
సందర్భం
ఏడాది కాలంగా దేశీ కరెన్సీ ‘రూపాయి’ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దీని విలువ 12 నెలల్లోనే రూ. 82.60 నుంచి ఏకంగా రూ. 86.85కు పడిపోవడం ఆందోళనకర మైన అంశం. మారకం విలువ సుమారు 5 శాతం పడిపో వడం దేశ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూప
నుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముడి చమురు దిగుమతుల ఖర్చులు పెరిగిపోవడం.
చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్ ఉన్నదన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. 2022–23లో మన ముడిచమురు దిగు మతుల ఖర్చు రూ. 12 లక్షల కోట్లకు చేరుకోగా రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పు ఫలితంగా ప్రస్తుతం రూ. 56 వేల కోట్ల అదనపు భారం పడనుంది. చమురు ధరలు పెరిగిపోతున్న కారణంగా వాణిజ్యలోటు, తద్వారా ద్రవ్యోల్బణం ఎక్కువై ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది.
భారత్ ఏటా సుమారు 170 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల ఖర్చుల్లో ముడిచమురు వాటానే 30 శాతం వరకూ ఉంది. రూపాయి మారకం విలువ ఏడాది కాలంలో రూ. 82.60 నుంచి రూ. 86.85కు పడిపోవడంతో దిగుమతి ఖర్చులు 5 శాతం వరకూ పెరిగినట్లే. రోజు వారీ చమురు దిగుమతుల ఖర్చులు రూ. 411 కోట్ల వరకూ ఉండగా వీటితోపాటు రవాణా, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో అన్ని రకాల సరుకుల ధరలు ఎగబాకుతాయి. పెరిగిన ఖర్చులు వినియోగదారుల ఖాతాల్లో వేయడం వల్ల ద్రవ్యో ల్బణం ఎక్కువవుతోంది.
రూపాయి ఎందుకు చిక్కిపోతోంది?
రూపాయి విలువ తగ్గిపోయేందుకు కారణాల్లో ముఖ్యమైనది అమెరికన్ డాలర్ బలపడుతూ ఉండట మని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కొన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో డాలర్ విలువ పెరుగుతోంది. అదే సమయంలో మిగిలిన కరెన్సీల విలువ తగ్గుతోంది. అంతేకాకుండా... ఆర్థిక అనిశ్చితి అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో చాలామంది డాలర్‌ను సురక్షితమైన పెట్టు బడిగా భావిస్తూండటం కూడా దాని విలువ పెరిగేందుకు కారణమవుతోంది. డాలర్ విలువ పెరగడం బంగారం వంటి కమాడిటీ ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. డాలర్ బలపడిన కొద్దీ బంగారం ధరలూ పెరిగిపోతాయి. భారత్ లాంటి బలహీన కరెన్సీ ఉన్న దేశంలో ఇది మరికొంచెం ఎక్కువగా ఉంటుంది.
రూపాయి మారకం విలువ తగ్గిపోవడం వాణిజ్య లోటు పెరిగిపోయేందుకు కారణమవుతుంది. 2023లో దేశ ఎగుమతుల్లో వృద్ధి (3,350 లక్షల కోట్ల రూపాయలు) నమోదైనా, దిగుమతుల ఖర్చు పెరిగి పోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఈ తేడా కూడా భారత రూపాయి విలువ తగ్గిపోయేందుకు ఒక కారణమైంది.
2022లో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు సుమారు 58 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉండగా 2023 నాటికి ఇది 48 లక్షల కోట్లకు తగ్గింది. ఫలితంగా విదేశీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు ఉన్న సామర్థ్యం తగ్గిపోయింది. తగినన్ని విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితుల్లో కరెన్సీ విలువల నియంత్రణ కష్టతరమవుతుంది. రూపాయి మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను ఉపయోగించవచ్చు కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే.
దీర్ఘకాలంలో మాత్రం ముడిచమురు దిగుమతులను వీలై నంత తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంధన వనరుల్లో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ దేశీ యంగా చమురు అన్వేషణను ముమ్మరం చేయడం; సౌర, పవన విద్యుత్తుల వాడకాన్ని మరింత ఎక్కువ చేయడం అవసరం. ఈ రంగాల్లో మరిన్ని పెట్టు బడులను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. దీంతోపాటే విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచుకోవడం అవసరం.
సేవల రంగం విషయానికి వస్తే ఐటీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. తయారీ రంగం కూడా మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా అభివృద్ధిలో సమతౌల్యం ఏర్పడగలదు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ రంగా లపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే వాణిజ్య లోటును అధిగమించే అవకాశం ఉంది. అప్పుడే రూపాయి మారక విలువల్లో ఒడిదుడుకులను నియంత్రించడమూ సాధ్యమవుతుంది. ఇంధన రంగంలో స్వావలంబన సాధించేందుకు అన్ని రకాల ప్రయ త్నాలూ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ విదేశీ శక్తుల ప్రభావా నికి లోనుకాకుండా ఉంటుంది.
రూపాయి మారకం విలువ తగ్గిపోవడం సామా న్యుడిపై నేరుగా ప్రభావం చూపుతుందన్నది తెలిసిందే. దేశ ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇంధన ధరలు లీటర్‌కు వంద రూపాయలు దాటిపోయాయి. దీనివల్ల వస్తు సేవల ధరలు కూడా ఎక్కువవుతాయి. 2023 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకుంది. నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్ మ్యాన్ చెప్పినట్లు.. ‘కరెన్సీ బలహీన పడినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయి సమాజంలో అట్టడుగున ఉన్నవారు తీవ్రంగా ప్రభావితమవుతారు’ అన్నది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment