మూడేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీ.. | India will be the world third largest economy by 2028 | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీ..

Published Fri, Mar 14 2025 4:22 AM | Last Updated on Fri, Mar 14 2025 8:05 AM

India will be the world third largest economy by 2028

2028 నాటికి 5.7 ట్రిలియన్‌ డాలర్లు 

జర్మనీని అధిగమించి ముందుకు మోర్గాన్‌ స్టాన్లీ అంచనా 

న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి అవతరిస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న వినియోగ మార్కెట్‌గా భారత్‌ మారుతోందంటూ.. స్థూల ఆర్థిక స్థిరత్వానికితోడు, మెరుగైన మౌలిక వసతులతో ప్రపంచ ఉత్పాదకతలో భారత్‌ తన వాటా పెంచుకోనున్నట్టు తెలిపింది. 

2023 నాటికి 3.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌.. 2026 నాటికి 4.7 ట్రిలియన్‌ డాలర్లకు విస్తరించడం ద్వారా యూఎస్, చైనా, జర్మనీ తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. 2028లో 5.7 ట్రిలియన్‌ డాలర్లతో జర్మనీని అధిగమించి భారత్‌ మూడో స్థానానికి చేరుతుందని పేర్కొంది. 1990లో ప్రపంచంలో 12వ స్థానంలో భారత్‌ ఉన్నట్టు తన నివేదికలో గుర్తు చేసింది. ఆ తర్వాత 2000 నాటికి 13వ స్థానానికి దిగిపోయిందని..తిరిగి 2020లో 9వ ర్యాంక్‌నకు, 2023లో 5వ స్థానానికి మెరుగుపడినట్టు వివరించింది. ప్రపంచ జీడీపీలో 3.5 శాతంగా ఉన్న భారత్‌ వాటా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది.  

2035 నాటికి 10.3 ట్రిలియన్‌ డాలర్లు.. 
భారత ఆర్థిక ప్రగతి విషయమై మోర్గాన్‌ స్టాన్లీ మూడు రకాల అంచనాలు వేసింది. ‘‘బేర్‌ కేసులో (ప్రతికూల పరిస్థితుల్లో) భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ఉన్న 3.65 ట్రిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 2035 నాటికి 6.6 ట్రిలియన్‌ డాలర్లకు విస్తరించొచ్చు. బేస్‌ కేసులో (తటస్థ పరిస్థితుల్లో) 8.8 ట్రిలియన్‌ డాలర్లకు.. బుల్‌ కేసులో (సానుకూల పరిస్థితుల్లో) 10.3 ట్రిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుంది’’అని తెలిపింది. 

2025లో తలసరి ఆదాయం 2,514 డాలర్లుగా ఉంటే బేర్‌ కేసులో 4,247 డాలర్లకు, బేస్‌ కేసులో 5,683 డాలర్లకు, బుల్‌ కేసులో 6,706 డాలర్లకు వృద్ది చెందుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఉత్పాదకతలో భారత్‌ వచ్చే దశాబ్ద కాలంలో తన వాటాను పెంచుకుంటుంది. జనాభాలో వృద్ధి, స్థిరమైన ప్రజాస్వామ్యం, విధానపరమైన మద్దతుతో స్థూల ఆర్థిక స్థిరత్వం, మెరుగైన మౌలిక వసతులు, పెరుగుతున్న వ్యాపార వర్గం, సామాజిక పరిస్థితుల్లో మెరుగుదల అనుకూలించనున్నాయి’’అని మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక తెలిపింది.  

అతిపెద్ద వినియోగ మార్కెట్‌ 
ప్రపంచంలో టాప్‌ వినియోగ మార్కెట్‌గా భారత్‌ అవతరించనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా. 
ఇంధన పరివర్తనం దిశగా భారత్‌ అతిపెద్ద మార్పును చూడనుందని.. జీడీపీలో రుణ నిష్పత్తి పెరుగుతోందని, అదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాటా సైతం వృద్ధి చెందుతోందని పేర్కొంది.  

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. 
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ‘‘ఇటీవలి వారాల్లో అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ, కొన్ని నెలల క్రితంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉన్నాయి. ద్రవ్య, పరపతి విధాన మద్దతుకుతోడు, సేవల ఎగుమతులు పుంజుకోవడంతో 2024 ద్వితీయార్ధంలో మందగమనం నుంచి వృద్ధి కోలుకుంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొంది.  2024–25లో జీడీపీ 6.3 శాతం మేర, 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 

రానున్న రోజుల్లో వినియోగం అన్ని విభాగాల్లోనూ కోలుకోవచ్చంటూ.. ఆదాయ పన్ను తగ్గింపు పట్టణ డిమాండ్‌కు ప్రేరణనిస్తుందని, గ్రామీణ వినియోగానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. 2024–25లో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, 2025–26లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. సేవల ఎగుమతుల్లో ఉన్న వృద్ధి వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతను కొంత వరకు భర్తీ చేస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా మందగమనం లేదా సమీప కాలంలో మాంద్యం వంటి పరిస్థితులు తలెత్తితే అవి తమ అంచనాలకు సవాలు కాగలవని.. అలాంటి పరిస్థితుల్లో 2025లో భారత ఈక్విటీలు గరిష్ట స్థాయిలకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement