forest lands
-
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
కాలిఫోర్నియాలో మంటల బీభత్సం.. 1200 మంది తరలింపు
కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భీకర వాతావరణం నెలకొంది. కాలిఫోర్నియాలోని అడవిలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా సుమారు 1200 మంది వారి నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతలకు తరలివెళ్లారు. మంటల కారణంగా రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. దక్షిణ కాలిఫోర్నియాలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. అడవిలో విస్తరిస్తున్న మంటల కారణంగా కనీసం 1,200 మంది ప్రజలు ఖాళీ చేయవలసి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక, మంటల వ్యాప్తితో 16 చదరపు మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలు క్రమంగా ఆ ప్రాంతమంతా చుట్టుముట్టాయి. మరోవైపు.. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ బ్రిగేడ్ ప్రకారం.. ఈ అగ్నికి పోస్ట్ ఫైర్ అని పేరు పెట్టారు. #PostFire update: acreage is now up to 12,265, with containment at 2%. The cause is still under investigation.#CAwx #firewx pic.twitter.com/Y0XxzczIyh— WeatherNation (@WeatherNation) June 17, 2024 మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. కాలిఫోర్నియా నుండి న్యూ మెక్సికో వరకు కార్మికులు అడవి మంటలను నియంత్రించడానికి కష్టపడుతున్నారు. లాస్ ఏంజిల్స్‌కు వాయువ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్మాన్లోని ఇంటర్‌స్టేట్-5ఫ్రీవే సమీపంలో ఈ మంటలు శనివారం ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదని అధికారులు తెలిపారు. WILD FIRES, CALIFORNIAPost Fire grows to 10,504 acres; Castaic on evacuation warningJUNE 16,2024The Post Fire, which originated in Gorman on Saturday afternoon, has grown to 10,504 acres and is 2% contained as of Sunday morning as Castaic residents have been urged to… pic.twitter.com/rK56bsOu3G— Abhay (@AstuteGaba) June 16, 2024 మరోవైపు.. మంటల కారణంగా హంగ్రీ వ్యాలీ ప్రాంతం నుంచి 1200 మందిని తరలించినట్టు లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. అలాగే, అగ్ని ప్రమాదం దృష్ట్యా హంగ్రీ వ్యాలీ, పిరమిడ్ సరస్సు రెండూ మూసివేయబడ్డాయి. అలాగే, మంటల వల్ల ఇళ్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయితే రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. A wind-fueled #California #wildfire that started on Saturday (June 15) spread over 12,000 acres overnight. The fire is 2% contained and has burned through 12,265 acres of land and brush. No injuries reported so far. pic.twitter.com/QOYwqHJRDo— DD News (@DDNewslive) June 17, 2024 -
పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. ► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో చంద్రబాబు హయాంలో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ కేసులో అరెస్ట్ ► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో 408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, సెక్షన్ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. ► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో 15–11–2023న ఎఫ్ఐఆర్ నెంబర్ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. ► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ► కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్ నిర్వహించినందుకు గుంటూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్‌లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
అతిపెద్ద టైగర్ రిజర్వ్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రెండు అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగ్‌పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే రెండు, మూడు నెలల్లో ఏర్పాటుకానుంది. -
గిరిజనులనుంచి 18,665 ఎకరాలను గుంజుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించాల్సింది పోయి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 18,665 ఎకరాల భూములను వారి నుంచి లాక్కున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,950 మంది గిరిజనుల నుంచి ఈ భూములను లాక్కున్నారని ఆయన చెప్పారు. శనివారం టీపీసీసీ ఎస్టీ సెల్, కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన అటవీభూముల హక్కులపై రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ భూములపై హక్కుల కల్పన కోసం గిరిజనుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చా రు. అటవీభూములకు పోడు భూములనే పేరు పెట్టి వాటిపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా టీఆర్ఎస్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశామని, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్, రాములు నాయక్, కోదండరెడ్డి, మంగీలాల్ నాయక్, చారులతా రాథోడ్ పాల్గొన్నారు. -
భూ ఆక్రమణలపై కన్నెర్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు.. జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలి... ‘జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్‌ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్‌లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది. వక్ఫ్ భూములను ఈ జాబితాలో చేర్చలేం.. ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. -
గుడిసెల తొలగింపుతో తిరగబడిన ఆదివాసీలు
సాక్షి, మంచిర్యాల/దండేపల్లి: అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెల తొలగింపుతో జోరు వర్షంలోనూ అటవీ, పోలీసు అధికారులు, గిరిజనులకు మధ్య రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ శివారు అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న ఆరు తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త తకు దారి తీసింది. గుడిసెలు తొలగించేందుకు శుక్రవారం ఉదయమే లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో వెళ్లారు. దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడితో అధికారు లపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలను అధికారులు జీపుల్లో తరలి స్తుండగా గిరిజనులు దారిపొడవునా అడ్డుకుని, తమ వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేశారు. అధికారులు వారిని పక్కకు నెట్టి మహిళలను తాళ్లపేట రేంజి ఆఫీసుకు తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి, సీపీఎం, వ్యవ సాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. ఆది వాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ హన్మంతరావు.. ఆ మహిళ లను బైండోవర్ చేస్తూ, 6 నెలలపాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించి విడిచిపెట్టారు. ఇందులో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురి చేశారని రోదిస్తూ చెప్పింది. రిజర్వు ఫారెస్టులో ఆక్రమణలు చేపడుతున్నారని, గత నెల 1న అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, అప్పటి నుంచి ఇరు పక్షాలమధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. -
పులుల కోసం ఓ వంతెన
సాక్షి, హైదరాబాద్: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్పాస్నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్‌లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్‌పూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది. తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. వైల్డ్‌లైఫ్ బోర్డు సిఫారసుతో.. ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్‌లైఫ్ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్‌పాస్ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. నాయిస్ బారియర్స్ ఏర్పాటు ఎక్స్‌ప్రెస్ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్‌పాస్ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్ లైఫ్ బోర్డు ఆదేశించింది. దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. -
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి
సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్ కమిటీ గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు. సర్వే పనులు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వాలిడేషన్ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. -
అడవులకు అగ్గి ముప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. అక్కడక్కడా మరికొన్నిచోట్ల కూడా అడవులకు నిప్పంటుకునే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్)’లో ఈ వివరాలను వెల్లడించింది. కొన్నిచోట్ల అడవులకు అతిఎక్కువ ప్రమాదం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతమున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోనే ఈ ప్రాంతాలు ఉన్నట్టు తెలిపింది. 2018 నవంబర్ నుంచి 2019 జూన్ మధ్యకాలంలో.. తెలంగాణకు సంబంధించి మోడీస్ ద్వారా 1,246, ఎస్‌ఎన్‌నపీపీ–వీఐఆర్‌ఎస్ ద్వారా 15,262 అగ్ని ప్రమాద హెచ్చరికలు వచ్చాయని వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా పరిశీలించి.. మనదేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం ఉపగ్రహాల ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తోంది. ‘ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్’ ద్వారా నిప్పు అంటుకున్న, అగ్ని ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపడుతోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఆ ప్రాంతంలోని సంబంధిత అధికారులు, గ్రామ కార్యదర్శులకు సమాచారం వెళ్లేలా ఏర్పాటు ఉంది. మోడీస్, ఎస్‌ఎన్‌నపీపీ–వీఐఆర్‌ఎస్ శాటిలైట్ డేటా ద్వారా ఈ హెచ్చరికలను పంపుతుంటారు. ఇప్పటికే జాగ్రత్తగా.. తెలంగాణలోని 43 అటవీ రేంజ్‌లలో మొత్తం 9,771 కంపార్ట్మెంట్లకు గాను 1,106 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్నట్టు గతంలోనే గుర్తించారు. ఆయా చోట్ల కనీసం ఐదుగురు సిబ్బంది, ప్రత్యేక వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని కంపార్ట్మెంట్లలో ఫైర్ లైన్లను ఏర్పాటు చేసి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మేదాకా అడవుల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. అటవీ మార్గాల్లో మంటలు పెట్టకుండా, వంట చేయకుండా.. కాలుతున్న సిగరెట్, బీడీల లాంటివి పడేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపడితే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్నస్థాయిలో నిప్పు అంటుకోవడం సాధారణమేనని.. కానీ నియంత్రించలేని స్థాయికి చేరి కార్చిచ్చులుగా మారితే.. తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
600 ఎకరాల అటవీ భూమి అమ్మకానికి సిద్ధం..?!
సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్‌లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు -
8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అటవీ భూమిలో పోడు ఆక్రమణ ఎంతో తేలింది. 10 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు చెందిన 125 గ్రామాలు, ఆవాసాల్లో ఈ ఆక్రమణ భూమి ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తంగా 8,208 మంది ఆధీనంలో 17,449 ఎకరాలు ఉందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఈనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్‌లైన్స్‌తో అధికార యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణపై ముందుకెళ్లనుంది. అటవీ భూమి 1.57 లక్షల ఎకరాలు.. జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల ఎకరాల్లో భూమి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 1,57,888 ఎకరాలు (14.66 శాతం). మొత్తం అటవీ భూమిలో ప్రస్తుతం ఇందులో 17,449 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అత్యధికంగా కారేపల్లి (సింగరేణి) మండలంలో 1,510 మంది ఆధీనంలో 4,673.315 ఎకరాలు, ఆ తర్వాత సత్తుపల్లి మండలంలో 2,355మంది చేతిలో 3,208.27 ఎకరాల భూమి ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు 17,861 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. ఎఫ్ఆర్సీ కమిటీ పర్యవేక్షణలో.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో మొదటిగా గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కమిటీకి పోడుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సంబంధిత అధికార బృందం విచారణ, సర్వే పూర్తి చేస్తుంది. అనంతరం అర్హులు ఎవరన్నది గ్రామసభ తీర్మానం చేసి దరఖాస్తులను సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఈ నివేదిక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత హక్కుపత్రాలను పోడుదారులకు జారీ చేస్తుంది. ఈనెల 8 నుంచి అటవీ భూమి ఆక్రమణకు గురైన 95 గ్రామ పంచాయతీల వారీగా 95 బృందాలు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులను గుర్తించి హక్కపత్రాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ భూమి సంరక్షణకు హద్దులు నిర్ణయిస్తారు. ఈ భూమి సంరక్షణ కోనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజిలెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. ఎస్టీల ఆధీనంలో 56 శాతం.. జిల్లాలోని 10 మండలాల్లో పోడు భూమి ఉంటే..ఎస్సీ,ఎస్టీ, గొత్తికోయ, ఇతర కేటగిరిలకు చెందిన మొత్తం 8,208 మంది 17,449 ఎకరాలను ఆక్రమించారు. ఇందులో ఎస్టీల చేతిలో అత్యధికంగా 9764 ఎకరాలు ఉండగా.. ఎస్సీలకు 1,602 ఎకరాలు, గొత్తికోయలు ఆధీనంలో 116 ఎకరాలు ఉంది. ఇతర కేటగిరిలకు చెందిన వారు మిగితా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 56 శాతం ఎస్టీల ఆధీనంలోనే ఈ ఆక్రమణకు గురైన భూమి ఉంది. మిగితా 44 శాతం ఎస్సీలు, గొత్తికోయలు, ఇతర కేటగిరిల చేతిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు.. ప్రభుత్వం పోడు భూములపై దరఖాస్తుల స్వీకరణ, అఖిలపక్ష పార్టీలతో సమావేశంపై జిల్లా యంత్రాంగాలకు గతంలో సూచనలు చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలతో సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకారమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. పోడుదారులను ఎలా గుర్తించాలన్న దానిపై అఖిలపక్ష పార్టీల నేతలు, ఆదివాసీ సంఘాలు కూడా జిల్లా యంత్రాంగానికి, నేరుగా ప్రభుత్వ పెద్దలకు పలు దఫాలుగా వినతులు అందించారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఎఫ్ఆర్సీ కమిటీలు గ్రామసభ అర్హుల జాబితాను ఫైనల్ చేసి సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పంపనుంది. మండలాల వారీగా ఆక్రమణకు గురైన భూమి (ఎకరాల్లో..), పోడు దారుల సంఖ్య ఇలా ఉంది మండలం పోడుదారులు భూమి సత్తుపల్లి 2,355 3,208.27 కొణిజర్ల 1,575 3,682 సింగరేణి 1,510 4,673.315 పెనుబల్లి 1,182 1,580.8 రఘునాథపాలెం 735 1,795.525 కామేపల్లి 314 988.2275 ఏన్కూరు 282 1,087.975 తల్లాడ 104 270.8 చింతకాని 88 130 వేంసూరు 63 31.75 మొత్తం 8,208 17,448.66 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పోడుదారులు భూమి –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సత్తుపల్లి 3,208.27 కొణిజర్ల సింగరేణి 4,673.315 పెనుబల్లి 1,580.8 రఘునాథపాలెం 1,795.525 కామేపల్లి 988.2275 ఏన్కూరు 1,087.975 తల్లాడ 270.8 చింతకాని 130 వేంసూరు 31.75 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పొటోరైటప్ 02సీకేఎం01: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అటవీ భూమి గూగుల్‌మ్యాప్ -
Telangana: పోడుపై బహుముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎలా ముందుకెళ్లాలి? పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు. పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటవీ అంచున కేటాయింపు! అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 3,31,070 ఎకరాలు ..లక్ష మందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి. 2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు. -
ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు
ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు. కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్ శోభ పులుల సంరక్షణ అందరి బాధ్యత... అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ శివఆశీష్, ఎస్ఎస్ తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పస్రా ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు, వెటర్నరీ డాక్టర్ కరుణాకర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
తెరపైకి ‘పోడు’ గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది. దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్వోఎఫ్ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. గిరిజనేతరుల ఆక్రమణతో... పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు. కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా.. రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు. -
దారి ఇస్తావా.. చస్తావా: ఫారెస్టు అధికారికి టీడీపీ నేతల బెదిరింపులు
నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా): అటవీ భూమిలో తమ పొలానికి దారి ఇవ్వకపోతే చంపుతామని ఫారెస్టు అధికారిని బెదిరించిన వ్యవహారంలో టీడీపీ చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్జీ వెంకటేష్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లెకు చెందిన ఆర్జే వెంకటేష్, గొల్లపల్లెకు చెందిన సిరసాని క్రిష్ణమూర్తి, సిరసాని చెన్నకేశవులకు నూరుకుప్పల కొండ, రిజర్వుఫారెస్టుకు మధ్య సర్వే నం.239లో పట్టాభూమి ఉంది. అటవీ రికార్డుల ప్రకారం పట్టాభూమికి సర్వే నం.222 నుంచి 3 అడుగుల వెడల్పుతో కాలిబాట ఉంది. రైతులు క్రిష్ణమూర్తి, చెన్నకేశవులు ఈ దారి గుండా తమ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆర్జే వెంకటేష్ టీడీపీ హయాంలో తన రాజకీయ పలుకుబడితో సర్వే నం.234 నుంచి అక్రమంగా రిజర్వుఫారెస్టులో 2కి.మీ రోడ్డు ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అటవీ భూమి, సంపద, పరిరక్షణలో భాగంగా ఫారెస్టు అధికారులు 2018లో రెడ్డివారిపల్లె, రాచవేటివారిపల్లె సమీపంలో కందకాలు తవ్వించారు. వెంకటేష్ ఏర్పాటు చేసుకున్న దారి మూసుకుపోయింది. అప్పటి నుంచి ఫారెస్టు బీట్ ఆఫీసర్ ప్రకాష్‌కు వేధింపులు మొదలయ్యాయి. విధులను అడ్డగిస్తూ, దారి ఇవ్వపోతే చంపేస్తామంటూ బెదిరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు, అనుకూల మీడియాలో వార్తలతో వేధిస్తున్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా ఫారెస్టు అధికారి ప్రకాష్ వెళ్లగా వెంకటేష్, రెడ్డెప్ప చంపేస్తామంటూ బెదిరించడంతో అటవీ అధికారుల ఆదేశాలతో ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉన్న రక్షిత అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ, అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కృష్ణా జిల్లా, పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. -
గిరిజన పక్షపాతి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అటవీ భూములపై హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు 2 విడతల రైతు భరోసాను ఒకేసారి చెల్లించడం ద్వారా సీఎం జగన్ గిరిజన పక్షపాతి అనే విషయాన్ని మరోసారి నిరూపించారని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. ఒక్కో గిరిజన రైతుకు రూ.11,500 చొప్పున ఒకేసారి ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 2న సీఎం జగన్ రాష్ట్రంలోని 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని పట్టాలుగా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వారందరికీ కూడా రైతు భరోసా అందిస్తామని సీఎం అప్పట్లో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మాట ప్రకారం.. నేడు రెండు విడతల రైతు భరోసా మొత్తాలను ఒకేసారి గిరిజనుల ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా గిరిజనులు ఆ భూముల ద్వారా ఉపాధి పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే అమలు చేసిన రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల ద్వారా గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని కొనియాడారు. -
అటవీ భూముల కేటాయింపులపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం మైలవరం గ్రామం సమీపంలోని అటవీ భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి న్యాయవాది వి.గంగా ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ‘మైలవరం గ్రామంలో సర్వే నంబర్లు 54, 55, 204/1, 205/1లో కొండలతో కూడిన దాదాపు 250 ఎకరాల అటవీ భూమి ఉంది. జిల్లా కోర్టుల భవన సముదాయంతో పాటు ఇతర నిర్మాణాలకు ఈ భూమిని కేటాయించారు. 25 ఎకరాలను జిల్లా కోర్టుల భవన సముదాయాల నిర్మాణానికి, 20 ఎకరాలను పీజీ కళాశాల భవనాలకు, ఐదెకరాలు టూరిజం కార్పొరేషన్‌కు, 2.30 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించింది. నిరుపయోగమైన, నీటి సౌకర్యం లేని భూములను మాత్రమే నిర్మాణాలకు కేటాయించాలని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోకు విరుద్ధంగా వృక్షాలున్న ఈ భూమిని నిర్మాణాలకు కేటాయించారు. ఈ భూ కేటాయింపులను చట్టవిరుద్ధంగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వండి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. -
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలని, మానవత్వంతో పని చేసి.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌తో లింక్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలి ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి మనం రైతు భరోసా అమలు చేస్తున్నాం. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ► గిరిజనులు ఆదాయం పొందడానికి మనం అవకాశాలు కల్పించాలి. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు. అధికారులు గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలి. ► వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించండి. ఆదివాసీ దినోత్సవం నాటికి వారికి అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలి. ► సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి జీవో నంబరు 3పై (షెడ్యూల్ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సీఎం పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చామని, పరిశీలన పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు. -
నల్లమలలో వంట, మంట నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవుల్లో నిప్పు రాజేయడం, వంటలు చేయడంపై అటవీ శాఖ నిషేధం ప్రకటించింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు, ఇతరుల ప్రవేశంపైనా ఆంక్షలు విధించింది. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలుండటంతో.. ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో మూడు అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు నల్లమల అడవి మీదుగా శ్రీశైలానికి వెళ్లనున్న క్రమంలో.. వారు అటవీ శాఖ సూచనలు తప్పక పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని, కాలిబాట ప్రయాణాలు చేయరాదని ప్రకటించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లోనే సేదతీరేందుకు అనుమతి ఉందని అటవీ శాఖ స్పష్టం చేసింది. కూర్చునే సదుపాయం, తాగునీటి సౌకర్యం, చెత్త వేసేందుకు కుండీలు ఏర్పాటు చేస్తోంది. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. పశువుల కాపరులు, అడవిలోకి వచ్చేవారు సిగరెట్, బీడీ తాగకుండా చర్యలు చేపడుతోంది. అవగాహనా కార్యక్రమాలు అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 9,771 కంపార్ట్మెంట్లకు గాను 43 అటవీ రేంజ్‌ల్లో 1,106 ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు అత్యంత ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించారు. కనీసం ఐదుగురు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్లతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లుంటాయి. శాటిలైట్‌లో పర్యవేక్షించే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నందున, ఎక్కడ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. -
రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా
పచ్చని చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. పొదల మాటున జీవనం సాగించే వన్యప్రాణులు. విలువైన వృక్ష సంపద. అద్భుతమైన జీవ వైవిధ్యం.. అటవీ ప్రాంతం సొంతం. గత టీడీపీ హయాంలో నేతలు అడవినీ వదిలి పెట్టలేదు. అడవిలో విధ్వంసం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టారు. కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం అటవీ ప్రాంతంలో జెలిటిన్స్టిక్స్తో పేల్చుతూ వృక్ష, పక్షి జాతులతో పాటు వన్యప్రాణులను విలవిలల్లాడేలా చేశారు. ఇదంతా రిజర్వు ఫారెస్ట్‌లోనే విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టడానికే అని విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అక్రమార్కులు రూ.8 కోట్ల విలువైన సంపదను యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించినా, అధికారులు నిలువరించలేకపోయారు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అధికారులు అండగా నిలిచారని సమాచారం సాక్షి, నెల్లూరు: అధికారం మాటున అప్పటి మంత్రి అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. రక్షకులమంటూ.. అడవిని భక్షించారు. నీతికి, నిజాయతీకి తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్ నిర్వాహకులతో కలిసి అటవీ సహజ వనరులను దోచేశారు. పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని 1990లో ఉమామహేశ్వరీ మైన్ నిర్వాహకులకు మైనింగ్ అనుమతి ఇచ్చారు. ఆ సర్వే నంబరులో దాదాపు 214 ఎకరాల భూమి ఉంది. అందులో 70 ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ భూములను మైనింగ్‌కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి చొరబడ్డారు. కొండలు, గుంటల భూములను ఇష్టానుసారంగా తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్‌ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. 2009 నాటికి మైనింగ్ అనుమతులు ముగిసినా కూడా నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్‌ను కొనసాగించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు. టీడీపీ హయాంలో.. టీడీపీ హయాంలో మైనింగ్ నిర్వాహకుడు జిల్లా మంత్రితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమించారు. ఫారెస్ట్ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్‌స్టిక్ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్‌ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో అటవీశాఖ, రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మైనింగ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినా.. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం జిల్లా స్థాయిలో అధికారులందరికీ తెలిందే. ఈ వ్యవహారంపై గత జిల్లా ఉన్నతాధికారి దృష్టికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్‌కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు కూడా అక్రమ మైనింగ్‌కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. వన్యప్రాణులు విలవిల మైనింగ్ నిర్వాహకులు తమ స్వార్థం కోసం అడవినే ఆక్రమించి సంపదను కొల్లగొట్టే క్రమంలో విధ్వంసం సృష్టించి వన్యప్రాణులను, పక్షి జాతులను విలవిలాలాడేలా చేశారు. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్‌లో దాదాపు 40 రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉండే పక్షులు, వన్యప్రాణులకు పేలుళ్లతో నిద్ర లేకుండా చేశారు. కొండను తొలిచేందుకు నేపథ్యంలో జెలిటిన్‌స్టిక్, అమ్మెనియా వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి రాత్రి వేళల్లో పేల్చేవారు. ఆ ప్రభావంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలలాడాయి. ఆ పేలుళ్ల ప్రభావం వల్ల నందివాయ గ్రామ పరిధిలో పంటలపై పడేది. పచ్చని పంటలపై దుమ్ము, ధూళి కణాలు పడి ఎదుగుదల లోపించేదని స్థానికులు ఆరోపించారు. విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు నందివాయ రిజర్వు ఫారెస్ట్‌లో కొండలను తొలిచి ఏళ్ల కాలంగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వైనంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమ మైనింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. అధికారులు విచారణలో దాదాపు అడవిని కొల్లగొట్టి రూ.8 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా రవాణా సాగించినట్లు నిగ్గు తేలింది. 2010 నుంచి మైనింగ్‌కు అనుమతి లేకుండా నిర్వాహకులు మాత్రం మైకా, తెల్ల రాయిలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇంత భారీగా అక్రమ మైనింగ్ జరిగినా అధికారులు స్పందించలేదని తేలడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులపై వేటు వేశారు. ఇంకా ఈ అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఒక్కరూ సహకరించలేదు నేను రాపూరు రేంజర్‌గా జాయిన్ అయినప్పటి నుంచి అక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు పోరాటం చేస్తున్నా. ఏ ఒక్క అధికారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అయితే అసలు చెవికెక్కించుకోలేదు. గతంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మైనింగ్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశాను. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఏమి చేయలేకపోయాం. నిర్వాహకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. జాయింట్ సర్వే చేయమని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదు. – శ్రీదేవి, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి జాయింట్ సర్వే నిర్వహిస్తాం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులందరిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయి. త్వరలోనే మైనింగ్‌పై జాయింట్ సర్వే నిర్వహిస్తాం. పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతాం. అక్రమ మైనింగ్‌కు సహకరించిన ఎవరిని వదలం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులపై తాత్కాలిక చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి విచారణలో తప్పు చేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్ఓ , నెల్లూరు -
అడవి.. ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యంత వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు ఉటంకిస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం సగం కంటే తక్కువగానే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే పరిస్థితి నెలకొంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం హరితహారం కార్యక్రమం చేపడుతున్నా అడవుల ఆక్రమణల వల్ల ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను అడ్డం పెట్టుకొని వారి బినామీలుగా ఆదివాసీ, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. ఎస్టీలు, ఇతర బలహీనవర్గాల పేరుతో స్థానికంగా బలమైన సామాజికవర్గాలు, రాజకీయ అండదండలున్న వారి పెత్తనం పెరిగిపోయింది. కింది స్థాయిలో అటవీ, రెవెన్యూశాఖలలో అవినీతి కూడా ఆక్రమణదారులకు కలసి వస్తోంది. ‘పోడు’ మారిపోయింది... కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా కొనసాగుతోంది. చెట్లు లేని చోట వారు సాగు చేసుకొని ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటకు తరలిపోవడం వంటిది జరిగేది. పారలు, ఎడ్లు లేకుండా వారు వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. 1907లో ఆదివాసీలు అడవుల్లో ఈ విధమైన పోడు వ్యవసాయం చేసుకునేందుకు నిజాం నవాబు అనుమతించాడు. 1947 తర్వాత గిరిజనేతరులు అడవులపై పడటంతో పోడు అటవీ భూముల ఆక్రమణ మొదలైంది. ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కు కల్పించినా దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్రప్రభుత్వం అటవీహక్కుల చట్టం తీసుకురావడంతో ఈ భూములను సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు అందజేయాల్సి ఉంది. అడవి మిగిలింది 13 శాతమే.... రాష్ట్రంలో 26.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ఉంది. అందులో 2.94 లక్షల (11%) హెక్టార్లు అన్యాక్రాంతమైనట్టు అటవీశాఖ రికార్డుల్లో స్పష్టమైంది. వాస్తవానికి ఈ ఆక్రమణలు మరో 3% వరకు ఉంటాయని, ఇప్పుడు మనకు మిగిలింది 10–13% అడవులేన ని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద... అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరి నాటికి మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు), సామూహికంగా 3,427 క్లెయిమ్స్ (4,70,605 ఎకరాలకు) క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ‘వ్యక్తిగత’లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌కు 4,54,055 ఎకరాల మేర హక్కు పత్రాలు అందజేశారు. మొత్తం 80,890 ‘వ్యక్తిగత’కు సంబంధించిన కేసులను 2,90,589 ఎకరాలకు, ‘సామూహిక’లో 11,988 ఎకరాలకు సంబంధించి 1,682 కేసులను తిరస్కరించారు.