environmental conservation
-
Vaishali Shroff: సజీవ ప్రపంచంలోకి...
వైశాలి ష్రాఫ్ చేతిలో మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం అడవులను బడులకు రప్పించగలదు. అలనాటి రాక్షస బల్లులతో ఈనాటి పిల్లలను మాట్లాడించగలదు. ఆ మంత్రదండం పేరు కలం. ముంబైకి చెందిన వైశాలి ష్రాఫ్ పర్యావరణ సంబంధిత విషయాలపై పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఎన్నో పుస్తకాలు రాసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకుంది... నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్(సిఎన్పీ)కి వెళ్లి వచ్చిన తరువాత వైశాలికి ‘సీతాస్ చిత్వాన్’ అనే పుస్తకం రాయడం ప్రారంభించింది. ఈ పార్క్‌కు వెళ్లడానికి ముందు తన కుటుంబంతో కలిసి మన దేశంలోని ఎన్నో జాతీయ పార్క్‌లను చూసింది వైశాలి. ఏ పార్క్‌కు వెళ్లినా అందులోని జీవవైవిధ్యం తనకు బాగా నచ్చేది. సాలె పురుగుల నుంచి పెద్ద పిల్లుల వరకు ఏనుగుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే చెట్ల వరకు తనను అమితంగా ఆకట్టుకునేవి. ‘ప్రకృతిని కాపాడుకుంటేనే బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు’ అనే సత్యాన్ని పిల్లలకు బోధ పరచడానికి ‘సీతాస్ చిత్వాన్’ పుస్తకం రాసింది. ‘పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే అడవులను తద్వారా రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. అడవి ఒక పాఠశాల. సహనంతోనూ, సాహసోపేతంగా ఉండడాన్ని నేర్పుతుంది. జీవరాశుల పట్ల సానుభూతి కలిగి ఉండడాన్ని నేర్పుతుంది’ అని ‘సీతస్ చిత్వాన్’ ద్వారా చెబుతుంది వైశాలి. ప్రాపంచిక, పర్యావరణానికి సంబంధించిన విషయాల గురించి తగిన సమాచారంతో ఫిక్షన్ ఫార్మట్‌లో చెప్పడం వైశాలికి ఇష్టం. ఈ ఫార్మట్‌లో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆకట్టుకునే క్యారెక్టర్లను సృష్టించింది. పిల్లలు పుస్తకంలోని పాత్రలతో కనెక్ట్ కావడమే కాకుండా పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు. తన బామ్మ నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకుంది వైశాలి. వైశాలి స్కూల్ రోజుల్లో... తన బామ్మ ఒక మూలన కుర్చీలో కూర్చుని ఏదో ఒక పుస్తకం సీరియస్‌గా చదువుతూ కనిపించేది. బామ్మను అనుకరిస్తూ వైశాలి కూడా ఏదో కథల పుస్తకం చదువుతూ కూర్చునేది. మధ్య మధ్యలో బామ్మను ఆసక్తిగా చూసేది. ఈ అనుకరణ కాస్తా ఆ తరువాత పుస్తకాలు చదివే అలవాటుగా మారింది. ఆ అలవాటే తనని పిల్లల రచయిత్రిని చేసింది. ‘ఫిక్షన్, నాన్ ఫిక్షన్లలో నాన్ ఫిక్షన్ రాయడమే కష్టం. నాన్ ఫిక్షన్ పుస్తకాల కోసం బోలెడు సమాచార సేకరణ చేయాల్సి ఉంటుంది’ అంటుంది వైశాలి. మన దేశంలోని రాక్షస బల్లుల గురించి సాధికారమైన సమాచారంతో ఆమె రాసిన ‘బ్లూథింగోసారస్’ నాన్–ఫిక్షన్ పుస్తకానికి ఎంతో మంచి స్పందన వచ్చింది. వివిధ రకాల వ్యక్తీకరణల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ కావడానికి భాషలు వీలు కల్పిస్తాయి. వైశాలి తాజా పుస్తకం ‘తాతుంగ్ తతుంగ్ అండ్ అదర్ అమేజింగ్ స్టోరీస్’ పుస్తకం భారతీయ భాషల విస్తృతి, లోతు గురించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మాతృభాషల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. గుహ గోడలపై ఉన్న చిత్రలిపి నుంచి పురాతన, సమకాలీన స్థానిక భాషలకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి. ‘తాతుంగ్ తతుంగ్... మన దేశపు అద్భుతమైన భాషా సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది. భాషలు, వాటి గొప్ప వారసత్వాలు కనుమరుగు కాకూడదని హెచ్చరిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు తమ మాతృభాష పట్ల మరింత అభిమానం పెరుగుతుంది’ అంటారు రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్. ‘భిన్నమైన విషయాల గురించి భిన్నమైన పద్ధతుల్లో రాయడం ఇష్టం’ అంటున్న వైశాలి ష్రాఫ్ పిల్లల కోసం మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశిద్దాం. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
పచ్చగా ఉండాలంటే చిరుత కావాల్సిందే!
‘చిరుత కనిపిస్తే, అమ్మో.. చిరుత అని భయపడకండి.. అది మ్యాన్ ఈటర్ కాదు. పైగా పర్యావరణానికి మేలు చేస్తుంది’ ఇది పర్యావరణ నిపుణుల మాట. మరి అంతగా మేలు చేసే చిరుతపులులు మనదేశంలో ఎన్ని ఉన్నాయి.. వాటి మనుగడ ఎలా ఉంది.. వాటి సంరక్షణకు ఇంకేం చేయాలి.. అనే అంశాల గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే, ‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా’నివేదికలో ఏం ఉందో చూడాల్సిందే! దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిరుతపులుల సంఖ్యను శాస్త్రీయ పద్ధతుల ద్వారా లెక్కించిన వివరాలు, అధికారిక గణాంకాల నివేదికను ఇటీవల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే వీటి మనుగడ కొనసాగుతోంది. మిగతా ఖండాల్లో ఇవి క్రమంగా కనుమరుగైపోయాయి. భారత్‌లో చిరుతల సంఖ్య భారీగానే పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల సంఖ్య పెరిగింది. ఆ నివేదికలో ఏముందంటే..? ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా–2018 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం... దేశంలో మొత్తం 12,852 చిరుతపులులున్నట్లు అంచనా. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలున్నాయి. అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,421, పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్ణాటక 1,783 చిరుతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతపులులతో తృతీయస్థానంలో నిలిచింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్ల విభాగంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నాయి. 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలుండగా 2018 కల్లా వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం పెరుగుదల) పెరిగింది. మనదేశంలో పెద్దపులులు, ఆసియాటిక్ లయన్స్, ఇప్పుడు చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని బట్టి భారత్‌లో పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు మేలైన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోందని ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. చిరుతల సంఖ్య పెరిగితే.. మనరాష్ట్రంలో చిరుతల సంఖ్య 334 ఉండగా, 2022లో మరోసారి లెక్కలను వెల్లడించే నాటికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పులుల సంఖ్య కూడా గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో పెద్దపులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుదలతో అడవులు, పర్యావరణానికి మంచి భవిష్యత్ ఉన్నట్టు కనిపిస్తోంది. చిరుతల సంఖ్య పెరుగుదలతోనే అవి జనావాసాల్లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయని భావించడం సరికాదు. వాటి సహజసిద్ధమైన ఆవాసాలు, అడవి, ఇతర అనువైన చోట్లలో మనుషులు, ఇతరత్రా రూపాల్లో అంతరాయాలు కలిగించడం వల్లే అవి తరచూ జనావాసాలకు దగ్గరగా వస్తున్నాయి. –ఎ.శంకరన్, అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ వాటి పరిరక్షణకు ఏం చేయాలంటే.. అడవులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ సమతూకంగా పాటించడంలో భాగంగా చిరుతలు కూడా కీలకపాత్రను పోషిస్తున్నాయి. చిరుతలనూ ‘కీ స్టోన్’ సీషెస్గా పరిగణిస్తాం. జింకలు, దుప్పులు, నీల్గాయిలు వంటి శాకాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగితే వాటి వల్ల అడవికి జరిగే నష్టాన్ని పులులు, చిరుతలు బ్యాలెన్స్ చేసే అవకాశముంది. లెపర్డ్స్ కారిడార్లను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ కారిడార్ల పరిధిలోని గ్రామాల ప్రజలను చైతన్యవంతులను చేయాలి. రోడ్లు, రైలు ప్రమాదాల్లో అవి మరణించకుండా, గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –జి.సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, ఫారెస్ట్ 2.0 ఆర్డీ -
ఆత్మీయతా వారధులు.. అమెరికా నావికులు
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర):ఎక్కడో సుదూర దేశం నుంచి.. వేలాది మైళ్లకు ఆవల ఉన్న తీరం నుంచి తరలి వచ్చిన నావికులు వారు. స్నేహపూర్వకంగా, సామాజిక బాధ్యతలో భాగంగా వారు మన సాగర నగరానికి వచ్చారు. ఏదో చుట్టం చూపులా వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి మరలకుండా ఓ మంచి పనిలో పాలుపంచుకున్నారు. దివ్యాంగుల దగ్గరకు వెళ్లి వారిని ఉత్సాహపరిచారు. వారి సమక్షంలో చాలా సేపు గడపడమే కాదు.. వారు చేసిన కళాకృతులను మెచ్చుకున్నారు. వారితో పాటు పని చేసి తామూ చేయి తిరిగిన హస్త కళాకారులమేనని నిరూపించుకున్నారు. కొన్ని కళాకృతులు తయారు చేసి ప్రదర్శించి.. దివ్యాంగుల గుండెల్లో ఆనందాన్ని నింపి బోలెడు అనుభూతులను మూటగట్టుకుని నిష్క్రమించారు. నగరంలోని అక్కయ్యపాలెం చేరువలోని జగన్నాథపురంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా సైలర్లలో ఆత్మీయ కోణాన్ని ఆవిష్కరించింది. జగన్నాథపురంలో గల ప్రజ్వల వాణి వెల్ఫేర్ సోసైటీని అమెరికా నావీ సైలర్స్ బృందం సందర్శించింది. పర్యావరణ పరిరక్షణలో దివ్యాంగులతో చేతులు కలిపింది. వారికి అంతులేని సంతోషాన్ని సమకూర్చింది. తమ కళానైపుణ్యాన్ని చూపుతున్న నావికులు కాదేదీ కళకు అనర్హం పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నించడమే కాకుండా, పనికి రాని వస్తువులను కళాకృతులుగా మలచడం ఎలాగో అమెరికా నావికులు చేసి చూపారు. పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రి ఎలా తయారు చేయాలో ప్రయత్నించి నేర్చుకున్నారు. ఇందుకోసం వారు దివ్యాంగులతో కలిసి వర్క్ షాప్ నిర్వహించారు. తాగి పారేసిన గాజు సీసాలను జ్యూట్ థ్రెడ్, లేసులు, కుందన్స్, ఫ్లవర్‌తో అలంకరించి అందంగా ఫ్లవర్‌వాజ్‌లు తయారు చేశారు. జ్యూయలరీ తయారీని, ఇళ్లలోని పాత దుస్తులతో క్లాత్ బ్యాగ్స్ తయారీని దివ్యాంగుల నుంచి వారు నేర్చుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ (ఆంధ్ర, తెలంగాణ) కేథరిన్ హడ్డా మాట్లాడుతూ దివ్యాంగులకు హితవచనాలు చెప్పారు. నచ్చిన రంగంలో కృషి చేస్తే అందరితో పాటు రాణించడం సాధ్యమేనని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా దివ్యాంగులతో కలిసి వర్క్‌షాప్‌లో పాల్గొనడం చాలా ఆనందంగాఉందన్నారు. ప్రజ్వల్ వాణి సంస్థ ద్వారా దివ్యాంగులకు లభిస్తున్న శిక్షణ తమను ఆకట్టుకుందని తెలిపారు. తమ నావికులు నేర్చుకున్న అంశాలను అమెరికాలో పలువురికి నేర్పించనున్నట్టు తెలిపారు. సొసైటీ ప్రతినిధులు కె.వి.ఎల్ సుచిత్రా రావు, హరీష్ మాట్లాడుతూ అమెరికా నావికులు దివ్యాంగ విద్యార్థులతో కలిసి బెస్ట్ అవుటాఫ్ వేస్ట్ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ తీరానికి వచ్చిన అమెరికా నౌకలో నావికులు, కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు మూడురోజులుగా విశాఖలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రజ్వలవాణిని సందర్శించి పర్యావరణపరిరక్షణలో బాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. అనంతరం దివ్యాంగ విద్యార్ధులు కాన్సులేట్ జనరల్‌కు జ్ఞాపిక బహూకరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో ఆకాష్, టి.సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. -
టయోటా కొత్త ‘కామ్రీ హైబ్రీడ్’
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా ‘కామ్రీ హైబ్రీడ్’ కారు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంటుందని తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండే ఈ కారు లీటరుకు 23.27 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ హోల్డ్ ఫీచర్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, ఈ తరహా హైబ్రీడ్ కార్ల ఉత్పత్తితో ఆటో పరిశ్రమ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సంస్థ ఎండీ మజకాజు యోషిమురా చెప్పారు. -
‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మేనిఫెస్టోలో చేర్చండి’
హైదరాబాద్: అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దిష్టంగా పొందుపర్చి ఆ మేరకు నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని, పర్యావరణ పరిరక్షణకు ఏ రాజకీయ పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నా రు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘ప్రిపేరింగ్ తెలంగాణ ఫర్ ఎ గ్లోబల్ ఛేంజ్’పేరుతో 17 అంశాలతో రూపొందించిన సమీకృత ఎన్నికల ప్రణాళిక–2018ను ఆవిష్కరించారు. ఇండిపెండెట్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి, సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన 17 అంశాల్లో ఒక్కో అంశంపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా జీవావరణ సంబంధమైన జీవనోపాధి, హరిత నైపుణ్యం, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఇంధనాలు, ఆహార భద్రత వంటి అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోను అన్ని పార్టీల అధినాయకులకు అందిస్తామని చెప్పారు. సీజీఆర్ ఆధ్వర్యంలో నవంబర్ 17న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ ఇంజనీర్ డాక్టర్ కేశవరెడ్డి, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రస్తుతం తినే తిండి రసాయనాల మయమైంది.. కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పేమాట.. కానీ అదే కూరగాయలు, ఆకుకూరలు మోతాదుకు మించిన రసాయన ఎరువులతో పండించడం కారణంగా ప్రజలు రోగాల బారిన పడక తప్పడం లేదు. రసాయనాల ఎరువుల ద్వారా ఇటు ప్రజల ఆరోగ్యంతోపాటు రైతుల పెట్టుబడి ఖర్చులూపెరిగిపోతున్నాయి. ఈ దృష్ట్యా కొంతమంది జిల్లా రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచిస్తున్నారు. వీరికి కలెక్టర్ దివ్యదేవరాజన్ అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి సేంద్రియ సాగు కోసం సహాయాన్ని అందిస్తున్నారు. తాను ఆచరణలో ఉండి ఇతరులకు చెబుదామనే ఉద్దేశంతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దాదాపు ఎకరం స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసేలా దృష్టి సారించారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమావేశంలో సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారు. యువ రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి గతంలో సేంద్రియ పద్ధతిలో రైతులు పంటలు సాగు చేసేవారు. దీంతో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పప్పుదినుసులు తీసుకోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణం మెరుగుగా ఉండేది. 70 నుంచి 80 సంవత్సరాల వయస్సు వచ్చిన కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా యువతతో పోటీ పడి పనులు చేసే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. పంట పొలాలన్ని రసాయనమయం అయ్యాయి. దీంతోపాటు రైతుల పెట్టుబడి సైతం పెరిగిపోయింది. గతంలో ఆవుపేడ, గోమూత్రం, వేప కషాయం, తదితర వాటిని కలిపి సేంద్రియ ఎరువులను పంట పొలాల్లోనే తయారు చేసేవారు. ఎలాంటి రసాయనాలు లేకుండానే అన్నిరకాల పంటలను పండించేవారు. కొంత మంది రైతులు ఎలాంటి అవగాహన లేక రసాయన ఎరువులను వాడుతున్నారు. వీటిని చూసిన మిగతా రైతులు సైతం దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రసాయన ఎరువుల వాడకాన్ని మొదలు పెట్టారు. క్రమంగా ఈ విధానానికి అలవాటు పడ్డారు. రసాయన ఎరువుల సాగుతో మొదట్లో దిగుబడి వచ్చినా, రానురాను భూసారం తగ్గడం, పెట్టుబడి పెరిగిపోవడంతో రైతులకు సైతం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంపై సైతం ప్రభావం పడే ప్రమాదం ఉంది. 110 ఎకరాల్లో సాగు.. సేంద్రియ పంటల శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ అడుగుజాడల్లో జిల్లాకు చెందిన కొంతమంది రైతులు నడుచుకుంటున్నారు. ఇంతకాలం రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడంతో భూమి సారవంతం కోల్పోయి దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మొదట సాగు వల్ల కొంత దిగుబడి తగ్గినప్పటికీ మూడేళ్ల తర్వాత రైతు అనుకున్న దిగుబడులను పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 110 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. జైనథ్ మండలం అడ, సాంగ్వి, తలమడుగు మండలం కుచులాపూర్, పల్లి, ఇచ్చోడ మండలం నవేగాం, ఆదిలాబాద్‌రూరల్ మండలం వాగాపూర్, ఉట్నూర్ మండలం హస్నాపూర్, ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లిలో ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, కంది, శనగ, తదితర పంటలను పండిస్తున్నారు. వీరందరు గత మూడు నాలుగేళ్లుగా ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడి పొందుతున్నారు. పండించిన పంటను విక్రయించడానికి మార్కెట్ లేకపోవడంతో వారు ఆశించిన ధర రావడంలేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ చొరవతో గత శుక్రవారం జిల్లా కేంద్రంలో సేంద్రియ పంటల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణ మార్కెట్లో ఉండే ధర కంటే వీటి ధర రూ.20 వరకు అధికంగా విక్రయించుకునే అవకాశాన్ని వీరికి కల్పించారు. రసాయనాల గురించి తెలిసిన వారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
మొక్కల ‘అంబులెన్స్’
రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర వైద్య సాయం అవసరమైనా వెంటనే అంబులెన్స్ గుర్తుకొస్తుంది. రోగిని ఆస్పత్రికి తరలించే లోపు అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఫలితంగా చాలామంది రోగులు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ సందర్భాలు అనేకం. అదే మొక్కలకు రోగం వస్తే? అత్యవసర చికిత్స అవసరమైతే? అందుకోసమే ఇప్పుడు కొత్తరకం అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అదే ట్రీ అంబులెన్స్. మొక్కలకు అవసరమైన చికిత్స అందించడం, వాటిని సంరక్షించడం వీటి బాధ్యత. మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఈ అంబులెన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో మొక్కల నిపుణుడు, సహాయ సిబ్బంది, మొక్కలు నాటేందుకు అవసరమైన పరికరాలు, నీరు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంటాయి. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్న కొందరు కలసి సేవాలయ బృందంగా ఏర్పడ్డారు. ఎవరికైనా మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉంటే ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పర్యావరణం పరిరక్షణ, పచ్చదనం కోసం చాలామంది మొక్కలు నాటుతారు. అయితే 60 నుంచి 70 శాతం మొక్కలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాయి. వీటిని ఎలా సంరక్షించాలో తెలియకపోవడం వల్ల చనిపోతున్నట్లుగా తాము గుర్తించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా ఉచితంగానే సేవలందించడం మరో విశేషం. ఐడియా బాగుంది కదూ..! -
పర్యావరణ పరిరక్షణ నేత రాఘవయ్య కన్నుమూత
సోంపేట/కంచిలి: పర్యావరణ పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడు, కంచిలి మండలం మండపల్లి గ్రామానికి చెందిన మాదిన రాఘవయ్య (76) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున తనువుచాలించారు. ఈ విషయం తెలిసి థర్మల్ వ్యతిరేక ఉద్యమకారులు, ప్రజలు విషాదానికి గురయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాలు, తోటలు చూసుకొని ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవయ్య మృతి సమాచారం తెలుసుకున్న వెంటనే పర్యావరణ పరిరక్షణ సంఘ ప్రతినిధులు, మత్స్యకారులు, స్థానిక ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. రాఘవయ్య పెద్దకుమారుడు సింగపూర్‌లో ఉన్నారు. అతను వచ్చిన తరువాత రాఘవయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె, ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు.. రాఘవయ్య వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతంలో పెద్దమనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుటుంబా నికి అండగా ఉండేవారు. వీరిది ఉమ్మది కుటుంబం. సుమారు 50 మంది కుటుంబ సభ్యులున్నారు. ఉద్యమంలో కీలపాత్ర థర్మల్ విద్యుత్ కర్మాగారం నిర్మిస్తే సమస్యలు తప్పవని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందారు. దీంతో థర్మల్ వ్యతిరేక ఉద్యమం చేయాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మంది కమిటీలో రాఘవయ్య ఒకరు. ఉద్యమంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. సుమారు 50కు పైగా కేసులను ఎదుర్కొన్నారు. తన పొలం పనులు చూసుకుంటూ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరై థర్మల్ వ్యతిరేక ఉద్యమం పట్ల తన చిత్తశుద్ధిని చూపించుకున్నారు. మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ సంఘం వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. పదిరోజుల క్రితం విజయవాడలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సంఘం సమావేశంలో పర్యావరణ పరిరక్షణసంఘం కార్యదర్శి బీన ఢిల్లీరావుతో కలసి పాల్గొన్నారు. పలువురు సంతాపం రాఘవయ్య మృతికి ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్.దాసు, పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, జెడ్పీటీసీ సభ్యులు ఎస్.చంద్రమోహన్, నాయకులు ఎస్.శ్రీరామమూర్తి, బి.తారకేశ్వరరావు, ఎం.బుద్దేశ్వరరావు, మానవహక్కులవేదిక నాయకుడు జగన్నాథం, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సంతాపం తెలియజేశారు. -
మొక్క నాటు.. లైసెన్స్ తీసుకో!
సాక్షి,హైదరాబాద్: వాహనదారుల్లో పర్యావరణ పరిరక్షణను పెంపొందించేందుకు రవాణాశాఖ దృష్టి సారిం చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే వారిని ఇంటిదగ్గర ఓ మొక్క నాటి రావాలని కోరుతోంది. వాహనం కొనుగోలు చేసేవారినైతే రెండు మొక్కలు నాటాలని సూచిస్తోంది. వివిధ రకాల పౌరసేవల కోసం ఆర్టీ ఏ కేంద్రాలకు వచ్చేవారిని మొక్కలు నాటేలా ప్రోత్సహించేందుకు రవాణాశాఖ మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన హరితహారంలో జేటీసీ పాండురంగ నాయక్, ఆర్టీవో రమేశ్ మొక్కలు నాటడంతో పాటుగా 200 మంది వాహనదారులకు మొక్కలు పంపిణీ చేశారు. డ్రైవింగ్ లైసెన్సుకు గుర్తుగా ఓ మొక్కను నాటాలని పాండురంగ నాయక్ కోరారు. -
విధ్వంసం సృష్టించి ఉపదేశాలా?
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే వేల ఎకరాల పచ్చని భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో ఉష్ణోగ్రతలను తగ్గించాలంటూ అధికారులకు ఉపదేశించటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణం అంటూ వాగూ వంకలను మళ్లిస్తూ ఆ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడటంతోనే ఎండలు మండుతున్నాయనే వాస్తవాలను అంగీకరించకుండా ఉష్ణోగ్రతలు కనీసం 10 డిగ్రీలు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంపై అధికారులు నివ్వెరపోతున్నారు. నదీ గర్భంలో ఆక్రమణలు, ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ అటవీ భూములను గుంజుకుంటుంటే ఉష్ణోగ్రతలు ఎలా తగ్గుతాయి? వర్షాలు ఎలా కురుస్తాయి? అని ప్రశ్నిస్తున్నారు. పచ్చని భూములు మాయం.. టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూ దోపిడీకి తెరతీసింది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కృష్ణా తీరంలోని పచ్చని భూముల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించింది. అవసరమైన దానికంటే దాదాపు మూడింతల భూమిని అధికంగా సేకరించింది. రైతులను భయపెట్టి మరీ 33 వేల ఎకరాలు బలవంతంగా గుంజుకుంది. కృష్ణా కరకట్టలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు అండగా నిలిచింది. స్వయంగా సీఎం చంద్రబాబే కృష్ణా ఒడ్డున నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తన అధికారిక నివాసంగా చేసుకోవడం గమనార్హం. అటవీ భూములకూ ఎసరు రాజధాని ముసుగులో అటవీ భూములపై కూడా కన్నేసిన ప్రభుత్వ పెద్దలు 47,582.16 ఎకరాలను తమకు అప్పగించాలని కేంద్రానికి తొలుత లేఖ రాశారు. అయితే అటవీ భూములు తీసుకొని వినియోగించాల్సినంత అత్యవసరం రాజధానిలో లేదని దీనిపై కేంద్రం నియమించిన పర్యావరణ, అటవీ శాఖ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వీడకపోవటంతో 2017 ఆగస్టులో 5,157 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు కేంద్రం షరతులతో అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కనీసం 7,71,821 చ.కి.మీ. మేర విస్తీర్ణంలో అటవీ భూములుండాలి. కానీ ప్రస్తుతం 5,30,779 చ.కి.మీ. విస్తీర్ణంలోనే అటవీ భూములు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇసుక దోపిడీతో భూగర్భ జలాలు ఖాళీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కృష్ణా నదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. వందల సంఖ్యలో లారీలు, ప్రొక్లెయినర్లతో అమరావతిలోని ఆరు ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం లక్ష టన్నుల ఇసుకను కొల్లగొడుతున్నారు. లింగాయపాలెం, పెనుమాక ఇసుక రీచ్ నుంచే రోజూ 50 వేల టన్నుల ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం గమనార్హం. మాస్టర్ ప్లాన్‌లోనే విధ్వంస రచన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అమరావతి మాస్టర్ ప్లాన్‌లోనే ప్రకృతి విధ్వంసం మొదలైంది. దాదాపు 217.23 చ.కి.మీ. విస్తీర్ణంలో కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. 29.65 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నదులు, వాగులు, కాలువలు కూడా అందులో కలిపేస్తూ మాస్టర్‌ప్లాన్ రూపొందించడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాలను ధ్వంసం చేసేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. రాజధానిలో పర్యటించిన జలసంరక్షణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ అక్కడ జరుగుతున్న ప్రకృతి విధ్వంసం చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాటలకు, చేతలకు పొంతన లేదు పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేదు. రాజధాని పేరుతో భారీగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. కృష్ణా నదిని కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మేం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కూడా వేశాం. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో పచ్చని భూములను నాశనం చేస్తోంది. నదీ ప్రవాహాన్ని కూడా మారుస్తుండంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. – రాజేంద్రసింగ్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి నదిలో నీటికంటే పరివాహక ప్రాంతం భూగర్భంలో పది రెట్లు నీరు నిల్వ ఉంటుంది. నదిలో నీరు తగ్గినప్పుడు ఇసుకలో నీరు నదిలోకి ప్రవహించి నీటిస్థాయిని నిలబెడుతుంది. అమరావతిలో ఇసుకను కొల్లగొట్టడంతో పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు పడే అవకాశాలు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. – విక్రం సోని, పర్యావరణ శాస్త్రవేత్త -
తన పేరులోనే ‘నర.. సింహం’ వైవిధ్యం..
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి తన పేరే నిదర్శనమని.. తన పేరులోనే ‘నర.. సింహం’ వైవిధ్యం ఉందని గవర్నర్ నరసింహన్ సరదాగా వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 25వ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్.. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. భారతీయులు వేల సంవత్సరాలుగా జీవవైవిధ్యాన్ని పాటిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాల్లోనే జంతువులు, వృక్షాలను పూజించే సంస్కృతి ఉందని నరసింహన్ పేర్కొన్నారు. ప్రతి దేవుడి వాహనంగా ఒక జంతువు ఉంటుందని, అలా జంతువులకు కూడా దేవుడితో సమానంగా పూజలు చేసే సంస్కృతి ఉందని చెప్పారు. జీవవైవిధ్యం అంటే పర్యావరణ పరిరక్షణ కూడా అని.. అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో కళకళలాడేదని, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మనిషికి మంచి చేసేదిగా ఉండాలేగానీ.. చెడు చేసేలా ఉండకూడదని చెప్పారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనల్ని కాపాడలేదని, పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మనం ఆరోగ్యంగా జీవించడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మనుగడకు వైవిధ్యమే ఆధారం: జోగు రామన్న జీవవైవిధ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని.. మనిషి మనుగడకు, జీవనోపాధికి కూడా జీవవైవిధ్యమే ఆధారమని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జీవవైవిధ్యంలో ప్రపంచంలోనే భా రతదేశం 8వ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి–2015’ను రూపొందించిందని చెప్పారు. జీవ వనరుల సేకరణ, వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలపై నియంత్రణ, స్థానిక సంస్థల పరిధిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటు, జీవవైవిధ్య వారసత్వ స్థలాల గుర్తింపు, నిర్వహణ విధులను జీవవైవిధ్య మండలి చేపడుతోందన్నారు. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవుగా మెదక్ జిల్లాలోని అమీన్పూర్ చెరువును గుర్తించామని, అక్కడికి దేశదేశాల నుంచి పక్షులు వలస వస్తాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు, కాలుష్యం తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పలువురికి జీవవైవిధ్య అవార్డులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఉపాధిని పొందుతున్న పలువురికి ‘ఇండియా జీవవైవిధ్య సదస్సు–2018’అవార్డులను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. బహుమతిగా లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. -
త్వరలో విద్యుత్ వాహనాల ప్రణాళిక!
సాక్షి, హైదరాబాద్: ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు త్వరలో ప్రభుత్వం విద్యుత్ వాహనాల ప్రణాళికను తీసుకురానుందని రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యుత్ సౌధలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. విద్యుత్ వాహనాల చార్జింగ్ ఏజెన్సీలతో పాటు రిటైల్ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను విక్రయించేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ సరఫరా కోసం రిటైల్ టారిఫ్ పట్టికలో కేటగిరీని ఏర్పాటు చేశామన్నారు. -
ఫోక్స్‌వ్యాగన్ మేనేజర్‌కి ఏడేళ్ల జైలు
డెట్రాయిట్: పర్యావరణ పరిరక్షణ నిబంధనల ఉల్లంఘనకి సంబంధించిన కేసులో ఫోక్స్‌వ్యాగన్ జనరల్ మేనేజర్ ఆలివర్ ష్మిట్కి అమెరికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, 4 లక్షల డాలర్ల జరిమానా విధించింది. అమెరికాను మోసగించేందుకు ఉద్దేశించిన కుట్రలో ఆలివర్ కీలక పాత్ర పోషించారని డెట్రాయిట్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి షాన్ కాక్స్ వ్యాఖ్యానించారు. ఫోక్స్‌వ్యాగన్‌లో ఉన్నత స్థానానికి చేరడానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారని ఆక్షేపించారు. కాలుష్యకారక వాయువుల ప్రమాణాల పరీక్షలను గట్టెక్కడానికి ఫోక్స్‌వ్యాగన్ తమ కార్లలో రహస్య సెన్సార్లను అమర్చేదని అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆలివర్‌కి 169 ఏళ్ల దాకా జైలు శిక్షకు అవకాశం ఉంది. అయితే, తప్పులను అంగీకరించిన దరిమిలా శిక్షాకాలాన్ని న్యాయస్థానం తగ్గించింది. -
‘గ్రీన్’ కండిషన్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈమేరకు 145 పేజీల తీర్పును వెలువరించింది. ప్రతిపాదిత రాజధాని నగర నిర్మాణానికి వరద ముప్పు ఉందని, బహుళ పంటలు పండే భూములు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ పి.శ్రీమన్నారాయణ, అంతటి కమలాకర్, బొలిశెట్టి సత్యనారాయణ 2015లో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతి (ఈసీ) లోపభూయిష్టంగా ఉందని, దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా పిటిషన్ వేశారు. గతంలోనే జస్టిస్ స్వతంతర్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను పూర్తి చేసినా.. తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెల్లడించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఒకే తీర్పును వెల్లడిస్తున్నట్టు జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సంజయ్ పారిఖ్, పారుల్, కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరపున ఏకే గంగూలీ, గుంటూరు ప్రభాకర్, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు తమ వాదనలు వినిపించారు. అయితే ఎన్జీటీ షరతులు రాజధాని నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర్పులో సహజ నీటి ప్రవాహాల దిశలను మార్చరాదని ట్రిబ్యునల్ పేర్కొనడం ప్రధానమని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలున్న చిత్తడి నేలల్లో కట్టడాలకు ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉండటం, కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో దాదాపు 15 వేల ఎకరాలు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు ఇబ్బంది కలిగిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ 25 వేల ఎకరాలు మినహాయిస్తే మాస్టర్‌ప్లాన్ పూర్తిగా మార్చాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడు మళ్లీ అనుమతులన్నీ మొదటికి వస్తాయని చెబుతున్నారు. ఈసీకి షరతులు.. స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) 2015 అక్టోబర్9న జారీ చేసిన ఈసీని పక్కకు పెట్టాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని, అయితే ఈసీ షరతులకు అదనంగా మరికొన్ని షరతులు విధించడం అవసరమని ఎన్జీటీ తీర్పులో పేర్కొంది. వీటిని ఈసీలోని షరతులుగా పరిగణించాలని పేర్కొంది. పదేళ్లలోగా రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంతో పాటు ఇప్పటివరకు జరిగిన పనిని కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తీర్పులో పేర్కొంది. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సంతులన విధానాన్ని పాటించడం ద్వారా ఆర్థికవృద్ధి సాధ్యమని పేర్కొంది. ‘‘ అమరావతి నిర్మాణానికి చట్టంలో కాలపరిమితి ఉంది. ఇప్పటికే పలు పనులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ‘ఫెయిట్ అకంప్లి’ (కొనసాగించక తప్పని పరిస్థితి) సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఉన్న దశ నుంచి వెనక్కి రావాలంటే భారీ మూల్యం చెల్లించడం ద్వారానే సాధ్యమవుతుంది. అది కేవలం ఆర్థికంగానే కాదు. ఇప్పటికే ఏర్పాటైన మౌలిక వసతులను కూల్చాలంటే పర్యావరణం, ప్రజలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఆయా ప్రాజెక్టుల తదుపరి పనులను పూర్తిచేసేందుకు అనుమతించేలా సంతులన విధానం పాటిస్తున్నాయి. అలాగే అవి పర్యావరణ పరిరక్షణకు తగిన రక్షణ చర్యలను ఆదేశిస్తున్నాయి’’ అని తన తీర్పులో ఎన్జీటీ పేర్కొంది. ఈసీకి అదనంగా విధించిన 9 షరతులు ఇవీ - సమర్థవంతమైన నీటి సంరక్షణ ప్రణాళిక రూపొందించుకునేందుకు రాజధాని ప్రాంతం లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర హైడ్రోజియోమా ర్ఫాలజీ అధ్యయనం చేయించాలి. చెరువులు, జలాశయాలు, వరద నీటి కాలువలు, అంతర్గత అనుసంధానంతో కూడిన నీటి నిర్వహణ ప్రణాళిక ఉంటే నీటి సంరక్షణ చర్యలను మెరుగ్గా చేపట్టవచ్చు. - వరద నీటి కాలువలు, నీటి నిలువ కోసం నిర్మించే చెరువులు, సంబంధిత అభివృద్ధి పనుల కోసం ఫ్లడ్ ప్లెయిన్స్ (వరద ప్రాంతాలు)లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేసిన తరువాతే చేపట్టాలి. - నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది. - ప్రతిపాదిత రాజధాని నగరంలో వరద రక్షణ చర్యలకు మినహాయించి మరే ఇతర సందర్భాల్లోనూ ఇంతకు ముందే ఉన్న కట్టడాల్లో మార్పు చేయరాదు. వరద ప్రవాహ నమూనాపై సమగ్రమైన అధ్యయనం చేసిన తరువాతే పనులు చేపట్టాలి. - ప్రతిపాదిత నగరంలో నివాస, నివాసేతర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను ఎక్కడికక్కడ కంపోస్టింగ్ లేదా బయోమెథనేషన్ పద్ధతుల ద్వారా నిర్మూలించాలి. - వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు, సౌర శక్తి వినియోగం, నీటి పొదుపు పరికరాల బిగింపు, వినియోగించిన నీటిని శుద్ధి చేసి ఇతర అవసరాలకు వినియోగించడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల నిబంధనలను నోటిఫై చేయాలి. - వాతావరణ మార్పుల ప్రభావ తగ్గింపునకు ఒక సమగ్రమైన సిటీ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. వచ్చే 6 నెలల్లో రంగాల వారీగా రోడ్ మ్యాప్ తయారు చేయాలి. - కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి. - రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు. రెండు కమిటీలు.. వాటి పాత్ర.. తీర్పులో ఇచ్చిన ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ప్రాజెక్టు నియంత్రణ, పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. అందులో ఒకటి సూపర్వైజరీ కమిటీ. ఇందులో చైర్మన్, నోడల్ అధికారి సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేంద్ర పర్యావరణ విభాగం అదనపు కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. ఏపీ పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ నోడల్ అధికారిగా ఉంటారు. ఇందులో సభ్యులుగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సంస్థ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పుణే వర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఎన్జే పవార్ సభ్యులుగా ఉంటారు. రెండో కమిటీ ఇంప్లిమెంటేషన్ కమిటీ. ఇందులో రాష్ట్ర పర్యావరణ విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా.. పర్యావరణ మంత్రిత్వ శాఖ నామినీ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, అనంతపురం ఎస్కేయూ మైక్రోబ యాలజీ విభాగం పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు. కమిటీలు ఏం చేయాలి? - సూపర్ వైజరీ కమిటీ కనీసం మూడు నెలలకోసారి సమావేశమై విధాన మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వాలి. పర్యావరణ అనుమతుల(ఈసీ)లో ఉన్న షరతులు, ప్రస్తుత తీర్పులో ఉన్న షరతులను రాష్ట్రప్రభుత్వం అమలు చేసేలా మార్గదర్శకాలు ఉండాలి. - ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రతి నెలలో సమావేÔశమై ఈ తీర్పులో ఉన్న ఆదేశాలను, సూపర్వైజరీ కమిటీ ఇచ్చే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చూడాలి. - షరతుల అమలుకు కమిటీ ఒక కాలపరిమితి విధించాలి. ప్రాజెక్టు పురోగతికి ఈ కాలపరిమితితో సంబంధం ఉండాలి. - ఈ కమిటీ సమగ్రమైన తనిఖీ నిర్వహించాలి. నీళ్లు, అడవులు, ప్రవాహాలు, చిత్తడి నేలలు, పర్యావరణ, జీవావరణ ప్రభావాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలాంటివన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు కమిటీ అదనంగా కాలపరిమితితో కూడిన షరతులు లేదా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. వీటిని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. - కమిటీ ప్రతి 6 నెలలకోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించాలి. అయితే తొలి నివేదిక మాత్రం ఈ తీర్పు వెలువరించిన తేదీ నుంచి మూడు నెలలకు సమర్పించాలి. ఈ నివేదిక రాగానే తగిన మార్గదర్శకాలు ఇస్తుంది. - వర్షపు నీటి సంరక్షణ, పునర్వినియోగానికి శుద్ధి చేసిన నీరు, భవన నిర్మాణాలకు ఫ్లైయాష్ ఇటుకలు వినియోగించడం వంటి అంశాలకు సానుకూలంగా భవన నిర్మాణ నిబంధనలను ఈసీలో సవరించాలి. కమిటీ ఈ నిబంధనలను కూడా అమలు చేయించాలి. - రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల బ్యాంకు గ్యారంటీని కమిటీకి సమర్పించాలి. ఈ తీర్పులోగానీ, ఈసీలో ఉన్న షరతులు గానీ ఉల్లంఘించినప్పుడు షోకాజ్ నోటీస్ జారీ చేసి కమిటీ ఆ బ్యాంకు గ్యారంటీని జప్తు చేసుకుంటుంది. -
దుమ్ము దుమారం!
►గ్రేటర్లో ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యం ►శ్వాసకోశ వ్యాధులతో జనం సతమతం ►అధ్వానంగా మారిన రోడ్లతోనే అసలు సమస్య ►కాలం చెల్లిన వాహనాలు, నిర్మాణ పనులు కూడా గ్రేటర్లో వాయు కాలుష్యం సిటీజన్ల ముక్కు పుటాలను అదరగొడుతోంది. ప్రధాన రహదారులపై ఎగిసిపడుతున్న దుమ్ము తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. మట్టికొట్టుకు పోయిన రోడ్లు..పెరుగుతున్న వాహనాలు, మెట్రో పనులు, నిర్మాణ కార్యకలాపాలు, కాలంచెల్లిన వాహనాల కారణంగా నగరం తరచు ధూళిమయం అవుతోంది. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలా చోట్ల సరాసరిన 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూళిరేణువులు నమోదవుతుండడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: గ్రేటర్లో వాయు కాలుష్యం సిటీజన్ల ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రధాన రహదారులపై ఎగిసిపడుతోన్న దుమ్ము తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ప్రతిసారీ రోడ్లపై ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. మహానగరం పరిధిలో కాలుష్య స్థాయిలు ఏటేటా పెరుగుతూనే ఉండడం సిటీజన్లను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్నేళ్ల వార్షిక సగటును పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. పెరుగుతోన్న వాహనాలు, అధ్వాన్న రహదారులకు తోడు కాలంచెల్లిన వాహనాలు, మెట్రో పనులు, నిర్మాణ కార్యకలాపాలతో నగరం తరచూ ధూళిమయం అవుతోంది. మహానగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. ఇందులో సుమారు 10 లక్షల వరకు పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన కార్లు,జీపులు,బస్సులు,ఆటోలున్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో ధూళిరేణువులు,సల్ఫర్ డయాక్సైడ్,నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్యకారకాలు ఊపిరి సలపనీయడంలేదు. నగరంలో పలు ప్రాంతాల్లో పరిమి తికి మించి ధూళి కాలుష్యం నమోదవుతుం డడం ఆందోళన కలిగిస్తోంది. ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలా చోట్ల సరా సరిన 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూ ళిరేణువులు నమోదవుతుండడం గమనార్హం. అవధులు మించిన వాయు కాలుష్యం... గ్రేటర్లో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, ఆబిడ్స్, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం ప్రతి ఘనపు మీటరు గాలిలో తరచూ వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. ప్రధాన కారణాలివే.. ►మెట్రో పనులతోపాటు నగర రహదారులపై నిత్యం విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్మాణం, టెలీఫోన్ కేబుల్స్కోసం జరుపుతున్న తవ్వకాలు ధూళికాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం. ►జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్æ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తిచేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళిమేఘాలు కమ్ముకుంటున్నాయి. ►పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం మరింత పెరుగుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►వాహనాల వేగానికి రహదారులపై పైకి లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా కూడా ధూళి కాలుష్యం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యం.. నగరంలోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ,పరిశోధన సంస్థ(ఈపీటీఆర్ఐ)తాజా అధ్యయనం ప్రకారం నగరంలో ఏటేటా ధూళికాలుష్యం పెరుగుతూనే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ వార్షిక సగటు గతేడాది చివరినాటికి 94 మైక్రోగ్రాములకు చేరుకోవడం గమనార్హం. కాగా సిటీలో ఇప్పటికే వాహనాల కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరింది. దాదాపు 50 లక్షల వాహనాలు సిటీ ఉన్నాయి. వీటి వల్ల గాలిలో హానికారక రేణువులు పెరుగుతున్నాయి. అనర్థాలివే.. ►ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాసకోస సంబంధ వ్యాధులు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ►ఆస్తమా, బ్రాంకైటీస్, హైబ్లెడ్ ఫ్రెషర్, ఊపిరితిత్తుల వద్ధి రేటు తగ్గిపోవడం తదితర వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. ►నగరంలోని పలు ఆసుపత్రులకు వచ్చే 90 శాతానికి పైగా రోగులు ధూళికాలుష్యం బారిన పడుతున్నవారేనని వైద్యులు చెబుతున్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
మిరుదొడ్డి: హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. శనివారం మిరుదొడ్డి, చెప్యాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరితహారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలను నాటి సంరక్షిస్తేనే మానవ మనుగడ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు గొట్టం భైరయ్య, ధార స్వామి, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదు ఇంకుడు గుంతల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దిగ్విజయ ప్రస్థానం
అదిగో అల్లదిగో... డెన్మార్క్ విస్తీర్ణానికి చిన్న దేశం... అయితే, అందంలో ఆనందంలో మాత్రం పెద్ద దేశం. పర్యావరణ పరిరక్షణలో నిలువెత్తు నిబద్ధతను చాటుతున్న దేశం. శాస్త్రసాంకేతిక జ్ఞానంలో ముందుకు దూసుకెళుతున్న దేశం. చమురు, సహజవాయు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల మాత్రమే డెన్మార్క్ శక్తిమంతమైన దేశం కాలేదు. సాహిత్యం నుంచి సాంకేతిక జ్ఞానం వరకు అన్ని రంగాలలో బలంగా ఉండడం వల్లే డెన్మార్క్ శక్తిమంతమైన దేశం అయింది... ఇప్పుడు డెన్మార్క్ గురించి మాట్లాడుకోవడమంటే అభివృద్ధిపథంలో ఉన్న ఒక దేశం గురించి మాట్లాడుకోవడం. అంతమాత్రాన మొదటి నుంచి డెన్మార్క్ నడక నల్లేరుపై నడక కాదు. అడుగులు ఎన్నోసార్లు తడబడ్డాయి. తొమ్మిదవ శతాబ్దంలో ఎన్నో రాజ్యాలుగా చీలిపోయింది డెన్మార్క్. పదో శతాబ్దంలో ఈ రాజ్యాలన్నీ ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది డెన్మార్క్. 1915లో డెన్మార్క్ ప్రజాస్వామ్య భావన మరింత విశాలమైంది. మహిళలకు ఓటు హక్కు రావడం ఇందులో భాగమే. 1930లో డెన్మార్క్ ఆర్థికమాంద్యానికి గురైంది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. 1960 మాత్రం డెన్మార్క్‌కు బంగారు కాలం. నిరుద్యోగం జాడే కనిపించేది కాదు. 1970లో డెన్మార్క్ ఆర్థికవ్యవస్థ మరోసారి దెబ్బతింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 21వ శతాబ్దంలో డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ బలోపేతం అయింది. నిరుద్యోగం తగ్గిపోయింది. 2009లో యూరప్‌లోని ఇతర దేశాల్లాగే డెన్మార్క్‌పై కూడా ఆర్థికమాంద్యం ప్రభావం పడడంతో ఆ దేశ ఆర్థికవ్యవస్థ బలహీనపడింది. అయితే కొద్దికాలంలోనే తిరిగి పుంజుకుంది. డెన్మార్క్‌లో 406 దీవులు ఉన్నాయి. వీటిలో 89 దీవులలో ప్రజలు నివసిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం డెన్మార్క్‌ను అయిదు ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. 1. రాజధాని ప్రాంతం 2. కేంద్రీయ డెన్మార్క్ ప్రాంతం 3. ఉత్తర డెన్మార్క్ ప్రాంతం 4. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం 5. జీలాండ్ ప్రాంతం. రాజధాని కోపెన్హాగెన్తో సహా ఆర్హస్, ఓరెన్స్, ఆల్బోర్గ్, ఫ్రెడరిక్స్ బెర్గ్, ఎస్బ్‌జెర్గ్, జెంటోప్టె, గ్లాడీసాక్స్, రాండర్స్, కొల్డింగ్, హర్సెన్స్... మొదలైన 45 ముఖ్య నగరాలు, పట్టణాలు డెన్మార్క్‌లో ఉన్నాయి. జీవపర్యావరణ విషయాలకు డెన్మార్క్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ‘ఎన్విరాన్మెంటల్ లా’ (1973) అమలు చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. మరోవైపు వివిధరంగాలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. డెన్మార్క్‌కు బలమైన చారిత్రక, సాంస్కృతిక పునాదులు ఉన్నాయి. స్వీడన్, నార్వేలతో బలమైన సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞానం నుంచి సాహిత్యపరిమళం వరకు తనదైన శైలిలో దూసుకు వెళుతుంది డెన్మార్క్. టాప్ 10 1. డెన్మార్క్‌లో 406 ద్వీపాలు ఉన్నాయి. ఒక్కో ద్వీపానికి వెళ్లడానికి వివిధ ఆకారాలలో బ్రిడ్జీలు ఉన్నాయి. బ్రిడ్జీలు నిర్మించడానికి వీలు లేని ద్వీపాలకు బోటు మీద ప్రయాణం చేయవచ్చు. 2. ఇనుము, స్టీలు, రసాయన, ఫుడ్‌ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, నౌకల తయారీ, ఎలక్ట్రానిక్స్... మొదలైన పరిశ్రమలు డెన్మార్క్‌లో ఉన్నాయి. 3. 1940లో జర్మనీ ఆక్రమణకు గురైంది. 4. డెన్మార్క్‌లో 44 శాతం జనాభా పట్టణాలలో నివసిస్తుంది. 5. ‘నాటో’లో 1949లో, 1973లో యురోపియన్ యూనియన్(ఈయూ)లో చేరింది. 6. ‘యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్’ వ్యవస్థాపక సభ్యదేశాలలో డెన్మార్క్ ఒకటి. 7. ప్రపంచ ప్రఖాత్య పిల్లల రచయిత హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ జన్మస్థలం డెన్మార్క్‌లోని ఒడెన్స్ పట్టణం. 8. డెన్మార్క్‌లోని ‘గ్రీన్‌ల్యాండ్’ ద్వీపం ప్రపంచంలోనే పెద్ద ద్వీపం. 9. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఉన్న ‘స్ట్రోగెట్’ యూరప్‌లోని ‘లాంగెస్ట్ షాపింగ్ స్ట్రీట్’లలో ఒకటి. 10. డెన్మార్క్ నుంచి వివిధ దేశాలకు క్రిస్మస్ ట్రీలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. దేశం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ అధికార భాష డానిష్ కరెన్సీ డానిష్ క్రోన్ జనాభా 57 లక్షల 7 వేలు (సుమారుగా) -
గంగానది వెంబడి శుద్ధి ప్లాంట్లు
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో గంగానది పరీవాహక ప్రాంతంలో 20 నీటి శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో ఆయన శనివారం ప్రసంగించారు. గంగ పరీవాహ ప్రాంతాల్లో 20 జల శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను నది వెంబడి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 111 నదులను జలమార్గాలుగా మార్చేందుకు పార్లమెంటు ఆమోదం తెలపడం విప్లవాత్మక చర్య అని, దేశంలోని 35 వేల కిలోమీటర్ల జలమార్గాలను వినియోగించుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జలమార్గాల అభివృద్ధి వల్ల కాలుష్యం తగ్గుతుందని, రవాణా చార్జీలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో వ్యర్థాలను సంపదగా మార్చడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి వాడే తారులో ఎనిమిది శాతం మేరకు ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. -
ప్రకృతితో ముడిపడేదే జీవనం
-
ప్రకృతితో ముడిపడేదే జీవనం
పర్యావరణ పరిరక్షణకు ఇదే అవసరమన్న ప్రధాని * వెంకయ్య నివాసంలో సంక్రాంతి సంబరాలకు హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతితో ముడిపడిన జీవనశైలిని అలవర్చుకుని ముందుకెళ్లాలని, దీనివల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచానికి పెద్ద సవాల్‌గా నిలిచిన పర్యావరణ ముప్పును అధిగమించేందుకు ప్రజలంతా పరిస్థితిని బట్టి ప్రకృతితో ఒదిగిపోవాలన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరైన ప్రధాని.. గతనెలలో జరిగిన పారిస్ పర్యావరణ సదస్సులోనూ ప్రకృతితో మమేకమవటంపై తీవ్ర చర్చ జరిగిందన్నారు. ఇన్నాళ్లూ జరిగిన ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన దేశాలు ఇప్పుడిప్పుడే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. సూర్యచంద్రుల గమనం ఆధారంగానే మానవజీవనం సాగుతోందని చెప్పారు. శతాబ్దాల కిందట ఆదివారం సెలవు దినం కాదని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే సెలవులుండేవని గుర్తుచేశారు. మన దేశంలో పండుగలకు చాలా విశిష్టత ఉందని, రైతుల పంట కోతకు వచ్చినప్పుడు, నాట్లు వేసినప్పుడు పండుగలు జరుపుకుంటారని, మన పండుగలు ఆర్థిక గమనంలోనూ కలిసిపోయాయన్నారు. సంక్రాంతి నుంచి పగలు ఎక్కువగా ఉంటుందని, సూర్య తేజస్సులా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల వారి కోసం ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటామని వెంకయ్య చెప్పారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంబరాలను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, వీకే సింగ్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, నజ్మా హెప్తుల్లా, మహేశ్ శర్మ, జయంత్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి, సీవీసీ కేవీ చౌదరి, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు సభికులను అలరించాయి. వెంకయ్య నా దత్తపుత్రుడు: హెప్తుల్లా ఛలోక్తులతో ఆకట్టుకునే వెంకయ్య సంక్రాంతి సంబరాలకు హాజరైన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాపైనా సరదాకా జోకులేశారు. హెప్తుల్లాకు ఆస్తులు బాగా ఉన్నందున తను ఆమెకు దత్తత వెళ్లానన్నారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘అవును వెంకయ్యను నేను దత్తత తీసుకున్నాను’ అని అన్నారు. ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ భేటీ వచ్చే నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని వెంకయ్య చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రకటిస్తుందన్నారు. సంక్రాంతి సంబరాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి విపక్షాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాను స్వయగా కలిశానని, కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చామని తెలిపారు. ఎస్పీ బాలుకు సత్కారం గాయకుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్లు సత్కరించారు. 50 ఏళ్లపాటు సంగీత యాత్ర కొనసాగించటం సరళమైన పనికాదని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ఉన్నతశిఖరాలకు వెళ్లిన తర్వాత కూడా సాధనను స్వచ్ఛభారత్ కోసం సమర్పించుకోవడం గొప్పవిషయమన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ పాటను పాడిన బాలు.. అన్ని భాషల్లో ఈ పాటను తానే పాడతానన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవడం జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తాను పాడిన 40 వేల పాటల్లో స్వచ్ఛభారత్ గీతమే ఉత్తమమైనదని బాలు చెప్పారు. -
కథ చెబుతాను.. జై కొడతావా...
కథలంటే పిల్లలకి చెప్పే కథలనుకున్నారా? పెద్దలు కూడా వినాల్సిన కథలు. ఊ కొట్టి ఊరుకుంటే సరిపోయేవి కాదు జనంతో కలిసి జై కొట్టాల్సిన కథలు. కొండల్ని, గుట్టల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే కథలు, నీటిని, గాలిని కలుషితం చేయవద్దనే స్ఫూర్తిని నింపే కథలు... సంపుల్‌గా కాలుష్యం గురించి చెప్పేస్తే సరిపోతుందా? దానికీ ఒక కథారూపం ఇచ్చి వినిపిస్తే... దాని ప్రభావం కళ్లకు కడుతుంది. మనసు పర్యావరణానికి జై కొడుతుంది. ‘ఇప్పుడు ప్రతి అంశానికీ స్టోరీ టెల్లింగ్‌ను మేళవిస్తున్నారండీ. ఏ విషయమైనా కథలా చెబితేనే మనసులకు హత్తుకుంటుందనే ఆలోచనే దీనికి కారణం’ అన్నారు నగరానికి చెంది న ప్రసిద్ధ స్టోరీ టెల్లింగ్ ఆర్టిస్ట్ దీపాకిరణ్. ఇటీవలే బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో ‘సేవ్ రాక్ సొసైటీ’ నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ సెషన్ దీనికో ఉదాహరణ. ఈ కార్యక్రమంలో భాగంగా కొండరాళ్ల విశిష్టత, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వంటివి కథలు కథలుగా వినిపించారు దీపాకిరణ్. ‘ఏ అంశానికి ఆ అంశంపై రీసెర్చ్ చేసి కథలు రాసుకుని, వాటిని వినసొంపుగా వినిపించడం నాకు ఎప్పటికప్పుడు ఒక ఛాలెంజ్‌గా మారుతోంది. ఏది ఏమైనా పిల్లలకు కథలు వినిపించడం ద్వారా వారిలో క్రియేటివ్ స్కిల్స్‌ను పెంచడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా నా కళ విస్తరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు దీపాకిరణ్. విన్నారు కదా. జై కొట్టండిక. -
ఉద్యమంలా డిజిటల్ ఇండియా కార్యక్రమం
- ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు విజయవాడ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహించినట్లేనని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక బెంజిసర్కిల్ వద్ద 2కె డిజిటల్ ఇండియా ర్యాలీని శనివారం ఆయన ప్రారంభించారు. ర్యాలీ బందరు రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం జేసీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానంగా సంబంధిత వ్యక్తుల సర్టిఫికెట్లు తదితర ధ్రువపత్రాలను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సర్టిఫికెట్లను అంతర్జాలంలో ఉంచుకోవడం ద్వారా పూర్తి భద్రతకు అవకాశం ఉందన్నారు. ప్రతి నిత్యం కోట్ల కొద్ది పేపర్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ డిజిటల్ లాకర్‌ను పొందాలని అన్నారు. మీ-సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి రాజారావు, జిల్లా ఎన్ఐసీ అధికారి శర్మ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామకృష్ణ, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు. -
‘పర్యావరణ పరిరక్షణలో భాగం కండి’
ముంబై: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని సీఎం ఫడ్నవీస్ సతీమణి అమృతనగరవాసులకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దక్షిణ ముంబైలోని మలబార్ ప్రాంతవాసులతో కలసి ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోథా, విల్సన్ కాలేజీ ప్రిన్సిపల్ వీజే సిర్వారియా, ఎంసీజీఎం కార్పొరేటర్లు, వందమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడతామని కార్యక్రమానికి హాజరైన ప్రజలతో లోథా ప్రతిజ్ఞ చేయించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్ నేవీ స్వచ్చత అభియాన్ నిర్వహించింది. కొంకణ్ రైల్వే ప్రత్యేక సైకిల్ స్టాండ్లను ఏర్పాటు చేసింది. గోదావరి తీరంలో స్వచ్ఛత అభియాన్... నాసిక్‌లోని గోదావరి తీరంలో మహా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం జరిగింది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పర్యావరణ దినం సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా 10 వేల చెట్లను నాటాలని సంకల్పించింది. -
ప్రకృతి దేవోభవ
- పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల కృషి - సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు - పాఠశాల వేదికగా పనిచేస్తున్న ఎకోక్లబ్ పర్యావరణం దెబ్బతింటే బాధితులుగా మారేది భావితరాలే. అందుకే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అంశంలో అత్యవసరంగా అవగాహన పెంచాల్సింది విద్యార్థుల్లోనే. ఈ విషయంలో ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి నగరంలోని పాఠశాలల్లో ఏర్పాటవుతున్న ‘ఎకో క్లబ్స్’. వీటిలో కొన్ని స్పష్టమైన విధానాలతో ముందడుగేస్తున్నాయి. ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ‘మా స్కూల్లో 30 మంది విద్యార్థులు ఎకో క్లబ్లో వలంటీర్లుగా ఉన్నార’ని చెప్పారు కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్‌స్కూల్ టీచర్ రమ. ప్రస్తుతం తమ స్కూల్లోని ఎకోక్లబ్కు కో ఆర్డినేటర్‌గా ఉన్నారామె. పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వెల్త్ అవుటాఫ్ వేస్ట్’ (వావ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ కాంపిటీషన్లో 2014-15కు గాను పాఠశాలలోని ఎకో క్లబ్ విజేతగా నిలిచింది. ఈ పాఠశాల విద్యార్థులు 9,545 కిలోల పేపర్ వేస్ట్‌ను సేకరించి ‘వావ్’కి అందించడం ద్వారా గెలుపు దక్కించుకున్నారు. ఇదే ఏడాది మరో ఎన్జీఓ ‘టెరి’ నిర్వహించిన టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలోనూ వీరు గెలుపొందారు. ఇంతే కాకుండా కొంతకాలంగా విభిన్న రకాల యాక్టివిటీస్ ద్వారా తమ ఎకో క్లబ్ విద్యార్థుల్లో చైతన్యం పెంచుతోందని వివరించారు రమ. పర్యావరణ స్పృహే ధ్యేయంగా.. స్కూల్లో 2005లో ఎకోక్లబ్ ఏర్పాటైంది. అదే ఏడాది నుంచి స్కూల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఫలితంగా అప్పటి వరకూ పచ్చని ఆకుకు సైతం నోచుకోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పుడు వందలాది చెట్లు పెరిగాయి. ‘నాటిన 500 మొక్కల్లో ఎన్నో ఏపుగా పెరిగాయి. క్రోటన్స్ నుంచి పూల మొక్కల వరకూ మా స్కూల్ మొత్తం గ్రీనరీయే. త్వరలో ఆర్గానిక్ గార్డెనింగ్‌ను స్కూల్ టైపై ఏర్పాటు చేయనున్నాం’ అంటూ ఉత్సాహంగా చెప్పారు రమ. ఈ స్కూల్లోని ఎకోక్లబ్ ప్రసిద్ధ ఎన్జీఓ ‘టెరి’ నుంచి గత ఐదేళ్లుగా టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలో గెలుపొందుతూ ఎన్విరాన్మెంట్ అంశాల్లో బెస్ట్ స్కూల్‌గా నిలుస్తోంది. పర్యావరణం అంశంలో అందుకున్న నగదు బహుమతులను సైతం వీరి క్లబ్ పాఠశాలలో ట్రీ ప్లాంటేషన్‌కు అవసరమైన ఖర్చులుగా వినియోగించడం విశేషం. ‘ఎనర్జీ సేవింగ్’ అంశంపై పీయూష్ గోయల్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌కు మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక స్కూల్ మాదే’నని వివరించారు ఆమె. హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ఆర్గానిక్ రంగులు, టపాసులు.. వినియోగంపై తమ విద్యార్థులు రకరకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని, ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దనే సందేశంతో పెయింటింగ్, వ్యాసరచన పోటీలతో పాటు తరచుగా ర్యాలీలు నిర్వహిస్తారని చెప్పారు. మనిషిని ప్రకృతి పుట్టిస్తే.. అభివృద్ధి పేరిట ఆ ప్రకృతినే నాశనం చేస్తున్నాడు మనిషి. ఆ ఫలితం ఇప్పటికే రకరకాల వైపరీత్యాల రూపంలో మనకు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుక్త వయసులోనే ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను తెలియజెప్పే ఎకోక్లబ్స్ అన్ని స్కూల్స్‌లో ఇంతే యాక్టివ్‌గా మారితే.. పచ్చని భవితకు ఆసరాగా మారితే.. అంతకన్నా కావాల్సిందేముంది? -
అటవీ భూములను రక్షించాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో అటవీ భూములను రక్షించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కల పెంపకాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా జిల్లాలో అటవీ భూములను పరిరక్షించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని, ఇందు కోసం సాధ్యమైనంత కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ కలెక్టర్లకు ఈ సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టంచేశారు. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేతలోనూ నిక్కచ్చిగా ఉండాలన్నారు. జిల్లాలో అత్యవసర సమయంలో కావాల్సిన నిధులను అందుబాటులో ఉంచుకునేందుకు అనువుగా కలెక్టర్ పరిధిలో రూ.10 కోట్లను ప్రత్యేక నిధిగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులను సైతం జారీ చేశారు. జిల్లాలో పాలనా పరంగా మరింత వేగం పెంచాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్ పనులను కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.మిషన్ కాకతీయ వల్ల రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు. చెరువుల తవ్వకం, పునర్నిర్మాణం అనే యజ్ఞం కలెక్టర్ల పర్యవేక్షణలో సరైన నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి కావాలన్నారు. ఖమ్మంలో ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. డంపింగ్‌యార్డ్ లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను స్థానికులు అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సీఎం కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి సత్వరం చర్యలు తీసుకోమని ఆదేశించడం విశేషం. నగరాన్ని, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అన్ని పట్టణాల్లో చెత్తను ఎత్తివేయడానికి అనుగుణంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో తడి,పొడి చెత్తలను ఎత్తివేసేందుకు రెండు డస్ట్బిన్లను పంపిణీ చేయాలని సూచించారు.. జిల్లాలో శ్మశాన వాటిక కొరత ఉన్న ప్రాంతాన్ని గుర్తించి శ్మాశాన వాటికలకు స్థలం మంజూరు చేయాలని తెలిపారు. రైతుబజారులను ఏర్పాటు చేయాలని, ప్రతినెలలో ఒకరోజు అర్బన్ డే, ఒకరోజు రూరల్డేను నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మరుగుదొడ్లను నిర్మించుకునే వారికి రూ.12వేల సహాయాన్ని మంజూరు చేయాలన్నారు. సామూహిక మరుగుదొడ్లకు రూ.60 వేలు కేటాయించాలన్నారు. హైదరాబాద్‌లో సీఎం నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావడానికి దాదాపు వారం రోజుల ముందు నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ వివిధ శాఖల వారీగా అభివృద్ధిని సమీక్షించి, ప్రగతి నివేదికలను తయూరు చేశారు. దాదాపు 18 అంశాలతో ఈ సమావేశం ఎజెండా రూపొందిం చారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ ప్రాజెక్టుల అంశానికి ఎజెండాలో తొలి ప్రాధాన్యం లభించింది. నీటిపారుదల, వాటర్‌గ్రిడ్, గోదావరి పుష్కరాల పనులు, సీజనల్ వ్యాధులకు సంబంధించి పరిస్థితి, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, జిల్లాలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమతోపాటు జిల్లాలో ఫుడ్‌పార్క్, డ్రైపోర్ట్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసుకున్నారు. గత నెలలో సీఎం ఖమ్మంలో పర్యటించి భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, అశ్వాపురం మండలం అమర్ద వద్ద మరో పవర్ ప్లాంట్ నిర్మించే అవకాశంపై వివరాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. మిషన్‌కాకతీయలో జిల్లావ్యాప్తంగా 903 చెరువులను అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెండర్లు పూర్తయిన తీరు, ఇప్పటికి పనులు ప్రారంభించిన చెరువులు, వాటి పురోభివృద్ధి తదితర అంశాలను నివేదికలో వివరించారు. తొలిరోజు సీఎం నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావనకు రాగా.. మరికొన్ని అంశాలను రెండోరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశంలో కలెక్టర్ ఇలంబరితితోపాటు ఎస్పీ షానవాజ్‌ఖాసిం, జాయిం ట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బంజారాహిల్స్: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర అటవీశాఖ ప్రకాష్ జవదేకర్ అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కును సందర్శించిన ఆయన పార్కులో వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. దేశంలో ప్లాస్లిక్‌క్యారీ బ్యాగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో కేంద్ర ్రపభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా క్యారీ బ్యాగ్‌లపై నిషేధాన్ని కఠిన ంగా అమలు చేయడంతో పాటు తక్కువ మైక్రాన్ల క్యారీ బ్యాగ్‌ల తయారీ సంస్థలను గుర్తించి మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పార్కులో ప్రవేశ రుసుం తగ్గించాల్సిందిగా వాకర్లు కోరగా చట్టప్రకారం పార్కు నిర్వహణ ఉంటుందన్నారు. పార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు, వాకర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పార్కు నిర్వహణాధికారి మోహన్ వివరించారు. కార్యక్రమంలో అధికారులు మిశ్రా, శర్మ, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు మట్టిపాలు
నరసరావుపేట రూరల్:‘ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకోసం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. వాటిని నిబద్ధతతో సంరక్షించుకోవాలి’ అంటూ పర్యావరణ వేత్తలు, పాలకులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయి సిబ్బంది చెవికి అవేమీ ఎక్కడంలేదు. ‘నీరు-చెట్టు’ అంటూ సర్కారు ఒకవైపు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటే దీనికి ఆదర్శంగా ఉండాల్సిన అటవీశాఖ అధికారులు పూర్తిగా నీరుగారుస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము మట్టిపాలుకానుంది. ఇందుకు తాజా ఉదాహరణే కోటప్పకొండలో నాటిన మొక్కల దుస్థితి. వినుకొండ జోన్ పరిధిలోని కోటప్పకొండ అటవీ ప్రాంతంలో శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు ఎర్రచందనం మొక్కలను నాటారు. గత ఏడాది ఆగస్టులో ఆయన స్వయంగా మొక్కలు నాటారు. పెట్లూరివారిపాలెం వైపు వెళ్ళే రహదారిలో కొండ దిగువన ఐదు హెక్టార్లలో మొక్కలు సాగుచేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.15 లక్షల ఖర్చుచేసి పిచ్చిమొక్కలు తొలగించి, నేలను చదును చేసి రెండువేల ఎర్రచందనం మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణను మరిచారు. మొక్కలకు నీరు కూడా సక్రమంగా అందించకపోవడంతో ప్రస్తుతం కొన్ని మొక్కలు ఎండిపోగా మరికొన్ని ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఎండిపోయిన గడ్డితో నిండిపోయింది. అటవీ శాఖాధికారులు ఎంత నిబద్ధతతో మొక్కల పెంపకాన్ని చేపట్టారో దీనిని చూస్తే అర్థమవుతోంది. వేసవి రాకముందే మొక్కలు ఎండిపోతే రానున్న రోజుల్లో ఎండలు పెరిగితే మిగిలిన మొక్కల సంరక్షణ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటర్ ట్యాంకర్లతో మొక్కలకు నీటిని అందిస్తాం కోటప్పకొండ అటవీప్రాంతంలో పెంచుతున్న ఎర్రచందనం మొక్కల సంరక్షణకు వేసవిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కలకు అందిస్తాం. ఇప్పటికైతే మొక్కల పరిస్థితి బాగానే ఉంది. - బద్దునాయక్, ఫారెస్ట్సెక్షన్ ఆఫీసర్, కోటప్పకొండ -
50 మైక్రాన్ల కన్నా తగ్గితే జరిమానా
ప్లాస్టిక్ బ్యాగ్‌లపై పర్యావరణ మంత్రి సాక్షి, ముంబై: ప్లాస్టిక్ వినియోగం వల్ల విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పర్యావరణ శాఖ నడుం బిగించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ అక్రమంగా వాటిని తయారుచేస్తే సంబంధిత తయారిదారులపై, వాటిని విక్రయించే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి రామ్‌దాస్ కదం ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై లక్ష రూపాయల వరకు జరిమాన, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఈ నియమాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. వాతావరణ పరిరక్షణ కోసం గతంలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రభుత్వం నిషేధించింది. కాని పకడ్బందీగా అమలు చేయకపోవడంవల్ల వాటి వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. దీనిపై మంత్రాలయంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులతో కదం చర్చించారు. ప్లాస్టిక్ వినియోగంవల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, దీంతో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీని, వాటి వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. దీంతో కదం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిషేధించినప్పటికీ వాటి తయారి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్‌కు బదులుగా బట్టతో కుట్టిన, కాగితపు సంచుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కదం తెలిపారు. అందుకు మహిళా పొదుపు సంఘాలకు వాటి తయారీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
లోకకల్యాణం కోసమే అప్తోర్యామం
కర్నూలు(జిల్లా పరిషత్): అప్తోర్యామం, మహాసౌర యాగాలతో పర్యావరణ పరిరక్షణతో పాటు లోక కల్యాణం సిద్ధిస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం స్థానిక గాయత్రి ఎస్టేట్స్‌లోని పుష్పక్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మహాయాగాన్ని విజయవంతం చేయాలన్నారు. యాగంలో పాల్గొనాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించామన్నారు. కృష్ణదేవరాయల కాలం నుంచే రాయలసీమ ప్రాంతంలో యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారన్నారు. యాగం మహా యోగమని.. కులమతాలకు అతీతంగా ఇలాంటి యాగాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలన్నారు. కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతంలో యాగ నిర్వహణ వల్ల సస్యశ్యామలం అవుతుందన్నారు. మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి కర్నూలు రాధాని కాలేకపోయినా.. యజ్ఞయాగాలకు రాజధాని అవడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా యాగానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హోమ పర్యవేక్షకులు బ్రహ్మశ్రీ కేసా ప్రగడ హరిహరనాథశర్మ మాట్లాడుతూ 90 ఏళ్ల క్రితం రెంటచింతల యాజులు ఈ యాగాన్ని రాష్ట్రంలో నిర్వహించారన్నారు. అప్తోర్యామం-శ్రౌతయాగం-మహాయాగం-స్మార్త యాగం ఏకకాలంలో ఒకే స్థలంలో, రెండు విడివిడి యాగశాలల్లో, రెండు విడి బృందాలుగా చేపట్టడం విశేషమన్నారు. జీవకోటి ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, దీక్షతో నిర్వహించే ఇలాంటి మహాయాగాలు అరుదన్నారు. సమావేశంలో ప్రజాహిత సేవా సమితి ట్రస్ట్ బ్రహ్మశ్రీ కేసా ప్రగడ ఫణిరాజశేఖరశర్మ, యాగ పీఆర్వో వెంకటాచలం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ ధనారెడ్డి, పబ్లిక్‌హెల్త్ రిటైర్డ్ ఎస్ఈ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఎమ్మెల్యే ఐజయ్య, రాయలసీమ, Environmental conservation, MLA ijayya, Rayalaseema -
స్వావలంబనకు విజయపతాకం
పెళ్లి, కాపురం, పిల్లలు... ప్రతి మహిళా కోరుకునే అదృష్టాలు. జయాదేవికి అవి కోరుకోకుండానే దక్కాయి. అయినా వాటితో సంతృప్తి పడిపోలేదామె. ఒక స్త్రీగా మాత్రమే ఆలోచించి ఉండిపోలేదు. సమాజంలో ఓ బాధ్యత గల పౌరురాలిగా ఆలోచించింది. పదిమందికీ ఉపయోగపడటంలోనే అసలైన ఆనందం ఉందని అనుకుంది. అందుకే ఆమె నేడు కొన్ని వందల కుటుంబాలకు పెద్ద దిక్కయ్యింది. కొన్ని వేల మందిని వెనకుండి నడిపిస్తోంది. కొన్ని లక్షల మందిలో స్ఫూర్తిని నింపుతోంది! ఒకరి వెంట నడవడం తేలికే. కానీ పది మందిని వెంట నడిపించుకోవడం అంత తేలిక కాదు. అలా చూస్తే జయాదేవిని గొప్ప నాయకురాలని అనాలి. ఎందుకంటే ఆమె వెంట కొన్ని ఊళ్లే నడుస్తున్నాయి. ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ తమ రూపురేఖల్ని అందంగా మార్చుకుంటున్నాయి. బీహార్‌లోని చాలా ఊళ్లలో జయాదేవి పేరు మారు మోగుతూ ఉంటుంది. ఆవిడ ఎవరు అని అడిగితే... అందరి కంఠాలూ ఒకేసారి పలుకుతాయి... మా అమ్మాయి అని! అందరూ ఆమెను తమ ఇంటి బిడ్డే అనుకుంటారు. తమ కుటుంబాలను నిలబెట్టిన దేవతగా కొలుస్తారు. జీవితాలనే మార్చేసింది... బీహార్ రాష్ట్రంలోని ‘సారథి’ అనే గ్రామంలో పుట్టింది జయాదేవి. అభివృద్ధి అన్న మాటకు ఆమడదూరంలో ఉండే ఊరది. ఆడపిల్లలకు పెళ్లే జీవితం అనే నమ్మకం అక్కడి వారిది. అందుకే ఐదో తరగతితోనే జయాదేవి చదువుకు ఫుల్స్టాప్ పడింది. పన్నెండో యేటనే ఆమె మెడలో తాళిబొట్టు పడింది. కాపురం అంటే ఏమిటో తెలియని వయసులోనే అత్తవారింటికి పయనమయ్యింది. తన పసితనం పూర్తిగా పోకముందే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఇంటిని చక్కబెట్టుకోలేక చాలా అవస్థ పడేది. భర్త రోజు కూలీ. అతడి సంపాదనతో పాటు రెండు ఆవుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు మనుషులు బతకాలి. చాలా ఇబ్బంది అనిపించేది. సరిగ్గా అప్పుడే నోట్రడామ్ హెల్త్ సెంటర్ నుంచి కొందరు నన్స వచ్చారు. వారి ద్వారా స్వయం సహాయక సంఘాల గురించి తెలిసింది జయాదేవికి. వెంటనే తన కష్టాలు గుర్తు రాలేదామెకి. తన ఊరు, చుట్టుపక్కల ఊళ్లలోని వారి కష్టాలు గుర్తొచ్చాయి. తన కుటుంబంతో పాటు వారందరి కుటుంబాలనూ చక్క దిద్దాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టింది. తన స్వస్థలంతో మొదలుపెట్టి ఊరూరా తిరిగింది. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి అందరికీ వివరించింది. ఒక్కచోట మొదలుపెట్టి పలు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నలభై అయిదు గ్రామాల్లో 285 సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతురాలయ్యింది. రెండువేల మంది మహిళలను సభ్యులను చేసింది. ఆర్థిక స్వావలంబన కలిగించింది. వారంద రి పిల్లలనూ బడిబాట పట్టించింది. ఈ అందరి ఆకలి మంటలను చల్లార్చింది. ప్రతి ఇంటా ఆనందాన్ని నింపింది. ఆమె అంతటితో ఆగిపోలేదు. ఆ గ్రామాల్లో నక్సలైట్ల దాడుల కారణంగా జరుగుతోన్న దారుణాల మీద దృష్టి పెట్టింది. వారికి భయపడే తండ్రి తనను బడి మాన్పించి పెళ్లి చేసి పంపేయడం, అందంగా ఉంటుందన్న కారణంగా తన చెల్లెలిని దూరంగా వేరేవాళ్ల ఇంట్లో ఉంచడం వంటివన్నీ ఆమెను ఎంతో బాధించాయి. ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదని తపించింది. నక్సల్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తింది. పోలీసు వ్యవస్థను జాగృతం చేసింది. నక్సలైట్ల నీడ ఊళ్లమీద పడకుండా చేసింది. ఆపైన ఆమె సాధించిన మరో విజయం... వ్యవసాయ అభివృద్ధి. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నీటి పారుదలను మెరుగుపర్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అక్కడి రైతులకు పరిచయం చేసింది. దాంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ పాటు పడటం మొదలుపెట్టింది. వేల సంఖ్యలో మొక్కలను నాటి గ్రామాలన్నింటికీ పచ్చరంగు పూసేసింది. ఎన్నో అవార్డులను, రివార్డులనూ అందుకుంది. ఒక్క మహిళ ఇన్ని సాధించడం మాటలు కాదు అని ఎవరైనా అంటే... ‘ఇది నా ఒక్కదాని వల్లా కాలేదు, అందరూ సహకరించడం వల్లే సాధ్యపడింది’ అంటుంది జయాదేవి వినమ్రంగా. ఇంత సాధించినా ఇప్పటికీ విశ్రమించదలచు కోలేదామె. ఇంకా ఇంకా ఏదైనా చేయాలని తపిస్తోంది. అసలు మా రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోని ప్రతి గ్రామమూ ఇలా మారిపోవాలి అంటోంది. రాష్ట్రానికో జయాదేవి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కనీసం మనలో కొందరైనా ఆమె స్ఫూర్తితో అడుగులేస్తే ఆమె అన్నది జరగక మానదు! -
నిమర్జనం జాగ్రత్త
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం భక్తి పారవశ్యంతో ఆదిదేవున్ని కొలుస్తున్నారు. మరికొన్నిచోట్ల మాలధారణలు, కంకణధారణలు స్వీకరించి తమదైన రీతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల పర్యావరణ పరిరక్షణ కు మట్టి వినాయకులను ప్రతిష్టించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. మంటపాల్లో నిర్వాహకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉత్సవాలతో పాటే ప్రమాదాలూ పొంచి ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నవరాత్రులను అంతే ఆనందంతో ముగించుకోవాల్సిన అవసరం ఉంది. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అశుభ ఘడియలు చోటు చేసుకోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సంబురాలు విజయవంతం చేయొచ్చు. - కరీంనగర్ క్రైం → నిమజ్జనోత్సవం విజయవంతం చేద్దాం.. → కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం → మండళ్ల నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల చోదకులు ఇవి పాటించాలి నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిమలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు సూచనలివ్వాలి. ►అనుభవజ్ఞులైన డ్రైవర్లనే ఎంచుకోవాలి. ►డ్రైవర్‌కు ముందుగానే పోలీసులు, ఉత్సవ సమితి వారు సూచించిన సూచనలు, సలహాలను ఇవ్వాలి. ►డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. ►మద్యం, మత్తు పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి. ►ముందు, వెనుక, పక్కభాగాలను పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయాలి. ►డ్రైవర్ పక్కన ఎవరినీ కూర్చోనివ్వద్దు. అలాగే వాహనం ముందు భాగంలో ఎవరినీ కూర్చోనివ్వకూడదు. ►రోడ్లపై ఉండే గతుకులు, గుంతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినాయక ప్రతిమకు తగిలే అవకాశం ఉంటే అవి వెళ్లే వరకు పూర్తి శ్రద్ధతో వాహనం నడిపి వాటిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకాకూడదు. ►ట్రాక్టర్ పైన ప్రతిమ వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. ►డ్రైవర్‌ను సదరు నిర్వాహకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కుటుంబీకులూ తమ వంతుగా... ►శోభాయాత్ర, నిమజ్జన సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ►నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపించకుండా, తెలిసిన వారితో గానీ, కుటుంబ సభ్యుల్లోని వారితో గానీ వెళ్లేలా చూసుకోవాలి. ►ఎలాంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా చూసుకోవాలి. మత్తు పానీయాలు, పదార్థాలకు లోనుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి. ►క్రమశిక్షణ, శాంతియుతంగా ఉండాలని ఆదేశించాలి. ►శోభాయాత్ర తిలికించేందుకు చాలా మట్టుకు ప్రజలు డాబాల పైకి ఎక్కి తిలకిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ప్రహారి ఉన్న డాబాలపైకి ఎక్కి తిలకించాలి. అలాగే సమీపంలో విద్యుత్ తీగలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. సెట్టింగ్‌ల విషయంలో... వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మధ్య జరుపుకోవాలి. ఇందులో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడం మేలు. ఒక బండి తర్వాత ఇంకో బండి వరుస క్రమంలో వెళ్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. తిలకించే భక్తులకూ సౌకర్యంగా ఉంటుంది. ►శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి. ►ఎలాంటి ఉద్వేగాలకు పోకూడదు. ►కేటాయించిన నెంబర్ల ప్రకారమే క్రమపద్ధతిలో వెళ్లాలి. ►ఉత్సవ సమితి వారు, పోలీసులు సూచించినవిధి విధానాలు పాటించాలి. ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాలను భారీ సెట్టింగులతో వేసి వచ్చే భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపేందుకు చాలా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. మరికొన్ని చోట్ల సెట్టింగులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే.. వేసే సెట్టింగుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. ►కరెంటు వైర్ల కింద నుంచి సెట్టింగులు ఉండ కుండా జాగ్రత్త పడాలి. ►లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. తెగిపోవడం, జాయింట్లు వేయడం వంటివి లేకుండా చూసుకోవాలి. ►సెట్టింగుల సమీపంలో బాణసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ►అగ్ని ప్రమాదాలు సంభవించే వాటిని సమీ పంలో ఉంచకుండా చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాటిని ఆర్పేందుకు వీలుగా అవసరమైన నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచాలి. ►ఆది దేవున్ని దర్శించుకునే భక్తులకు ప్రతిమ వద్దకు వెళ్లేందుకు వీలుగా పకడ్బందీగా మెట్లు, స్టేజీలను ఏర్పాటు చేయాలి. ►దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఎలాంటి తోపులాటలు జరుగకుండా ఒకరి తర్వాత ఒకరు దర్శించుకు నేలా భారీ కేడ్లను ఏర్పాటు చేయాలి. ►వర్షపు నీరు లోపలికి రాకుండా పైభాగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మండపాల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ►రాకపోకలు సాగించే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిమజ్జనం సమయంలో... ►ప్రతిమలను ప్రవహించే నదులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, లోతైన వాటిల్లో నిమజ్జనం చేస్తారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ►నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రెయిన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. ►సూచనలు, విధివిధానాలు తప్పక పాటించాలి. ►పోలీసులు, నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని చెరువులు, నదులు, కుంటలు, ప్రాజెక్టుల నీటిలోకి వెళ్లేందుకు సాహసించకూడదు. ►నీటి లోపలికి ఎవరూ వెళ్లకూడదు. అందులోనూ ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు. కరెంటు వైర్ల వద్ద జాగ్రత్త.. ►నిమజ్జన శోభాయాత్ర సమయంలో చాలా సందర్భాల్లో కరెంటు తీగలతో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ►కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను ముందుగానే విద్యుత్ శాఖ వారు సరిచేయాలి. ►శోభాయాత్ర సమయంలో లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోవడం, జాయింట్లు ఉన్న వైర్లను వినియోగించ కూడదు. ►జనరేటర్‌ను ప్రతిమ ఉన్న వాహనంలో ఉంచకుండా, దాని వెనుక భాగంలో ఒక వాహనంలో గానీ, ట్రాలీలో గానీ ఉండేలా చూసుకోవాలి. ముందు వాహనం కదిలిన సమయంలో వెనువెంటనే జనరేటర్ కదిలేలా అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగలు ప్రతిమకు తగిలే అవకాశం ఉందనిపిస్తే వెంటనే వాటిని పైకిలేపేందుకు ప్రత్యేక కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. వైర్లు దాటే వరకు అప్రమత్తంగా ఉండాలి. ►శోభాయాత్రలో బాణసంచాలు, తదితర పేలుడు పదార్థాలు ఉపయోగించరాదు. ►అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించేందుకు ప్రతిమ వెంట వాహనంలో అవసరమైనంత మేర నీళ్లు, ఇసుకను బకెట్లలో ఉంచుకోవాలి. భక్తి పారవశ్యం చాటుదాం.. ►నిత్యం ఎంతటి భక్తితో ఆదిదేవున్ని కొలిచామో అదే మాదిరిగా నిమజ్జన శోభాయాత్రలోనూ ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని కొలవాలి. ►భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ఇష్టారీతిన పారే యకుండా చేతికి అందివ్వాలి. ►భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్యపూర్వక వాతావరణం కలిగేలా చూడాలి. ►నిర్వాహకులు శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి. ►ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతన ప్రజ్వరిల్లేలా దేశ సంస్కతి, సంప్రదాయాలను వెల్లివిరిసే భక్తి పాటలు, నృత్యాలు, కోలాటాలు తదితర వాటిని చేసుకుంటూ వెళ్లాలి. ►తిలకించేందుకు వచ్చే చిన్నారులు, మహిళలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. ►మండపాల నిర్వాహకులు తమతో వచ్చే సభ్యులను తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి ఇంటికే చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించాలి. ►ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చూడాలి. సమాచారం ఇవ్వండి.. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
మొక్కల పెంపకం అందరి బాధ్యత రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు జనగామ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ విధిగా మొక్కలను పెంచాలని సూచించారు. రూరల్ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎస్పీ కాళిదాసురంగారావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన జీవితంలో మొత్తం లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఇందులో భాగంగా 1978లో తాను డిగ్రీ చదివిన రోజుల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థిగా వేలాది మొక్కలు నాటానని గుర్తుచేశారు. వంట చెరుకు కారణంగా ప్రస్తుతం అడవులు క్షీణిస్తున్నాయని, వాటి లోటును పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ విధిగా 100 మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులందరూ ప్రతిభావంతులని, ప్రస్తుతం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులు చాలామంది అందులో చదువుకున్నావారేనని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. మునిసిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మూత్రశాలల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీఇచ్చారు. కళాశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు అధ్యాపకులు పాటుపడాలని కోరారు. అనంతరం మునిసిపల్ వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, డీఎస్పీ కూర సురేందర్, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగబండి సుదర్శనం, క ళాశాల అధ్యాపకులు ఐదు కంప్యూటర్లను విద్యార్థులకు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింగరావు, ఎస్సై కోటేశ్వర్రావు, కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్, నాయకులు పిట్టల సత్యం, లెక్చరర్లు ఎండీ.అప్జల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన రూరల్ ఎస్పీ జనగామరూరల్ : పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవా రం రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్‌పరేడ్ విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సింహారావు, ఎస్సై కోటేశ్వర్రావు ఉన్నారు. -
మట్టి గణపతికి జై...
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 30వేల ప్రతిమలు హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు కంకణం సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతికే హెచ్ఎండీఏ జై కొడుతోంది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల పరిర ణక్షకు నగరవాసులు మట్టి వినాయక ప్ర తిమలకే ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానే మట్టి గణపతులను మండపాల్లో ప్రతి ష్ఠించేందుకు భక్తులు ముందుకు రావాలని హెచ్ఎండీఏ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ కజూరియా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డి వి.కృష్ణ పిలుపునిచ్చారు. మట్టి గణేశ్ ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏటా హెచ్ఎండీఏ సబ్సిడీపై గణపతులను సరఫరా చేస్తోందన్నారు. ఈ ఏడాదీ రూ.6 లక్ష ల వ్యయంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయిస్తున్నామన్నారు. ఇళ్లల్లో పూజకు వినియోగించేందుకు వీలుగా 30 వేల మట్టి గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నామన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు ప్రత్యేకంగా లేక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందులో విద్యాసంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలను అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని వివిధ పార్కుల్లో, అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 8 అంగుళాల ప్రతిమల ను పండుగకు రెండ్రోజుల ముందు ఒక్కోటి రూ.13కు అందజేస్తామని ఓఎస్డి తెలిపారు. 3 అడుగుల ఎత్తు విగ్రహం ధర రూ.1250 గా నిర్ణయించారు. పెద్ద విగ్రహాలను పాఠశాలలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కమ్యూనిటీ గ్రూప్స్, ఉత్సవ నిర్వాహకులకు మాత్రమే అందజేస్తామని చెప్పారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు లుంబినీపార్కు వద్దనున్న బీపీపీ కార్యాలయంలో గానీ, లేదా 9885311134, 8008889537 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో చూడవచ్చు. -
‘పర్యావరణా’నికి ప్రజలు ధర్మకర్తలు కావాలి : ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో, సహజ వనరులను ఇప్పుడు వినియోగించుకుంటూనే భవిష్యత్ తరాల ఆనందాన్ని కాపాడటంలో ప్రజలంతా ధర్మకర్తలుగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణకు, భూగోళాన్ని మరింత పరిశుభ్రంగా, ఆకుపచ్చగా రూపొందించటానికి పునరంకితం కావాల్సిన అవసరముందని మోడీ సామాజిక వెబ్సైట్ ట్విటర్లో చేసిన వ్యాఖ్యల్లో ఉద్ఘాటించారు. పర్యావరణంతో మమేకమై సామరస్యంతో జీవించటమనేది మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. మరింత శుభ్రమైన, పచ్చనైన భూగోళం కోసం ప్రభుత్వ కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం మంచి ఫలితాన్నిస్తుందని చెప్పారు. ప్రకృతిని, ప్రకృతి వనరులను పరిరక్షించటానికి దైనందిన జీవనంలో ఏ చిన్న చర్య అయినా చేపట్టాలని ప్రజలను కోరారు. అడవిలో మొక్కలు నాటిన మమత కోల్‌కతా: పర్యావరణ దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురువారం అడవిలో పకృతి మధ్య గడిపారు. ఉత్తర బెంగాల్‌లోని జల్దాపరా నేషనల్ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్లో మమత పోస్ట్ చేశారు. తన చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, ఏనుగులు, ఖడ్గమృగాలు, జలపాతాలు, ప్రజల ఆత్మీయత తనను ముగ్ధురాలిని చేశాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
పర్యావరణ మిత్రుడు
‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక... చిట్ట చివరి చేపను కూడా పట్టేశాక... అప్పుడు గుర్తిస్తావు నువ్వు... డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత ఇది. ఈ సామెత ఆ యువకుడి ఆలోచనలను ప్రభావితం చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోయాక, ప్రపంచమే కలుషితమైపోయాక ఎంత సంపాదించినా సుఖంగా జీవించలేమన్న విషయాన్ని బోధపడేలా చేసింది. ‘నెక్ట్స్ జెన్ సొల్యూషన్’ స్థాపనవైపు అతడిని నడిపించింది. ముంబైకి చెందిన అభిషేక్ హంబద్ (26) బిట్స్ పిలానీలో చదివాడు. అక్కడ హాస్టల్ రూముల్లో... తన స్నేహితులతో జరిపిన చర్చల్లో... పలుమార్లు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రస్తావన వచ్చింది. పర్యావరణానికీ, మనిషి జీవనానికీ ఉన్న ముడిని అప్పుడే అర్థం చేసుకున్నాడు అభిషేక్. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే, భవిష్యత్తులో మనల్ని మనం కాపాడుకోలేమన్న ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. అలాగని కేవలం పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేయాలనీ అనుకోలేదు. ముందు ఉపాధిని కల్పించుకోవాలి. ఆ ఉపాధి ద్వారానే తాను అనుకున్నది సాధించాలి. అలా జీవనభృతికి, జీవిత లక్ష్యానికీ ముడిపెట్టాడు. నెక్ట్స్‌జెన్ సొల్యూషన్ సంస్థను స్థాపించాడు. ఎనర్జీ మేనేజ్మెంట్లో అనేక కార్పొరేట్ కంపెనీలకు మార్గదర్శకుడయ్యాడు. కోట్ల టర్నోవర్‌తో యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజహితం కోరుతూనే... నెక్ట్స్‌జెన్ సంస్థ... పెద్ద పెద్ద ఇండస్ట్రీలతోనూ, కంపెనీలతోనూ కలిసి పని చేస్తుంది. ఇంధన వృథాను అరికడుతూ, వాటి నుంచి వెలువడే భయంకరమైన ఉద్గారాలను నియంత్రించడమే దాని పని. ప్రత్యేకించి తమ పని విధానం పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదు అని భావించే కంపెనీలతో అభిషేక్ బృందం పనిచేస్తున్నారు. ఇంధన నియంత్రణ, పునరుద్ధరింపదగ్గ వనరులను ఉపయోగించడం వంటి అంశాల గురించి అధ్యయనం చేసి, ఆయా కంపెనీలకు సలహాదారులుగా ఉంటున్నారు. ఫలితంగా పరిశ్రమలకు నిర్వహణ ఖర్చు తగ్గుతోంది. వ్యర్థాలు తగ్గుతున్నాయి. తద్వారా ఉద్గారాల నియంత్రణతో పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతోంది. ‘‘నేను చేసే వ్యాపారం ఉపాధి మార్గంగానే కాకుండా పదిమందికి ఉపయోగపడేలా, సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలని కలలు కనేవాడిని, అందుకు తగ్గట్టుగా పిలానీలోని బిట్స్ క్యాంపస్ లో చదివిన ఇంజనీరింగ్ నా ఆలోచన తీరుకు ఒక ఆకారాన్ని ఇచ్చింది’’ అంటాడు అభిషేక్. పర్యావరణ కాలుష్యం గురించి అనునిత్యం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న ఆందోళనలను గమనించి, ఇంధనవృథా వల్ల తలెత్తబోయే పరిస్థితుల గురించి తెలుసుకొన్నప్పుడు అతడి మనసులో ఒక విధమైన ఆందోళన నిండిపోయేది. అది తన ఒక్కడి సమస్య కాకపోయినా, భవిష్యత్తు తరాల గురించి తలుచుకొంటే భయమేసేది. అందుకే తానేం చేయగలడా అని ఆలోచించేవాడు. ఆ మేధోమథనం గురించి చెబుతూ... ‘‘నేను ఒక సాధారణ బీటెక్ గ్రాడ్యుయేట్గానే కనిపించేవాడిని. చదువు పూర్తి చేయడం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, ఒక కారు కొని దానికి ‘సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా’ అంటూ ఒక స్టిక్కర్ అతికించుకోవడం... అదే నేను పర్యావరణ పరిరక్షణకై చేసే పెద్ద ఉపకారంగా భావించేవాడిని. ఈ సమయంలో స్నేహితులందరిలోనూ మొదలైన చైతన్యం ‘నెక్ట్స్‌జెన్’కు ఊపిరి పోసింది. 2009లో ఈ కంపెనీ ప్రారంభం అయ్యింది’’ అంటూ తన సుదీర్ఘప్రయాణం గురించి వివరిస్తాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్ట్స్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది. దాని వ్యవస్థాపకుడిగా అభిషేక్‌కు ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అనేక అవార్డులను తెచ్చిపెట్టింది! నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్స్ట్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది. -
పర్యావరణ సంరక్షణలో
భారతదేశానికి చెందిన పది సంవత్సరాల బాలుడు అబ్దుల్ ముఖీత్ యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తూ చిన్న వయస్సులోనే ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు. ప్రతిరోజూ న్యూస్పేపర్లతో బ్యాగులు చేసి సూపర్ మార్కెట్లకు, కొన్ని షాపింగ్ సెంటర్లకు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తండ్రి అతనికి ప్లాస్టిక్ కారణంగా కలిగే నష్టాలను వివరించడంతో ఎనిమిదేళ్ళ ప్రాయం నుంచే అబ్దుల్ ఈ బ్యాగులు తయారు చేసి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. అబ్దుల్ ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికో లేక టీవీ చూడడానికో ఇష్టపడతారు కానీ అబ్దుల్ దానికి భిన్నంగా పేపరు బ్యాగుల తయారీలో నిమగ్నమైపోతాడు. అబ్దుల్ ఇప్పటి వరకు దాదాపు 4,500 బ్యాగులు పంపిణీ చేశాడు. అతన్ని స్కూల్లో అందరూ ‘అబ్దుల్ ముఖీత్ బ్యాగ్స్’ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటారు. ఇంకా అబ్దుల్ ‘పేపర్ బ్యాగ్ బాయ్’గా కూడా ప్రసిద్ధి. అందరూ నన్ను అలా పిలుస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందని అబ్దుల్ చెబుతున్నాడు. ప్రస్తుతం అబ్దుల్ తన స్వస్థలంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించడానికి కృషి చేస్తూ భూమాతను, పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. అతని కృషికి మెచ్చి కొన్ని సంస్థలు ప్రతిష్టాత్మకమైన అవార్డులతో, ప్రశంసా పత్రాలతో సత్కరించాయి.