జార్ఖండ్‌లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం (ట్రైబల్ రిలీజియన్) పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జార్ఖండ్ శాసనసభ చేసిన తీర్మానం పైన కేంద్ర ప్రభుత్వం, జనాభా గణన విభాగం (సెన్సెస్ డిపార్ట్మెంట్) సానుకూలంగా ఉంటుందని ఎవ్వరూ భావించడం లేదు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఊపందుకునే అవకాశం మెండుగా ఉంది. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడు తుందన్నది వాస్తవం. భారతదేశంలో 1871లో జనాభా గణన ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివాసీలను ‘అబ్ ఆర్జినల్స్’గా పేర్కొన్నారు. 1901 నుంచి 1942 వరకు జనాభా లెక్కల్లో ఆది వాసీలను యానిమిస్ట్స్ అని పేర్కొన్నారు. దానర్థం ‘ప్రకృతి ఆరా ధకులు’ అని. అయితే భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆదివాసీలను ప్రత్యేకంగా గుర్తించడం ఆపేశారు. అప్పటి నుంచి వారిని హిందువులుగానో, క్రైస్తవులుగానో లేదా ఇతర మతాల గాటనో కట్టేశారు. నిజానికి చరిత్ర పరిశోధకులుగానీ, మానవ శాస్త్ర నిపుణులుగానీ ఆదివాసీలు ప్రత్యేక మత సాంప్రదాయాలు కలిగిన వారుగానే పేర్కొ న్నారు. ఏ దేశంలోనైనా అడవుల్లో, కొండల్లో నివసించే వారి సాంప్రదా యాలు విభిన్నంగానే ఉంటాయి. వాళ్ళల్లో విగ్రహారాధనగానీ, ఇతర మనుషుల రూపంలో ఉండే దేవుళ్ళు, దేవతలుగానీ ఉండరు. సమస్త ప్రకృతే వారి దైవం. చెట్లు, కొండలు, జంతువులు, పక్షులు, ప్రకృతి లోని ఇతర గాలి, నీరు లాంటివే వారికి ఆరాధ్యదైవాలు. ‘సరన’ అంటే ఒక చెట్టు పేరు. దానిని ‘సాల్ ట్రీ’ అంటారు. అంటే తెలుగులో మద్ది చెట్టు అన్నమాట. ఇది చరిత్రలో కూడా ఎంతో ఆరాధ్య వృక్షంగా వుంది. గౌతమ బుద్ధుడు జన్మించింది, మహాపరి నిర్వాణం పొందింది కూడా ఈ మద్దిచెట్ల మధ్యనే అని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మన దేశంలోని ప్రధాన ఆదివాసీ తెగలన్నీ కూడా ఏదో ఒక రకమైన ప్రకృతి ఆరాధనలోనే ఉన్నాయి. భారతదేశంలోని ప్రధానమైన ఆదివాసీ తెగల్లో సంతాల్ ఒకటి. తమ పూర్వీకుల ఆత్మలే తమకు మంచి, చెడు చేకూరుస్తాయని నమ్ముతారు. అదేవిధంగా ఒక తోటలోని చెట్లలో తమ పూర్వీకులు నివసిస్తుంటారని, తమకు సమీపంలోని కొండల్లో వాళ్ళు కొలువుదీరి ఉంటారని సంతాల్ తెగ నమ్ముతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెంచులు చెట్లకు ప్రతిరూపంగా గరెలైసమ్మకు పూజ చేస్తారని అంటారు. మన దేశంలోని మరో ప్రధానమైన తెగ గోండ్ తెగ. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. నాగజాతి ఆరాధకులు. నాగోబా జాతర పేరుతో జరిగే జాతర వీరి సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన జాతర. వీళ్ళ గూడేల్లో కూడా ఏ హిందూ దేవుళ్ళో, లేదా దేవతల విగ్రహాలో ఉండేవి కావు. వీరిలో మనిషిని బలిచ్చే సాంప్రదాయం ఉండేది. ఎంత శక్తిమంతులను బలిస్తే, అంత ఫలితం ఉంటుందని వీళ్ళు 1 9వ శతాబ్దం వరకు నమ్మేవారు. మరొక తెగ ‘ఖిల్’. వీళ్ళ ప్రకృతి ఆరాధనతో పాటు, మంత్రా లను, తంత్రాలను విశ్వసిస్తారు. కోయ, కొండరెడ్లు, కోంద్, ఇతర తెగలన్నీ గతంలో ప్రకృతి ఆరాధకులుగానే ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా, కొందరు క్రైస్తవులుగా, మరికొందరు హిందూ దేవత లను ఆరాధించేవాళ్ళుగా మారిన మాట వాస్తవమే. అయితే ఇటీవల ఆదివాసులలో పెరిగిన రాజకీయ చైతన్యం ఆదివాసీలను తమ అస్తిత్వ ఉద్యమంవైపు అడుగులు వేసేలా చేస్తోండడం ఆహ్వానించదగ్గ పరి ణామం. అయితే వాళ్ళు ఈ దేశంలోని మెజారిటీ మతం కలహించే సమాజం, సంస్థలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిరాశకు గురవుతున్నారు. రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తుంటారు. దానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. అవి 1. భౌగోళికంగా ప్రత్యేక ప్రాంతం, ప్రత్యేకించి అడవులు, కొండలు. 2. ప్రత్యేక భాష, 3. ప్రధాన సమాజానికి భిన్నంగా ప్రాచీన సాంప్రదా యాలు, ప్రత్యేకించి ప్రకృతి ఆరాధన. 4. వెనుకబడిన ఆర్థిక విధానం, ప్రకృతి వనరులపైన ఆధారపడిన జీవన విధానం, 5. ప్రత్యేక తెగగా ఉండడం, 6. అన్ని సమస్యలనూ, వ్యవహారాలనూ వారి సంఘం నేతృత్వంలో పరిష్కరించుకొనే తమదైన ప్రత్యేక పాలనా విధానం. ఈ విధమైన జీవనవిధానాన్ని బట్టి వారిని ఆదివాసీలుగా గుర్తించాలని భారత ప్రభుత్వమే ఎన్నో ఏళ్ళ కిందట నిర్ణయించింది. ఇప్పటికీ ఆదివాసీలు తమ మత విధానాలను వదులుకోలేదని, బయటి ప్రపంచం ప్రభావం కొంత ఉన్నప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నది వాస్తవం. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ప్రణాళికలు, పథకాలు రచించారు. మరెన్నో విధివిధానాలు రూపొందించారు. కానీ అవి మిగతా పేదలు, దళితులతో పాటు, ఆదివాసీలకు అందించాల్సిన స్థాయిలో అంద లేదు. ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధిలో భాగం కాలేకపోయారు. అంతేకాకుండా, మన ప్రభుత్వాలు, పాలకులు, పెద్దలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల ఆదివాసీలకు ప్రయోజనం చేకూరకపోవడం మాత్రమే కాదు, వారు అభివృద్ధిలో బలిపశువులుగా మారుతున్నారు. గత 30 ఏళ్లనుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది ఆదివాసీలు నిరాశ్ర యులయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, గనులు, బహుళజాతి కంపెనీల వల్ల, తాము వేల ఏళ్ళుగా నివసిస్తోన్న నేలను వీడి, తాము దైవ స్వరూపంగా భావించే భూమిని వదులుకొని, వలసపోతున్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై జరుగుతోన్న అకృత్యాలెన్నో లెక్కలో లేవు. అంతే కాకుండా రాజ్యాంగంలో పొందు పరిచిన ఐదవ, ఆరవ షెడ్యూల్స్‌లో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ ఆచరణలో అవి ఎంత మాత్రం అండగా నిలబడలేకపోతున్నాయి. రాజ్యాంగం అమలుకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయాయి. ఆదివా సీల ప్రగతికి పదికిపైగా కమిషన్లు, కమిటీలు నివేదికలు ఇచ్చాయి. కానీ ఏ ఒక్కటీ కూడా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలు, యువకుల చదువు అంతంత మాత్రంగానే ఉంది. అడవులు, కొండ కోనలు దాటి ఉన్నత విద్యను ఆర్జిస్తున్న వారు, వారి జనాభాలో రెండు శాతం మాత్రమే. అంటు వ్యాధులు, ఇతర సీజనల్ జబ్బులు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. టి.బి., ఇతర తీవ్రమైన రోగాలతో ప్రతి సంవత్సరం వేలాదిమంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఒక లక్షా నలభైవేల మంది మృత్యు వాత పడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అడవిలో లక్షల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ఆదివాసీలు తర తరాలుగా ఆ అడవే జీవితంగా బతుకుతున్నప్పటికీ వారి కాళ్ళకింది నేల వారిది కాదు. వారు జీవిస్తోన్న అడవిపై వారి హక్కు కాగితాలకే పరిమితం. రకరకాల పేర్లతో, అభివృద్ధి పథకాల నెపంతో ఆదివాసీ లకు చెందాల్సిన భూమి మొత్తం అన్యాక్రాంతమౌతోంది. అందుకే అవునన్నా, కాదన్నా జల్, జంగిల్, జమీన్ అనే నినాదం మరింత తీవ్ర తరం అవుతున్నది. భారత సమాజం, భారత ప్రభుత్వం అనుసరి స్తున్న దోపిడీ, నిర్లక్ష్యం ఆదివాసీలను ప్రత్యేక అస్తిత్వం వైపు నడిపిస్తు న్నది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక ఆది వాసులను ప్రత్యేక మతంగా గుర్తించాలని చేసిన తీర్మానం భారత సమాజానికి, కేంద్ర ప్రభు త్వాలకు చేసిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా వివక్షకు, విద్వేషానికి, విస్మరణకు గురౌతోన్న కులాల, తెగల విషయంలో సానుకూల దృక్పథం అనుసరించకపోతే ఫలితాలు మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉంటాయన్న విషయాన్ని మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
దాడులు ఆపకపోతే..మినఫా తరహా ఘటనలే!
చర్ల: దండకారణ్యంలో పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి.. అమాయక ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపకపోతే మినఫా తరహా ఘటనలకు పాల్పడక తప్పదని సీపీఐ మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖను విడుదల చేశారు. అలాగే.. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మినఫా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, ఆ సందర్భంలో మృతి చెందిన పోలీసు బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించి వివరాలు, పార్టీ వివరాలను వెల్లడించింది. సరిహద్దుల్లో ఉన్న సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో మినఫాలో ఆదివాసీలతో మాట్లాడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కాల్పులకు దిగడంతో సరైన రీతిలో బుద్ధి చెప్పి 19 మందిని మట్టుబెట్టడంతోపాటు 20 మందిని గాయపరిచి వెళ్లగొట్టామని తెలిపారు. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా మృతి చెందారని పార్టీ పేర్కొంది. మృతి చెందిన వారిలో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి ఏరియాలోని గోండుమెట్టకు చెందిన పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు సక్రు, గంగులూరు ఏరియాలోని బుర్కేల్‌గ్రామానికి చెందిన పార్టీ సభ్యుడు రాజేష్, బైరంఘడ్ ఏరియాలోని గానార్ గ్రామానికి చెందిన సుక్కు మృతి చెందారని, వీరందరికి పార్టీ ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించిందని పార్టీ పేర్కొంది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల నుంచి 11 ఏకే 47 తుపాకులు, 2 ఇన్శాస్ తుపాకులు, ఒక ఎస్ఎల్ఆర్ అండ్ ఎల్ఎంజీ, 2 యూబీజీఎల్‌తోపాటు 1,550 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు లేఖలో వివరించింది. దండకారణ్యంలోని బస్తర్, రాజ్‌నందిగావ్, గడ్చిరోలి తదితర జిల్లాల్లో ఉన్న పోలీస్స్టేషన్లు, క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే మినఫా తరహా దాడులకు దిగుతామంటూ పార్టీ ఈ లేఖలో హెచ్చరించింది. -
ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఆదివాసుల అక్రమ నిర్బంధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మంది ఆదివాసీలను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. కాగజ్ నగర్ వెంపల్లి అటవీశాఖ డిపో నుంచి ఆదివాసీలను హైదరాబాద్‌కు అటవీ శాఖాధికారులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అటవీశాఖాధికారుల అదుపులో ఉన్న 67 మంది ఆదివాసీలు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌కు చేరుకున్నారు. వీరికి అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కుందన్‌బాగ్‌లోని హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు అటవీశాఖాధికారులు హాజరు పరచనున్నారు. వివరాలు..కుమ్రం భీం జిల్లా రేపల్లెలోని ఫారెస్ట్ డిపోలో ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట పౌరహక్కుల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని ఫారెస్ట్ డివిజినల్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఆదివాసీలను ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరినీ బలవంతంగా బంధించలేదని వాళ్లు ఇష్టపూర్వకంగానే వచ్చి ఫారెస్ట్ డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించలేదు. దశాబ్దాలుగా ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, ఇటీవల ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో పోడు వ్యవసాయం చేస్తోన్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సాక్షాత్తూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వినతి పత్రం కూడా సమర్పించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని దాడులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని ఆత్రం సక్కు కోరారు. -
ఝార్ఖండ్ ఆదివాసిల్లో జేఎంఎం పట్టు!
మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఝార్ఖండ్‌లో ఆదివాసీల జనాభా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంది. ఝార్ఖండ్‌లో మొత్తం 14 పార్లమెంటు స్థానాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా, ఆర్జేడీ, జనతాదళ్(యూ) ఝార్ఖండ్ ఏర్పడినప్పటినుంచీ ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 2004లో 14 లోక్‌సభ స్థానాలకు గాను యూపీఏ (కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జేడీ, సీపీఐ)కి 13 సీట్లు వస్తే, బీజేపీ ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. 2009లో బీజేపీ 8 స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, కాంగ్రెస్ 1, జేవీఎం 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 12 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 2 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఝార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్ జెవీఎం), ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. గత ప్రాభవాన్ని పునర్నిర్మించుకోవాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంటే, తమ బలాన్ని సుస్థిరం చేసుకుంటామన్న ఆశాభావంతో బీజేపీ ఉంది. జనాభాలో 25 శాతంగా ఉన్న ఆదివాసీలు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆదివాసీలు ఆధారపడి బతుకుతోన్న అడవినుంచి అత్యధిక మంది ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు తెచ్చిన చట్టాలు వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. అలాగే రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శ పాలకులను వెంటాడుతోంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసింది చివరి దశలో జరిగే రాజ్ మహల్, దుమ్కా, గొడ్డా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా? లేక ఈసారి కూడా బీజేపీకే పాలనావకాశం దక్కుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌మహల్ ... ఎస్టీ రిజర్వుడు సీటైన రాజ్‌మహల్ లోక్‌సభ స్థానాన్ని 2014లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై జేఎంఎం అభ్యర్థి విజయ్‌కుమార్ హన్స్‌డాక్ విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, జేఎంఎం కూటమి తరఫున సీపీఎం అభ్యర్థి గోపీన్ సోరెన్ పోటీ చేస్తున్నారు. గోపీన్ సోరెన్ పై గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ్లాల్ ముర్ముని బీజేపీ తిరిగి పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ, జేఎంఎంలు గెలుపుగుర్రమెక్కడానికి హోరాహోరీ పోరాడుతున్నాయి. 2014 గణాంకాలను బట్టి ఈ పార్లమెంటు స్థానంలో మొత్తం 13,53,467 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 2009లో బీజేపీ తరఫున దేవిధన్ బెస్రా విజయాన్ని సాధించారు. దుమ్కా ... ఎస్టీ రిజర్వుడు స్థానమైన దుమ్కా ఝార్ఖండ్ ముక్తి మోర్చాకి బలమైన పునాదులున్న ప్రాంతం. 2014 ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేసేందుకు జెఎంఎం శిబూ సోరెన్‌ని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి సునీల్‌సోరెన్‌ఫై 3,35, 815 ఓట్లతో శిబూసోరెన్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌కి 2,96,785 ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వరసగా ఈ స్థానాన్ని జేఎంఎం కైవసం చేసుకుంటూ వచ్చింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఈ స్థానంలో జేఎంఎం గెలుపొందింది. గొడ్డా.... ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న గొడ్డా పార్లమెంటు స్థానంలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. 2014లో గొడ్డా స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీపై బీజేపీ అభ్యర్థి నిశీకాంత్‌దూబే గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో నిశీకాంత్ దూబే 36.25 శాతం ఓట్లతో(3,80,500) ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీకి కూడా 3,19,818 (30.47శాతం) ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ నిశీకాంత్ దూబేని బరిలోకి దింపింది. జార్ఖండ్ వికాస్ మోర్చా అభ్యర్థి ప్రదీప్ యాదవ్ ఈ స్థానంలో కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. -
అక్కడ ఒక్కరూ ఓటెయ్యలేదు!
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘం మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే, అండమాన్ నికోబార్‌లో కూడా అతి పురాతన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లలో ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదట. మంగోలాయిడ్ తెగకు చెందిన వీరు నాగరికులతో కలవడానికి బిడియపడతారు. అడవుల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడరు. అడవుల్లో దొరికేవే తిని బతుకుతుంటారు. బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరిని తప్ప ఇతరులెవరినీ వారు దగ్గరకి రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డులు జారీ చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఇద్దరంటే ఇద్దరు (75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ) మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువ మందిని రప్పించడం కోసం అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహించారు. దానికి దాదాపు 35 మంది షొంపెన్లు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దాంతో అధికారులకు ఉత్సాహం కలిగింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. ‘శిబిరాలకు వచ్చిన వాళ్లను చూసి సంతోషించాం. షొంపెన్ భాష తెలిసిన ఒక నికోబార్ జాతీయుడి సహాయంతో వాళ్లకు ఎన్నికల గురించి ఓటు’ గురించి అవగాహన కల్పించాం. వాళ్ల కోసం వారు నివసించే గుడిసెల్లాంటి పోలింగ్ కేంద్రాలనే ఏర్పాటు చేశాం. కొత్తగా ఉంటే రావడానికి భయపడతారని ఈ పని చేశాం. అయినా కూడా ఒక్కరూ ఓటు వేయడానికి రాలేదు’ అన్నారు కాంప్‌బెల్ బే అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా. కాగా, ఇక్కడి ఓంగే, గ్రేట్ అండమాన్ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి 51 మంది ఓంగేలు, 26 మంది గ్రేట్ అండమానీస్ ఓటు వేశారు. -
ఆదిలాబాద్‌లో... ఆదివాసీ ఎటు?
సాక్షి, ఆసిఫాబాద్: లోక్‌సభ ఎన్నికల సంగ్రామంలో ఆదివాసీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో గిరిజన ఓట్లలో అత్యధికంగా ఆదివాసీ తెగలకు చెందిన ఓట్లే ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడనుంది. గత రెండేళ్లుగా ఆదివాసీలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. ఈ ఉద్యమ ప్రభావంతో అప్పట్లో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. ఈ ఉద్యమాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుండి నడిపించింది. ఆదివాసీ హక్కుల కోసం అన్నింటా ముందుండే తుడుందెబ్బ ఎన్నికల ముందు ఆ సంఘం నాయకుల్లో చీలిక వచ్చింది. వేర్వేరు రాజకీయ కారణాలతో తుడందెబ్బ పెద్ద నాయకులంతా ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో చేరడంతో ఆదివాసీ ఉద్యమంతోపాటు ఎంపీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడనున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలు మారిన నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదివాసీ మెజార్టీ నాయకులు ఒకే పార్టీలో ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీలు మారడంతో ఆదివాసీ ఓట్లు ఎటువైపు వెళ్తాయానేది ఆసక్తికరంగా మారింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపు రావు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల తరఫున ఉన్న మరో కీలక నాయకుడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. అలాగే కుమురంభీం జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కోట్నాక విజయ్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ జన సమితి పార్టీలో ఉన్నారు. మరికొంత మంది కిందిస్థాయి నేతలు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలో ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ సైతం ఆదివాసీ వర్గానికి చెందిన నాయకుడే కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు ఎటువైపు మళ్లుతాయనేది ఆసక్తిగా మారింది. వేర్వేరు పార్టీలో ఉన్న ఈ ఆదివాసీ నాయకులు తమ జాతి ఓట్లను ఎవరివైపు మలుచుకుంటారనే చర్చ సర్వత్రా సాగుతోంది. రిజర్వు స్థానాల్లో మరింత కీలకం.. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో సిర్పూర్, ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్ జనరల్ శాసన సభ నియోజకవర్గాలు ఉండగా మిగతా మూడు బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజార్టీ ఓట్లు గిరిజనేతరులు ఉండగా రెండోస్థానంలో ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అందులో ఆదివాసీ ఓట్లే అధికంగా ఉన్నారు. రిజర్వు స్థానాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ఓటర్లు ఎటువైపు ఉంటారనే ఆసక్తి నెలకొంది. ఆదివాసీ నాయకుల్లోనే ఇద్దరు ప్రధాన నాయకులైన సోయం బాపురావు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి గొడం నగేశ్ పోటీలో ఉండడంతో ఆదివాసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం లోక్‌సభ పరిధిలో అన్నింటా టీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలే ఉండడం నగేశ్‌కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండడంతో పదికి పది టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నట్లు అయిపోయింది. ఇక బీజేపీ నుంచి బరిలో ఉన్న సోయం బాపూరావు పోటీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో బీజేపీ బలమైన కేడర్ లేకపోవడం ప్రధాన లోపం. పది నియోజకవర్గాల్లో ఎక్కడా ఎమ్మెల్యేలు లేరు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రమే రెండో స్థానంలో బీజేపీ ఉంది. నిర్మల్‌లో కాస్త పట్టు ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా పార్టీకి బలం లేకపోవడంతో ఆ పార్టీ గెలుపొందాలంటే ఆదివాసీ ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో గంపగుత్తగా పడితే గెలుపు సాధ్యం అవుతోంది. అయితే ఆదివాసీలంతా లోక్‌సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి. -
చొరవ చూపండి సమానత్వం వస్తుంది
మహిళలు తమ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందడానికి మాత్రమే పరిమితం కాకుండా, అభివృద్ధిని సాధించడానికీ చొరవ చూపాలని దివ్య దేవరాజన్ పిలుపునిస్తున్నారు. ఏడాది క్రితం బదిలీపై ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన కలెక్టర్ దివ్య దేవరాజన్ మహిళా సాధికారత, మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆదివాసీ – లంబాడాల మధ్య నెలకొన్న వివాదాలను సద్దు మణిగించేందుకు ప్రభుత్వం దివ్యను ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. వివాదాలను తొలగించడమే కాదు, ఇరువర్గాలకున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకొని పరిష్కరించడంలో ఆమె సఫలమయ్యారు. దివ్యకు ఆదివాసీలు మాట్లాడే భాష అర్థమైనా, తిరిగి వారికి అదే భాషలో విషయాన్ని వివరించేందుకు మొదట్లో కాస్త ఇబ్బంది పడినమాట వాస్తవమే. అయితే ఆ క్రమంలో గోండు భాష నేర్చుకున్నారు. అలా ఆదివాసీ మహిళలతో వారి భాషలోనే మాట్లాడి అంతర్గతంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో మహిళలకున్న సమస్యలను పరిష్కరించేందుకు మార్గం సులువైంది. మరోవైపు ఈ యేడాది ఏజెన్సీ ఏరియాలో మహిళా సంఘాల ద్వారా కలెక్టర్ పత్తి కొనుగోళ్లు జరిపించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే భయాలను పక్కనపెట్టి చొరవగా ముందడుగు వేస్తేనే ఫలితం ఉంటుందని, గౌరవం దక్కుతుందని కలెక్టర్ దివ్య అంటున్నారు. ‘‘మహిళల మనసు సున్నితం. కరుణ, జాలి ఎక్కువగా ఉంటాయి. అలాగే మహిళల్లో బిడియం, భయం కూడా ఉంటాయి. వాటిని పక్కనపెట్టి మనోబలంతో ముందడుగు వేయాలి. అప్పుడే సమాజంలో మహిళలకు సమాన గుర్తింపు లభిస్తుంది. మహిళలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) కూడా పెరుగుతుంది. అలా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. తమ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలో సగం మంది మహిళలు సర్పంచులుగా ఉన్నారు. భర్త సహకారంతోనో, బంధువుల ద్వారానో కాకుండా స్వయంగా వారే విధులను నిర్వహించాలి. మహిళా సర్పంచులు ఉన్న అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం చూశాను’’ అని దివ్య దేవరాజన్ అన్నారు. – సాక్షి, ఆదిలాబాద్ -
నేడే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ శిష్యు డు మైకేల్ యోర్క్ జాతరకు రానున్నారు. -
అదృష్టం తలంబ్రాలు చల్లింది
ఐదు నెలల పాపాయి సాక్షిగా జరిగిన పెళ్లి అది! పాపాయి అమ్మ అరుణ, నాన్న జీతేశ్వర్ పెళ్లి చేసుకున్నారు. అదే పందిరి కింద పాపాయి నానమ్మ సహోదరి (ఆమె పేరే సహోదరి), తాత రామ్‌లాల్ కూడా దంపతులయ్యారు. రామ్‌లాల్, సహోదరి ఇద్దరూ ముప్పై ఏళ్లు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉండి ఇప్పుడు దంపతులయ్యారు. వాళ్లకు పుట్టిన జీతేశ్వర్ కూడా అదే రోజు అరుణను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే జీతేశ్వర్, అరుణలకు ఐదేళ్ల పాపాయి ఉంది. చిత్రంగా ఉన్నా విచిత్రంగా ఉన్నా ఇది నిజం. జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీ తెగలో జరిగిన పెళ్లిళ్లు అవి. ఆ రోజు జరిగింది ఈ రెండు పెళ్లిళ్లే కాదు. రెండు వందల పెళ్లిళ్లు జరిగాయి. వధూవరుల్లో ఇరవైలలో ఉన్నవాళ్లే కాదు, అరవైలలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ ఆదివాసీ తెగలో ఉన్న ఒక దుస్సంప్రదాయం కారణంగా పెళ్లి బంధం లేకుండానే లివింగ్ ఇన్ రిలేషన్ షిప్లో కొనసాగిన వాళ్లే వాళ్లంతా. అంతకంటే లోతుగా చెప్పాలంటే చేతిలో డబ్బులేకపోవడం వల్ల వాళ్ల తెగ దుస్సంప్రదాయాన్ని పాటించే ఆర్థిక వెసులుబాటు లేక పెళ్లి చేసుకోకనే కలిసి జీవించిన వాళ్లు. జార్ఖండ్, కుంతి జిల్లాలోని ఆదివాసీ తెగల్లో పెళ్లి అంటే విపరీతమైన ఖర్చుతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకునే వాళ్లు ఊరు ఊరంతటికీ తిన్నంత తినిపించాలి, తాగినంత తాగించాలి. అప్పుడే ఒక స్త్రీ– పురుషుడిని వివాహబంధంలోకి అనుమతిస్తుంది వాళ్ల తెగ ఆచారం. రోజూ పని దొరుకుతుందనే భరోసా లేదు. ఇక పెళ్లి వేడుక చేసుకోవడానికి డబ్బెక్కడ నుంచి తేవాలి? అందుకే ఈ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌లు. ధుక్ని.. ధుకాష్.. ధున్‌కా ఈ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌ని ఆదివాసీలు ‘ధుక్ని, ధుకావ్, ధున్‌కా’ అనే పేర్లతో పిలుస్తారు. ఈ రిలేషన్‌షిప్‌ని ధుకు అని, ఆ రిలేషన్లో ఉన్న మహిళను ధుక్నీ మహిళ అని వ్యవహరిస్తారు. ఇదేమీ గౌరవప్రదమైన హోదా కాదు. జీవితంలో చొరబడిన మహిళ అని అర్థం. భార్య అనే హోదా ఉండదు కాబట్టి దుక్నీ మహిళ నుదుట సింధూరం ధరించడానికి వీల్లేదు. ఆమెకు పుట్టిన పిల్లలకు చెవులు, ముక్కులు కుట్టించడానికి వీల్లేదు. ఆ మగమనిషి రేషన్ కార్డులో ఆ మహిళ పేరు ఉండదు, పిల్లల పేర్లు నమోదు కావు. ఆ పిల్లలకు ఆధార్ కార్డులుండవు. ధున్‌కా రిలేషన్షిప్లో ఉన్న పురుషుడు చనిపోతే ఆ మహిళకు అతడి ఆస్తిలో భాగం రాదు. ఆమె మరో వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవాలి లేదా ఆ చనిపోయిన మనిషి బంధువుల దయాదాక్షిణ్యాల మీద బతుకు సాగించాలి. ఆ మహిళలు చెప్పే మరో కష్టం ఏమిటంటే.. సొంత ఊళ్లో అయితే ఎవరు ఎవరితో కలిసి జీవిస్తున్నదీ అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ ఉండదు. ఈ మహిళలకు నుదుట సింధూరం లేకపోవడంతో (వివాహిత అనడానికి గుర్తు) బయట గ్రామాలకు వెళ్లినప్పుడు పెళ్లి కాని యువతులుగా భావించి మగవాళ్లు టీజ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఖరీదైన పెళ్లి వేడుకకు భయపడి లివింగ్ ఇన్‌లో ఉన్న వాళ్లు వేలాదిమంది ఉన్నట్లు్ల సమాచారం. ఊరంతా పెళ్లి కళ ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని రిటైర్డ్ పోలీస్ అధికారి ఆరాధనా సింగ్ చొరవతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సామూహిక వివాహాలు చేసింది. ఆమె సర్వీస్ ఎక్కువగా ట్రాఫికింగ్‌కు గురైన పిల్లలను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడంలోనే గడిచింది. ఆదివాసీల పిల్లలు అపహరణకు గురయినప్పుడు వాళ్లను వెతికి పట్టుకోవడం, వెతికి పట్టుకున్న పిల్లలను ఎవరి పిల్లలో నిర్ధారించుకుని తల్లిదండ్రులకు అప్పగించడం ఒక సవాల్‌గా ఉండేదామెకి. ఆ పిల్లల పేర్లు ఎక్కడా అధికారికంగా నమోదు కాకపోవడమే అందుకు కారణం. అలా తప్పిపోయి దొరికిన ఒక పిల్లాడి తండ్రి ఒకరోజు మద్యం తాగి ఆమె ఇంటి ముందుకు వచ్చి ‘పెళ్లి చేసుకుంటాను, డబ్బివ్వమని’ కాళ్లావేళ్లా పడ్డాడు. అప్పుడు విచారిస్తే ఆదివాసీల జీవనశైలి తెలిసిందామెకు. స్థానికంగా పనిచేస్తున్న ‘నిమిత’ అనే ఓ స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి ఈ పెళ్లిళ్లు చేయించారు ఆరాధనా సింగ్. తొలి అడుగుగా వాళ్లకు పెళ్లి ప్రయత్నం జరిగింది.పెళ్లికి అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదని చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఆచారాలు మనిషిని ఒక సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేయాలి తప్ప, మనిషికి మోయలేని బరువుగా మారకూడదని వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేదెవరు? పెళ్లి పెద్ద ఆరాధనా సింగ్, నమిత స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేస్తే వినేందుకు ఆ తెగల్లోని మిగతా వాళ్లు మానసికంగా సిద్ధంగా ఉంటారా అనేదే పెద్ద ప్రశ్న. -
ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు. ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు. మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్‌కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు. ‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్‌లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు. -
ఫేస్‌బుక్‌తోనే పుట్టుకొచ్చిన ‘జాయ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో కొత్త రాజకీయ చరిత్రను లిఖించేందుకు ఓ కొత్త శక్తి ఆవిర్భవించింది. ఇప్పుడది తన లక్ష్య సాధన దిశగా పురోగమిస్తోంది. అది పాలక పక్ష బీజేపీకి చెమటలు పోయిస్తుండగా, మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఆ శక్తి పేరే ‘జాయ్స్ (జేఏవైఎస్)’. అంటే, జై ఆదివాసి యువ శక్తి. 2009లో ‘ఫేస్బుక్’ పేజీ ద్వారా పుట్టుకొచ్చిన ఈ సంస్థ ప్రజల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చి నేడు ‘మాల్వా–నిమర్’లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించింది. వెనకబడిన వర్గాల ప్రాబల్య ప్రాంతమైన మాల్వా–నిమర్‌లో 66 అసెంబ్లీ సీట్లకుగాను 28 సీట్లకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. వాటిలో 22 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన స్థానాలే కావడం గమనార్హం. రాష్ట్రంలో 22 శాతం జనాభా కలిగిన ఆదివాసీలను అనాదిగా అగ్రవర్ణాలు అణచివేస్తున్నా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కసితో కొంత మంది ఆదివాసీ విద్యార్థులు తమ సొంత గొంతును వినిపించేందుకు 2009లో ‘యువ శక్తి బిలాల’ పేరుతో ఓ ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. అది కాస్త 2011లో ‘జై ఆదివాసీ యువ శక్తి’గా మారింది. దాన్ని ఆదివాసీ విద్యార్థులంతా ‘జాయ్స్’గా పిలుచుకుంటారు. దేవీ అహల్య విశ్వవిద్యాలయం, రాణి దుర్గావతి యూనివర్శిటీ పరిధిలోని విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మొత్తం 250 పోస్టులకుగాను 162 పోస్టులను జాయ్స్ గెలుచుకుంది. రాష్ట్రంలోని కుక్షీ ప్రాంతానికి చెందిన హీరాలాల్ అలావ, రేవాలో మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి ఈ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఆయన వెంట ప్రస్తుత ఇండోర్ సిటీ జాయ్స్ అధ్యక్షుడు రవిరాజ్ బఘెల్ కలిసి నడిచారు. 2013లో ‘ఫేస్బుక్ పంచాయతీ’ పేరిట బర్వాణిలో రెండువేల మంది ప్రజలతో మొదటిసారి సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ‘ఫేస్బుక్ మహాపంచాయతీ’ పేరుతో ఇండోర్‌లో భారీ సమావేశాన్ని నిర్వహించగా, రాష్ట్రం నుంచి వేలాది ఆదివాసీలు తరలిరాగా, ఆరు రాష్ట్రాల నుంచి యువజన ఆదివాసీ కార్యకర్తలు తరలి వచ్చారు. జాయ్స్ ఉద్యమం ఊపందుకుంటుండంతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలోని ఢిల్లీ వైద్య కళాశాలలో క్లినికల్ ఇమ్యూనాలోజీ, రెమటాలోజిలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న హీరాలాల్ అలావ 2017లో వైద్య వృత్తికి గుడ్‌బై చెప్పి సొంతూరుకు వచ్చారు. కొంత మంది తోటి కార్యకర్తలతో కలిసి ప్రతి ఊరుకెళ్లి పంచాయతీలను నిర్వహించడం, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ కింద ఆదివాసీలకున్న అటవి హక్కులు, పంచాయతీలకున్న హక్కుల గురించి వివరిస్తూ వచ్చారు. ఆదివాసీల వలసలు, స్థ్రానభ్రంశం, పునరావాసం లాంటి అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత విద్యార్థులకు పరిమితమైన ‘జాయ్స్’ ప్రజల ప్రాతినిధ్యంతో ప్రజా సంఘంగా విస్తరించింది. తొలుత ఈ సంఘంలో భిలాల ఆదివాసీలే ఉండగా, నేడు భిలాలతోపాటు భిల్, భరేలా, పటేలియా ఆదివాసీ జాతులు కూడా వచ్చి చేరాయి. ఆరెస్సెస్ రోజువారి శాఖల నిర్వహణకు చోటు దొరక్కుండా జాయ్స్ చేయగలిగింది. అలీరాజ్‌పూర్, రత్లం, జాభ్వా, ధర్, ఖర్గావ్, బుర్హాన్పూర్, ఖండ్వా, దేవాస్, బడ్వానీ జిల్లాల్తో జాయ్స్‌కు ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ స్థాయిలో తమ సంఘం జనంలోకి చొచ్చుకు పోవడానికి 90 శాతం ఫేస్బుక్ పేజీయే కారణమని రవిరాజ్ బఘెల్ వ్యాఖ్యానించారు. గత జూలై 29వ తేదీన మాల్వా–నిమర్ ప్రాంతంలో పాలకపక్ష బీజేపీ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’కు పిలుపునిచ్చింది. అందుకు ప్రతిగా అదే రోజున ‘ఆదివాసీ అధికార్ యాత్ర’కు జాయ్స్ పిలుపునిచ్చింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాయ్స్ నాయకత్వాన్ని పిలిపించి చర్చలు జరిపారు. మాల్వా–నిమర్ ప్రాంతంలో ఓ వైద్య, ఓ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో బీజేపీతో రాజీ కుదరలేదు. రాష్ట్రంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతోని ఎన్నికల పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్ నాయకులు జాయ్స్‌తో సంప్రతింపులకు వచ్చారు. రానున్న ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్ తీసుకొచ్చారు. కనీసం 20 సీట్లు కావాలని కోరుతున్న జాయ్స్ నాయకత్వం హీరాలాల్ అలావ పోటీ చేసేందుకు కుక్షీ అసెంబ్లీ నియోజక వర్గాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ నియోజక వర్గానికి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ విధేయుడు సురేంద్ర సింగ్ బఘెల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లక్ష మందికిపైగా తమ ఆదివాసీ ఓటర్లు, ఐదువేల మంది జాయ్స్ కార్యకర్తలను కలిగిన కుక్షీ నుంచి హీరాలాల్ పోటీ చేయకపోతే తమ ప్రజలు నిరాశకు గురవుతారని జాయ్స్ నాయకత్వం వాదిస్తోంది. గుజరాత్లో హార్దిక్ పటేల్, మెవానీ, ఠాకూర్లను సమర్థించిన కాంగ్రెస్ కుక్షీలో హీరాలాల్‌కు మద్దతిస్తే మునిగేదేముంటుందని నాయకత్వం ప్రశ్నిస్తోంది. మధ్యప్రదేశ్‌లో జాభ్వా బహిరంగ సభలో ప్రసంగించేందుకు సోమవారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈ రోజు రాత్రికి జాయ్స్ నాయకత్వం కలుసుకోబోతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని హెచ్చరించింది. -
ఆదివాసీ అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలి
ఉట్నూర్/ఇంద్రవెల్లి (ఖానాపూర్): ‘రాష్ట్రంలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వు స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివాసీ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి. లేదంటే తుడుందెబ్బ తరఫున ఆదివాసీ అభ్యర్థులను బరిలో నిలుపుతాం. కేసీఆర్‌కు ఆదివాసీల సత్తా ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తాం’ అంటూ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏటీడబ్ల్యూఏసీ మాజీ చైర్మన్ సిడాం భీంరావ్ అధ్యక్షతన సోమవారం ఆదివాసీల ఐక్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పోరాటం చేస్తుండగా.. కేసీఆర్ లంబాడీలకు టికెట్లు కేటాయించి తమ మనోభావాలు దెబ్బ తీశారన్నారు. ఆదివాసీలంతా ఏకమై ‘లంబాడీ హఠావో.. ఆదివాసీ బచావో’ నినాదంతో ఆదివాసీ అభ్యర్థులను గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించకుంటే తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరించారు. ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే లంబాడీ వర్గానికి చెందిన వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ తొమ్మిది తెగల పెద్దలంతా కలసి ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఆదివాసీల నుంచి ఒక్కరినే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుపడం ద్వారా ఎలాంటి విభేదాలు రావన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి 17 మంది ఆది వాసీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. పోటీలో ఉండే రాథోడ్ రమేశ్, రేఖానాయక్‌ల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఆదివాసీల తడాఖా చూపుదామన్నా రు. లంబాడీ అభ్యర్థులు ఓట్ల కోసం ఆదివాసీ గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని అన్నారు. అనంతరం ఆదివాసీ పెద్దలు నిర్ణయించిన అభ్యర్థికి పోటీలో మరో ఆదివాసీ అభ్యర్థి పోటీ చేయకుండా తీర్మానం చేశారు. సమావేశంలో మహారాష్ట్ర ప్రొఫెసర్ ఉయికే హంరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరకనే పోలీసులు ఉతికి ఆరేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు మంగళవారం నాడు నగర పోలీసు జాయింట్ కమిషనర్ అశోక్ యాదవ్, డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్వేతా శ్రీమాలితోపాటు మరో నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అన్యాయంగా పోలీసులు జరిపిన దాడిలో ఇరుగు పొరుగు వారితో పాటు గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న అహ్మదాబాద్ కోర్టు అక్టోబర్ 11వ తేదీనాడు కోర్టుకు రావాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. అహ్మదాబాద్ శివారులోని ఛరానగర్ కాలనీపై జూలై 26వ తేదీ రాత్రి దాదాపు 400 మంది పోలీసులు కర్రలతో దాడి చేసి బీభత్సం సష్టించారు. కనిపించిన టూ వీలర్లు, కార్లు, వ్యాన్ల అద్దాలను, లైట్లను, ఇళ్ల తలుపులను, కిటికీలను విచక్షణా రహితంగా పగులగొట్టారు. ఇళ్లలో జొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలను సైతం తరిమి తరిమి కొట్టారు. చిన్న జుట్టున్న ఓ బాలికను బాలుడనుకొని పోలీసులు కొడుతుంటే తల్లి అడ్డం వచ్చి బాలుడు కాదు, బాలికంటూ వదిలేయమనడంతో పోలీసులు రుజువు కోసం ఆమె బట్టలిప్పి చూశారు. చెస్టా, బ్రెస్టా అంటూ తడిమారు. ఇంకా అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల ఈ వికత చేష్టలకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వీధుల్లోని సీసీటీవీ కెమరాలకు చిక్కాయి. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి చేతులు విరగ్గా, కొందరికి నడుములు విరిగాయి. పోలీసుల వికృత చేష్టలను ఫొటోలు తీస్తున్న ఓ నేషనల్ మీడియా ఫొటో జర్నలిస్టును కూడా పోలీసులు చితక బాదారు. ఈ మూకుమ్మడి పోలీసుల దాడిలో తన భార్య, న్యాయవాదులైన ముగ్గురు కుమారులతోపాటు తాను గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాడుల పేరిట పోలీసులు సాగించిన అరాచకంపై ఫిర్యాదు చేయడానికి నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు వెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఏ పోలీసు అధికారి కూడా అంగీకరించలేదు. దాంతో ఆ న్యాయవాది అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఛరానగర్ వాసులు నియోజకవర్గం ఎమ్మెల్యేను, ఇతర రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అహ్మదాబాద్‌లోని ‘అల్పసంఖ్యాక్ మంచ్’ అనే పౌర సంస్థ నిజ నిర్ధారణ కమిటీగా ఆగస్టు 14వ తేదీన ఛరానగర్ కాలనీని సందర్శించింది. అప్పటికీ పోలీసుల బీభత్సానికి గుర్తుగా పగిలిన కిటికీలు, తలుపులు, వాహనాల పగిలిన అద్దాల గుర్తులు అలాగే ఉన్నాయి. దాదాపు 70 ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారని, 80 మంది కాలనీ వాసులను చితక బాదారని, వారిలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయని, దాదాపు 50 వాహనాలను ధ్వంసమయ్యాయని, ఇళ్లలోని టెలివిజన్లు, వాషింగ్ మషిన్లకూడా ధ్వంసం చేశారని అల్పసంఖ్యాక్ మంచ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను కూడా న్యాయవాది మనోజ్ తమంచే కోర్టు దష్టికి తీసుకెళ్లడంతో కోర్టు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఛరానగర్లో ఎవరుంటారు? ఈ కాలనీలో ఛరా అనే ఆదివాసీలు ఉంటారు. వారి జనాభా దాదాపు 20 వేల మంది. ఒకప్పుడు బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులవడం వల్లన ఈ తెగకు చెందిన మగవారిని భటులని పిలిచేవారు, ఇప్పటికీ కొందరు అలాగే పిలుస్తారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన ఈ జాతి మొత్తాన్ని ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్–1871’ కింద బ్రిటిష్ పాలకులు నేరస్థుల తెగ వారని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం 1952లో ఈ చట్టాన్ని ఎత్తివేసి ఆ స్థానంలో ‘హాబిచ్యువల్ అఫెండర్స్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఎన్నో తరాలు మారినా, ఛరానగర్ వాసులు ఎంత అభివద్ధి చెందినా, వారు ఎలాంటి నేరం చేయక పోయినా వారిపై నేరస్థుల ముఠా అనే ముద్ర మాత్రం పోవడం లేదు. ఛంగ్లీ సారాయికి అడ్డా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న నాటు సారాయిలాగా ఛంగ్లీ అనే మత్తు ద్రావకాన్ని సంప్రదాయకంగా తయారు చేయడం ఛరా ఆదివాసీలకు అలవాటు. గుజరాత్లో మద్యంపై నిషేధం ఉండడంతో ఈ ఛంగ్లీ సారాయికి డిమాండ్ పెరిగింది. కొన్ని కుటుంబాలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఛంగ్లీ తయారీ కేంద్రాలపై పోలీసులు ఉత్తుత్తి దాడులు జరపడం, లంచంగా డబ్బులు తీసుకెళ్లడం తరచూ జరిగే తతంగమే. ఛరానగర్ కాలనీ, శారదా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ బదిలీపై వచ్చే పోలీసు సైకిల్‌పై వస్తాడని, వెళ్లేటప్పుడు కారులో వెళతాడనే ప్రతీతి కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందీ? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూలై 26వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతం. కూబర్నగర్ పోలీస్ చౌక్‌కు చెందిన సబ్ ఇనిస్పెక్టర్ డీకే మోరీ కాలనీకి వ్యక్తిగత కారులో వచ్చారు. పెట్రోలింగ్‌కు వచ్చినట్లు చెప్పుకున్నారు. ఓ రోడ్డులో స్కూటర్‌ను ఆపిన ఓ యువకుడితో ‘స్కూటర్‌ను అలా పార్క్ చేయడం ఏమటి’ అంటూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న ఆయన భార్యను అసభ్య పదజాలంతో దూషించారు. చుట్టుపక్కల వారు కూడా ఎస్సైనే దూషించడంతో రెచ్చిపోయిన డీకే మోరీ వెళ్లి అహ్మదాబాద్ ఫోర్త్ జోన్ డిప్యూటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్‌కు వచ్చిన తనపై, తన సిబ్బందిపై ఛరానగర్ వాసులు భారీ ఎత్తున రాళ్లు విసురుతున్నారని, అదనపు బలగాలు కావాలని కోరారు. దాంతో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని నవ నరోడా నుంచి 80 మంది పోలీసులు, శారదా నగర్, నరోడా, మెఘాని నగర్, గాంధీనగర్ నుంచి దాదాపు 320 మంది పోలీసులు లాఠీలతో వచ్చి విచక్షణా రహితంగా దాడులకు దిగారు. 29 మందిని అరెస్ట్ చేశారు, వారిపైనా వివిధ దోపిడీలు, దొంగతనాల కింద కేసులు బనాయించారు. గాయపడిన వారిలో ఫొటో జర్నలిస్ట్ ప్రవీణ్ ఇంద్రేకర్, వస్త్రాల వ్యాపారి 40 ఏళ్ల అతులు డేకర్. అనితా తమాంచేలు అసలు ఎం జరిగిందో మీడియాకు వివరించారు. అందుకు వారి వీడియోలే సాక్ష్యం. జూలై 29 నగరంలో మౌన ర్యాలీ పోలీసుల దాడికి వ్యతిరేకంగా ఛరానగర్ వాసులు దాదాపు ఐదువేల మంది మౌనంగా ర్యాలీ తీశారు. ర్యాలీలో మహిళలతోపాటు పిల్లలు పాల్గొన్నారు. ర్యాలీని వీక్షించేందుకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ సింగ్‌కు పిల్లలు గులాబీ పూలు అందజేశారు. పూలు అందుకున్న ఆయన ఛరానగర్వాసులకు క్షమాపణలు చెప్పారు. పోలీసు దాడులపై అంతర్గత దర్యాప్తునకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత దర్యాప్తులో ఏమి తేలిందని డిప్యూటి పోలీసు కమిషనర్ నీరజ్‌ను మీడియా ప్రశ్నించగా, కేసులో పోలీసులే నిందితులవడం వల్ల దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని వారి నుంచి ఇంకా నివేదిక రావాల్సి ఉందన్నారు. మమ్మల్నీ ఇంకా ఎందుకు ఇలా చూస్తున్నారు? ‘మా ఆదీవాసీల్లో లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు, నటులు, కళాకారులు, గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. మాలో నూటికి నూరు శాతం అక్షరాస్యులు ఉన్నారు. మా పూర్వులు నేరం చేశారో, లేదోగానీ మమ్మల్ని మాత్రం ఇంకా నేరస్థులుగా చూడడం అన్యాయం’ అని ఓ థియేటర్ ఆర్టిస్ట్ డాక్సిన్ ఛరా వ్యాఖ్యానించారు. మహా రచయిత్రి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మహా శ్వేతాదేవీ, ఫిల్మ్ మేకర్ గణేశ్ దేవీ కలిసి ఏర్పాటు చేసిన ‘బుధాన్ థియేటర్ గ్రూప్’లో సభ్యుడు డాక్సిన్ ఛరా. ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే ఛరానగర్లో పలు సామాజిక అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గ్రూపులో శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులు పోలీసు దాడులపై నాటకాలు రూపొందిస్తుండగా, మరికొందరు డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. -
అన్యాయంగా పోలీసులు దాడి
-
ఊరు మారింది
గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలి తాలూకాలో ఓ కుగ్రామం.. హాల్పట్టి. ఆదివాసీలు నివసించే గ్రామం అది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పాఠం చెబుతోంది. ఓ నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్లలో ఒకతడి కంఠం ఖంగుమంది ‘వీళ్లకు పాఠాలు చెప్పడం ఆపెయ్. వీళ్లంతా చదువరులైతే రేపు మా పొలాల్లో పనులు చేసేదెవరు’ అని హుంకరించాడతడు. హాల్పట్టి పొలాలన్నీ జమీందారుల చేతుల్లోనే ఉన్నాయి. చిన్న రైతులు, ఆదివాసీల పొలాలు కూడా వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోయాయి. పంటలు సరిగ్గా పండక, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు పెరిగిపోవడంతో పొలాలు అప్పులోకే జమయ్యాయి. ఆ రైతులు తమ పొలాల్లోనే కూలీలయ్యారు. అప్పుడొచ్చింది సౌమ్య! హాల్పట్టి గ్రామంలోని ఆదివాసీ మహిళలకు కొడవలి చేతపట్టి పొలం పనులు చేయడమే కాదు, అదే చేతుల్తో రోజూ ఇంట్లో చేసే పనులతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే కొత్త ఆలోచనకు బీజం వేసింది సౌమ్య. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఢిల్లీలో హిందూ కాలేజ్ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసింది. అనేక స్టార్టప్ కంపెనీలకు మార్కెటింగ్ చేసింది. మార్కెటింగ్ రంగంలో మంచి సంపాదన ఉంది. మార్కెటింగ్ కంటే దానికి మూలమైన ఉత్పత్తి రంగం మీద ఆసక్తి పెరిగిందామెకు. అలా మొదలైందామె ప్రయాణం. గుజరాత్‌లోని బార్డోలి తాలూకా, హాల్పట్టి ఆదివాసీ తండా ఆమె కార్యక్షేత్రమైంది. స్థానిక మహిళలను చైతన్యవంతం చేసింది. అగాఖాన్ రూరల్ సపోర్టు ప్రోగ్రామ్ ద్వారా ఇరవై వేల రూపాయలతో వారికి గ్రైండర్, తిరుగలి తీసిచ్చింది. ఇద్దరే ముందుకొచ్చారు ఆ మహిళలు చేయాల్సింది కొత్తగా ఏమీ లేదు, రోజూ ఇంటి కోసం చేసుకునే మసాలాలనే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేయాలి. ఎండు మిర్చితో కారం, పసుపు కొమ్ములను ఎండబెట్టి పసుపు పొడి చేయడం వంటివే. పని చేయడానికైతే అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక బ్రాండ్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టడానికి వెనుకడుగు వేశారు. ముప్పై మందిలో వ్యాపారం మొదలు పెట్టడానికి ధైర్యం చేసింది పాతికేళ్ల సోనమ్ బెన్, శోభన్‌బెన్‌లు మాత్రమే. తేజ్ మసాలా పేరుతో తయారు చేసి, తమ ఉత్పత్తులను తామే విక్రయించుకుంటున్నారు. పంచాయితీ భవనమే ఫ్యాక్టరీ ఈ మహిళలు అంతా కలిసి పని చేయాలనైతే అనుకున్నారు కానీ ఎక్కడ చేసుకోవాలి? ఒక చోట కూర్చుని పని చేసుకోవడానికి ఎవరివీ అంత విశాలమైన ఇళ్లు కాదు. ముడిసరుకు నిల్వ చేయడానికి అనువైనవి కూడా కాదు. ఎంత కరకుగా ఉన్న ఊరి పెద్దలయినా సరే... ఆడపిల్లలు ముందుకొచ్చి పని చేసుకుంటామంటే ముచ్చటపడతారు. అలాగే ఊరిపెద్ద గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఒక గది ఇచ్చాడు. కారం, పసుపు, గరం మసాలా, మసాలా చాయ్ పౌడర్, చికెన్‌మసాలా, కొత్తిమీర– జీలకర్ర మసాలా, పావ్‌భాజీ మసాలా, పులావ్ మసాలాలు తయారయ్యాయి. 50, 100 గ్రాములు తూకం వేసి, ప్యాకింగ్ మెషీన్‌తో ప్యాక్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఇక హైవే మీద ఒక గుడారం వేసి టేబుల్ వేసుకున్నారు. అదే వారి దుకాణం. నెలకు పాతిక కిలోల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ దుకాణంతోపాటు వారం వారం సంతలకు కూడా వెళ్తారు. తేజ్ మసాలా హైవే మీద ప్రయాణించే దూరప్రాంతాల వాళ్లను చేరింది, కానీ ఉన్న ఊళ్లో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. ఆదివాసీ మహిళలు ఇంటింటికీ వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ‘ఒకసారి వాడి చూద్దాం’ అని తీసుకున్న వాళ్లు వీటికి మంచి మార్కులు వేయడంతో డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా మంచి ఫలితాలనే ఇస్తోంది. ఐదు నెలల పాటు తాజాదనం తగ్గని క్వాలిటీ కూడా డిమాండ్ పెరగడానికి ఓ ప్రధాన కారణం. ‘ఉత్పత్తిని ఇంకా పెంచాలి’ నెలకు నలభై కిలోల మసాలాలు తయారవుతున్నాయిప్పుడు హాల్పట్టిలో. ఒక్కొక్కరికి నెలకు నికరంగా ఐదు వేల రూపాయలు మిగులుతున్నాయి. డిమాండ్ ఉంది. కాబట్టి నెలకు 80 కిలోలకు పెంచడం ఇప్పుడు వారి లక్ష్యం. వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేస్తున్నారిప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మార్కెట్ జోన్ కనిపించింది. బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు వీరి ఉత్పత్తులను కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ తమ సొంతమైతే పరిశ్రమను విస్తరించడానికి మరెంతో సమయం పట్టదని ధీమాగా చెప్తున్నారు. అవకాశం వస్తే తన ఉనికిని చాటు కోవడానికి మహిళలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో బతుకీడుస్తున్నా సరే, చిన్న అవకాశాన్ని పట్టుకుని ఎదిగి తీరుతారు. – మంజీర -
మా ఊళ్లో మా రాజ్యం
హైదరాబాద్: ‘ మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో ఆదివాసీ పోరాట సమితి నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధానమైన డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు తెలంగాణ రాష్ర్ట సీఎస్‌తో కూడా గురువారం చర్చించారు. సీఎస్‌తో ఆదివాసీల చర్చలు విఫలమయ్యాయి. ఎస్టీల జాబితా నుంచి లంబాడా కులస్తులను తొలగించేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆదివాసీ నాయకులు గురువారం రాత్రి నుంచే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు స్పందిస్తూ..ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, మా డిమాండ్లపై స్పష్టత రాలేదని, జూన్ 2న నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. -
సాయుధ పోరులో కోయబెబ్బులి
కోయబెబ్బులిగా ప్రసిద్ధి చెందిన సోయం గంగులు నిజాం రాజ్యంలోని దట్టమైన పాల్వంచ (పాత తాలూక) అటవీ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర అనే కోయ గూడెంలో జన్మించాడు. గంగులు ఉద్యమ (రహస్య) జీవితం దశలుగా కన్పిస్తుంది. మొదటి దశలో నిజాం వ్యతిరేక పోరాటంలో గంగులు దళ నాయకుడిగా కీలక బాధ్యత వహిం చాడు. రెండవ దశలో పాల్వంచ అటవీ ప్రాంతాన్ని కమ్యూ నిస్టుల ముఖ్య స్థావరంగా మార్చడంలో కీలక భూమిక పోషించాడు. మూడవ దశలో యూనియన్ సైన్యాన్ని ధిక్క రించి వీరోచితంగా పోరాడాడు. గంగులు యవ్వనంలో వేలేర్పాడు మండలం పేరంటాల పల్లిలో బాలానందస్వామి అక్కడి కొండ రెడ్డి, కోయ జనులకు విద్యా బుద్ధులు నేర్పుతూ, తిండి గింజలు పంచి ఆదు కున్నాడని విన్నాడు. ఆయన అనుచరుడైన సింగ రాజు దళంలో చేరి కమాండర్‌గా ఎదిగిన గంగులు నాటి ఉద్యమంలోని సంఘటిత శక్తిని అంచనా వేశాడు. 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోని కమ్యూనిస్టు దళంలో చేరిపో యాడు. సీపీఐ పార్టీ లోని వివిధ కమి టీలతో గ్రామ కమిటీల నిర్మాణం చేశాడు. పార్టీలో సెంట్రల్ కమాండర్‌గా ఎదిగిన గంగులు గెరిల్లా దళాల నిర్మా ణంలో కీలక పాత్ర పోషించాడు. సోయం గంగులును మట్టుబెడితే తప్ప పాల్వంచ అటవీ ప్రాంతాల్లో ఉద్యమాన్ని అణచ లేమని పెత్తందారులు భావించారు. ఆయనకు సమీప బంధువైన ఒక స్త్రీని కోవర్టుగా చేసి. ఆమె ఇచ్చిన జీలుగు కల్లు తాగిన మైకంలో స్పృహ కోల్పోయిన గంగులును సైన్యం బంధించి చిత్ర హింసలు పెట్టారు. పార్టీ రహస్యాలేమీ చెప్పని గంగులును రుద్రాక్షపల్లిలోని రావిచెట్టుకు కట్టేసి, 1951 మే 12న కాల్చిచంపి నిస్సిగ్గుగా ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు.మహోజ్వల ఆదివాసీ సమాజాన్ని స్వప్నిం చిన మహా ఆదివాసీ యోధుడు సోయం గంగులు దొర పేరును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పెట్టాలి. (మే 12 సోయం గంగులు 66వ వర్ధంతి) – వూకె రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 98660 73866 -
లంబాడాలను తొలగించేదాకా.. లడాయే
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్‌బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్, గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య, పాండురంగ్, మారుతి, జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్, వెంకటేశ్ హైమన్‌డార్ఫ్ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. అస్తిత్వం కోసమే పోరాటం మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉద్యమించక పోతే మనల్ని క్షమించరు ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. – ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
ఆదివాసీ మధు కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
కొచ్చి: ఆహారం దొంగలించినందుకు ఆదివాసి యువకుడు మధును కొట్టిచంపిన ఘటనపై కేరళ హైకోర్టు స్పందించింది. ఈ ఘటనపై సమోటో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేరళలోని అత్తపడిలో కేవలం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేని ఆదివాసీ వ్యక్తి అయిన అతన్ని కట్టేసి దారుణంగా కొట్టడమే కాదు.. ఆ సమయంలో అతనితో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఈ దారుణం ఒక్క కేరళనే కాదు యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (కెల్సా) ఇన్చార్జ్గా ఉన్న జస్టిస్ కే సురేంద్రమోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ‘మన సమాజానికి, రాష్ట్రానికి ఈ ఘటన సిగ్గుచేటు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల మనం సిగ్గుతో తలదించుకోవాలి’ అని లేఖలో సురేంద్రమోమన్ పేర్కొన్నారు. ఈ ఘటనలోని తీవ్రత దృష్ట్యా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించి.. ఈ కేసును సుమోటోగా విచారించాలని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటోనీ డొమినిక్ నిర్ణయించారు. ‘గిరిజన ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ సంస్థలు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పేదరికం తగ్గించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు సైతం కృషి చేస్తున్నాయి. అయినా మధు ఆహారం దొంగలించే పరిస్థితులు ఏర్పడటం.. ప్రభుత్వ పథకాలు అంత సమర్థంగా అమలవ్వడం లేదని చాటుతున్నాయి. ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందేందుకు ఈ పథకాల్లో అవసరమైన మార్పులు చేయాల్సి ఉంది. ఇది సమాజానికి కళ్లు తెరిపించే ఘటన. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సమీక్షించి..సమగ్ర మార్పులు చేయాల్సిన అవసరముంది’ అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. -
ఉట్నూర్ సమస్యకు పరిష్కారం!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ, లంబాడీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్ప గా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూ ర్కు తరలివచ్చింది. శనివారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లతో కలిసి హెలికాప్టర్లో ఉదయం ఉట్నూర్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో గడిపారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులతో, ఆపై ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చలు జరిపారు. మీడియాను ఈ సమావేశాలకు అనుమతించలేదు. శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి: సీఎస్ ఎస్పీ సింగ్ ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు జరగడంతో శాంతిభద్రతలపై కొంత ప్రభావం చూపిందని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసు, అధికారులతో చర్చలు జరిగాయని తెలి పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆయా కమ్యూనిటీ లీడర్లతో ముఖా ముఖి చర్చించామన్నారు. శాంతి స్థాపన కోసం సహకారం అవసరమని కోరగా, అందుకు ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత కలెక్ట ర్లు, ఎస్పీలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. చర్చల్లో అదనపు డీజీపీ అంజనీకుమార్, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీలు విష్ణు ఎస్.వారియర్, కల్మేశ్వర్‌లు పాల్గొన్నారు. చర్చలపై అసంతృప్తి.. చర్చలపై ఆదివాసీ, లంబాడీలు అసం తృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు. హక్కుల సాధన కోసం ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని అన్నారు. వారితో కలసి చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు. మరో ఆదివాసీ సం ఘం నేత బొంత ఆశరెడ్డి మాట్లాడుతూ చర్చలు పూర్తి కాలేదని, సీఎంను పిలవాలన్నారు. గవర్నర్ ఆదివాసీల దగ్గరికి రావాలన్నారు. లంబాడీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు ఆడపిల్లలను అమ్ముకుంటున్న సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని, 45 రోజులుగా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయన్నారు. -
ఆదివాసీ, లంబాడీలతో చర్చలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆదిలాబాద్ : ఆదివాసీ, లంబాడీల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం ఇరువర్గాలతో చర్చలకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం వారితో చర్చలు జరిపినవారిలో ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ వై.నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఉన్నారు. మొదట ఆదివాసీ నాయకులతో ఐటీడీఏ కార్యాలయం లో, ఆ తర్వాత రాత్రి కుమురంభీం కాంప్లెక్స్ లో లంబాడీ నాయకులతో అధికారులు చర్చించారు. జిల్లాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కలిసిరావాలని అధికారులు కోరారు. చర్చలు ముగిసిన తర్వాత వేర్వేరుగా మీడి యాకు వివరాలను తెలియజేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం ఆగదని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు అధికారులకు స్పష్టం చేశారు. కుమురంభీం విగ్రహానికి చెప్పులదండ వేసిన వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు మర్సకోల తిరుపతి, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలస లంబాడీలకు వ్యతిరేకమే... లంబాడీలకు పూర్తిస్థాయి రక్షణ ప్రభుత్వం కల్పించాలని ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్‌సింగ్ తిలావత్ చర్చల్లో అధికారులను కోరారు. లంబాడీలు ఎస్టీలు కాదనే హక్కు ఎవరికీ లేదని అన్నారు. వలస లంబాడీలకు తాము కూడా వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో లంబాడీ నేతలు జాదవ్ రమణానాయక్, రామారావు, భరత్ తదితరులు ఉన్నారు. సద్దుమణిగిన ఘర్షణలు.. ఏజెన్సీలో సోమవారం ఘర్షణలు సద్దుమణిగాయి. పాత జిల్లా పరిధిలో పోలీసు పహారా కొనసాగుతుంది. ముగ్గురు ఐజీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఎలాంటి సంఘటన చోటుచేసుకోలేదు. -
చెట్లు నరికి రోడ్డుపై వేసిన ఆదివాసీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి / నిజామాబాద్ : ఆదివాసీల ఆందోళన ఉధృతమవుతోంది. ఇప్పటికే కుమ్రంభీం విగ్రహానికి చెప్పుల దండ వేసిన సంఘటనపై ఉట్నూరు ఏజెన్సీలో అట్టుడికి పోతుండగా తాజాగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ధర్మకర్తల కమిటీ నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పస్రా-తాడ్వాయి మధ్య రహదారిరని స్తంభింపజేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసి రహదారిపై అడ్డంగా వేశారు. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్ళి రహదారిపై అడ్డంగా వేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఆదివాసీ-లంబాడీల ఘర్షణల నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏజెన్సీలో శాంతిభద్రతలను ఐజీలు అనిల్ కుమార్, నాగిరెడ్డి, చౌహాన్, డీఐజీ రవివర్మ పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ సమీప జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిన పోలీస్ అధికారులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల క్రితం మేడారంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశం రసాభాసాగా జరిగిన విషయం విదితమే. సమావేశానికి వచ్చిన మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక 15 వాహనాలను ఆదివాసీలు ధ్వంసం చేశారు. రోడ్డెక్కిన లంబాడీలు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండా వాసులు రోడ్డెక్కారు. తండాలోని లంబాడీలు అందరూ శనివారం ఉదయాన్నే జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులను ప్రభుత్వం వెంటనే ఆపివేయించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. -
ఆదివాసీ-లంబాడీల వివాదం హింసాత్మకం
-
ఆదివాసీల ఆందోళన హింసాత్మకం
సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు. -
'లంబాడీలను తొలగించాల్సిందే'
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఆదివాసీల ఆత్మగౌరవ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొమురం భీం మనువడు కొమురం సోలేవాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఆదివాసీల నుంచి తొలగించాల్సిందేనన్నారు. కొమురం భీం పోరాట స్పూర్తితో ముందుకెళ్దామన్నారు. ఆదివాసీలకంటూ ప్రత్యేక రిజర్వేషన్ కావాలని సోలేవాల్ డిమాండ్ చేశారు. కాగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది ఆదివాసీలు సభకు హాజరయ్యారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్ తో ఆదివాసీలు సభ నిర్వహిస్తున్నారు. -
కదంతొక్కిన ఆదివాసీలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో ఆదివాసీలు కదంతొక్కారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు జిల్లా కేంద్రం లో కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భారీ ర్యాలీ చేపట్టారు. లంబాడీల ను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగదన్నారు. 1977 నుండి ఎస్టీలుగా చలామణి అవుతున్న పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన లంబాడీలు ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఎస్టీలుగా గుర్తింపుతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకగారి భూమయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 9 వరకు వేచి చూస్తాం ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో డిసెంబర్ 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు. ఆదివాసీలు సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. -
ఇద్దరు ఆదివాసీ గిరిజనులపై దాడి
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హీరాపూర్ సమీపంలో జైనూర్ మండలం పానపటా ర్కు చెందిన ఆదివాసీ గిరిజనులు సుదర్శన్, ఆమృత్‌రావ్‌లపై ఆదివారం ఐదుగురు వ్యక్తు లు దాడి చేశారు. దీంతో సుదర్శన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికీ ఉట్నూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సడికే సుదర్శన్, సిడాం అమృత్‌రావులకు ప్రేం, వినోద్, శ్రీను, సుధాకర్, ప్రభాత్ అనే వ్యక్తులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అమృత్‌రావు, సుదర్శన్‌లు జైనూర్ వైపు వెళ్తుండగా, వారిని వెంబడించి హీరాపూర్ సమీపంలో దాడికి పాల్పడ్డారు. సుదర్శన్ ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ గణపత్ జాదవ్ తెలిపారు. ఈ దాడికి నిరసనగా సోమవారం ఆదివాసీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డీఎస్పీకి, ఐటీడీఏ ఏపీవో జనరల్ కుమ్ర నాగోరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయన్న, సీఐ సతీశ్‌లు హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఈ దాడికి నిరసనగా మంగళ వారం ఆదివాసీ సంఘాలు ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చాయి. ‘భద్రాద్రి’లో భారీ ధర్నా కొత్తగూడెం అర్బన్: లంబాడీలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఆదివాసీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కలెక్టరేట్‌ను ముట్టడించింది. ఆదివాసీలు, మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు నాగేశ్వరరావు, సిద్దం కిశోర్, ఆదివాసీ నిరుద్యోగ ఐక్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం, గోరుకొండ ప్రభుత్వ పాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న లంబాడా తెగకు చెందిన నలుగురు ఉపాధ్యాయులను సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీనిపై టీచర్లు ఎంఈఓ జుంకీలాల్‌కు ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యుల మూకుమ్మడి రాజీనామా ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్‌కి చెందిన వార్డు సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉప సర్పంచ్ పేందోర్ సునీతా, వార్డు సభ్యు లు ఆత్రం కవిత, ఆత్రం పూర్ణ బాయి, పెందోర్ కైలాస్, మర్సుకోల లక్ష్మీబాయి, ఆత్రం గంగారాం, ఆడా ముత్యా లు, మర్సుకోల సురేశ్, నైతం లింగన్న, ఉయిక జంగుబాయిలు రాజీనామా చేశారు. -
‘ఎస్టీ’ నుంచి లంబాడీలను తొలగించాలి
ఉట్నూర్(ఖానాపూర్): ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకూ ఆదివాసీలందరూ ఒక్కటై పోరాటం చేస్తారని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ స్పష్టంచేశారు. మరో ఇంద్రవెల్లి ఘటన పునరావృతం కాకముందే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం నుంచి ఉట్నూర్‌లోని ఐటీడీఏ వరకు సుమారు 19 కిలోమీటర్ల మేర ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు, ఆర్డీవో విద్యాసాగర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సోయం బాపూరావ్ మాట్లాడుతూ... ‘1976లో నాటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాయి. నాటి నుంచి అసలైన ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. షెడ్యూల్డ్ తెగలో గోండు, కోలాం, తోటి, నాయక్‌పోడ్, మన్నెవార్, కోయ, ప్రధాన్, ఆంద్ జాతులను రాజ్యాంగం ఆదివాసీలుగా గుర్తించి అభివృద్ధి ఫలాలు అందించాలని పేర్కొంది. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన నాటి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక ఫలాలు నిజమైన ఆదివాసీలకు అందకుండా పోతున్నాయి’అని అన్నారు. ఇటీవల ఆదివాసీ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, జోడేఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహణలో విఫలమైన జిల్లా కలెక్టర్ చంపాలాల్, లంబాడీ అధికారులను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తుంటే అధికారులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు.. ఆదివాసీలు గిరిజనేతరులకు వ్యతి రేకం కాదని, తమ మనుగడ కోసం చేస్తు న్న ఉద్యమానికి గిరిజనేతరులు మద్దతు ఇవ్వాలని బాపూరావ్ పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి మద్దతు ఇస్తే గిరిజనేతరులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. వచ్చేనెల 9న ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజ్జు, ఆంద్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముకాడే విష్ణు, గోడ్వాన రాయిసెంటర్ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, కోలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావ్, ఏఎస్యూ కుమురం భీం జిల్లా ఇన్చార్జి కోట్నాక్ గణపతి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి భూపతి, ప్రధాన్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క పాల్గొన్నారు. -
ఆదివాసీల భారీ ర్యాలీ
సాక్షి, ఆసిఫాబాద్: కుమ్రం భీం జిల్లాలోని ఆదివాసీలకు కోపమొచ్చింది. తమ వర్గానికి చెందిన వారిని అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సంఘాలు గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆదివాసీలు అక్కడ పార్క్ చేసి ఉన్న పలువురు అధికారుల కార్ల అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆదివాసీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలు మండలాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. తొలుత ర్యాలీ తీసి, అంతర్ రాష్ట్ర రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఐక్యకార్యాచరణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం అనంతరం వేలాది సంఖ్యలో ఆదివాసీలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో పార్కింగ్ చేసిన జేసీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇరిగేషన్ ఈఈ, జిల్లా వ్యవసాయ అధికారి, సీపీవో వాహనాలపై దాడి చేశారు. ఒక దశలో కార్యాలయ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. వేలాది సంఖ్యలో బైఠాయించిన ఆదివాసీలను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చి ఆదివాసీలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. జోడేఘాట్లోని కుమ్రంభీం మ్యూజియంలో ఉన్న లంబాడీ తెగకు చెందిన శాంకిమాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 5న కాల్చివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా లంబాడీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు దాదాపు 20 మందిపైగా ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని, కలెక్టర్ చంపాలాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీల సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. -
ఆదివాసీల విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్ర
మేడారం చేరుకున్న షెడ్యూల్ ఏరియా పరిరక్షణ సమితి బస్సు యాత్ర ఎస్‌ఎస్‌తాడ్వాయి : ఆదివాసీలను విచ్ఛినం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని షెడ్యూల్ ఏరియా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్, ప్రొఫెసర్ ఈసం నారాయరణ, రాష్ట్ర కోకన్వీనర్ అప్ప నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆదివాసీల జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జుడోఘట్ నుంచి పరిరక్షణ సమితి చేపట్టిన చైతన్య బస్సు యాత్ర ఆదివారం సాయంత్రం మేడారానికి చేరుకుంది. స్థానిక ఆదివాసీల నాయకులు బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయబద్దంగా బస్సు యాత్ర నాయకులను గద్దెలపైకి స్వాగతించారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేసేలా కేసీఆర్ మనస్సు మార్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6 షెడ్యూల్ భూగాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉండే ఆదివాసీలను మూడు, నాలుగు జిల్లాల్లో కలపడం సరి కాదన్నారు. ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, తెలంగాణ తెచ్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కోప్పుల రవి మాట్లాడుతూ అక్టోబర్ 7న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గిరిజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూజారుల సంఘం ఉపాధ్యక్షుడు చంద గోపాల్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ల పాపయ్య, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మైపతి సంతోష్, రేగ కిరణ్‌కుమార్, తుడుందెబ్బ మండల నాయకుడు శేషగిరితోపాటు ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పాల్గొన్నారు. 02ఎంయూఎల్407: సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న ఈసం నారాయణ, నాయకులు -
ఆదివాసీలను విడదీయొద్దు
ములుగును జిల్లా చేయాలి సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో ములుగు : షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీలను విడదీసే హక్కు ప్రభుత్వానికి లేదని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ భూభాగాన్ని విభవించరాదని రాజ్యాంగం, చట్టాలు చెబుతున్నా అవేమీ పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ప్రజాభిప్రాయాల మేరకు జరగాల్సి ఉన్నా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యమాలే ఉండవని చెప్పిన కేసీఆర్ నేడు జిల్లాల కోసం జరుగుతున్న ఉద్యమాలను ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్న ములుగును కాదని బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేయడం రాజకీయ లబ్ధికోసమేనని ఆరోపించారు. ములుగును జిల్లా చేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆందోళనకు వైఎస్సార్ సీపీ నాయకుడు కలువాల సంజీవ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు డివిజన్ ఇన్చార్జీ చెట్టబోయిన సారంగం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు కాకి రవిపాల్, ఎండబి. మునీంఖాన్, గుగులోతు సమ్మన్న, కనకం దేవాదాసు, మల్లేశ్, ఈర్ల నర్సింహస్వామి, అజ్మీరా హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు
కేయూ క్యాంపస్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలను సీఎం కేసీఆర్ ముక్కలు చేస్తున్నాడని మన్యసీమ రాష్ట్రసాధన సమితి జాతీయ కన్వీనర్ చందా లింగయ్య అన్నారు. ఆదివా రం ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), ఆదివాసీ విద్యార్థి సంఘం జేఏసీ, పలు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కేయూ దూరవిద్య కేంద్రంలోని జాఫర్‌నిజాం సెమినార్ హాల్లో సమావేశంలో నిర్వహించారు. ఇందులో ఐదో షెడ్యూల్ భూభాగాన్ని ఆదివాసీల జిల్లాలుగా చేయాలనే చర్చ జరిగిం ది. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక మన్యసీమ ఆదివాసీ రాష్ట్రం కోసం తెలంగాణ నుంచి వేర్పాటు ఉద్యమాన్ని విద్యార్థులతో ఉధృతం చేస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర పోలిట్‌బ్యూరో చైర్మన్ బూర్క పోచయ్య ఆదివాసీల ప్రాంతాలను పాలకవర్గాలు విధ్వం సం చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మైపతి అరుణ్‌కుమార్, బాధ్యులు వెంకట్, సాయిబాబా, జిల్లా అధ్యక్షుడు తాటి హన్మంతరావు, రవి, ఆలంకిషోర్, సిద్దబోయిన లక్ష్మినారాయణ, ఈసం సుధాకర్, ఇర్ప విజయ పాల్గొన్నారు. -
మావోలతో సంబంధాలంటూ దాడులు
ఆదివాసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తొగుట: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలే లక్ష్యంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తొగుటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దేహగాం, టెంపర్ గ్రామాలకు చెందిన సిడాం శ్రీనివాస్, కుడిమేత సుగునయ్యను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. మాజీ సర్పంచ్ సోయం చెన్నన్నకు మావో కార్యదర్శి దామోదర్‌తో సంబందాలున్నాయని పోలీసులు ఆరోపిస్తూ వేధిస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా నార్లాపూర్‌కు చెందిన సిద్దబోరుున శివరాజ్ అనే యువకుడిని జైలుకు పంపించారని ఆవేదన చెందారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణానికి 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలన్న హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ 123 జీఓతో భూసేకరణ చేస్తున్న అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అందుకే నిరుపేద రైతుల భూములు దౌర్జన్యంగా లాక్కుంటోందని ఆరోపించారు. అంతేగాక నల్లగొండ జిల్లా అంకపల్లి వద్ద ఒక్క టీఎంసీ రిజర్వాయర్ లీకేజీకి రిపేరు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాంటిది మైదాన ప్రాంతంలో 50 టీఎంసీలను నిల్వ సాధ్యం కాదన్నారు. పోడు భూములు లాక్కోవడంతో ఖమ్మం జిల్లా మరిగూడలో వెంకటేశ్వర్లు అనే ఆదివాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని లక్ష్మణ్ ఆరోపించారు. -
అడవితల్లికి దండాలో...
-
అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం
విశాఖ–కల్చరల్ : ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమష్టి జీవన పద్ధతులు, పారదర్శకతకు నిలువెత్తు సాక్ష్యాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీల సమాజానికి మూలవాసులులాంటి వారన్నారు. 22వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్ డాక్టర్ అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో మంగళవారం ఘనంగా జరిగింది. ఏయూ క్యాంపస్ గిరిజన విద్యార్థుల సంఘం, గిరిజన పరిశోధకులు, ట్రైబల్ టీచింగ్, నాన్‌టీచింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏయూ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు మాట్లాడారు. గిరిజన యువత చదువుకొని ఉపాధిని పొందిన తర్వాత తమ సమాజం వైపు కన్నెత్తి చూడటం లేదని..ప్రతి వ్యక్తి తమ మూలాలను మర్చిపోవద్దని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ ప్రపంచంలో నీతి, నిజాయతీ గల మనుషులెవరంటే ఆదివాసీ ప్రజలేనన్నారు. రెక్టార్ ప్రొఫెసర్ ఇ.ఎ.నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలను తప్పుదొవ పట్టించి గిరిజనుల వనరులను దోచుకొనే ప్రయత్నాలను గిరిజనులు తిప్పికొట్టాలన్నారు. సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి మాట్లాడుతూ రక్షణ కవచంలాంటి చట్టాలు, ఆదివాల చరిత్ర, హక్కులను భవిష్యత్తు తరాలకు చాటిచెప్పాల్సిన బాధ్యత గిరిజన యువతపై ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల సంపదను దోచుకోవడానికి భూస్వామ్య వర్గాలు మభ్యపెడుతుందని విమర్శించారు. ఉన్న కొద్దివనులునైనా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏయూ తెలుగు విభాగం ఆచార్య జె. అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఏయూ రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె. రవిబాబు, ప్రొఫెసర్లు ఎస్. ప్రసన్నశ్రీ, టి. సుబ్బరాయుడు,వీవీఎస్ ప్రసాదరావు, గిరిజన స్కాలర్స్ టి. జగత్రావు, బలరామ్, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు వంగపండు,ఉదయ భాస్కర్లు ఆలపించిన పలు ప్రజా గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ‘థింసా’15వ వార్షిక మాసపత్రికను ఏయూ వీసీ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా గిరిజన పరిశోధకులు, ఏయూ గిరిజన అచార్యలు కలిసి వీసీ నాగేశ్వరరావును, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఘనంగా సత్కరించారు. -
జీవన సౌందర్యం
-
జీవన సౌందర్యం
-
అరుకులో 9న జరిగే ఆదివాసీ దినోత్సవం
పెదవాల్తేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆరుకు పర్యటన ఖరాౖరైనట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈనెల 9వతేదీన విశాఖకు చేరుకుంటారు. అరుకుతోపాటు పలు కార్యక్రమాలులో సిఎం పాల్గొంటారు. ఆరోజు ఉదయం 11.30గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు కు బెంగళూరు నుంచి చేరుకుని, 12.30గంటలకు హెలికాప్టర్లో అరుకు చేరుకుంటారని కలెక్టర్‌తెలిపారు. తొలిత ఆధునీకరించిన పద్మాపురం ప్రారంభిస్తారు.అనంతరం హరిత రిసార్టులో గోష్టి సమావేశ మందిరంలో పెదలబుడు ప్రజలతో ముఖాముఖి లో పాల్గొంటారని చెప్పారు, అక్కడి నుంఇచ ఎన్టీఆర్గార్డెన్స్ చే రుకుని పంచాయితీరాజ్ ,గ్రామీణ నీటి సరఫరా ,గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివద్ది పనులు ప్రారంభోత్సవం చేస్తారు. శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సమాజంలో ఆదివాసీల పాత్ర వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అంశాలుంటాయన్నారు. ఆదివాసీ సంస్కతినిప్రతిబింబించే సాంస్కతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చే యనున్నట్లు పేర్కొన్నారు. సిఎం పర్యటనపై జిల్లా అధికారులతో కలెక్టర్‌సమీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా నఅన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పెదలబుడు గ్రామస్థులతోముఖాముఖీ పంచాయతీ పరిధిలో 22 గ్రామాల ప్రతినిధులు, మండలస్థాయి అధికారులంతా పాల్గొనాల్సి వుంటుందన్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి 12 నుంచి 15వేల మంది గిరిజనులు హాజరయ్యే అవకాశం వుందని భావిస్తూ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. సి ఎం పర్యటనలో భాగంగా ఎన్టీ ఆర్ మైదానం లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏపీడీ ఆర్పి ,గ్రామీణ ఉపాధిహామీ ,నబార్డు, సి ఆర్ ఆర్ నిధులతో గిరిజన ప్రాంతాలలో చూ.38.36 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన లకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆశాఖ ఎస్ఈ గజేంద్ర వివరించారు. పి ఎంజీ ఎస్ వై నిధులతో పాడేరు ఏజన్సీలో రూ.29.14కోట్ల తో నిర్మించిన 10రోడ్లను కూడా సి ఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో ఏజన్సీ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ.14.30కోట్ల వ్యయంతో చేపట్టనున్న పథకాలను శంకుస్థాపన చేసుందకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ ఈ ప్రభాకరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నమని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. అరకు నుంచి తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5.30గంటలకు చేరుకుని అక్కడ పలు కార్యక్రమాలు పాల్గొంటారని తెలిపారు. నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగర పోలీసులకు సమకూరుస్తున్న జీపిఎస్అనుసంధానం చేసిన 25 మోటరు సైకిల్ ప్రారంభం ,బ్రిక్స్ సదస్సు నిర్వహణ లో భాగంగా రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విజయనగరం కలెక్టర్ ఆధ్వర్యం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసిత రైతులు మాట్లాడుతారని తెలిపారు. ఎయిర్‌పోర్టులలో కార్యక్రమాలు ఆర్డివో సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. మండలాల నియమితుౖలైన నోడల్ అధికారులంతా వచ్చే గురువారం నుంచి తమకు కేటాయించిన మండాలలోగ్రామ సందర్శన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో నిర్వహించాలని, అనంతరం తనకు నివేదికలు సమర్పించాలన్నారు.ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ –2 డి.వెంకటరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసి విద్యార్థి సంఘం పేరిట అసత్య ఆరోపణలు
ఏయూ క్యాంపస్: మావోయిస్టు కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఆదివాసి విద్యార్థి సంఘం పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసత్య ప్రకటనలు చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు డాక్టర్ ఎల్.మధు అన్నారు. శనివారం ఉదయం ఏయూ ఫ్యాకల్టీక్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమ సంస్థ మావోయిస్టులకు వ్యతిరేకంగా ఎటువంటి పోస్టర్లను విడుదల చేయలేదని వివరణ ఇచ్చారు. తమ సంస్థ కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రమే ఏర్పాటయిందని, పోలీసులకు, ప్రభుత్వానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఉండే సంఘం కాదని స్పష్టం చేశారు. ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా మన్యంలో వెలసిన పోస్టర్లతో తమ సంస్థకు సంబంధం లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.లోవరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఆదివాసి విద్యార్థి సంఘంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన దుష్పచారం చేస్తున్నారన్నారు. దీనిని తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ తమకు రాజకీయ పార్టీతోను, మావోలతోను, పోలీసు వ్యవస్థలతోను ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను ఎవ్వరూ పరిగణించరాదని విజ్ఞప్తి చేశారు. ప్రతికా ముఖంగా ప్రభుత్వానికి, మావోయిస్టులకు, పోలీసులకు కూడా వాస్తవాలను తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యంగి ప్రసాద్, విద్యార్థులు బాబురావు, లక్ష్మణ్, మణికాంత్, ఎస్.టి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ధర్మారాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్కరికి !
మేడారం జాతర కమిటీలో ఏకైక ఆదివాసీ... ‘పునరుద్ధరణ’ కూర్పుపై విమర్శలు ఆదివాసీ వర్గీయుల్లో అసంతృప్తి వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో స్థానికుల పాత్ర ఉండేందుకు ఆలయ కమిటీ ఉంటుంది. కోర్టు వివాదం నేపథ్యంలో ఆలయ కమిటీకి బదులుగా దేవాదాయ శాఖ ఇటీవల ‘సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీ’ని నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ వేశారు. అరుుతే, పూర్తిగా ఆదివాసీలకు సంబంధించిన ఈ జాతర పునరుద్ధరణ కమిటీలో ఈ వర్గం వారికి ప్రాధాన్యం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదివాసీల పాత్ర ఎక్కువగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం... తొమ్మిది మందిలో ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతర, ఆలయ కమిటీల్లో అధికార పార్టీ నేతలను సభ్యులుగా నియమించడం సహజంగా జరిగే విషయమే. తాజా పుననరుద్ధరణ కమిటీలోనూ ఇదే జరిగింది. ఇలా అధికార పార్టీ నేతలతో నియమించిన కమిటీలో ఆదివాసీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మేడారం జాతర ప్రాంతం ఉండే ములుగు నియోజకవర్గం నుంచి ఎ.చందులాల్ గిరిజన మంత్రిగా ఉన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీలో తమ వర్గం వారికి ప్రాధాన్యం కల్పిస్తే సమంజసంగా ఉండేదని ఆదివాసీ సంఘాల నేతలు అంటున్నారు. ‘వన జాతర పునరుద్ధరణ కమిటీలో మా వర్గం వారికి ప్రాధాన్యం ఇవ్వకపోగా అగ్రవర్ణాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆదివాసీల జాతరలో మా పాత్ర ఏమిటో మాకే అర్థం కావడలేదు’ అని మాజీ ప్రజాప్రతినిధి ఒకరు వాపోయా రు. మేడారం జాతర కమిటీ పూర్తిగా ఒకరిద్దరు అధికార పార్టీ ముఖ్య నేతల సొంత వ్యవహారంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఆదివాసీల నేతల వ్యాఖ్యలకు తగినట్లుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తొమ్మిది మంది సభ్యు ల కమిటీలో ఒక్కరే ఆదివాసీ వ్యక్తి ఉన్నారు. మిగిలిన వారిలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కాకుండా ఇతర వర్గం వారు ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమ్మక్క-సారలమ్మ జాతర పునరుద్ధరణ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి పేరు కాక లింగయ్యది. తాడ్వాయి మండలం పడిగాపూర్‌కు చెందిన లిం గయ్య ఆదివాసీ గిరిజనుడు. గతంలో సీపీఐఎంఎల్ ప్రతిఘటన పార్టీలో కీలకంగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ములుగు నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. ప్రతి ఘటన పార్టీ కనుమరుగయ్యాక టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గోవిందరావుపేటకు చెందిన ఎస్.సాంబలక్ష్మీ(ఎస్సీ), ఏటూరునాగారానికి చెందిన దడిగెల సమ్మయ్య(నాయూబ్రాహ్మణ), మంగపేటకు చెందిన లొడంగి లింగయ్య(యాదవ)... ఎస్టీల్లో లంబాడి వర్గానికి చెందిన పోరిక కస్నానాయక్(మదనపల్లి), గిరిజన మంత్రి బంధువు అజ్మీరా జవహర్లాల్(సారంగాపూర్) సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు వ్యాపారులు సూరపనేని సాయికుమార్, పింగిలి సంపత్‌రెడ్డి, కొంపెల్లి రమణారెడ్డికి కమిటీలో చోటు కల్పించారు. -
ఆదివాసులను అడవుల నుండి గెంటివేస్తారా!
- కె.గోవర్దన్ గత 45 ఏళ్లుగా ఆదివాసీలు, ఇతర గిరిజను లు తెలంగాణ ఫారెస్టులో సాగు చేసుకుం టున్న పోడు భూములను బలవంతంగా లాక్కొని అడవిలో కలుపుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇం దుకై అటవీశాఖను ఉసిగొల్పుతున్నది. ఇప్పటికే పంటలను ధ్వంసం చేయడం, వ్యవ సాయ పరికరాలను స్వాధీనం చేసుకోవడం, భూముల చుట్టూ కంద కాలను తీయడం, పోడు చేసుకునే వారిపై కేసులుపెట్టి జైలుకు పంపిం చడం సాగిస్తున్నది. పోడుదారులపై సమరానికి సాయుధ పోలీసులను సైతం సిద్ధం చేస్తున్నది. ఈ పనులన్నీ సులువుగా చేసుకోవడానికి, కుట్రపూరిత పథకాలలో భాగంగా హరితహారం, పర్యావరణం, కోతు లబెడద లాంటి వాటిని అడ్డం పెట్టుకునే ప్రచారాన్ని ప్రారంభించింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వమని దశాబ్దాలుగా ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎత్తివేసిన దగ్గర నుంచి కమ్యూనిస్టు విప్లవకారుల నాయక త్వాన ఆదివాసులు ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళనలు చేస్తూనే ఉన్నా రు. ప్రతి ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప పోడు భూములకు పట్టాలు మాత్రం మంజూరు చేయలేదు. చివరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు దక్కడం లేదు. అరకొరగా కొంత మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన వారందరికీ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకున్నది. అధికార యంత్రాం గం తప్పుడు పద్ధతుల వల్ల లక్షలాది ఎకరాలలో సాగు చేసుకుంటున్న పోడుదారులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు. కాకతీయ రాజులకాలంలో అటవీ ప్రాంతంలో నిర్మించిన పాకాల, బయ్యారం లక్నవరం, రామప్ప, గణపురం వగైరా పెద్ద పెద్ద చెరువులు ఆదివాసుల ప్రయోజనాలకు కాకుండా గిరిజనేతరుల వ్యవసాయాలకు నెలవయ్యాయి. అందువల్లనే ఆదివాసులు తమ ప్రాంతాలు వదిలి అడ వి లోతట్టుకు పోవాల్సి వచ్చింది. అటవీ సరిహద్దుల భూములన్నీ గిరిజనేతరుల పాలైనాయి. దీంతో సహజవనరులతో బతికే ఆదివాసీ లకు జీవనాధారం దెబ్బతిన్నది. అడవి సంపదలు కోల్పోయి, వ్యవ సాయ భూములు కోల్పోయిన ఆదివాసీలకు పోడు వ్యవసాయమే జీవనాధారమైంది. అందువల్లనే గత్యంతరం లేక పట్టా హక్కులు లేకు న్నా దశాబ్దాల తరబడి పోడు భూమియే తమ జీవనాధారంగా వారు బతుకుతున్నారు. ఇంతలోనే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆదివాసీల, ఇతర గిరిజనుల సంక్షేమమే తమ ధ్యేయమంటూనే కొత్త రాగాలు మొదలు పెట్టింది. దశాబ్దాలుగా పోడు భూములుగా ఉన్న వాటిలో తొలకరిలో 3 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కొద్దికాలంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. మే నెలలో కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమా వేశంలో జులైలో 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు, వచ్చే ఏడాది 60 నుంచి 70 కోట్ల మొక్కలు నాటనున్నట్లు ప్రకటించారు. అటవీ అధికా రులకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు, భూఆక్రమణదారులపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. అంటే పొట్టకూటి కోసం పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులు కేసీఆర్ దృష్టిలో భూఆక్రమణదారులన్న మాట! వీరిని నిరంకుశ పీడీ చట్టం కింద జైలులో బంధిస్తాడన్నమాట! వీళ్ల పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకుంటున్న పొలాల్లో మొక్కలు నాటతారన్నమాట! జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ ఫారెస్టును మరో శేషాచలంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోందనిపిస్తోంది. ఆదివాసీల పోడు భూములకు పట్టాహక్కులివ్వాలి స్వతంత్రంగా బతకగలుగుతున్న పోడుదారుల భూములను కేసీఆర్ ప్రభుత్వం హరించడానికి కుట్ర చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం 1 ఆఫ్ 70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అడవి విధ్వంసానికి పైన పేర్కొన్న ప్రధాన కారణాలను అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దేశ, విదేశాల కార్పొరేట్ శక్తులకు అడవిని, కొండల్ని మైనింగ్‌లకు ఇవ్వడాన్ని మానుకోవాలి. రిజర్వ్ ఫారెస్టును అభివృద్ధి చేయడానికి, పాడటానికి అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూనే ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శషబిషలు లేకుండా పట్టాలు ఇవ్వాలి. (నేడు హైదరాబాద్‌లో పోడు భూముల పరిరక్షణ వేదిక ధర్నా) వ్యాసకర్త సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొబైల్: 98661 90514 -
ఆదివాసీలపై ప్రభుత్వాల కుట్ర
‘కంతనపల్లి’కి అడ్డుగోడలా నిలబడాలి : వట్టం ఉపేందర్ ఏటూరునాగారం : ఆదివాసీ గూడాలను, ఆదివాసేతర ప్రజలను జల సమాధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒడిగడుతున్నాయని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ అన్నారు. కంతనపల్లి వ్యతిరేక పోరాట మన పాదయాత్ర ఈనెల 9న తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మొదలై.. తుపాకులగూడెంలో ముగిసింది. ఈ మేరకు ఆదివారం ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభకు ఆదివాసీ రాష్ట్ర నాయకులు, కేయూ ప్రొఫెసర్లు హాజరై ప్రసంగించారు. ముందుగా గిరిజన నృత్యాలతో పాదయాత్ర విద్యార్థులను గ్రామస్తులు, నాయకులు స్వాగతించారు. అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ.. ఐదో షెడ్యూల్డ్ ప్రకారం కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అర్హతలు లేవన్నారు. రాజకీయ నాయకుల స్వాలాభాల కోసం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం పేరిట రూ.9,574 కోట్లు మింగారని, దీనంతటికీ కేవీపీ రాంచందర్ సూత్రధారని మండిపడ్డారు. దేవాదుల పేరిట మిం గిన నిధులు సరిపోక రాజకీయ నాయకులు కంతనపల్లితో జేబులు నింపుకోవడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు దబ్బగట్ల సుమన్ మాట్లాడుతూ.. బహుళ జాతి కంపెనీలకు ఖనిజాలు, బొగ్గు, సహజ వనరులను దోచిపెట్టడానికి ప్రజాప్రతినిధులు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారన్నారు. ఖనిజ సంపదను దోచుకెళ్లడానికి పన్నాగం పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ.. కంతనపల్లి ప్రాజెక్టు ఒక్క పునాది రాయిని కూడా వెయ్యనియవద్దన్నారు. ప్రాజెక్టుకు ఆదివాసీలు అడ్డుగోడలా నిలవాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో కంతనపల్లి ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు. తెలంగాణ ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఆనాడు ఆజాంజాయి మిల్‌ను మూసేసి.. నేడు కమలాపురం బిల్ట్‌ను అదే తరహాలో మూసివేయడానికి ప్రభుత్వాలు, యజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ఉపాధి లేని వ్యక్తి లేడన్నారు. కానీ ప్రభుత్వాల స్వార్థాల కోసం తెలంగాణ ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మంకిడి బుచ్చయ్య, ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆప్క నాగేశ్వర్రావు, విరసం నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్, గిరిజన జాక్ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, తుడుందెబ్బ నాయకులు గొంది సత్యనారాయణ, రమణాల లక్ష్మయ్య, పోడెం బాబు, మల్లెల రాంబాబు, చెరుకుల ధర్మయ్య, కోటి రవి, చంద రంఘుపతి, రాఘవరావు, పోడెం రత్నం, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు నల్లెల రాజయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూర్క యాదగిరి, తాడ్వాయి జెడ్పీటీసీ పులసం సరోజన, ఆదివాసీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
సాయుధ వసంతగీతం
ఉద్యమ నవల: 1980 దశకం మధ్యలో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో, అడవంచు పల్లెల్లో ప్రజల కోసం, ముఖ్యంగా ఆదివాసీలకు భూమి, భుక్తి, విముక్తి కోసం ఒక దళం సాగించిన పోరాటాన్ని, దాన్ని అణచడానికి ప్రభుత్వం అమలు చేసిన హింసా విధానాలను రాజయ్య తన రాజకీయ విశ్వాస కోణంలో సాహిత్య, కళాసౌందర్య విలువలను బలిపెట్టకుండా పరిచయం చేశాడు. జీవితం నిత్యబాధల రంపపు కోతలా మారిన వర్తమానంలో సాయుధ విప్లవం, గెరిల్లా పోరాటం, కాల్పులు, మందుపాతర్లు, కూంబింగ్‌లు, ఎన్కౌంటర్లు, దళాలు, ఇన్ఫార్మర్లు వంటి మాటలు మరింత భయంగొల్పుతాయి. అడవి అందాలను కవితల్లో, చిత్రాల్లో అనుభవించి, పలవరించే సామాన్యులకు అడవి కడుపులో చెలరేగుతున్న బడబానలం, పారుతున్న నెత్తుటి కాల్వలు, పురుడు పోసుకుంటున్న కొత్త ప్రపంచాల గురించి అంతగా తెలియకపోవచ్చు. తెలుసుకొని కలవరపడ్డమెందుకు, అరణ్య మధురస్వప్నాలను ఆవిరి చేసుకోవడమెందుకు అనుకునేవాళ్లు అల్లం రాజయ్య వీరగాథలా ఆలపించిన ‘వసంత గీతాన్ని’ అస్సలు వినకూడదు. పొరపాటున విన్నా చప్పున మరచిపోవాలి. లేకపోతే అది మన బుద్ధికి వేల పదునైన కొడవళ్లను వేలాడగట్టి ఎటూ కదలనివ్వదు. కదిలేందుకు ప్రయత్నించామా రక్తపాతమే. అడవి మల్లెల చల్లని తెలుపును, మోదుగపూల వెచ్చని ఎరుపును శ్రుతిలయలుగా మార్చుకొని, తుపాకీ మోతల షడ్జమ స్వరంతో, థింసా నాట్యపు ఊపులా సాగే ఆ పాట అంత ప్రమాదకరమైనది మరి. నాలుగున్నర దశాబ్దాల కిందట నక్సల్బరిలో గర్జించి, దేశమంతా అల్లుకుపోయిన వసంత మేఘాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన ఈ నవల తెలుగు విప్లవ సాహిత్యంలో ఒక మైలురాయి. ఉద్యమ ఆహ్వానం. నేలకొరిగిన ఉద్యమకారుల స్మరణకు పరిమితమైన సహజావేశ కవిత్వంలో చెప్పలేని, కథలకు పూర్తిగా అందని ఉద్యమ జీవితాన్ని దాని సమస్త కోణాల్లో ఇది అద్భుతంగా చిత్రించింది. ఉద్యమంలో ఉండే కష్టనష్టాలు, ఉద్వేగ, ఉత్కంఠభరిత యుద్ధాన్ని నగ్నంగా కళ్లకు కట్టింది. చైనా విప్లవాన్ని కవాతు పాటల్లా చిత్రించిన ‘ఉదయ గీతిక’, ‘ఎర్ర మందారాలు’ కోవలోని సాయుధ సైనిక నవల ఇది. 1990లో ‘గోదావరి ప్రచురణలు’ తొలిసారి ముద్రించిన ఈ నవలను ఇటీవల వరవరరావు ముందుమాటతో పర్స్పెక్టివ్స్ పునర్ముద్రించింది. 1980 దశకం మధ్యలో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో, అడవంచు పల్లెల్లో ప్రజల కోసం, ముఖ్యంగా ఆదివాసీలకు భూమి, భుక్తి, విముక్తి కోసం ఒక దళం సాగించిన పోరాటాన్ని, దాన్ని అణచడానికి ప్రభుత్వం అమలు చేసిన హింసా విధానాలను రాజయ్య తన రాజకీయ విశ్వాస కోణంలో సాహిత్య, కళాసౌందర్య విలువలను బలిపెట్టకుండా పరిచయం చేశాడు. పరిస్థితుల ప్రభావంతో నక్సల్‌గా మారిన లింగయ్య అలియాస్ గట్టయ్య కుటుంబతీపితో దళాన్ని వదలడం, తన కుటుంబ ఈతిబాధలు ఉద్యమంతో తప్ప పరిష్కారం కావని తెలుసుకుని మళ్లీ దళంలో చేరడం ప్రధాన ఇతివృత్తం. దళంలోని గిరిజన రాధక్కకు శత్రువు పైనే కాకుండా పరుషాధిపత్యం పైనా పోరాడడం అదనపు బాధ్యత. యుద్ధంలో ఉండే హింస, ఎత్తుగడలు, అచంచల విశ్వాసం, ద్రోహం, గెలుపోటములు నవల సాంతం యాంత్రికంగా కాకుండా రక్తమాంసాల మనుషుల చర్యల్లా సహజంగా, నాటకీయంగా సాగుతాయి. వస్తువు తీవ్రమైంది కాబట్టి శిల్పం కూడా తీర్చిదిద్దినట్టు కాకుండా వస్తువు గమనానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అఫెన్స్, రిట్రీట్, గెరిల్లా జోన్, బేస్ యూనిట్ వంటి దళం పరిభాష, రాజకీయాల విశ్లేషణలు శ్రుతి మించినట్లు అనిపించినా కథాగమనానికి ఆటంకం కలగనివ్వవు. అడవి, పల్లె సమయాల వర్ణనలు శివసాగర్ రొమాంటిక్ విప్లవ కవితల్లా ఉంటాయి. చెవులకు పండగ చేసే ఆదిలాబాద్ యాస, తునికాకు పరిమళం,గోడు దాదల ఆత్మీయ ‘రాం రాం’ పలకరింపులు, కామ్రేడ్ల లాల్సలామ్ల నడుమ గగుర్పొడిచే ఎన్కౌంటర్లు సాగిపోతూ ఉంటాయి. వరవరరావు మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పటి వరకు వచ్చిన రాజకీయార్థిక చారిత్రక నవలలకు వసంతగీతం ఒక సైనిక కోణాన్ని జోడించింది’. ‘వసంతగీతం’ ఊరిలోనే కాదు అడవిలోనూ అరుదుగా కనిపించే పేరు తెలియని రంగురంగుల పక్షి. చూడనివాళ్లు దురదృష్టవంతులు. - పి. మోహన్ వసంతగీతం - అల్లం రాజయ్య, పర్స్పెక్టివ్స్ ప్రచురణ, వెల: రూ.250; ప్రతులకు- విశాలాంధ్ర (040-24224458)