
దిగ్విజయ ప్రస్థానం
అదిగో అల్లదిగో... డెన్మార్క్
విస్తీర్ణానికి చిన్న దేశం... అయితే, అందంలో ఆనందంలో మాత్రం పెద్ద దేశం. పర్యావరణ పరిరక్షణలో నిలువెత్తు నిబద్ధతను చాటుతున్న దేశం. శాస్త్రసాంకేతిక జ్ఞానంలో ముందుకు దూసుకెళుతున్న దేశం. చమురు, సహజవాయు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల మాత్రమే డెన్మార్క్ శక్తిమంతమైన దేశం కాలేదు. సాహిత్యం నుంచి సాంకేతిక జ్ఞానం వరకు అన్ని రంగాలలో బలంగా ఉండడం వల్లే డెన్మార్క్ శక్తిమంతమైన దేశం అయింది...
ఇప్పుడు డెన్మార్క్ గురించి మాట్లాడుకోవడమంటే అభివృద్ధిపథంలో ఉన్న ఒక దేశం గురించి మాట్లాడుకోవడం. అంతమాత్రాన మొదటి నుంచి డెన్మార్క్ నడక నల్లేరుపై నడక కాదు. అడుగులు ఎన్నోసార్లు తడబడ్డాయి. తొమ్మిదవ శతాబ్దంలో ఎన్నో రాజ్యాలుగా చీలిపోయింది డెన్మార్క్. పదో శతాబ్దంలో ఈ రాజ్యాలన్నీ ఏకమయ్యాయి.
ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది డెన్మార్క్. 1915లో డెన్మార్క్ ప్రజాస్వామ్య భావన మరింత విశాలమైంది. మహిళలకు ఓటు హక్కు రావడం ఇందులో భాగమే. 1930లో డెన్మార్క్ ఆర్థికమాంద్యానికి గురైంది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. 1960 మాత్రం డెన్మార్క్‌కు బంగారు కాలం. నిరుద్యోగం జాడే కనిపించేది కాదు. 1970లో డెన్మార్క్ ఆర్థికవ్యవస్థ మరోసారి దెబ్బతింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 21వ శతాబ్దంలో డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ బలోపేతం అయింది. నిరుద్యోగం తగ్గిపోయింది. 2009లో యూరప్‌లోని ఇతర దేశాల్లాగే డెన్మార్క్‌పై కూడా ఆర్థికమాంద్యం ప్రభావం పడడంతో ఆ దేశ ఆర్థికవ్యవస్థ బలహీనపడింది. అయితే కొద్దికాలంలోనే తిరిగి పుంజుకుంది.
డెన్మార్క్‌లో 406 దీవులు ఉన్నాయి. వీటిలో 89 దీవులలో ప్రజలు నివసిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం డెన్మార్క్‌ను అయిదు ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. 1. రాజధాని ప్రాంతం 2. కేంద్రీయ డెన్మార్క్ ప్రాంతం 3. ఉత్తర డెన్మార్క్ ప్రాంతం 4. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం 5. జీలాండ్ ప్రాంతం. రాజధాని కోపెన్‌హాగెన్‌తో సహా ఆర్హస్, ఓరెన్స్, ఆల్‌బోర్గ్, ఫ్రెడరిక్స్ బెర్గ్, ఎస్బ్‌జెర్గ్, జెంటోప్టె, గ్లాడీసాక్స్, రాండర్స్, కొల్డింగ్, హర్సెన్స్... మొదలైన 45 ముఖ్య నగరాలు, పట్టణాలు డెన్మార్క్‌లో ఉన్నాయి.
జీవపర్యావరణ విషయాలకు డెన్మార్క్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ‘ఎన్విరాన్‌మెంటల్ లా’ (1973) అమలు చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. మరోవైపు వివిధరంగాలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. డెన్మార్క్‌కు బలమైన చారిత్రక, సాంస్కృతిక పునాదులు ఉన్నాయి. స్వీడన్, నార్వేలతో బలమైన సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞానం నుంచి సాహిత్యపరిమళం వరకు తనదైన శైలిలో దూసుకు వెళుతుంది డెన్మార్క్.
టాప్ 10
1. డెన్మార్క్‌లో 406 ద్వీపాలు ఉన్నాయి. ఒక్కో ద్వీపానికి వెళ్లడానికి వివిధ ఆకారాలలో బ్రిడ్జీలు ఉన్నాయి. బ్రిడ్జీలు నిర్మించడానికి వీలు లేని ద్వీపాలకు బోటు మీద ప్రయాణం చేయవచ్చు.
2. ఇనుము, స్టీలు, రసాయన, ఫుడ్‌ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, నౌకల తయారీ, ఎలక్ట్రానిక్స్... మొదలైన పరిశ్రమలు డెన్మార్క్‌లో ఉన్నాయి.
3. 1940లో జర్మనీ ఆక్రమణకు గురైంది.
4. డెన్మార్క్‌లో 44 శాతం జనాభా పట్టణాలలో నివసిస్తుంది.
5. ‘నాటో’లో 1949లో, 1973లో యురోపియన్ యూనియన్(ఈయూ)లో చేరింది.
6. ‘యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్’ వ్యవస్థాపక సభ్యదేశాలలో డెన్మార్క్ ఒకటి.
7. ప్రపంచ ప్రఖాత్య పిల్లల రచయిత హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ జన్మస్థలం డెన్మార్క్‌లోని ఒడెన్స్ పట్టణం.
8. డెన్మార్క్‌లోని ‘గ్రీన్‌ల్యాండ్’ ద్వీపం ప్రపంచంలోనే పెద్ద ద్వీపం.
9. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఉన్న ‘స్ట్రోగెట్’ యూరప్‌లోని ‘లాంగెస్ట్ షాపింగ్ స్ట్రీట్’లలో ఒకటి.
10. డెన్మార్క్ నుంచి వివిధ దేశాలకు క్రిస్మస్ ట్రీలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి.
దేశం డెన్మార్క్
రాజధాని కోపెన్‌హాగన్
అధికార భాష డానిష్
కరెన్సీ డానిష్ క్రోన్
జనాభా 57 లక్షల 7 వేలు (సుమారుగా)