అటవీ భూములను రక్షించాలి | To protect forest lands | Sakshi
Sakshi News home page

అటవీ భూములను రక్షించాలి

Published Sat, Apr 18 2015 3:36 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

To protect forest lands

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో అటవీ భూములను రక్షించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కల పెంపకాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా జిల్లాలో అటవీ భూములను పరిరక్షించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని, ఇందు కోసం సాధ్యమైనంత కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ కలెక్టర్‌లకు ఈ సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టంచేశారు. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేతలోనూ నిక్కచ్చిగా ఉండాలన్నారు. జిల్లాలో అత్యవసర సమయంలో కావాల్సిన నిధులను అందుబాటులో ఉంచుకునేందుకు అనువుగా కలెక్టర్ పరిధిలో రూ.10 కోట్లను ప్రత్యేక నిధిగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఈ మేరకు ఉత్తర్వులను సైతం జారీ చేశారు. జిల్లాలో పాలనా పరంగా మరింత వేగం పెంచాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్ పనులను కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.మిషన్ కాకతీయ వల్ల రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు. చెరువుల తవ్వకం, పునర్నిర్మాణం అనే యజ్ఞం కలెక్టర్ల పర్యవేక్షణలో సరైన నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి కావాలన్నారు.

ఖమ్మంలో ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. డంపింగ్‌యార్డ్ లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను స్థానికులు అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సీఎం కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి సత్వరం చర్యలు తీసుకోమని ఆదేశించడం విశేషం. నగరాన్ని, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

అన్ని పట్టణాల్లో చెత్తను ఎత్తివేయడానికి అనుగుణంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో తడి,పొడి చెత్తలను ఎత్తివేసేందుకు రెండు డస్ట్‌బిన్‌లను పంపిణీ చేయాలని సూచించారు.. జిల్లాలో శ్మశాన వాటిక కొరత ఉన్న ప్రాంతాన్ని గుర్తించి శ్మాశాన వాటికలకు స్థలం మంజూరు చేయాలని తెలిపారు. రైతుబజారులను ఏర్పాటు చేయాలని,  ప్రతినెలలో ఒకరోజు అర్బన్ డే, ఒకరోజు రూరల్‌డేను నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు.

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మరుగుదొడ్లను నిర్మించుకునే వారికి రూ.12వేల సహాయాన్ని మంజూరు చేయాలన్నారు. సామూహిక మరుగుదొడ్లకు రూ.60 వేలు కేటాయించాలన్నారు. హైదరాబాద్‌లో సీఎం నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావడానికి దాదాపు వారం రోజుల ముందు నుంచి  జిల్లా కలెక్టర్, ఎస్పీ వివిధ శాఖల వారీగా అభివృద్ధిని సమీక్షించి, ప్రగతి నివేదికలను తయూరు చేశారు. దాదాపు 18 అంశాలతో ఈ సమావేశం ఎజెండా రూపొందిం చారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ ప్రాజెక్టుల అంశానికి ఎజెండాలో తొలి ప్రాధాన్యం లభించింది.

నీటిపారుదల, వాటర్‌గ్రిడ్, గోదావరి పుష్కరాల పనులు, సీజనల్ వ్యాధులకు సంబంధించి పరిస్థితి, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, జిల్లాలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమతోపాటు జిల్లాలో ఫుడ్‌పార్క్, డ్రైపోర్ట్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసుకున్నారు. గత నెలలో సీఎం ఖమ్మంలో పర్యటించి భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, అశ్వాపురం మండలం అమర్ద వద్ద మరో పవర్ ప్లాంట్ నిర్మించే అవకాశంపై వివరాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు.

మిషన్‌కాకతీయలో జిల్లావ్యాప్తంగా 903 చెరువులను అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెండర్లు పూర్తయిన తీరు, ఇప్పటికి పనులు ప్రారంభించిన చెరువులు, వాటి పురోభివృద్ధి తదితర అంశాలను  నివేదికలో వివరించారు. తొలిరోజు సీఎం నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావనకు రాగా.. మరికొన్ని అంశాలను రెండోరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశంలో కలెక్టర్ ఇలంబరితితోపాటు ఎస్పీ షానవాజ్‌ఖాసిం, జాయిం ట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement