
అభిప్రాయం
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కు లను హరించేందుకు సన్నద్ధ మైంది. ‘ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందద’ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే! అడవి, అటవీ భూములు, అందులోని వనరు లపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు.
1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నియామ కంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన అధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు.
1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే! 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్ళ గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోదీ ప్రభుత్వం ‘అటవీ హక్కుల సవరణ చట్టం’ ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది.
షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం–1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూము లను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి, భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం ‘1/70’గా ప్రాచుర్యంలో ఉంది.
శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించ కుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది.
ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు.
1/70 సెక్షన్ –3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతా ల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయి.
5వ షెడ్యూల్‌లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీమ్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. ‘పీసా’ చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.
చట్ట సవరణ ప్రయత్నాలు
గిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను, బహుళజాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్ట పెట్టేందుకు 1996–2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింత పల్లి బాక్సైట్ తవ్వకాల కోసం ‘రస్ ఆల్ ఖైమా’ బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది.
వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధ మయింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అను గుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం ‘1/70 చట్టాన్ని రద్దు చేయబోమ’ని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.
ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలనీ, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయాలనీ అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
వ్యాసకర్త రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526
Comments
Please login to add a commentAdd a comment