rupee value decline
-
రూపాయి పతనంతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
ఏడాది కాలంగా దేశీ కరెన్సీ ‘రూపాయి’ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దీని విలువ 12 నెలల్లోనే రూ. 82.60 నుంచి ఏకంగా రూ. 86.85కు పడిపోవడం ఆందోళనకర మైన అంశం. మారకం విలువ సుమారు 5 శాతం పడిపో వడం దేశ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపనుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముడి చమురు దిగుమతుల ఖర్చులు పెరిగిపోవడం. చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్ ఉన్నదన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. 2022–23లో మన ముడిచమురు దిగు మతుల ఖర్చు రూ. 12 లక్షల కోట్లకు చేరుకోగా రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పు ఫలితంగా ప్రస్తుతం రూ. 56 వేల కోట్ల అదనపు భారం పడనుంది. చమురు ధరలు పెరిగిపోతున్న కారణంగా వాణిజ్యలోటు, తద్వారా ద్రవ్యోల్బణం ఎక్కువై ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. భారత్ ఏటా సుమారు 170 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల ఖర్చుల్లో ముడిచమురు వాటానే 30 శాతం వరకూ ఉంది. రూపాయి మారకం విలువ ఏడాది కాలంలో రూ. 82.60 నుంచి రూ. 86.85కు పడిపోవడంతో దిగుమతి ఖర్చులు 5 శాతం వరకూ పెరిగినట్లే. రోజు వారీ చమురు దిగుమతుల ఖర్చులు రూ. 411 కోట్ల వరకూ ఉండగా వీటితోపాటు రవాణా, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో అన్ని రకాల సరుకుల ధరలు ఎగబాకుతాయి. పెరిగిన ఖర్చులు వినియోగదారుల ఖాతాల్లో వేయడం వల్ల ద్రవ్యో ల్బణం ఎక్కువవుతోంది.రూపాయి ఎందుకు చిక్కిపోతోంది?రూపాయి విలువ తగ్గిపోయేందుకు కారణాల్లో ముఖ్యమైనది అమెరికన్ డాలర్ బలపడుతూ ఉండట మని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కొన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో డాలర్ విలువ పెరుగుతోంది. అదే సమయంలో మిగిలిన కరెన్సీల విలువ తగ్గుతోంది. అంతేకాకుండా... ఆర్థిక అనిశ్చితి అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో చాలామంది డాలర్‌ను సురక్షితమైన పెట్టు బడిగా భావిస్తూండటం కూడా దాని విలువ పెరిగేందుకు కారణమవుతోంది. డాలర్ విలువ పెరగడం బంగారం వంటి కమాడిటీ ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. డాలర్ బలపడిన కొద్దీ బంగారం ధరలూ పెరిగిపోతాయి. భారత్ లాంటి బలహీన కరెన్సీ ఉన్న దేశంలో ఇది మరికొంచెం ఎక్కువగా ఉంటుంది. రూపాయి మారకం విలువ తగ్గిపోవడం వాణిజ్య లోటు పెరిగిపోయేందుకు కారణమవుతుంది. 2023లో దేశ ఎగుమతుల్లో వృద్ధి (3,350 లక్షల కోట్ల రూపాయలు) నమోదైనా, దిగుమతుల ఖర్చు పెరిగి పోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఈ తేడా కూడా భారత రూపాయి విలువ తగ్గిపోయేందుకు ఒక కారణమైంది. 2022లో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు సుమారు 58 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉండగా 2023 నాటికి ఇది 48 లక్షల కోట్లకు తగ్గింది. ఫలితంగా విదేశీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఉన్న సామర్థ్యం తగ్గిపోయింది. తగినన్ని విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితుల్లో కరెన్సీ విలువల నియంత్రణ కష్టతరమవుతుంది. రూపాయి మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను ఉపయోగించవచ్చు కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీర్ఘకాలంలో మాత్రం ముడిచమురు దిగుమతులను వీలై నంత తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంధన వనరుల్లో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ దేశీ యంగా చమురు అన్వేషణను ముమ్మరం చేయడం; సౌర, పవన విద్యుత్తుల వాడకాన్ని మరింత ఎక్కువ చేయడం అవసరం. ఈ రంగాల్లో మరిన్ని పెట్టు బడులను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. దీంతోపాటే విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచుకోవడం అవసరం. సేవల రంగం విషయానికి వస్తే ఐటీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. తయారీ రంగం కూడా మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా అభివృద్ధిలో సమతౌల్యం ఏర్పడగలదు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ రంగా లపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే వాణిజ్య లోటును అధిగమించే అవకాశం ఉంది. అప్పుడే రూపాయి మారక విలువల్లో ఒడిదుడుకులను నియంత్రించడమూ సాధ్యమవుతుంది. ఇంధన రంగంలో స్వావలంబన సాధించేందుకు అన్ని రకాల ప్రయ త్నాలూ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ విదేశీ శక్తుల ప్రభావా నికి లోనుకాకుండా ఉంటుంది. రూపాయి మారకం విలువ తగ్గిపోవడం సామా న్యుడిపై నేరుగా ప్రభావం చూపుతుందన్నది తెలిసిందే. దేశ ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇంధన ధరలు లీటర్‌కు వంద రూపాయలు దాటిపోయాయి. దీనివల్ల వస్తు సేవల ధరలు కూడా ఎక్కువవుతాయి. 2023 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకుంది. నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్ మ్యాన్ చెప్పినట్లు.. ‘కరెన్సీ బలహీన పడినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయి సమాజంలో అట్టడుగున ఉన్నవారు తీవ్రంగా ప్రభావితమవుతారు’ అన్నది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రూపాయికి కలిసిరాని ఏడాది!
ఈ ఏడాది రూపాయికి అచ్చి రాలేదు. ఏడాదిలో డాలర్(Dollar)తో 3 శాతం మేర తన విలువను కోల్పోయింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే కాస్త మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ అస్థిరతలు కనిపించింది రూపాయి(Rupee)లోనే కావడం విశేషం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం కరెన్సీ మార్కెట్లో అస్థిరతలను పెంచింది. నిజానికి ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం డాలర్‌లోనే తక్కువగా కనిపించింది. అంతేకాదు యూరో, జపాన్ యెన్లతో పోలిస్తే రూపాయి బలపడింది.2024 జనవరి 1న రూపాయి డాలర్ మారకంలో 83.19 వద్ద ఉంటే, డిసెంబర్ 27 నాటికి 85.59కి బలహీనపడింది. విలువ పరంగా రూ.2 కోల్పోయింది. ముఖ్యంగా కీలకమైన 84 స్థాయి దిగువకు అక్టోబర్ 10న రూపాయి పడిపోయింది. డిసెంబర్ 19న 85 స్థాయినీ కోల్పోయి.. డిసెంబర్ 27న ఫారెక్స్(Forex) మార్కెట్లో 85.80 జీవిత కాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి అదే రోజున 85.59 వద్ద స్థిరపడింది. యెన్‌తో రూపాయి ఈ ఏడాది 8.7 శాతం బలపడింది. జనవరి 1న 100 యెన్ల రూపాయి మారకం రేటు 58.99గా ఉంటే, డిసెంబర్ 27 నాటికి 54.26కు చేరింది. అంటే 100 యెన్లకు ఆరంభంలో 59 రూపాయిలు రాగా, ఏడాది ముగింపు నాటికి 54 రూపాయలకు యెన్(Yen) విలువ తగ్గిపోయింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!యూరో(Euro)తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ 5 శాతం పెరిగి డిసెంబర్ 27 నాటికి 89.11కు చేరింది. ఈ ఏడాది ఆగస్ట్ 27న అయితే 93.75 కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో రూపాయి విలువ అధికంగా క్షీణించినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా స్థూల ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడడం, వీటి ఆధారంగా రేట్ల కోత విషయంలో నిదానంగా వెళ్లాలని యూఎస్ ఫెడ్ నిర్ణయించడం డాలర్ బలపడడానికి కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా సహా చాలా దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తానంటూ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు డాలర్ కొనుగోళ్లకు మొగ్గు చూపించేలా చేసినట్టు చెబుతున్నారు. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
జారుడు బల్లపై రూపాయి
ముంబై: రూపాయి విలువ రెండో రోజూ జీవితకాల కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంలో 4 పైసలు బలహీనపడి 85.15 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న స్తబ్దత, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటం మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.10 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 10 పైసలు పతనమై 85.21 వద్ద సరికొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది.‘‘నెలాఖరు, సంవత్సరాంతం కావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ సుంకాలు విధించవచ్చనే భయాలూ నెలకొన్నాయి. మరోవైపు ఫెడ్ కఠిన పాలసీ అంచనాలు, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి’ అని మిరే అసెట్స్ విశ్లేషకుడు అనుజ్ చౌదరి తెలిపారు. కాగా, ట్రంప్ విజయం తర్వాత నుంచి డాలరుతో రూపాయి విలువ 104 పైసలు క్షీణించడం గమనార్హం. -
రూపాయి నేలచూపులు!
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 85.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ ఉద్ఘాటించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. పెద్దమొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని మాత్రం గుర్తుంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రూపాయి విలువ తగ్గిపోవడానికి కారణాలివే..1. రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 75 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు అమెరికా, చైనా వంటి మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కొంతకాలం వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రూపాయి భారీ పతనానికి కారణాలు
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.కారణాలివే..1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్‌లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్‌లో ఉంది. రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. తగ్గనున్న కరెంటు ఖాతా లోటు.. భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. మాంద్యం ప్రభావం ఇలా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే.. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 12 పైసలు పతనమై 77.78 తాజా లైఫ్ టైమ్ బలహీనతను చూసింది. దేశీయ ఈక్విటీల బలహీన ధోరణి, అంతర్జాతీయంగా డాలర్ పటిష్టత దీనికి ప్రధాన కారణం. విదేశీ నిధులు వెనక్కుపోవడం, తీవ్ర స్థాయిల్లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం రూపాయి ముగింపు 77.66. మంగళవారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 77.72 వద్ద ప్రారంభమైంది. 77.69 వరకూ ఇంట్రాడేలో బలపడినా, ఆ స్థాయిలో నిలద్రొక్కుకోలేకపోయింది. ఒక దశలో 77.80కి కూడా పడిపోయింది. చివరకు క్రితం ముగింపుకన్నా 12 పైసలు నష్టంతో 77.78 వద్ద ముగిసింది. దీనితో ఇంట్రాడే, ముగింపు స్థాయిల్లో రూపాయి సరికొత్త ‘బలహీన’ రికార్డులను చూసినట్లయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 78.05 వరకూ బలహీనపడే అవకాశం ఉందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఫారెక్స్, బులియన్ విశ్లేషకులు గౌరంగ్ సోమయ్య విశ్లేషించారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.80 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 102.50 వద్ద ట్రేడవుతోంది. చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు -
అన్నంతపని చేసిన అమెరికా.. మిగిలిన దేశాలకు ఇబ్బందులు
న్యూయార్క్: అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరుతో క్రూడ్ ధర అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడుల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంతో చమురు మంట మరింత ఎగసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 8 శాతం పైగా (దాదాపు 9 డాలర్లు) లాభంతో 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 129 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2008 తరువాత ఇంత తీవ్ర స్థాయిలో క్రూడ్ ధరలు చూడటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. సందిగ్ధంలో యూరప్ ప్రపంచ ముడి చమురు సరఫరాల్లో రష్యా వాటా 7 శాతం ఉండగా, ఉత్పత్తిలో 10 శాతం ఉంది. అమెరికా దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా కేవలం 10 శాతమే. ఇదే యూరప్ దేశాల విషయానికి వస్తే అధికంగా ఉంది. ఒక్క జర్మనినీ పరిశీలిస్తే ఆ దేశ అవసరాల్లో 40 శౠతం ముడిచమురు, సహాజవాయువుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో అమెరికా తరహాలో రష్యా నుంచి సరఫరాలపై నిషేధంపై యూరోపియన్ యూనియన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. 200 డాలర్లకు రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే బ్యారెల్ ముడిచమురు ధర 300 డాలర్ల వరకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని అలెగ్జాండ్ నోవాక్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ చమురు మార్కెట్ విశ్లేషకులు, ట్రేడర్లు మాత్రం త్వరలోనే క్రూడ్ 200 డాలర్లను తాకొచ్చన్న అంచనాలు వెలిబుచ్చుతున్నారు. రూపాయి మరింత పతనం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కొత్త కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌లో 7 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 77 వద్ద ముగిసింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి రూపాయి జారుడుబల్లపై కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో 77.02 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 76.71 గరిష్ట–77.05 కనిష్ట స్థాయిలను చూసింది. రూపాయికి ఇంట్రాడే కనిష్టం (77.05)–ముగింపుల్లో (77) సోమవారం స్థాయిలే రికార్డులు. చదవండి: భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆయిల్ -
కరెక్షన్లో పెట్టుబడుల రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి
ఇటీవల స్టాక్ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చింది కదా.. భారీ దిద్దుబాటుకు అవకాశం ఉందా? వస్తే లాభాలు, పెట్టుబడులను కాపాడుకోవడం ఎలా?– నవీన్ కరెక్షన్ కనిపించింది. కానీ, గణనీయంగా ఏమీ పడిపోలేదు. ఆ తర్వాత నుంచి స్థిరంగా కోలుకోవడాన్ని చూస్తున్నాం. భారీ పతనం రానున్నదా? అంటే నిజంగా లేదనే చెప్పుకోవాలి. కానీ, నిజం ఏమిటంటే స్వల్పకాలంలో ఏమి జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడి నుంచి గణనీయంగా పెరిగిపోవచ్చు. ఖరీదైన మార్కెట్ వ్యాల్యూషన్‌ను చాలా కంపెనీలు ఆశించొచ్చు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వ్యాల్యూషన్లు ఖరీదుగా అనిపిస్తున్నప్పటికీ, ఇవి ముందుకే వెళ్లొచ్చు. కనుక స్వల్పకాలానికి అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో అంటే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ కంపెనీల ఆదాయాలు, లాభాలు మరింత వృద్ధి చెందొచ్చు. దీర్ఘకాలానికి మార్కెట్ పట్ల నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను. అయితే, అదే కాలంలో కొన్ని కంపెనీలు ప్రతికూలతలను చూడొచ్చా? అంటే అవుననే నా సమాధానం. మార్కెట్లో ఈ తరహా కంపెనీలు ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది ఐపీవోల్లో ఖరీదైన వ్యాల్యూషన్లకు స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఏడాది, రెండేళ్ల తర్వాత లాభాలు రాకపోతే అంత ఖరీదుపెట్టి ఎందుకు కొన్నామా? అని అనిపించొచ్చు. ఇప్పుడైతే వాటి ధరలు పెరుగుతూ వెళుతుండడం పట్ల ఇన్వెస్టర్లు సౌకర్యంగానే ఉన్నారు. దీంతో ఆయా స్టాక్స్ వ్యాల్యూషన్ సరైనదేనన్న భావనతో ఉన్నారు. కానీ, కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా విశ్లేషణ చేస్తే అప్పుడు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. భారీ కరెక్షన్, ఆతర్వాత ఏకధాటిగా ర్యాలీని ఎవరూ ఊహించలేరు. కనుక అటువంటి ప్రశ్నలకు సమాధానం లభించదు. కాకపోతే మన పెట్టుబడులు, లాభాలను ఎలా కాపాడుకోవాలి? అంటే అందుకు మార్గముంది. అదే రీబ్యాలన్స్. మీరు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నట్టయితే స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్ ) పథకాలకు ఎంతో కొంత కేటాయింపులు చేసుకోవాలి. అది 25% లేదా 50 శాతమా అన్నది మీ ఎంపికే. ఒకవేళ మీ పెట్టుబడుల కేటాయింపులు ఈక్విటీ, డెట్‌కు 50:50 శాతం చొప్పున నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిపోయి మొత్తం పెట్టుబడుల్లో మీ ఈక్విటీ భాగం 50% నుంచి 60 శాతానికి చేరి.. డెట్ పెట్టుబడుల విలువ 40 శాతానికి తగ్గిందనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిందల్లా.. 60 శాతంగా ఉన్న ఈక్విటీని 50 శాతానికి తగ్గించుకోవాలి. అంటే 10% మేర ఈక్విటీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. దీన్ని లాభాల స్వీకరణగా చూడొచ్చు. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాంతో ఈక్విటీ, డెట్ మళ్లీ 50:50 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ మార్కెట్ పడిపోయి మీ 50% వాటా కాస్తా 40 శాతానికి తగ్గిపోయి, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు 60 శాతంగా ఉన్నాయనుకోండి. అప్పుడు మొత్తం పెట్టుబడిలో ఫిక్స్డ్ ఇన్కమ్ భాగం 50 శాతానికి తగ్గిపోయే విధంగా విక్రయాలు చేపట్టాలి. ఆ మొత్తాన్ని ఈక్విటీలోకి మళ్లించుకోవాలి. నూరు శాతం ఈక్విటీ లేదా నూరు శాతం డెట్ పెట్టుబడులు చాలా ప్రమాదకరం. మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి తరుగుదలను హెడ్జ్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు – రోణాక్ షా రూపాయి తరుగుదల అన్నది వాస్తవం. ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చిన్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. సామర్థ్యం, మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీయ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఒకవేళ మీరు ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి:జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి! -
USA : ద్రవ్యోల్బణం ఆందోళనలు ?.. పడిపోతున్న రూపాయి విలువ !
అమెరికాలో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 31 సంవత్సరాల్లో ఈ స్థాయి అధిక ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందన్న భయాలూ ఉన్నాయి. నవంబర్‌లో 6.8 శాతం వరకూ ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న అంచనాలు, దీనితో ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) పెంపు తప్పదన్న విశ్లేషణలు, ఇదే జరిగితే భారత్‌సహా వర్థమాన దేశాల నుంచి, ఈక్విటీ వంటి రిస్కీ అసెట్స్ నుంచి డాలర్ల రూపంలోని విదేశీ నిధులు భారీగా వెనక్కు వెళ్లి డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతుందన్న అభిప్రాయాలు రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నట్లు నిపుణుల అంచనా. ఇక్కడ అవే భయాలు ! ఇక దేశీయంగా చూసినా కమోడిటీ ధరల తీవ్రత భయాలు ఒకపక్క కొనసాగుతున్నాయి. దీనికితోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును వరుసగా తొమ్మిదవ ద్వైమాసిక సమావేశాల్లోనూ యథాతథంగా (4 శాతం) కొనసాగిస్తూ సరళతర ఆర్థిక విధానం కొనసాగించడం దేశంలోనూ ద్రవ్యోల్బణం భయాలకు ఆజ్యం పోస్తోంది. ఈ అంశంసహా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అధిక వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) భయాలూ రూపాయికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపా యి విలువ నష్టాల్లో 75.70వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96.40 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయికి తగ్గిన ‘విదేశీ నిధుల’ బలం డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మరో 18 పైసలు కోల్పోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 75.78 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, ద్రవ్యోల్బణం భయాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. రూపాయి గడచిన 16 నెలల కాలంలో ఇంత కనిష్ట స్థాయిని (22 జూన్ 2020లో 75.78) చూడ్డం ఇదే తొలిసారి. 75.65 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 75.85 స్థాయినీ చూసింది. మూడు వారాల నుంచి రూపాయి బలహీనపడుతోంది. తాజా సమీక్షా వారం (6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య) 0.88 శాతం అంటే 66 పైసలు క్షీణించింది. చదవండి: బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు! -
అయ్యో రూపాయి! వరుసగా మూడోరోజూ క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది. మంగళవారం మరో 16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగిసింది. రూపాయికిది వరసగా మూడోరోజూ నష్టాల ముగింపు కాగా.., మొత్తం 73 పైసలు పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ఉదయం 75.41 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 75.66 వద్ద కనిష్టాన్ని 75.16 గరిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ కొన్నేళ్ల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 1.6% పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల స్థాయిని దాటింది. ఈ అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. స్వల్పకాలం పాటు రూపాయి 74.90 – 75.80 పరిధిలో ట్రేడ్ అవ్వొచ్చు’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ హెడ్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. గతేడాది(202) ఏప్రిల్‌లో రూపాయి 76.87 స్థాయి వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. చదవండి: Economy: ఎకానమీలో వెలుగు రేఖలు -
రూపాయి చరిత్రాత్మక పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది. ► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. 74.70 గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది. ► భారత్ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి. ► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ► కోవిడ్–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 103 దాటేయడం గమనార్హం. ► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది. ► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన. -
బంగారం రూ.44,000 పైకి..
ముంబై: ఒకవైపు అంతర్జాతీయంగా పసిడి పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం. ప్రపంచ వృద్ధికి కోవిడ్–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి. రూపాయి... 17 నెలల కనిష్టం ఇదిలావుండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 20 పైసలు నష్టపోయి.. 73.39 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ట్రేడింగ్ మొదట్లో 72.90 వద్ద ప్రారంభమైన రూపాయి, 74 పైసల కనిష్ట–గరిష్ట స్థాయిల మధ్య తిరగడం గమనార్హం. బుధవారం ఒక దశలో 73.64 స్థాయినీ చూసింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూలతలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. -
ఒకేరోజు రూపాయి 59 పైసలు పతనం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు భారీగా 59 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.51 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్టం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత, దేశం నుంచి బయటకు వెళుతున్న విదేశీ నిధులు, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా వృద్ధి సంకేతాలు, డాలర్ పటిష్టం వంటి అంశాలూ రూపాయికి బలహీనమవుతున్నాయి. రూపాయి బలహీనతలో 70.16 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూపాయి 70.53ను కూడా తాకింది. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే తాజా అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
భారీగా కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ కుప్పకూలాయి. రూపాయి పతనం దేశీయ స్టాక్ మార్కెట్లను అంతకంతకు పాతాళంలోకి పడేసింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి భారీగా పతనం కావడంతో, మార్కెట్లు సైతం ఆరంభంలోనే భారీగా క్షీణించాయి. ఇక అప్పుడు మొదలైన పతనం, ఇక ఎక్కడా ఆగకుండా... కిందకి పడుతూనే ఉన్నాయి. కనీసం ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ భారీగా క్రాష్ అయి ఒక్కరోజే 900 పాయింట్ల మేర ఢమాలమంది. చివరికి సైతం 806 పాయింట్లు పతనమై, 35,169 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే నష్టాల్లో కొట్టుమిట్టాడింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 259 పాయింట్లు నష్టపోయి 10,600 కింద 10,599 వద్ద స్థిరపడింది. ఒక్కరోజే దేశీయ స్టాక్‌సూచీలు 1.50 శాతానికి పైగా నష్టపోవడం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టించింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఈ విధంగా కుప్పకూలాయి. ఓ వైపు రూపాయి పాతాళంలోకి జారిపోవడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడం ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. అటు ఆసియన్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. చాలా వరకు ఆసియా మార్కెట్లు, క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేవే ఉన్నాయి. దీంతో క్రూడాయిల్ ఎఫెక్ట్ ఆయా మార్కెట్లపై కూడా చూపించింది. ఈ నేపథ్యంలో డాలర్ పుంజుకుని, ఆసియన్ మార్కెట్ల కరెన్సీని మరింత పడగొట్టింది. మన దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 73.82ను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి విలువ కొంత కోలుకుని 36 పైసల నష్టంలో 73.70 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ ధరలు పతనం, రూపాయి క్షీణించడంతో, ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నేడు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఈ ప్రకటనతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, ఓఎన్జీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఆయిల్ కంపెనీల షేర్లు 22 శాతం నుంచి 18 శాతం మధ్య క్షీణించగా... ఓఎన్జీసీ పది శాతం కిందకి పడింది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అండగా నిలిచిన ఫార్మా, ఐటీ షేర్లు ఇవాళ భారీగా క్షీణించాయి. ఈ రెండు రంగాల సూచీలు 3 శాతం తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంకుల సూచీ మాత్రం పటిష్ఠంగా ఉండి.. నామ మాత్రపు నష్టాలతో ముగిసింది. ఇవాళ లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు ఉన్నాయి. -
రూపీ దెబ్బ : సెన్సెక్స్ భారీగా క్రాష్
ముంబై : దలాల్ స్ట్రీట్ మరోసారి కుప్పకూలింది. చివరి గంట ట్రేడింగ్‌లో పూర్తిగా బేర్స్ ఆధిపత్యం చెలాయించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 550 పాయింట్లు క్రాష్ అయి, 36వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు నష్టపోయి తన కీలక మైన మార్క్ 10,850 దిగువకూ దిగజారింది. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, ఇటలీ బడ్జెట్ ప్లాన్, రూపీ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోవడం, అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. చివరి గంటల్లో అమ్మకాల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్ షేర్లు మార్కెట్లను భారీగా కుప్పకూల్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల్లోనే ఉన్నాయి. కేవలం మెటల్స్ మాత్రమే లాభాలు ఆర్జించాయి. మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్లు నష్టపోయి 35,975 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 10,858 వద్ద క్లోజయ్యాయి. మొట్టమొదటిసారి డాలర్ మారకంలో రూపాయి విలువ 73 మార్కు దిగువకు క్షీణించి, 73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కో బ్యారల్‌కు 85 డాలర్లను మించిపోవడంతో, రూపీ ఇలా భారీగా క్షీణించింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. దీంతో రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. అయితే మార్కెట్ ముగిసే సమయంలో రూపాయి విలువ భారీగా రికవరీ అయింది. 73.42 మార్కును తాకిన రూపాయి 40 పైసలకు పైగా రికవరీ అయింది. అయినప్పటికీ మార్కెట్లు మాత్రం కోలుకోలేదు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్, ముథూట్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, జుబిలియంట్ ఫుడ్‌వర్క్స్, గోద్రెజ్ కన్జ్యూమర్, డాబర్, జీఎస్కే కన్జ్యూమర్, బాటా ఇండియా, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, అపోలో టైర్స్ 3 శాతం నుంచి 10 శాతం వరకు క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 85 డాలర్లను మించిపోయింది. -
మళ్లీ రూపాయి 68 దిగువకు...
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మళ్లీ కిందకు జారింది. వివరాల్లోకి వెళితే, ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70కి చేరింది. కాగా శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు కనిష్టానికి పడింది. 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్ విలువ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ వల్ల దేశీయ కరెన్సీ బలహీనబాట ఆగడం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. గత వారం మొత్తంమీద రూపాయి 67 పైసలు నష్టపోయింది. ఇదిలాఉండగా, భారత్ కరెంట్ అకౌంట్ (క్యాడ్)పై క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషించింది. 2018–19లో 2.4 శాతంగా క్యాడ్ నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
ఎన్నికల ఫలితాలు : భారీగా పతనమైన రూపాయి
ముంబై : కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇటు స్టాక్ మార్కెట్లు, అటు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపాయి. నేడు విడుదలైన ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోయే సరికి ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2017 జనవరి నుంచి తొలిసారి 68 మార్కుకు కిందకి క్షీణించింది. గత ముగింపు కంటే 59 పైసలు ఢమాల్‌మని 68.11 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్‌కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ వద్ద పౌండ్ స్టెర్లింగ్ కూడా రూ.91.28/92.00 వద్ద క్లోజైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన కర్నాటక ఫలితాలు, క్షణక్షణం మారుతూ వచ్చాయి. ఓటింగ్ ప్రారంభమైనప్పుడు కమలం విజయం దిశగా దూసుకెళ్లగా మార్కెట్లు జోరున ఎగిశాయి. కానీ మధ్యాహ్నం సమయానికల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయి, బీజేపీకు చెక్ పెట్టేందుకు జేడీఎస్, కాంగ్రెస్ పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్‌కు ప్రారంభ లాభాలన్నీ ఆవిరైపోయి, చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంలో ముగిసింది. నిఫ్టీ కూడా 10801 వద్ద సెటిలైంది. ఇటు రూపాయి విలువ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. మరోవైపు గత కొన్ని రోజులుగా కూడా ముడి చమురు ధరలు పెరుగుతుండటం రూపాయి విలువను దెబ్బతీస్తూ ఉంది. -
టీవీలపైనా సుంకాల మోత
న్యూఢిల్లీ: సుంకాల భారం లేకుండా చౌకగా వస్తుందనే ఉద్దేశంతో విదేశాల నుంచి టీవీ తెచ్చుకుందామనుకుంటే ఇకపై పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఇలాంటి టీవీల దిగుమతులపైనా సుంకాల మోత మోగనుంది. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరిగిపోతున్న నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా కాపాడటానికి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న ప్రభుత్వం తాజాగా వీటిపైనా దృష్టి సారించింది. ఈ తరహా సుంకాలు లేని ఫ్లాట్ స్క్రీన్ టీవీల దిగుమతులను నిషేధించింది. దీంతో ఇకపై ఎల్సీడీ, ఎల్ఈడీ, ప్లాస్మా వంటి ఫ్లాట్ పానెల్ టీవీలపై 36.05% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఉచిత బ్యాగేజి కింద దాదాపు దశాబ్ద కాలం పైగా టీవీలకు ఇస్తున్న సుంకాల మినహాయింపు నిబంధనను సవరిస్తూ రెవెన్యూ విభాగం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టు 26 నుంచి ఇలాంటి టీవీలపై 35% కస్టమ్స్ డ్యూటీ, దానిపై మరో 3% విద్యా సెస్సు....వెరసి 36.05% దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికులు వ్యక్తిగత వాడకం కోసం విదేశాల నుంచి తెచ్చుకునే ఫ్లాట్ స్క్రీన్ టీవీలపై ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం (క్యాడ్) భారీగా పెరిగిపోతోండటం, రూపాయి క్షీణిస్తుండటంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పసిడి, ప్లాటినం, వెండిపై ప్రభుత్వం సుంకాలను 10% మేర పెంచింది. అయినా ఫలితం కనిపించక తాజాగా ఈ తరహా చర్యలు చేపట్టింది.